కొడుకని ఇప్పుడు గుర్తుకు వచ్చిందా?

– ఎన్. వేణుగోపాల్

తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు కె.చంద్రశేఖర రావు ‘ఎవడి తెలుగుతల్లి, ఎక్కడి తెలుగుతల్లి’ అని ప్రశ్నించి తెలుగు సమాజంలో, ముఖ్యంగా రాజకీయాలలో, పత్రికావ్యాఖ్యాతలలో కందిరీగలతుట్టెను రేపారు. తెలంగాణ ఆకాంక్షలను దేశ రాజకీయాలలో, ఢిల్లీలో కేంద్రస్థానానికి తెచ్చిన ఘనతతోపాటు, ఈ అత్యవసరమైన తెలుగుతల్లి చర్చనీయాంశాన్ని ప్రధానవేదికమీదికి తెచ్చిన ఘనత కూడా కెసిఆర్ కి ఇవ్వాలి.

నిజానికి ఈ వ్యాఖ్య వెలువడడం ఇది మొదటిసారీ కాదు, ఆమాట అనడానికి కెసిఆర్ మొదటివారూ కాదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలు వ్యక్తమవుతున్న గత దశాబ్దంగా ఈమాట, ఇంత స్పష్టంగానో, కాస్త అస్పష్టం గానో వినబడుతునే ఉంది. యాభై సంవత్సరాల పాటు జరిగిన సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాలవల్ల, విద్రోహాలవల్ల, వివక్ష వల్ల పాలకుల మీద రావలసిన కోపం మొత్తంగా తెలుగు, ఆంధ్ర, తెలుగుతల్లివంటి భావనలమీదనే వ్యక్తమవుతోంది. సమైక్యరాష్ట్ర పాలకులకు తమ పాలనాప్రాంతంలోని కొన్ని భాగాలను మోసం చేయడానికి ఒక ఎలిబీగా ఉపయోగపడుతున్న తెలుగుజాతి ఐక్యత అనే భావనమీద వ్యతిరేకత పెరుగుతోంది. అసలు తెలుగుజాతి ఒకటేనా, తెలుగుభాష ఒకటేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆ ప్రశ్నల పునాదిమీద ‘తెలుగుజాతి’ గురించి మళ్ళీ ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది.
ఇటువంటి చర్చ అవసరం భారతజాతి విషయంలో కూడా వచ్చింది. సామాజిక శాస్త్రాలలో ఎంతో చర్చ జరిగింది. భారతజాతి అనేది ఒక భావనాత్మకంగా వాడే మాటేతప్ప, చరిత్రలోగాని, సంస్కృతిలోగాని, సామాజిక ఐక్యతలోగాని ఏకత ఎక్కడాలేదు. ఇవాళ భారతదేశంగా పిలుచుకుంటున్న భూభాగమంతా చరిత్రలో ఎప్పుడూ ఒకటిగా లేదు. బ్రిటిష్‌వాళ్ళు పాలించినంత విశాల భారతాన్ని అంతకుముందు ఎవరూ పాలించలేదు. ఆ బ్రిటిష్‌వాళ్ళు కూడా 500కు పైగా సంస్థానాలను వదిలేశారు. ఆ లెక్కన నెహ్రూ బ్రిటిష్‌వాళ్ళకంటే ఎక్కువ భూభాగాన్ని పాలించాడు. సిక్కింను దురాక్రమించి ఇందిరాగాంధీ మరింత ఎక్కువ భారతదేశాన్ని పాలించింది. భారతదేశం బహుజాతుల, బహుభాషల, బహు సం స్కృతుల ఉపఖండమని అటు ఈశాన్య రాష్ట్రాల జాతులు, ఉత్తరానకాశ్మీరీలు, పంజాబీలు, దక్షిణాన 1960లలో తమిళులు చెప్పిన తర్వాత కొంతయినా భారతజాతి భావనలోని సంక్లిష్టత అర్థమయిందిగాని తెలుగుజాతి ఐక్యత విషయమై ఆలోచించవలసిన కోణాలు చాలా ఉన్నాయని ఒప్పుకోవడానికి మనం ఇంకా సిద్ధంగా లేం.
ఈమె నా తల్లికాదు అని ఎవరయినా అనే సందర్భం చాలా ఆరుదుగా వస్తుంది. కాని అలా అన్నప్పుడు మిన్నువిరిగి మీద పడ్డంత గందరగోళం జరుగుతుంది. తల్లి గురించి మన మనసులలో ఉండే సెంటిమెంటువల్ల అది చాల అవమానకరమైన మాటగా, విధేయతలేని మాటగా, ధూర్తత్వంగా కనబడుతుంది. కాని కొంచెం స్థిమితంగా ఆలోచిస్తే అట్లా అనడానికి తల్లిమీద కోపం, తనకు ఆ తల్లివల్ల జరిగిన అన్యాయంపట్ల నిరసన, నిష్ఠురం, నిస్సహాయ ఆగ్రహం వంటి భావోద్వేగాలుగాని, లేదా ఒక కఠిన వాస్తవాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం గాని ఈ మాట ద్వారా వ్యక్తీకరణ పొందుతుండవచ్చు. ఇవాళ తెలంగాణలో చాలామందికి ఇటువంటి అభిప్రాయం ఉండడానికి ఈ కారణాలన్నీ ఉన్నాయి. ఈమె నా తల్లి కాదు అనడం ఆ తల్లికి అవమానంకూడా కానక్కరలేదు. అది ఒక వాస్తవం, కాదంటే నిష్ఠురమైన నిజం కావచ్చు.

