ఇంత అజ్ఞానంతో చర్చ సాగేనా?

మన రాజకీయ వ్యవస్థలో వివాదాలలో మొట్టమొదట అంతమైపోయేది సత్యం. ప్రత్యర్థులు అతిశయోక్తులతో, అబద్ధాలతో, అర్ధ సత్యాలతో, వక్రీకరణలతో హోరాహోరీ పోరాడుకునేటప్పుడు ఆ సంరంభంలో సత్యం వేదిక మీద నుంచి చల్లగా జారుకుంటుంది. కానీ ఈ పద్ధతి మతావేశాల ఘర్షణకు సరిపోతుందేమో గానీ ప్రజాస్వామ్యానికి సరిపోదు. ప్రజాస్వామ్యానికి ఉన్న అనేక నిర్వచనాలలో సంపూర్ణ సమాచారంతో జరిగే చర్చ అని ఒక నిర్వచనం ఉంది. మన రాజకీయ చర్చలను, వివాదాలను, ఘర్షణలను చూస్తుంటే మనం ప్రజాస్వామ్యాన్ని ఆచరించడం లేదనడానికి మరొక నిదర్శనం అడుగడుగునా కనబడుతోంది.

గత వారం రోజులుగా ఉష్ణోగ్రతా స్థాయి పెరిగిన తెలంగాణ చర్చనే చూడండి. కేంద్ర స్థాయి రాజకీయ నాయకుల నుంచి గల్లీ స్థాయి రాజకీయ నాయకుల దాకా ఎందరెందరో తమ అభిప్రాయాలను, వైఖరులను యథేచ్ఛగా, ఇష్టారాజ్యంగా ప్రకటిస్తున్నారు. ఈ గందరగోళాన్ని ఇన్‌ఫార్మ్‌డ్ డిబేట్ – సమాచార సహిత చర్చ – అని అనడం భాషకే అవమానం. తాము మాట్లాడుతున్న విషయం మీద తమకు కనీసమైన అవగాహన, సమాచారం లేకపోయినా ఏదైనా మాట్లాడి చలామణీ చేయవచ్చునని మన రాజకీయ నాయకులు అనుకుంటున్నారు. ఒక విషయం మీద అవసరమైన సమాచారం, పరిజ్ఞానం, అవగాహన ఉన్న తర్వాత అభిప్రాయం, వైఖరి ఏదైనా ఉండవచ్చు. కానీ ముందే వైఖరులు నిర్ణయమై పోయి ఆ తర్వాత సమాచారాన్ని తమ ఇచ్ఛానుసారం సృష్టించడం జరుగుతోంది. అటువంటి పని కూడా ఏదో కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు చేస్తే వారి అవసరాలు అర్థం చేసుకోవచ్చు. కానీ దశాబ్దాలుగా రాజకీయాలలో ఉన్నవాళ్లు, తమను తాము గొప్ప చదువరులుగా, ప్రజాస్వామ్య సౌధానికి గుత్తెదారులుగా భావించుకునే వాళ్లు కూడా ఇలా సమాచారం లేకుండానో, ఉన్న సమాచారాన్ని మసిపూసి మారేడుకాయ చేస్తూనో మాట్లాడుతుండడం దురదృష్టకరం.

ఈ వారంలో తెలంగాణ విషయమై వ్యాఖ్యానించిన వందలాదిమంది రాజకీయ నాయకుల అభిప్రాయాల మీద నిజనిర్ధారణ చేయడం చాలా పెద్ద పని. ఇక్కడ స్థలం సరిపోదు కనీసం నాలుగైదు ప్రాతినిథ్య వ్యాఖ్యానాలను పరిశీలిస్తే మనకు ఎంత అపక్వాహారం దొరుకుతున్నదో అర్థమవుతుంది.
ముఖ్యమంత్రి ఈ వారంలో ఒకటికిరెండుసార్లు ‘అభివృద్ధే కదా సమస్య, అభివృద్ధి జరుగుతోంది గనక తెలంగాణ డిమాండ్‌కు అర్థం లేదు’ అన్నారు. ఆ మాటను మరికొంతమంది కాంగ్రెస్ నాయకులుకూడా చిలుక పలుకుల్లా వల్లిస్తున్నారు. అభివృద్ధి అంటే ఏమిటి, ఆ మాటకు సర్వజనామోదం ఉంటుందా, ఏ ప్రమాణాలపై దాన్ని కొలుస్తారు వంటి లోతైన ప్రశ్నల జోలికి, తాత్విక చర్చకు కూడా పోనక్కర్లేదు. ఈ విషయంలో గుర్తించవలసిన ఒక వాదన గురించి ముఖ్యమంత్రికి సమాచారం ఉందా అన్నది ప్రశ్న. ఉంటే అటువంటి వ్యాఖ్య రావడానికి వీలు లేదు గనక ఆ సమాచారం ఉంటే ఆయన దాన్ని తొక్కిపట్టి వక్రీకరణకు పాల్పడుతున్నారన్న మాట. అసలు ఆయనకు ఆ సమాచారమే లేదంటే ఈ రాష్ట్రంలో అత్యున్నత స్థానాలలో ఉన్నవాళ్లకు కింద ఏం జరుగుతున్నదో సమాచారం అందడం లేదన్నమాట. మన ఇంటెలిజెన్స్ విభాగం అంత బ్రహ్మాండంగా పని చేస్తున్నదన్నమాట!

