నాయకులకు కన్నీళ్ళు రావా?

వర్షాకాలం ప్రవేశించి ఆరు వారాలు గడిచినా చాలా ప్రాంతాలలో వర్షాభావం నెలకొని ఈసారి కాలం కాదేమో అని భయపడుతున్నప్పుడు, కాలం కావడం మాత్రమే కాదు, కానికాలం కూడా వరదలా తోసుకొచ్చింది. రాష్ట్రంలోనూ, ఎగువ రాష్ట్రాలలోనూ కుండపోత వర్షా లు కురిసి నాగావళి, వంశధార, గోదావరి, కృష్ణ పొంగిపొర్లాయి. నీటిచుక్కలో దాగిన విధ్వంసం, బీభత్సం రాష్ట్రంలోని పదమూడు, పద్నాలుగు జిల్లాలను ముంచెత్తాయి. నెల రోజులకు పైగా ఈ వరద బీభ త్సం, దానికి ఎంతమాత్రం స్పందించని పాలకుల నిర్లక్ష్యం, ఒక అవకాశం దొరికిందని ఎగిరి గంతులు వేస్తున్న ప్రతిపక్ష అవకాశవాదం ప్రజల ముందు స్పష్టంగానే ఉన్నాయి.

ఇంతటి విషాదకరమైన వరదలు పాలకుల కళ్ళలో కనీసమైన చెమ్మ ను కూడా సృష్టించలేకపోయాయి. ప్రతిపక్ష నాయకుల కళ్ళలో సానుభూతి తడికన్నా ఎక్కువ విమర్శల వేడి కనిపించింది. బహుశా ప్రస్తుత రాజకీయ పక్షాల ప్రవర్తనా ఆలోచనా సరళిని ఈ వరదలు బహిరం గంగా మరోసారి ప్రదర్శించినట్టున్నాయి. కనీసం రెండు ప్రధాన లక్షణాలు- ప్రజల కష్టాల పట్ల ఏమాత్రం సానుభూతి లేని మొరటుతనం, నిర్లక్ష్యం ఒక పక్కన, ప్రతి విషయంలోనూ అవతలివాళ్ళ తప్పులు మాత్రమే ఎంచజూపే ప్రత్యర్థి రాజకీయాలు మరో పక్కన- వరద బీభత్సంలో ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి.

వేల ఊళ్లు మునిగిపోయాయి. లక్షలమంది నిరాశ్రయులయ్యారు. డజన్ల కొద్దీ గల్లంతయ్యారు. లక్షల ఎకరాల పంట చేతికి రాకుండాపోయింది. వందల కోట్ల రూపాయల ఆస్తి నీట కలిసిపోయింది. ఈ విధ్వంసానికంతా కారణమేమిటి? నెపాన్ని పూర్తిగా ప్రకృతి మనిషికి చాల వ్యవధి ఇచ్చి, ముందస్తు సూచనలు ఇచ్చి విరుచుకుపడింది. ఆ వ్యవధిలోపల చేయవలసిన పనులు, ఆ సూచనలను అనుసరించి తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోని పాలకులు ఆ పాపం మూట కట్టుకోవలసి ఉంటుంది.

అప్పుడు కూడా పాలకులంటే ఇవాళ అధికారంలో ఉన్నవాళ్ళు మాత్రమే అని కూడా కాదు. యాభై సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ నిర్వాహకులుగా ఉన్నవాళ్లందరూ. మన నదీ జలవనరులను సద్వినియోగం చేసుకోవడంపైన, నీటి పారుదల వ్యవస్థను సువ్యవస్థీకృతంగా నిర్మించడంపైన శ్రద్ధపెట్టి ఉంటే ఈ వరదలు ఇంత బీభత్సం గా ఉండేవా అని ఆలోచించవచ్చు. ప్రత్యేకించి గోదావరి మీద బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన వాటా ప్రకారం ఆనకట్టలు నిర్మించుకుని ఉంటే, కనీసం 1986 వరద ఉధృతి తర్వాతనైనా మేలుకొని ఉంటే వరద ఉధృతి ఇంతగా ఉండేదా? లక్షలాది క్యూసెక్కుల నీటిని అలవోకగా వదిలి, లోతట్టు ప్రాంతాలు మునిగిపోతుంటే నిస్సహాయంగా చూస్తూ ఉండవలసి వచ్చేదా?

