జీవో నెంబర్ 5 కోరలు తీయని పాము

అరవై నాలుగు వేలమంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ఊడ్చుకుపోదలచిన జీవో నెం.5 అనే వరద గురించి పూర్తిస్థాయి చర్చ జరగకముం దే రాష్ట్రంలోనే చిన్నా పెద్దా నదులన్నిటికీ వరదలు వచ్చి ఆ చర్చను ఊడ్చేశాయి. ఇటీవలికాలంలో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన ఒక విశిష్టత ఇది. సమస్యల మీద సమస్యలు ఎంత పెద్ద ఎత్తున వెల్లువలా ముంచెత్తుతున్నాయంటే ఒక సమస్య దగ్గర ఆగి దాన్ని కూలంకషంగా చర్చించి నిజమైన, దీర్ఘకాలికమైన పరిష్కారాలు ఆలోచించే వ్యవధి దొరకడం లేదు.

భారీవర్షాలు, వరదల వల్లనో, మరే కారణం వల్లనోగాని జీవో నెం. 5మీద జరగవలసినంత విస్తారమైన చర్చ జరగలేదు. జూన్ 18న విడుదలయిన ఆ జీవో ప్రతులను జూలై 30న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు ఢిల్లీ లో ఒక పత్రికా సమావేశంలో బయటపెట్టడంతో చర్చ మొదలయింది. ఆర్థి కశాఖమంత్రి రోశయ్య చేసిన వ్యాఖ్యగాని, అధికారపక్ష నాయకులు, స్వయం గా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలుగాని, ప్రధాన ప్రతిపక్షం స్పందించిన తీరుగాని ఎన్నో చర్చనీయాంశాలని వెలికితెచ్చాయి. మూడునాలుగు రోజుల్లోనే ఆ చర్చ సమసిపోయింది. జీవో నెం. 5ను ఉపసంహరించుకుం టున్నామని ప్రభుత్వం ప్రస్తుతానికి ప్రకటించిందిగాని చర్చను ముగించ డానికి అది సరిపోదు.

జీవో నెం. 5ను వెనక్కి తీసుకున్నామని ప్రభుత్వం చెపుతున్నప్పటికీ అది పామును బుట్టలో పెట్టడం వంటిదే తప్ప చంపడమో, కోరలు తీయడమో కాదు. ఈ బుట్టను ఎప్పుడైనా తెరచి మళ్ళీ ఈ పామును వదిలే అవకాశం ఉండనే ఉంది. గతంలో గిర్‌గ్లానీ కమిషన్ నివేదికను అమలు చేసే పేరు మీద ఇదే ప్రభుత్వం గిర్‌గ్లానీ సిఫారసుల స్ఫూర్తికీ, రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తికీ వ్యతిరేకమైన పద్ధతిలో జీవో నెం. 72ను తీసుకువచ్చింది. తెలం గాణ ఉద్యోగుల నుంచి తీవ్రమైన నిరసన రావడంతో మరొక జీవో ద్వారా ఆ పాత జీవోను తాత్కాలికంగా పక్కన పెడుతున్నామని (అబెయన్స్) ప్రకటిం చింది. ఇప్పుడు జీవో నెం. 5 విషయంలో అటువంటి ఉపసంహరణ జరుగు తున్నదో, కేవలం ‘సవరిస్తాం’ అనే హామీతో ఆగనున్నదో తెలియదు. నిజా నికి అబెయన్స్‌లో ఉంచడం అంటే కూడా కాలం కలసి వచ్చినప్పుడు మళ్ళీ బైటికి తీస్తామని చెప్పడమే.

అందువల్ల జీవో నెం. 5ను ఉపసంహరించుకోవాలని, రానున్న మూడు సంవత్సరాలలో ఉద్యోగాలు కోల్పోవడానికి వధ్య శిలపై ఎక్కనున్న 64వేల మంది ఉద్యోగుల కుటుంబాలకు ఉపశమనం కలిగించాలని కోరడం ఎంత ముఖ్యమైందో, అసలు ఇటువంటి ప్రభుత్వ ఉత్తర్వు రావడానికి మూల కార ణమైన రాజకీయార్థిక విధానాలను ప్రశ్నించడం అంతకన్న ముఖ్యమైనది. ఇవాళ జీవో నెం. 5ను ప్రశ్నించిన, ఉపసంహరించాలని కోరిన రాజకీయ పక్షాలలో ఎన్ని కేవలం ఆ డిమాండ్ దగ్గరే ఆగిపోతాయో, మరెన్ని ఇంకా ముందుకు వెళ్ళి అసలు రాజకీయార్థిక విధానాలనే ప్రశ్నిస్తాయో అందరికీ తెలిసిన సంగతే.

