ప్రభుత్వమా, అమానుషత్వమా?

‘రాక్షసీ, నీ పేరు రాజకీయమా?’ అని ఆదివిష్ణు నాలుగు దశాబ్దాల వెనుక ఒక నవల రాశారు. ఆ శీర్షికను వర్తమానానికి అన్వయిస్తే ‘అమానుషత్వమా, నీ పేరు ప్రభుత్వమా?’ అనో, లేదా దానినే తిరగేసి ‘ప్రభుత్వమా, నీ పేరు అమానుషత్వమా?’ అనో అనవలసి వచ్చేటట్టుంది.గత ఆదివారం ప్రకాశం జిల్లా ఎరగొండపాలెం సమీపంలో జరిగిందని చెప్పబడుతున్న ఎన్‌కౌంటర్‌లో మృతుల పార్థివ శరీరాల పట్ల ప్రభుత్వం అనుసరించిన వైఖరి ఈ వ్యాఖ్యకు కారణం. ఆ వైఖరి ప్రభుత్వంలోని వ్యక్తులు ఎవరో ఒకరిద్దరు ఎవరో అనుసరించినదయితే దాన్ని మినహాయింపుగా తీసుకోవచ్చు. కానీ, సాక్షాత్తూ హోంమంత్రి నుంచి అట్టడుగుస్థాయి పోలీసు అధికారి దాకా ఎందరో దాన్ని వాచ్యంగానూ, ప్రవర్తనలోనూ ప్రకటించారు కనుక, అది ప్రభుత్వ అధికారిక వైఖరే అనుకోవాలి. అటువంటి వైఖరి తీసుకుంటున్న ప్రభుత్వం పాలిస్తున్నదంటే సమాజపు మానవతా స్థితిని కూడా అనుమానించాలి.

