ఎవరికోసమీ యురేనియం

– ఎన్ వేణుగోపాల్

కడప జిల్లా వేముల మండలం తుమ్మలపల్లెలో యురేనియం గను ల తవ్వకం కోసం ఉద్దేశించిన ప్రాజెక్టు చేపట్టాలా లేదా అని ప్రజాభిప్రాయం సేకరించేందుకు ఏర్పాటయిన బహిరంగ విచారణ అనుకున్నట్టుగానే పులివెందుల మార్కు ప్రజాస్వామ్యం అనబడేదాన్ని నిజం చేస్తూ ‘ప్రజాస్వామికంగా’ ముగిసింది. ఈ దేశంలో అమలవుతున్నది నిజమయిన ప్రజాస్వామ్యమేననీ, ప్రజలకు తమ సమస్యలు చెప్పుకు నే, తమ సమస్యలకు తామే పరిష్కారాలు వెతుక్కునే అవకాశం ఉన్నదనీ ఇంకా ఎవరయినా నమ్ముతూ ఉంటే ఆ అభిప్రాయాలు నిజంకాదని తెలుసుకోవడానికి విప్లవ సాహిత్యం దాకా పోనక్కరలేదు. తుమ్మలపల్లెలో జరిగిన ప్రజాభిప్రాయసేకరణ అనే ప్రహసనం చూస్తే చాలు.

ప్రభుత్వం అనబడేది, యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, స్థా నిక పెత్తందారీవర్గాల మీద, ఎన్ని అబద్ధాలమీద, ఎంత దౌర్జన్యం మీద ఆధారపడి ఈ తుమ్మలపల్లె యురేనియం ప్రాజెక్టు వ్యవహారాన్ని నడుపుతున్నాయో చూస్తేనే అసలు ప్రాజెక్టులో ఏవో ప్రజా వ్యతిరేక అంశాలున్నాయని అర్థమవుతుంది. ప్రజల ఆరోగ్యం, జీవన భద్రత, ఉపాధి దృష్టితో చూసినా, సాంకేతిక దృష్టితో చూసినా పర్యావరణ దృష్టితో చూసినా, అభివృద్ధి కోణంనుంచి చూసినా, పరిసర ప్రాంతాల వనరుల వినియోగంవైపు నుంచి చూసినా, చట్టబద్ధమయిన అనుమతులవైపు నుంచి చూసినా ఆ ప్రాజెక్టు సంబద్ధత సందేహాస్పదంగా ఉంది. అయి నా, స్థానిక పెత్తందార్లు, ప్రజా ప్రతినిధులుగా తమను తాము ప్రకటిం చుకునేవాళ్లు ఆ ప్రాజెక్టు రావలసిందే అంటున్నారు.

ఆ ప్రాంతంలో దొరికే ఖనిజంలో వాస్తవంగా వినియోగంలోకి వచ్చే యురేనియం అతి తక్కువ అని స్వయంగా పర్యావరణ ప్రభావ అంచ నా నివేదిక తెలుపుతోంది. ఆ యురేనియం కూడా అణ్వస్త్రాలు తయా రు చేయడం కోసం మాత్రమే గనుక దాని వెలికితీత దేశ ప్రయోజనాలకోసమనో, అభివృద్ధి కోసమనో అనడం పచ్చి అబద్ధం. దాని నుంచి అణువిద్యుత్తు తయారు చేస్తామనడం కూడా అర్ధ సత్యమే తప్ప పూర్తి నిజం కాదు. ఎందువల్లనంటే అణు విద్యుదుత్పత్తి కేంద్రాలు కూడా అంతిమంగా అణ్వాయుధాలకు ముడి సరుకు సమకూర్చిపెట్టే వనరు లే. ఇక తుమ్మలపల్లెలో తవ్వకాలు జరిగితే చిట్టచివరికి మిగిలేది అక్కడ పోగుపడే రెండుకోట్ల డెబ్బై లక్షల టన్నుల అణుధార్మిక వ్యర్థపదార్థాలు. అవి గాలిలో, నీటిలో, పంటలలో కలిసి కొన్ని వందల ఏళ్లపాటో, వేల ఏళ్లపాటో పరిసర ప్రాంతాల ప్రజల ప్రాణాలనూ, ఆరోగ్యాలనూ హరి స్తాయి. ఇక్కడ పరిసర ప్రాంతాలు అన్నప్పుడు అది కేవలం వేముల మండలానికో, కడప జిల్లాకో కూడా పరిమితం కాదు. అణుధార్మిక ప్రభావం 170 కిలోమీటర్ల వరకూ ఉండే అవకాశం ఉంటుంది.