ఇంతకూ ఆ సమాచారం ఏమంటే, తెలంగాణ డిమాండ్‌లో భాగంగా అభివృద్ధి – వెనుకబాటుతనం చర్చ ఉండవచ్చు గానీ తెలంగాణ అంటే అదొకటే కాదు, అంతకుమించిన ఆత్మగౌరవ, స్వయంనిర్ణయాధికార, సాంస్కృతిక అస్తిత్వ ఆకాంక్ష అని కనీసం ఐదారు సంవత్సరాలుగా తెలంగాణ మేధావులు ఘోషిస్తున్నారు.

ఇక సిపిఐ(ఎం) అగ్రనాయకులు సీతారాం ఏచూరి మరొకసారి భాషాప్రయుక్త రాష్ట్రాల పాతచింతకాయ పచ్చడిని తెలంగాణ ఆకాంక్షల మీదకి విసరడానికి ప్రయత్నించారు. కేవలం ఒక శతాబ్దంన్నర ఫ్రెంచి పాలన కింద ఉన్నదనే చారిత్రక కారణంతో, ఒకదానికొకటి వందల మైళ్ల దూరంలో ఉన్న మూడు భాషా ప్రాంతాలు ఒకే పాండిచేరిగా ఏకమైనప్పుడు, ఒక్క హిందీకి ఏడు రాష్ట్రాలున్నప్పుడు ఇంకా భాషా ప్రయుక్త రాష్ట్రాల వాదనను, పచ్చి అబద్ధాన్ని వాడుకోవచ్చునని ఒక బాధ్యతాయుత వామపక్ష నేత భావిస్తున్నారంటే మన రాజకీయాలు ఎంత పతనోన్ముఖంగా ఉన్నాయో అర్థమవుతుంది. ఇక మరొక ముఖ్య నేత ‘హైదరాబాదు ను పెంచింది మేం, తెలంగాణకు భుక్తి కల్పించింది మేం, హైదరాబాదును, చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లాను వదిలేది లేదు’ అంటున్నారు. ఈ వాక్యాల్లో స్పష్టంగా కనపడుతున్న పరాయితనాన్ని, రియల్ ఎస్టేట్ ప్రయోజనాలను కూడా కాసేపు పక్కన పెడదాం. ఈ మాటలంటున్నవారికి హైదరాబాద్ చరిత్ర తెలుసునా? హైదరాబాద్ పుట్టిన వంద సంవత్సరాలకు హైదరాబాద్ రాజ్యం నుంచి కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలు వేరయిపోయాయి. అప్పటినుంచి 1956 వరకు అవి వేరుగానే ఉన్నాయి. ఆ రోజుల్లోనే హైదరాబాద్ ప్రభువు ప్రపంచంలోనే రెండవ సంపన్నుడిగా పేరు తెచ్చుకున్నాడు. హైదరాబాద్ రాజ్య ప్రజల నెత్తురూచెమటా కొల్ల గొట్టి ఈ నగరాన్ని సుసంపన్నం చేశాడు. 1956 తర్వాత యాభై ఏళ్లలో హైదరాబాద్‌లో అభివృద్ధే జరిగిందో, దోపిడియే జరిగిందో కావాలంటే లెక్కలు తీయవచ్చు. కానీ సరిగ్గా ఇదే వాదనను అన్వయిస్తే ‘భారతదేశాన్ని అభివృద్ధి చేసిందే మేం, ఉంటే అది మా పాలనలో ఉండవలసిందే లేదంటే సముద్రంలో కలిపేస్తాం’ అని బ్రిటీష్ వాళ్లు అని ఉంటే మన జవాబేమయి ఉండేది?

ఇక హైదరాబాదు ముస్లిం నేతలు హైదరాబాదును అటో ఇటో కలవనివ్వమని, కేంద్రపాలిత ప్రాంతం కావాలని అంటున్నారు. ముంబయి, కోల్‌కతా నగరాలకే ఆ స్థాయి లేకపోతే హైదరాబాదుకు ఆ ప్రతిపత్తి ఇవ్వడం అసాధ్యం అనే సాంకేతిక కారణం, హైదరాబాదు చండీగఢ్ లాంటి కొత్తన గరం కాదనే చారిత్రక కారణం అలా ఉంచినా స్థానిక స్వపరిపాలన కోర్కెలు పెరుగుతున్న ఈ కాలంలో కొత్త కేంద్రపాలిత ప్రాంతాలను కోరడం ముందుచూపో వెనకచూపో ఆలోచించవలసిందే.

అటు ముస్లిం నాయకులు ఏ భయాలతో ఆ వాదన తెస్తున్నారో ఆ భయాలను నిజం చేయడానికా అన్నట్టు తెరాస నాయకులు నరేంద్ర తన పూర్వజన్మ సంఘ పరివార వాసనను వదుల్చుకోకపోవడం మాత్రమే కాదు, దాచుకోవడానికి కూడా ప్రయత్నించడం లేదు. వినాయక నిమజ్జనానికి ఇంకా మొనగాడుగా నిలబడుతూ తాను తెలంగాణ కన్నా సంఘ్ పరివారానికే దగ్గర అని చూపెట్టుకుంటున్నారు.

ఇటువంటి అజ్ఞాన, అనాలోచిత, వక్రీకరణ, అసత్యాల సామ్రాట్టులతో సాగేవి చర్చలు కావు, రగిలేవి అనవసర ఉద్రేకాలు.

(ఆంధ్రజ్యోతి మంగళవారం, 29 ఆగష్టు’ 2006)

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Andhra Jyothy, Telugu, Vartamaanam. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s