కత్తి ఎత్తిందెవరిమీద?

ఎంతచెడ్డా శాసనసభలకు ఏదో ఒక స్థాయిలో ప్రజలతో సంబంధం, ఐదేళ్లకొకసారి ప్రజలముందుకు పోవలసి వస్తుందనే భయం అయినా ఉన్నాయి. అటువంటి సంబంధంగానీ, భయంగానీ లేని వ్యవస్థ చేతికి ఇంత నిరంకుశ అధికారం ఇవ్వడం సమంజసమేనా?

ప్రత్యక్షంగా రాజ్యాంగంలోని ఒక షెడ్యూల్‌మీదా, పరోక్షంగా రిజ ర్వేషన్లమీదా, భూ సంస్కరణలమీదా- ఒక్కమాటలో చెప్పాలం టే, సామాజిక న్యాయంమీదా కొరడా ఝుళిపిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈ ప్రపంచీకరణ యుగంలో సుప్రీంకోర్టు ధర్మాసనం ఎంత ప్రజావ్యతిరేకంగా, ఎంత దుర్మార్గంగా ఆలోచించగలదో, తీర్పులు ఇవ్వ గలదో మరొకసారి రుజువు చేసింది. ఈ అసమసమాజంలో న్యాయవ్య వస్థ ఆస్తిపరవర్గాలకూ, ఇప్పటికే సకల సౌకర్యాలు అనుభవిస్తున్న అగ్రవ ర్ణాలకూ అనుకూలంగానే పనిచేస్తుందని ఎంతోకాలంగా ఉన్న విమర్శను నిజం చేసింది. జనవరి 11న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వై.కె. సభర్వా ల్‌తో సహా 9మంది న్యాయమూర్తుల ధర్మాసనం ప్రకటించిన ఏకగ్రీవ తీర్పు రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూలుకు న్యాయస్థానాల వ్యాజ్యా లనుంచి ఉన్న మినహాయింపు చెల్లదనీ, ఆ షెడ్యూల్‌లోని చట్టాలను కూడా సవాలుచేస్తూ ఎవరయినా న్యాయస్థానాలలో వ్యాజ్యాలు దాఖలు చేయవచ్చుననీ నిర్ధారించింది.

పాలకవర్గాలు 9వ షెడ్యూల్‌ను దుర్వినియోగంచేసిన మాటా, అవ సరం లేని చట్టాలను కూడా న్యాయవ్యవస్థ పరిధినుంచి తప్పించడానికి ఒక కవచంగా వాడుకున్నమాటా, న్యాయవ్యవస్థకన్నా తాము అధికుల మని చూపుకోవడానికి ఆ షెడ్యూల్‌ను ఉపయోగించిన మాటా నిజమే. కానీ సుప్రీంకోర్టు ఆ దుర్వినియోగాన్ని ప్రశ్నించేబదులు, సరిచేసే బదు లు, అసలు ఆ షెడ్యూల్ అవసరాన్నే అపహాస్యం చేసింది. అంటే ప్రాథ మిక హక్కులను రక్షించేపేరుతో ఆదేశిక సూత్రాల గౌరవాన్ని తిరగదో సింది. పైకి మామూలుగా ప్రాథమిక హక్కుల రక్షణచర్యగా కనబడుతున్న ఈ తీర్పు భారత రాజకీయార్థిక వ్యవస్థలోనూ, న్యాయవ్యవస్థలోనూ పెనుమార్పులుకు దారితీస్తుంది. ఆ తీర్పువల్ల జరగబోయే సామాజిక అనర్థాల గురించి చర్చించబోయే ముందు, అసలు తొమ్మిదో షెడ్యూలు అంటే ఏమిటో దాన్ని రాజ్యాంగంలో ఎందుకు చేర్చవలసివచ్చిందో, అది ఇంతకాలం ఏ పాత్ర నిర్వహించిందో, ఇప్పుడు దాన్ని బలహీన పరచా లని ప్రపంచీకరణ శక్తులు ఎందుకు ప్రయత్నిస్తున్నాయో, ఆ శక్తులకు అత్యున్నతన్యాయస్థానం ఎట్లా తల ఒగ్గిందో తెలుసుకోవలసి ఉంది.