తుమ్మలపల్లె ప్రాజక్టు తక్షణమే ఐదు గ్రామాల ప్రజలను నిర్వా సితులను చేస్తుంది గనుక వారికి ఏదో ఒకరకమైన పునరావాసం కల్పి స్తే, ప్రాజెక్టు నిర్మించవచ్చునని ప్రాజెక్టు అనుకూలవర్గాలు వాదిస్తున్నా యి. ఇప్పటివరకూ ఏ అభివృద్ధి ప్రాజెక్టులోనూ పునరావాసం సక్రమం గా కల్పించలేదనేది ఒక వాస్తవం కాగా, అసలు ప్రాజెక్టు అవసరమా అనేది ముఖ్యమైన ప్రశ్న. ఆ ప్రాజెక్టు వల్ల స్థానికులకు రాబోయే ఉద్యో గాలు కూడా లేవు. ముందు ఒకటి రెండు సంవత్సరాలు సివిల్ నిర్మాణ పనుల్లో తట్టమోసే పనులు దొరుకుతాయేమోగానీ, ఆ తర్వాత స్థానికు లకు అక్కడ ఒక్క ఉద్యోగం కూడా ఉండదు. ఆ ప్రాజెక్టు వస్తే దానికి నీటి అవసరం చాలా ఉంటుంది. వట్టిపోయిన చిత్రావతి రిజర్వాయర్ నుంచీ నీరు తీసుకుంటామని యురేనియం కార్పొరేషన్ చెపుతోంది గానీ దాని అర్థం ఆ ప్రాంతంలోని భూగర్భ జలాలను ఇంకా లోతుకు పంపిస్తామని మాత్రమే.

ఇన్ని తప్పుడు వాదనలతో ముందుకేపోవడానికి యురేనియం కార్పొరేషన్‌కు ఏవో ప్రయోజనాలుండవచ్చు. కానీ స్థానిక రాజకీయ నాయకులకు ప్రజల గురించి ఎంతో కొంత ప్రేమాభిమానాలు ఉండా లిగదా? ఒకవైపు ముఠాకక్షలు, మరోవైపు ఏ పనిలోనైనా కోట్లకు కోట్లు గడించే పన్నాగాలు తప్ప రాజకీయాలగురించిగానీ, ప్రజా ప్రయోజ నాలగురించిగానీ ఏమాత్రం తెలియని, పట్టించుకోని ఆ స్థానిక నాయ కులకు, ఈ రూ. 1029 కోట్ల ప్రాజెక్టులో కాంట్రాక్టుల రూపంలోనైనా, బెదిరింపుల రూపంలోనైనా, భూ నష్టపరిహారం రూపంలోనైనా కనీ సం నాలుగోవంతు అయినా దక్కుతుందనే ఆశ మిగిలిన మానవ సహ జలక్షణమైన లక్షణాలన్నింటినీ విస్మరించేలాచేస్తోంది.

