ప్రతి ఊరూ ఒక దుఃఖపు జ్ఞాపకం
నేలనేలంతా కన్నీటిచెమ్మ
విషాదాక్షరాలతో స్నానమాడుతున్న చరిత్ర
ఇదిగో ఇక్కడ ఇదిగో ఇక్కడే ఇక్కడ ఇక్కడ…
పడిలేస్తూ పరుగెత్తుకొచ్చే
లోలోపలి మెదడుపొరలను చీల్చే స్మృతుల జవనాశ్వాలు
బరువెక్కిన కన్రెప్పల కఠినశిలల్ని కరిగించే కెరటాల వెల్లువ
ఎక్కడికని పోకుండా ఉండను?
ఎక్కడికని పారిపోను?
ఏది గుర్తు తెచ్చుకోకుండా ఉండను?
ప్రతి ఊరూ ఒక నెత్తుటిచార
జీర గొంతులో విచారధార
ఒకరిని చెట్టుకు కట్టి కాల్చినదిక్కడే
ఆత్మీయులు విద్యుదాఘాత చిత్రహింసలు అనుభవించినదిక్కడే
ముగ్గురు మిత్రులు ఒరిగిపోయినదిక్కడే
హోరాహోరీ సమరం సాగినదిక్కడే
మహావిషాదం సంభవించినదిక్కడే
భూమి భూమంతా యోధుల శాశ్వత విశ్రాంతిస్థలం
అమరుల జ్ఞాపకాల పరిమళభరిత ఉద్యానవనం
ఎక్కడని వినమ్రంగా శిరసు వంచకుండా ఉండను?
ఎక్కడని వీరులు కలిసిన మట్టిని
గర్వంగా జెండాగా ఎగరెయ్యకుండా ఉండను?
మాట్లాడకుండా ఎట్లా ఉండగలను?
athyabutha expression, hrudayantharaala lonchi vachina kavithaa nibhaddatha
చాలా మంచి కవిత
భూమి భూమంతా శాశ్వత యోధుల విశ్రాంతి స్థలం
చాలామంచి పదచిత్రం.
అద్భుతమైన పద్యం
బొల్లోజు బాబా