సద్దాం, బహదూర్ షా, మనం

ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ కు మరణశిక్ష విధింపజేయడంలో అమెరికన్ పాలకవర్గాలు ఎట్టకేలకు విజయం సాధించాయి. పదిహేను సంవత్సరాలుగా అమెరికన్ పాలకవర్గాలు పెంచుకుంటూ వస్తున్న కక్ష చివరికి ఇట్లా తీరబోతోంది. నాలుగున్నర సంవత్సరాలకింద, 2003 మార్చ్ లో ఇరాక్ పై ఒక అబద్ధపు ఆరోపణతో దండెత్తి, సద్దాంను పదవీచ్యుతుణ్నిచేసి, మరొక ఎనిమిదినెలల తర్వాత సద్దాం స్వస్థలం తిక్రిత్ లో ఆయనను పట్టుకుని, ఒక ఏడాదిగా విచారణ తంతు జరిపిన అమెరికన్ పాలకవర్గాలు, ముఖ్యంగా చమురు పిపాసను రక్తపిపాసగా మార్చుకున్న జార్జి బుష్ , డిక్ షెనీ లు ఇవాళ తమశత్రువును మట్టుబెట్టడానికి చట్టబద్ధమైన అనుమతి సంపాదించుకున్నారు.

ఈ క్రమంలో జరిగిన అక్రమాలకూ, అబద్ధాలకూ, దుర్మార్గాలకూ లెక్కలేదు. మొదటి గల్ఫ్ యుద్ధం తర్వాత ఐక్యరాజ్యసమితిని తందానతానగా మార్చుకుని విధించిన ఆంక్షలవల్ల లక్షలాదిమంది చిన్నారిపిల్లలు మందులులేక, ఆహారంలేక మరణించారు. జనవిధ్వంసక ఆయుధాలున్నాయనే పేరుతో ఇరాక్ మీద తీసుకున్న చర్యలన్నీ నిర్హేతుకమైనవని తేలిపోయింది. స్వయంగా ఐక్యరాజ్యసమితి విచారణ కమిషన్ కూడ జనవిధ్వంసక ఆయుధాల అబద్ధాన్ని నిజం చేయలేకపోయింది. అయినా మన తోడేలు – మేక కథలోలాగ అమెరికన్ చమురుపిపాస యుద్ధపిపాసగా మారి ఇరాక్ మీద దాడి చేసింది. ఒకవేళ ఇరాక్ అధ్యక్షుడు అమెరికా చెపుతున్నట్టు నియంతనే అయినా, అతడిని దించివేసే పని అమెరికాది ఎట్లా అవుతుందని ప్రశ్నించేవాడులేని స్థితి ఇవాళ ఈ మరణశిక్షకు దారితీసింది. ఆ మరణశిక్ష విధింపు కూడ కనీస చట్టబద్ధపాలన లేని స్థితిలో, నిందితునికి సరైన న్యాయసహాయం లేకుండా, నిందితుడి తరఫున వాదించిన ముగ్గురు న్యాయవాదులను హత్యచేసి జరిగింది.

ఒక నేలమీది నాయకులకు మరొక నేలమీదినుంచి దోపిడీ పీడనలకోసం వచ్చిన దురాక్రమణదారులు, వారి కీలుబొమ్మలు మరణశిక్షలో, ప్రవాసశిక్షలో విధించడం కొత్తకాదు. ప్రతిచోటా పొరుగుదేశాలమీద దురాక్రమణ చేసినవారు, వలసవాదులు, సామ్రాజ్యవాదులు ఇటువంటి పనులు చేశారు. కొన్నిచోట్ల తామే ఆ దుర్మార్గాలకు పాల్పడ్డారు. మరికొన్నిచోట్ల తమ కీలుబొమ్మలను, దళారీలను, తైనాతీలను అందుకు వినియోగించారు. స్వయంగా మన స్వాతంత్ర్యోద్యమచరిత్రలోనే అటువంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి.