ఎందుకంటే ఈ జీవో నెం.5 స్పష్టంగానే తాను ఒక ప్రక్రియలో ఒక దశను మాత్రమేనని, తనకన్న ముందర ఆ ప్రక్రియలోనే రెండు దశలు గడిచిపో యాయని ప్రకటించింది. ఇవాళ జీవో నెం. 5ను ఖండించి గంభీరోపన్యా సాలు చేస్తున్న ఒక రాజకీయపక్షం ఆ ప్రక్రియను ప్రారంభించి మొదటి రెండు దశలను అమలు చేసింది. నిన్న అమలు చేసిన విధానాన్ని ఇవాళ ఖం డించడం, నిన్న ఖండించిన విధానాన్ని ఇవాళ అమలు చేయడం వంటి దివాళాకోరు వైఖరులు అవలంభిస్తున్నందుకు మన రాజకీయపక్షాలను ఏమీ అనక్కరలేదు. దివాళాకోరుతనమే రాజకీయ విధాన కళగా అభివృద్ధి అయిన వ్యవస్థ మనది.

కానీ ఈ సందర్భంగా వ్యక్తమయిన మధ్య తరగతి స్పందనల గురించి మాత్రం కొంచెం ఆలోచించాలి. ఘటనలను ముందు వెనుకలు లేని విడి ఘటనలుగా ఆలోచించడం మన మధ్యతరగతికి అలవాటయిపోయింది. నిజానికి ప్రతి పరిణామమూ ఒక క్రమంలో భాగంగా ఉం టుంది. ప్రతి పరిణామానికీ గతమూ భవిష్యత్తూ ఉం టాయి. ఆ చరిత్రను కత్తిరించి ఇవాళ్టికి ఇవాళ ఒక ఘట నగా చూస్తే ఏ ఘటనా అర్థం కాదు సరికదా, అటువంటి దృష్టి దోషం వల్ల ఒక పరిణామంలో తీసుకోవలసిన వైఖరి కూడా స్పష్టం కాదు. ఏది సమర్థనీయమో ఏది విమర్శ నీయమో తెలియని గందరగోళం నెలకొంటుంది. ఒక్కో సారి యాదృచ్ఛికంగా సరైన వైఖరి తీసుకోవడం సాధ్యమే మోగాని, ఆ వైఖరి అక్కడితో అంతమవుతుంది. జీవో నెం. 5 విషయంలో జరిగినది అదే.

జీవో నెం.5 దాదాపు పదిహేను సంవత్సరాలుగా ఈ దేశంలో జరుగుతున్న ప్రక్రియలో ఒకముక్క. నూతన ఆర్థిక విధానాల పేరుతో ప్రభుత్వరంగాన్ని బలహీనపర చడానికి జరుగుతున్న కృషిలో భాగమే ప్రభుత్వరంగ సంస్థల పునర్ వ్యవస్థీకరణ. ఆ కార్యక్రమానికి చాలా లోత యిన సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్క¬ృతిక కోణాలు న్నాయి. ఒక ప్రభుత్వోద్యోగికో, ప్రభుత్వోద్యోగి కుటుంబానికో ఆ కోణాలన్నీ తెలియకపోవచ్చును. తాము కోల్పోతున్న జీవన భద్రత తిరిగి తమ చేతికి అందితే చాలని మాత్రమే అనిపించవచ్చును. కానీ, రాజకీయపక్షాలు కూడా సుదీర్ఘ క్రమాలను గుర్తించకపోవడం, ఆ క్రమాల గురించి బాధితుల అవ గాహన పెంచకపోవడం క్షంతవ్యం కాదు.

జీవో నెం. 5 తీగలాగి డొంకంతా కదిల్చి రాష్ట్ర ప్రభుత్వోద్యోగులందరినీ బహుళజాతి సంస్థలకు వ్యతిరేకంగానో, ప్రపంచ బ్యాంకుకు వ్యతిరేకంగానో తయారు చేయలేకపోవచ్చు. కనీసం ఈ జీవోను విడుదల చేసిన ఇంప్లిమెం టేషన్ సెక్రటేరియట్ ఉండగూడదని, మన రాష్ట్ర ప్రభుత్వ రాజకీయార్థిక విధానాలలో ప్రపంచబ్యాంకు వంటి పరాయి సంస్థ జోక్యం కూడదని దేశ భక్తియుత ఆలోచనలు రగిల్చడం అసాధ్యం కాదు. అది ప్రారంభమైతే 1997నుంచీ ఇప్పటిదాకా ప్రపంచబ్యాంకుతో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలన్నిటినీ బహిరంగంగా ప్రజల ముందుంచాలని, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు భంగకరమైన షరతులన్నిటినీ రద్దు చేయాలని ఆందోళన నిర్మించవచ్చు. కావలసిందల్లా విడివిడి ఘటనలను దాటి ప్రక్రియలను దీర్ఘ కాలిక దృష్టితో చూడగల అవగాహన.

(ఆంధ్రజ్యోతి మంగళవారం ఆగస్ట్ 08 ‘ 2006)

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Andhra Jyothy, Telugu, Vartamaanam. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s