కనుక వరదలు రావడానికి కూడా ప్రకృతి కన్న ఎక్కువగా తప్పుపట్టవలసింది పాలకుల విధానాలనే. అది చారిత్రక తప్పిదం, కొన్ని తరాల పాలకుల నిర్లక్ష్య ఫలితం. గత జలసేతు బంధనం కుదరదు అని అనుకుంటే, ఇవాళ్టికివాళ వరదలు వచ్చిన తర్వాత, ఊళ్లు రోజుల తరబడి నీట మునిగి ఉన్న తర్వాత పాలకుల వైపునుంచి సహాయం, పునరావాసం అందాయా? మన ఘనత వహించిన ముఖ్యమంత్రికి, మంత్రులకు, శాసనసభ్యులకు కూడా రక్షణ దగ్గరినుంచి సకల భోగాలవరకూ అందించడానికి పోటీలు పడి పరుగెత్తే అధికార యంత్రాంగం, ఎవరి నెత్తుటితో చెమటలతో తమ జీతభత్యాలు పొందుతున్నదో ఆ ప్రజలు వరదలలో చిక్కి అతలాకుతలమవుతుంటే కన్నెత్తి అయినా చూడకపోవడం ఎందుచేత? ఆ అధికారయంత్రాంగాన్ని కదిలించడం కోసం, తాము స్వయంగా కదలవలసిన పాలకులు ఆ కష్టకాలంలో ఎక్కడున్నారు? మారుమూల అడవులలో మనుషులను వేటాడి చంపడానికి సాయుధ బలగాలను తీసుకువెళ్ళగలిగిన ప్రభుత్వ హెలికాప్టర్లు వరదలలో నీటి మధ్యన గుడిసె కొప్పులమీద రోజుల తరబడికూచున్న అభాగ్యులవైపు కదలనైనా కదలలేదేం? మూడు రోజుకో, నాలుగోరోజుకో నింపాదిగా ప్రారంభమైన ఆకాశం నుంచి అన్నం పొట్లాల జారవేత ఎంత అమానుషంగా, ముక్కిపోయిన, పాచిపోయి న ఆహార పదార్థాలతో సాగిందో పాలకులు గుర్తించరా?

బహుశా ప్రజల పట్ల, తనను ఎన్నుకున్న ప్రజల పట్ల, కష్టాలలో ఉన్న ప్రజల పట్ల ఇలా దుర్మార్గంగా, నిర్లక్ష్యంగా, ద్వేషంతో సమానమై న అలక్ష్యంతో ప్రవర్తించిన పాలకవర్గాలు చరిత్రలో అతి తక్కువగా ఉండి ఉంటాయి.

అయితే ప్రతిపక్షమూ ప్రజల కడగండ్ల పట్ల అంతే మొరటుతనంతో వ్యవహరించిందని కనబడుతున్నప్పుడు మన రాజకీయ వ్యవస్థనే తప్పు పట్టాలి తప్ప ఎవరిని ఏమనగలం? చాలామంది ప్రతిపక్ష నాయకులు వరద బాధితుల దగ్గరికి వెళ్లిన మాటా, పరామర్శించిన మాటా నిజమేగానీ, అందులో ప్రజల పట్ల ప్రేమ కన్నా ఎక్కువగా ప్రత్యర్థి రాజకీయాల స్ఫూర్తే కనబడింది. వరద బాధితుల దగ్గర నిలబడి రాజకీయోపన్యాసాలు చేయడం, రెండువేళ్ళు విజయ చిహ్నంగా చూప డం, సానుభూతి కన్నా మిన్నగా విమర్శలు కురిపించడం, చరిత్రలో ఇవే మొదటి వరదలన్నట్టుగా ప్రవర్తించడం వాళ్ళ చిత్తశుద్ధిమీద అనుమానాలు కలిగిస్తున్నాయి.

సరిగ్గా ఈ రెండు లక్షణాలూ- ప్రజల కష్టాల పట్ల అలక్ష్యం, ‘అవతలివాళ్ళు చేసేదంతా చెడు, మేం చేసిందంతా మంచి’ అనే ప్రత్యర్థి రాజకీయాలు- శాసనసభ వేది క మీదకూడా మరోసారి ప్రదర్శనకు వచ్చాయి. ఈ వెల్లువలో అసలు వరద సమస్యలు కొట్టుకుపోయాయి. మళ్ళీ వరదలు వస్తే ఏం చేయవలసి ఉంటుంది, అసలు మళ్ళీ వరదలు రాకుండా ఏమయినా చర్యలు తీసుకోగలమా, మొన్నటి వరదల్లో సహాయ, పునరావాస చర్యలు సక్రమంగా జరగకపోవడానికి కారణాలేమిటి, వాటినెట్లా పరిహరించగ లం లాంటి దీర్ఘకాల, మధ్యంతర, తక్షణ ఉపశమనాల గురించి మాట్లాడదామనే కోరిక అటుగాని, ఇటుగాని ఉన్నట్టు కనబడడం లేదు. అధికారం ప్రజా సమస్యలకు సృజనాత్మక పరిష్కారాలు కనుకోవడం కోసం మాత్రమేనని అవగాహన రానన్నాళ్ళూ, ప్రజాసేవే రాజకీయాల పరమావధి అనే మౌలిక భావన కలగనన్నాళ్ళూ వరదలు వస్తూనే ఉంటాయి. రాజకీయ నాయకులకు కన్నీళ్ళు మాత్రం రావు.

(ఆంధ్రజ్యోతి మంగళవారం ఆగస్ట్ 22 ‘ 2006 )

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Andhra Jyothy, Telugu, Vartamaanam. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s