అసలు తెలుగుజాతి పట్ల తల్లి అనే భావన సరయినదేనా, ఆ భావనను ఇట్లా తర్కించి చూడవచ్చునా అని కూడా చర్చ చేయవచ్చు. కాని అంతకంటె ముందు మహాభారతంలో కూడా తల్లీకొడుకుల సంవాదం ఒకటి జరిగిందని, ఆ సంవాదంలో కూడా కొడుకు కర్ణుడు తల్లి కుంతిని ఇప్పుడు తల్లినని చెప్పుకుంటూ రావడం సరయినదేనా? అని నిలదీశాడని గుర్తుచేసుకోవలసి ఉంది.

తిక్కన సోమయాజి అనువదించిన ఉద్యోగపర్వంలోని చతుర్థాశ్వాసంలో ఆ ఆసక్తిదాయకమైన ఘట్టం వస్తుంది. అక్కడ కుంతి వచ్చి కర్ణుడికి జన్మరహస్యం చెప్పి పాండవులతో కలవమని కోరుతుంది. అప్పుడు కర్ణుడు క్షత్రియులకు తగిన మర్యాదలు నాకు అందేలా నువ్వు చూడలేదు. అటువంటి నీకు ఇహపర సుఖాలను ఆశించి ఇవాళ కొడుకునని చెప్పుకోవడం తగునా అని ప్రశ్నిస్తాడు.
సరిగ్గా తెలంగాణ పుత్రులు కూడా ఇటువంటి ప్రశ్న వేస్తున్నారు. క్షత్రియ మర్యాదల సంగతి పక్కన పెట్టండి. కొన్ని రక్షణలతో సమైక్యతను అంగీకరించిన తెలంగాణ పుత్రులకు కర్ణుడికి జరిగిన అవమానాలకన్న ఎక్కువ అవమానాలు జరిగాయి. ఏ ఒప్పందంవల్ల సమైక్యత సాధ్యమైందో ఆ ఒప్పందం దగ్గరి నుంచి ఇప్పుడు నలుగుతున్న జీవో 610 దాకా ఎన్నెన్ని అవమానాలు, ఉల్లంఘనలు, విద్రోహాలు, అన్యాయాలు జరిగాయో లెక్కలేదు. ఆ అవమానాలన్నీ అనుభవించి, ఒకేతల్లి పిల్లలమని అంటున్నారు గనుక ఎప్పటికైనా న్యాయం చేస్తారేమోనని ఎదురుచూసి, ఎదురుచూసి అవేవీ జరగనప్పుడు ఈ ఒకే తల్లి అనేమాట నిజమేనా అనే ప్రశ్న వచ్చింది. ఇప్పు డు నీ కొడుకునని గుర్తొచ్చిందా అని తల్లిని అడగవలసిన సందర్భం ఇది.

ఇంతకీ ఈ తల్లి సెంటిమెంటును చర్చలోకి ఎవరు ఎందుకు ఎట్లా తీసుకువస్తున్నారో కూడా కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే అందులో సెంటిమెంటు ఏమీ లేదని, పచ్చి రాజకీయార్థిక ప్రయోజనాలున్నాయని తేలిపోతుంది. నిజంగా ఆ తల్లి తెలంగాణ బిడ్డలకుకూడా తల్లి అయి ఉంటే, ఇవాళ కెసిఆర్ ప్రకటన మీద గగ్గోలు పెడుతున్నవారు అంత సెంటిమెంటు ఉన్నవారయితే తెలుగుతల్లిని గురించి ప్రశంస చేసినప్పుడల్లా ఆ తల్లి బిడ్డలందరి గురించి మాట్లాడి ఉండాలి. ఆ బిడ్డలందరి మధ్యా సమన్యాయాన్ని పాటించి ఉండాలి. సరిగ్గా కుంతీమాతలాగ వేరే బిడ్డలకు కష్టం రాబోతున్నప్పుడు మాత్రమే కొడుకా, నువ్వు నా కొడుకువే అని తరలి రావడమూ, సూర్య భగవానుని అశరీరవాణి సాక్ష్యం సంపాదించడమూ జరిగితే, కర్ణుడు అడిగినట్టే, నీకేబుత్రుడనని వచ్చుటింకబోలునెచెపుమా అని ప్రశ్నించవలసి వస్తుంది.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Telangana, Telugu. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s