ప్రజాస్వామ్యం నిజంగా లేకపోతేపోయింది, కనీసం అది ఉన్నట్టు భ్రమ అయినా కల్పించాలని పాతతరం నాయకులకు అనిపిస్తుండేది. ఈ తరం నాయకులు ఎట్లా ఉన్నారంటే, చట్టబద్ధంగా జరగవలసిన బహిరంగ విచారణ దగ్గరికి కేవలం ఘర్షణ సృష్టించడానికి, ప్రాజెక్టు పట్ల భిన్నాభిప్రాయం ఉన్నవారిని బెదిరించడానికి, కొట్టడానికి, వారు మాట్లేడేది వినబడకుండా అల్లరి చేయడానికి వందలాదిమందిని పోగు చేసి తీసుకురావడం ప్రజాస్వామ్యమే అనిపిస్తోంది. అక్కడ బహిరంగ విచారణ గురించి చట్టం నిర్దేశించిన అన్ని ప్రమాణాలను, పద్దతులనూ తుంగలో తొక్కి కాలరాచివేయడం ప్రజాస్వామ్యమే అనిపిస్తోంది. ప్రాజెక్టు పట్ల భిన్నాభిప్రాయం ప్రకటించడానికి వెళ్ళినవాళ్ళ చుట్టూ మూగి బూతులతో అవమానించారు. ఆ సమస్యలో అవ గాహన కలిగిన వాళ్ళు మాట్లాడడానికి అవకాశమే ఇవ్వ లేదు. ఒకరిద్దరు తమ అభిప్రాయం చెప్పడానికి ప్రయ త్నిస్తే ఆ మాటలు వినబడకుండా అల్లరిచేశారు. జిల్లాకు చెందిన ఒక రాజకీయ పార్టీ నాయకుడు వేదిక ఎక్కబోతే కిందకి లాగేశారు. ఆ ఘర్షణలో అటూ ఇటూ రాళ్లు విసు రుకుంటే కేవలం ప్రాజెక్టు వ్యతిరేకులమీద ప్రకటితమైన ప్రజాభిప్రాయంకాదు. నిష్పాక్షికంగా ఉండవలసిన ప్రభు త్వాధికారులు ఆ దౌర్జన్యానికి మౌన సాక్షులుగా ఉండట మే కాదు, దానికి వత్తాసు పలకడం ఇంకా ఘోరం. నిజంగా యురేనియం ప్రాజెక్టు ప్రజల కోసమే అయితే, దానికి ప్రజా ప్రయోజనాలు, దేశాభివృద్ధి తప్ప మరో లక్ష్యం ఏదీ లేనట్లయితే, ఇంత దౌర్జన్యం, పెత్తందారీతనం, భిన్నాభిప్రా యాన్ని తొక్కిపెట్టడం ఎందుచేత?

ఈ అక్రమాలన్నీ చాలవన్నట్లు ఆదివారం బహిరంగ విచారణ జరి గితే, మంగళవారం దినపత్రికలలో యురేనియం కార్పొరేషన్ ఒక ప్రక టన ఇచ్చింది. నిజానికి, చట్టబద్ధమైన బహిరంగ విచారణ జరిపిన ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆ విచారణ ఫలితాలపై నివేదిక ప్రకటించే వరకూ, ఆ వివాదంలో భాగస్తురాలయిన యురేని యం కార్పొరేషన్‌కు తన అభిప్రాయం ప్రకటించే హక్కు లేదు. కానీ ఆ ప్రకటన ప్రాజెక్టు వ్యతిరేక వాదనలు చేసినవారి మీద నిందలతోపాటు, తనకు అనుకూలంగానే విచారణ జరిగిందనే అర్థం వచ్చేట్టుగా ఉంది. ప్రాజెక్టు రాకముందే ఇన్ని అక్రమాలు జరుగుతున్నాయంటే, అది నిజంగా వస్తే మరెన్ని అక్రమాలు జరుగుతాయనుకోవాలి?

(ఆంధ్రజ్యోతి మంగళవారం, 19 సెప్టెంబర్ 2006)

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Andhra Jyothy, Telugu, Vartamaanam. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s