సద్దాంకు మరణశిక్ష విధించారనే వార్తవినగానే, నూటయాభై సంవత్సరాలకింద మననేలమీద జరిగిన ఇటువంటి తీర్పు గుర్తుకొచ్చింది. వ్యాపారంకోసం వచ్చి స్థానిక రాజుల మధ్య తగాదాలను వాడుకుని ఇక్కడ పాలన ప్ర్రారంభించిన బ్రిటిష్ వారిమీద తిరుగుబాటు చేసిన ప్రథమ భారత స్వాతంత్ర్య సమరయోధులు బ్రిటిష్ వారి అధికారాన్ని కాదన్నందుకు, మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ ను తమ చక్రవర్తిగా ప్రకటించుకున్నందుకు, బ్రిటిష్ సైన్యం జఫర్ మీద కత్తికట్టింది. భారతీయ ప్రజానీకంమీద చెప్పరాని దుర్మార్గాలకు పాల్పడింది. జఫర్ షాజహానాబాద్ లో తలదాచుకుంటే, మేజర్ విలియం హడ్సన్ అక్కడ దాడిచేసి, జఫర్ ముగ్గురు కొడుకులనూ, ఒక మనవడినీ చంపి ఆ తలలు జఫర్ కు బహూకరించాడు. జఫర్ మీద “దేశద్రోహ” నేరారోపణపై విచారణ జరిపి దేశాంతరవాస శిక్ష ప్రకటించి, రంగూన్ లో చెరసాలలో పెట్టారు. ఆ దుర్మార్గ చర్య జరిగి నూటయాభై ఏళ్లు కావస్తోంది. ఇవాళ మేజర్ హడ్సన్ పేరు రవూఫ్ అబ్దుల్ రహమాన్ గా మారిఉండవచ్చు. బహదూర్ షా జఫర్ నిలబడిన బోనులో సద్దాం హుస్సేన్ నిలబడిఉండవచ్చు. బ్రిటిష్ పాలకవర్గాల స్థానాన్ని అమెరికన్ పాలకవర్గాలు ఆక్రమించిఉండవచ్చు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం రవి అస్తమించని బహుళజాతిసంస్థల సామ్రాజ్యంగా రూపు మార్చుకుని ఉండవచ్చు. “ఎంత దురదృష్టవంతుడివి జఫర్, నీ ప్రేమైకభూమిలో నిన్ను ఖననం చేయడానికి రెండుగజాల నేలమిగలలేదు” అని జఫర్ అన్నట్టే, సద్దాం కూడ శిక్ష విని తన మహత్తర మాతృభూమిని పొగిడాడు. తనదేశానికే జయం అనీ, శత్రువులు మట్టికరుస్తారనీ అన్నాడు.

ఒకటిన్నర శతాబ్దాలు గడిచాయి. కాని అదే దోపిడీ. అదే పీడన. అదే రకమైన దౌర్జన్యం. తమకు ఎంతమాత్రం సంబంధంలేని భూమి మీదికి దండయాత్రకు తరలివెళ్లడం, ఆ భూమిపుత్రులమీద ఏవో అబధ్ధపు ఆరోపణలు చేయడం. తమను తాము తీర్పరులుగా ప్రతిష్ఠించుకోవడం, లేదా తమ కీలుబొమ్మలను తీర్పరులుగా కూచోబెట్టడం. ఆ భూమిని, ఆ భూములలోని వనరులను కాపాడినందుకు, ఆ భూమి మీద తమస్వయంనిర్ణయాధికారం కావాలన్నందుకు ఆ భూమిపుత్రులమీద కక్షబూనడం. వారిని వెంటాడి, వేటాడి వధించడం.

ఒకవేళ ఆ ఆరోపణలు నిజాలని అనుకున్నా, వాటికోసం శిక్ష విధించే అధికారం అమెరికాకు ఎవరు ఎప్పుడు కట్టబెట్టారు? ఆ మాటకొస్తే, అటువంటి నేరాలకు శిక్షలే విధించవలసి వస్తే అమెరికన్ పాలకవర్గాలకు ఎన్నిసార్లు మరణశిక్షలు విధించవలసి వస్తుంది? సీనియర్ బుష్ నూ, జూనియర్ బుష్ నూ ఎన్ని సార్లు ఉరికంబం ఎక్కించవలసి ఉంటుంది? ఒక నియంత పాలన నుంచి చట్టబద్ధపాలనకు మారే ఇరాక్ చరిత్రలో ఇది ఒక మైలురాయి అని జార్జి బుష్ అన్నాడట. ప్రపంచానంతా పాలించాలని చూస్తున్న ఆ నరహంతకుడి పాలనకు మరణశిక్ష ఎప్పుడు విధించబడుతుందో?!

పైన చెప్పిన బహదూర్ షా కథలోని హడ్సన్ ను ఏడాది తిరగకుండానే లక్నోలో కాల్చిచంపేశారు. భారతదేశపాలనాధికారాన్ని స్వయంగా మహారాణి చేపట్టినా, ఆ అధికారం మరొక తొంభై ఏళ్లుకూడ నిలవలేదు. “అధికారాంతమందుజూడవలె ఆ అయ్య సౌభాగ్యముల్ “ అని ఊరికే అనలేదు!

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Andhra Jyothy, Telugu, Vartamaanam. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s