వర్తమానం : మరలనిదేల ఎస్సార్సీ?

– ఎన్‌. వేణుగోపాల్‌

ఆ రావణకాష్టం ఈ దేశంలో ఎప్పటికీ చల్లారదనే స్పష్టమైన అవగాహనతోనే, ‘మరలనిదేల రామాయణంబన్న’ అని తానే ప్రశ్న వేసుకుని ‘తినిన అన్నమే తినినయట్లు, చేసిన సంసారమే చేసినయట్లు’ అని జవాబు చెప్పుకుని రామాయణ కల్పవృక్షం రాశారు విశ్వనాథ సత్యనారాయణ. విలీనానికి ముందునుంచీ, 1952 నుంచీ రగులుతున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష ఎప్పటికీ ఆరిపోదనే స్పష్టమైన అవగాహనతోనే, ఆ మంటమీద దొరికిన చన్నీళ్లు నాలుగు చిలకరిద్దామనే సాచివేత ఎత్తుగడలో భాగంగానే ‘మరలనిదేల ఎస్సార్సీ’ అని ప్రశ్నయినా వేసుకోకుండా ‘చేసినమోసమే చేసినయట్లు, ఆడిన అబద్ధమే ఆడినయట్లు’ రెండో ఎస్సార్సీ గురించి మాట్లాడుతున్నారు హస్తనాపురి పెద్దలూ, హైదరాబాదు పెద్దలూ.

రెండో ఎస్సార్సీకి సమయం వచ్చిందనీ, తమ వర్కింగ్‌ కమిటీ ఎప్పుడో ఆ విషయంలో తీర్మానం చేసిందనీ దిగ్విజ య్‌ సింగ్‌కు హఠాత్తుగా గుర్తుకొచ్చింది. ఇక ఇప్పుడు ఎవరూ ఏమీ మాట్లాడవద్దనీ రెండో ఎస్సార్సీ ఏర్పాటయ్యేవరకూ వేచిచూసి, ఆ ఎస్సార్సీ ముందరే ఏమయినా చెప్పుకోవాలనీ ఆయన అన్నారు. ఈ ప్రకటనలు మేధోమథనానికి ముందువికాగా, వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరొక అడుగు ముందుకువేసి, ఈ నెలాఖరులోగా రెండో ఎస్సార్సీ వేయమని సోనియాగాంధీని కోరుతామనీ, నివేదిక ఇచ్చేందుకు గడువు పెట్టమని కూడా కోరుతామనీ మేధోమథనంలో అన్నారు. ఇప్పటికే అన్ని రాజకీయపక్షాలూ ఈ రెండో ఎస్సార్సీ మీద ప్రతికూలంగా స్పందించాయి.

ఇన్నాళ్లూ ఏ రాష్ట్ర ఏర్పాటుకూ అవసరం రాని ఎస్సార్సీ ఇప్పుడు అవసరమా, అది దేశంలో మరెన్నో రాష్ట్రాల ఏర్పాటు కందిరీగలతుట్టెను కదపదా, అది ఏర్పడితే ఎన్నాళ్లలో నివేదిక సమర్పిస్తుంది, ఆ నివేదికను ప్రభుత్వం ఎన్నాళ్లలో అమలులోకి తెస్తుంది వంటి భేతాళ ప్రశ్నలెన్నో ఉన్నాయిగానీ వాటిని కాసేపు పక్కనపెడదాం. మొదటి ఎస్సార్సీ నివేదిక పట్ల అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎట్లా ప్రవర్తించిందో ఒక్కసారి చూస్తే, ఇప్పుడు రెండో ఎస్సార్సీ వల్ల ఏమైనా ఉపయోగం ఎవరికయి నా ఉంటుందా అని తేల్చుకోవచ్చు.

జస్టిస్‌ సయ్యద్‌ ఫజల్‌ అలీ, హృదయనాథ్‌ కుంజ్రూ, కెఎం పణిక్కర్‌లతో 1953 డిసెంబర్‌ 29న ఏర్పాటయిన మొదటి ఎస్సార్సీ దేశవ్యాప్తంగా 98,420 చ.కి.మీ. భూభాగాన్ని (అంటే దేశంలో మూడో వంతుకన్న ఎక్కువ) పర్యటించి, తొమ్మిదివేలమంది వ్యక్తులతో మాట్లాడి, 1,52,250 అభ్యర్థనలను స్వీకరించి, తన 267 పేజీల నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఆ ఉమ్మడి నివేదికను అటు ఫజల్‌ అలీ, ఇటు పణిక్కర్‌ అనుబంధ పత్రాలను కూడా చేర్చారు.

కమిషన్‌ తన నివేదికను 1955 సెప్టెంబరు 30న సమర్పిస్తే, కేంద్ర ప్రభుత్వం 1956 జనవరి 16న తన నిర్ణయాలను ప్రకటించింది. 1956 ఏప్రిల్‌లో పార్లమెంటులో ప్రవేశపెట్టిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు 1956 జులైలో ఆమో దం పొంది, 1956 నవంబర్‌ 1 నుంచి అమలులోకి వచ్చింది. భారత ప్రభుత్వం ఎస్సార్సీ నివేదికను, దాని సిఫారసులను ఎంతమాత్రం ఖాతరు చేయకుండా దాన్ని తన ఇష్టారాజ్యంగా, అడ్డదిడ్డంగా అమలు చేసిందని ఆ తర్వాతి పరిణామాలు రుజువుచేస్తాయి.