ఆ వైఖరి ఎంతటి నిరంకుశ, కర్కోటక పాలనలలో కూడా అమలయి ఉండదు. యుద్ధబీభత్సం మధ్య కూడా మృతుల విశ్వాసాలకు అనుగుణంగా, గౌరవంగా అంత్యక్రియలు జరిపే సంప్రదాయం అమలవుతుంది. అసలు మరణమే ఒక మనిషికి సంబంధించిన వ్యక్తిగత వైరాలన్నింటినీ రద్దుచేస్తుంది. ఒక మనిషి బతికున్నంత కాలం శత్రుత్వం వహించిన వాళ్ళు కూడా ఆ మనిషి చనిపోగానే మృతదేహాన్ని కడసారి చూసి నమస్కారం పెడతారు. గౌరవంగా ఒక పుష్పగుచ్ఛం ఉంచుతారు. స్మృతిచిహ్నంగా దహనవాటిక మీద ఒక కర్ర పెడతారు. సమాధిమీద పిడికెడు మట్టి చల్లుతారు. మనిషి పార్థివ శరీరాన్ని సగౌరవంగా ఊరేగించడం, ఆ వ్యక్తి మంచి పనులను మాత్రమే స్మరించుకోవడం, అంత్యక్రియలలో వందలాది వేలాదిమంది పాల్గొని శ్రద్ధాంజలి ఘటించడం- ఇదంతా నాగరికతా చిహ్నంగా భావిస్తున్నాం. మృతదేహాన్ని గౌరవించడం సభ్యతగా భావిస్తున్నాం. ఆ మనిషి బతికి ఉన్నప్పుడు మనతో ఉండిన విభేదాల్ని, ఆ మనిషి అనుసరించిన రాజకీయ విశ్వాసాల్ని పక్కనబెట్టి సంస్మరించుకుంటున్నాం. దురదృష్టవశాత్తూ మహాఘనత వహించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సభ్యతాసంస్కారాలకు, నాగరికతకు దూరంగా ఉన్నాననీ, ఉంటాననీ చెప్పదలుచుకున్నట్టుంది. గత తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో ఒక కవి అంత్యక్రియలకు వెళ్ళినందుకూ, ఆ కవి విప్లవకారుడు కూడా అయినందువల్లా, కవులనూ, రచయితలనూ, పాత్రికేయులనూ అరెస్టుచేసి వేధించిన ఘటన జరిగింది. ఆ ప్రభుత్వం పతనమయిన అనేక కారణాలలో ఇటువంటి అనాగరిక ప్రవర్తన కూడా ఒకటి. ‘మా సమస్య తీర్చకపోతే పోయారు. ఆ సమస్యలు ఉన్నాయని చెప్పుకొనే అవకాశమయినా ఇవ్వరా? మా సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న ఉద్యమకారులను ఎట్లాగూ చంపుతున్నారు. వారి మృతదేహాలను సగౌరవంగా సాగనంపేందుకూ అనుమతించరా? వారి పేరు మీద ఒక స్మారక చిహ్నం నిర్మించుకుని తలచుకునేందుకు అనుమతించరా? మా బిడ్డలను చంపితే చంపారు. వాళ్ళ గురించి కన్నీటి బొట్టు విడిచేందుకు కూడా అనుమతించరా?’ అని దాదాపు పదిహేను వందలమంది మృతుల కుటుంబాలవారూ, బంధుమిత్రులూ తెలుగుదేశం పాలనను ప్రశ్నించారు. అదే ప్రశ్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా పదే పదే అడగవలసి వస్తుండడం విషాదకరం. ప్రకాశం జిల్లా ఎన్‌కౌంటర్ మరణాలు ఆదివారం సంభవిస్తే సోమవారం మృతుల కుటుంబసభ్యులూ, బంధుమిత్రులూ వంద మంది వరకూ హోంమంత్రిని కలిశారు. పత్రికల, టీవీ చానళ్ళ సాక్షిగా తమ పాత అనుభవాలు చెప్పి, మృతదేహాల కోసం వెళితే పోలీసులు పెట్టిన ఇబ్బందులు చెప్పి, అంత్యక్రియలకు కల్పించిన ఆటంకాల చరిత్ర చెప్పి, ఈ సారయినా ఆ విషాద అనుభవం ఎదురు కాకుండా ఉంటుందా? అని ప్రశ్నించారు. గంటసేపు వాదవివాదాల తర్వాత ‘అంత్యక్రియలకు ఆటంకం కలిగించవద్దని మా అధికారులను ఆదేశిస్తాను‘ అని హోంమంత్రి బహిరంగంగా ప్రకటించారు. ఆయన హామీ కరీంనగర్ జిల్లాలో మాధవ్ అంత్యక్రియలు జరిగిన మంగపేటలో ఎట్లా అపహాస్యమయిందో మంగపేటకు దారి తీసే రోడ్లన్నీ కోడై కూస్తున్నాయి. ప్రజాసంఘాల నాయకులను మాత్రం ప్రశ్నలతో రెండు మూడు చోట్ల ఆపి వెళ్ళనిచ్చిన పోలీసులు, ప్రజలను వేలాదిగా ఆపివేశారు. పత్రికావార్తల ద్వారానే ప్రపంచాన్ని చూసే విశ్లేషకులు ఏమనుకున్నప్పటికీ, పోలీసులు దిగ్బంధనం చేసిన రోడ్లు మినహాయించి పొలాల్లో, చెలకల్లో అడ్డదార్లు వెతుక్కుని ఐదారువేలమంది అంత్యక్రియలకు హాజరయ్యారు. కనీసం ఇరవైవేలమందిని ఆపి ఉంటారని స్థానిక విలేఖరులు, రాజకీయనాయకులు చెబుతున్నారు. ఆ ఇరవై, ఇరవైఐదువేలమందికి తప్పనిసరిగా మాధవ్ రాజకీయ విశ్వాసాలతో ఏకీభావం ఉండాలనేమీ లేదు. కాని ఆ అంత్యక్రియల మీద నిర్బంధం చూస్తేనే మాధవ్ రాజకీయ అభిప్రాయాలలో ఎంతో కొంత వాస్తవం ఉండి ఉంటుందని అర్థమవుతుంది. హోంమంత్రి బహిరంగ హామీని ఉల్లంఘించడంగా ఇది అరాచక పాలనకు చిహ్నం. ఇటువంటి సందర్భాలలో మృతదేహాలతో ఎలా వ్యవహరించాలో చట్టాలు, న్యాయస్థానాలు చెప్పిన అంశాలను ఉల్లంఘించడంగా ఇది చట్టబద్ధపాలనకు వ్యతిరేకం. మృతుడి కడ సారిచూపుకు బంధుమిత్రులు నోచుకోకుండా చేయడంగా ఇది మానవధర్మానికే వ్యతిరేకం. ఇక, గంటల్లో కాకులు దూరని కారడవుల్లో దూరి పనిపూర్తిచేసి రాగలిగిన అత్యాధునిక సౌకర్యాలున్న వ్యవస్థ మృతదేహాలను పోస్టుమార్టం దగ్గరకి చేర్చడానికి మూడురోజులు తీసుకోవడం శవాలు చెప్పే సాక్ష్యాలను తారుమారు చేయడానికేనని ఎవరయినా అనుమానిస్తే, ‘శవాలను తెచ్చే కాంట్రాక్టులు వారికే ఇస్తాం‘ అనగల మనిషి ఈ రాష్ట్రానికి ఆంతరంగిక భద్రతకూ, శాంతి భద్రతలకూ బాధ్యుడని అనుకోవడానికి ఎవరికయినా ఎట్లా మనసొప్పుతుంది? అనుమానాస్పద మరణం సంభవించినప్పుడు ఆ అనుమానాలన్నీ నివృత్తి చేయగలంత తక్కువ వ్యవధిలో, సమర్థంగా, పకడ్బందీగా శవపరీక్ష జరగాలని కోరుకోవడం కనీస బాధ్యత. ఆ కనీస బాధ్యతను పాటించడానికి కూడా మన ‘రక్షక‘శాఖ సిద్ధంగా లేదు!
(ఆంధ్రజ్యోతి మంగళవారం ఆగస్ట్ 01 ‘ 2006)

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Andhra Jyothy, Telugu, Vartamaanam. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s