తొమ్మిదో షెడ్యూలు ఏదో చండ శాసనమైనట్టు, ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు తీర్పు దాన్ని సరళీకరిస్తున్నట్టు విజ్ఞులైన మేధావులు కొందరు మసిపూసి మారేడుకాయ చేస్తున్న నేపథ్యంలో ఈ వివరణ అవసరం మరింత పెరుగుతోంది. తొమ్మిదో షెడ్యూలు నిర్బంధ శాసనమూ కాదు. ఎవరి దయాధర్మ మూ కాదు, శాసన వ్యవస్థలు పన్నిన తప్పించుకునే ఎత్తుగడా కాదు. దేశంలో భూయాజమాన్య సంబంధాలను మార్చాలనే ఆకాంక్ష జాతీయోద్యమంలో భాగంగానూ, రైతాంగ ఆకాంక్షలలోనూ, సాయుధ పోరాటాలలోనూ వ్యక్తమైనప్పుడు 1947తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ భూ సంస్కరణల కార్యక్రమాలు ప్రారంభించాయి. ఆ కార్యక్రమాలను ఆయా ప్రభుత్వాలు ఎంతచిత్తశుద్ధితో నిర్వహించాయనేది వేరే చర్చగానీ, భూమి కోల్పోయే భూస్వాములు రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల రక్షణ తీసుకుని, తమ ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతున్నదం టూ భూ సంస్కరణ చట్టాలను సవాలు చేస్తూ న్యాయస్థానాలకు ఎక్కగల ప్రమాదం ముంచుకొచ్చింది.

ఆ ప్రమాదాన్ని నివారించడానికి జవహర్‌లాల్ నెహ్రూకు తట్టిన మార్గం తొమ్మిదో షెడ్యూలు. మన రాజకీయార్థిక సామాజిక వ్యవస్థలో కొన్ని పరివర్తనలు తీసుకురావాలంటే ఆ పరివర్తనకు అవసరమైన చట్టాలు కోర్టు వివాదాల చిక్కు ముడులలోకి పోకుం డా ఒక మార్గాంతరాన్ని సృష్టించాలని ఆయన అనుకున్నాడు. అందువల్లనే 1951 జూన్ 18న ఆమోదించిన మొట్టమొదటి రాజ్యాం గ సవరణలో కొత్తగా 31 ఏ, బి అనే అధికరణాలను చేర్చి ఒక తొమ్మిదో షెడ్యూలును సృష్టించి భూముల స్వాధీనపు చట్టాలను, ఇతర చట్టాలను న్యాయస్థానాల వ్యాజ్యాల పరిధినుంచి తప్పించడం జరిగింది. కాలక్రమంలో ఆ షెడ్యూలులోకి భూ సంస్కరణల చట్టాలు మాత్రమేగాక, రిజర్వేషన్ల పెంపుదల చట్టం, విదేశీ మారకద్రవ్య నియంత్రణ చట్టం వంటివి కూడా వచ్చి చేరాయి.

ఆయా చట్టాలలోని సంక్షేమ భావనను న్యాయస్థానాలలో సవాలు చేసి, ఆ భావనకు తూట్లుపొడిచే తీర్పులు తెచ్చుకుని, అంతిమంగా ఏ మార్పులూ లేని అసమ వ్యవస్థను కొనసాగించడానికి ఎవరూ ప్రయత్నించడానికి వీలులేదనేది ఈ షెడ్యూల్ స్ఫూర్తి. ముఖ్యం గా 1993లో తమిళనాడు ప్రభుత్వం రిజర్వేషన్లను 69 శాతం దాకా పెం చవచ్చునని చట్టంచేసి, దాన్ని తొమ్మిదో షెడ్యూలులో చేర్చినప్పటినుంచీ అది వివాదాస్పదమైంది. రిజర్వేషన్లు మొత్తం 50 శాతానికి మించగూడదని సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పటికీ, తొమ్మిదో షెడ్యూలులో చేరడం వల్ల తమిళనాడు రిజర్వేషన్లు ప్రశ్నించడానికి వీలులేనివయిపోయాయి. అప్పటినుంచీ అసలు తొమ్మిదో షెడ్యూలు నే ఎత్తివేయించాలని అగ్రవర్ణ మేధావులు ప్రయత్నిస్తున్నారు. మరొకవైపు కొత్త సంక్షేమ చట్టాలు రావాలని కోరుకున్న ప్రజా ఉద్యమాలన్నీ ఆ చట్టాలను తొమ్మిదో షెడ్యూలులో చేర్చమని కూడా అడగడం మొదలుపెట్టాయి.