‘ఒకే భాష, ఒకే రాష్ట్రం’ అనే ప్రాతిపదికన ఎల్లవేళలా ఆమోదయోగ్యమేమీ కాదని, ఇతర కారణాలతో పాటు దాన్ని సమతూకంలో చూడాలని మొదటి ఎస్సార్సీ సిఫారసు చేసింది. కానీ ప్రభుత్వం ఈ సిఫారసును బుట్టదాఖలు చేసింది.

పదహారు రాష్ట్రాలనూ, మూడు కేంద్ర పాలిత ప్రాంతాలనూ ఏర్పాటు చేయాలని మొదటి ఎస్సార్సీ సూచించిందిగానీ, ఆ స్థానంలో 14 రాష్ట్రాలు, ఆరు కేంద్ర పాలిత ప్రాంతాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. రాజరికపు వాసనలు వేస్తున్న రాజప్రముఖ్‌ పదవిని రద్దు చేయాలని మొదటి ఎస్సార్సీ సూచించింది. అంతకుముందరి సంస్థానాలను భారత యూనియన్‌లో విలీనం చేసుకున్నప్పుడు మాజీ సంస్థానాధీశులకు పాత రాజభోగాలను కొనసాగించడానికి ఏర్పాటయినది ఈ రాజప్రముఖ్‌ పదవి. మొదటి ఎస్సార్సీ సూచన ప్రకారం ప్రభుత్వం దాన్ని రద్దు చేయలేదు. ఆ తర్వాత 13 సంవత్సరాలకు ఇందిరాగాంధీ ఇతర అవసరాలకోసం ఆ పని చేశారు.

మొదటి ఎస్సార్సీ హర్యానా, జార్ఖండ్‌, నాగాలాండ్‌ రాష్ట్రాలు ఏర్పాటు చేయనక్కరలేదని సూచించింది. అప్పటికి ఆ సిఫారసును ఆమోదించినట్టు కనిపించిన ప్రభుత్వం ఆ తర్వా త రాజకీయ కారణాల రీత్యా 1963లో నాగాలాండ్‌ను, 1966లో హర్యానాను, 1998లో జార్ఖండ్‌ను ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పాటు చేసింది. మొదటి ఎస్సార్సీ మధ్యప్రదేశ్‌లోని మరాఠీ భాషా ప్రాంతాలయిన బుల్దానా, అకోలా, అమరావతి, యవత్మల్‌, వార్దా, నాగపూర్‌, భండారా, చందా జిల్లాలలో విదర్భ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. ఆ సిఫారసును అప్పుడు మాత్రమే కాదుగదా, ఆ తర్వాత యాభై సంవత్సరాలలోనూ అమలులోకి తేలేదు.

ఇక తెలంగాణ విషయంలో ప్రధాన నివేదిక పేరా 381 నుంచి పేరా 393 వరకూ హైదరాబాదు రాష్ట్రానికి అనుకూలంగా వాదనలు రాసి, సిఫారసు నెం. 28.4లో అప్పుడున్న హైదరాబాదు రాష్ట్రం నుంచి రాయచూరు, గుల్బర్గా, మరఠ్వాడా జిల్లాలను వేరుచేసి ప్రత్యేకరాష్ట్రంగా ఉంచాలని సిఫారసు చేసింది. మిగిలిన హైదరాబాదు రాష్ట్ర శాసనసభ 1961 సాధారణ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రాంతంలో విలీనం కావాలని నిర్ణయం తీసుకుంటే విలీనం కావచ్చునని సిఫారసు చేసింది. అంతకుముందే పేరా 383లో తెలంగాణ ప్రజల అభిప్రాయాలు ఆ ఆరు సంవత్సరాలలో విలీనానికి అనుకూలంగా బలపడకపోతే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండిపోక తప్పదని రాసింది. ఆ వాదనలూ, సిఫారసులూ అన్నీ కేంద్ర ప్రబుత్వ రథచక్రాల కింద, జవహర్‌లాల్‌ నెహ్రూ, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల ‘పెద్దమనుషులు’ సారథులుగా, భూస్థాపితమైపోయాయి. ఆ సిఫారసులన్నీ చరిత్ర బుట్టలోకి వెళ్లడానికి ప్రధాన కారణమైన కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు మరొక ఎస్సార్సీ వేస్తే, ఆ ఎస్సార్సీ కూడా మొదటి ఎస్సార్సీలాగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు సిఫారసు చేసినా ఒరిగేదేమిటి?

( 09 జనవరి 2007, ఆంధ్రజ్యోతి )

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Andhra Jyothy, Telangana, Telugu, Vartamaanam. Bookmark the permalink.

One Response to వర్తమానం : మరలనిదేల ఎస్సార్సీ?

  1. Pingback: రెండో ఎస్సార్సీ అంటే రెండో సారి మోసపొమ్మనే అర్ధం! « గుండె చప్పుడు…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s