సరిగ్గా అప్పుడే ప్రారంభమయిన నూతన ఆర్థి క విధానాల వెల్లువలో, భూ సంస్కరణలకు వ్యతిరేక ఆలోచనలు, విశాల భూక్షేత్రాలను బహుళజాతి సంస్థలకు, దేశ దేశాల సంపన్నలకు కట్టబెట్టాలనే ప్రయత్నా లు కూడా మొదలయ్యాయి. తొమ్మిదో షెడ్యూలులోని 284 చట్టాలలోనుంచి అత్యధిక చట్టాలను న్యాయస్థానాలకు లాగాలనీ, వ్యాజ్యాలలో ఇరికించి, కాలయాప న చేస్తూ, ఆ చట్టాలలోని నామమాత్రపు సంక్షేమ భావననైనా నీరుకార్చాలని పన్నాగాలు మొదలయ్యాయి. ఈ చరిత్రనంతా సాకల్యంగా పరిశీలిస్తే, ప్రస్తుతం కేవలం శాసనకర్తల అవకాశవాద రాజకీయాలమీద, అనవసరపు రక్షణలమీద న్యాయవ్యవస్థ చేసిన సక్రమమైన ఆగ్రహప్రకటనగా, రాజ్యాంగ మౌలిక స్ఫూర్తిని పరిరక్షించే చర్యగా కనబడే జనవరి 11 తీర్పులోని అసలు సమస్యలు బయటపడతాయి. ఇప్పటికైతే సుప్రసిద్ధ కేశవానంద భారతి తీర్పు (1973) తర్వాత తొమ్మిదో షెడ్యూలులో చేరిన 139 చట్టాలను సమీక్షించి, వాటి లో ఏవి న్యాయవ్యవస్థ పరిశీలనా పరిధిలోకి వస్తాయో తేలుస్తామని అం టున్నారుగానీ, నూతన ఆర్థిక విధానాల తర్వాత సుప్రీంకోర్టు ఆలోచనా సరళని పరిశీలించిన వారెవరికయినా ఆ సమీక్ష ఎట్లా జరగనుందో తేటతెల్లమే.

ఆ సమీక్ష భూ సంస్కరణ చట్టాలనూ, ముఖ్యంగా 69 శాతం రిజర్వేషన్ చట్టాన్నీ న్యాయవ్యవస్థ పరిశీలనా పరిధిలోకి తెస్తుంది. అంటే, ఆ చట్టాలమీద ఇబ్బడిముబ్బడిగా వ్యాజ్యాలు మొదలవుతాయి. కోన్‌కిస్కాలందరూ ఆ చట్టాలను సవాలుచేస్తూ కోర్టులకు ఎక్కుతారు. ఎక్కడో ఒక న్యాయస్థానం ఆ చట్టాలను కొట్టివేయవచ్చుకూడా. న్యాయస్థానాలకే సర్వాధికారాలు చేరినస్థితిలో సంక్షేమ చట్టాలనేవే లేకుండాపోతాయి. ఎంతచెడ్డా శాసనసభలకు ఏదో ఒక స్థాయిలో ప్రజలతో సంబంధం, ఐదేళ్లకొకసారి ప్రజలముందుకు పోవలసివస్తుందనే భయం అయినా ఉన్నాయి. అటువంటి సంబంధంగానీ, భయంగానీ లేని వ్యవస్థ చేతికి ఇంత నిరంకుశ అధికారం ఇవ్వడం సమంజసమేనా?

(ఆంధ్రజ్యోతి, 23 జనవరి 2007)

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Andhra Jyothy, Telugu, Vartamaanam. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s