సెప్టెంబర్ 17 ‘విమోచన’ – తెలంగాణ ఆకాంక్షలు

ఒక ప్రాంతీయ ఉద్యమం వికసించేటప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించిన చరిత్ర పట్ల ప్రగాఢమైన శ్రద్ధాసక్తులు వ్యక్తం కావడం, చరిత్రను తవ్వితీసి తమ అస్తిత్వపు ప్రత్యేకతకు ఆధారాలను, సమర్థనలను వెతుక్కోవడం, చరిత్ర పునాదిపైననే తమ ఉద్యమానికి మద్దతునూ, సాధికారతనూ సాధించుకోవడానికి ప్రయత్నించడం సహజమైన అంశాలు. అయితే చరిత్ర అనేది ఒక నిరపేక్షమైన ముద్ద కాదు గనుక, అందులో వ్యాఖ్యాత దృక్పథాన్నిబట్టి, ఇష్టాయిష్టాలనుబట్టి వాస్తవాల ఎంపికకూ, విస్మరణకూ, వక్రీకరణకూ అవకాశం ఉంటుంది గనుక, తీవ్రమైన భావోద్వేగాలు నెలకొని ఉన్నసమయంలో తమకు నచ్చినదానినే, తమకు అనుకూలమైనదానినే వాస్తవ చరిత్రగా భావించడం సహజంగా జరుగుతూ ఉంటుంది. నిజంగా ఏమి జరిగి ఉన్నా, తమకు అవసరమైనట్టుగా జరిగిఉంటే బాగుండునని భావించడం, తమకు అనుకూలంగానే జరిగిందని ప్రచారం చేయడం సహజమే.

ప్రాంతీయ ఉద్యమం, చరిత్ర పట్ల ఆసక్తి, తీవ్రమైన భావోద్వేగాలు అనే ఇక్కడి కీలకమైన పదబంధాలు మూడూ కూడ చాల సంక్లిష్టమైనవి, విశిష్టమైనవి. వాటి సంక్లిష్టత, విశిష్టతల వల్ల ఏఒక్క నిర్ధారణ అయినా అందరి ఆమోదాన్నీ పొందడం కష్టం. తీవ్రమైన భావోద్వేగాలున్నందువల్ల ఆ ఉద్వేగాలకూ వాస్తవాలకూ మధ్య తేడా ఉంటే సహించడం కష్టమవుతుంది. కాని వాస్తవాలనేవి అన్నివేళలా మన ఉద్వేగాలకు అనుగుణంగానే ఉండకపోవచ్చు. ప్రాంతీయ ఉద్యమం అన్నప్పుడే ఇతర విభేదాలను, అస్తిత్వాలను తాత్కాలికంగానయినా పక్కన పెట్టి ప్రాంతీయ అస్తిత్వమే ఏకైక ప్రమేయంగా ఐక్యతను కోరుతున్నామన్నమాట. కాని ఆ విభేదాలు, విభిన్న అస్తిత్వాలు చాల స్పష్టమైన భౌతిక వాస్తవికతలు గనుక ఆ ఘర్షణను పక్కన పెట్టడం నిజంగా సాధ్యం కాదు. ప్రాంతీయ ఉద్యమ ఆకాంక్షలలో ఏకకాలంలో వ్యక్తమయ్యే ఈ ఐక్యత, ఘర్షణలవల్ల ఒకచోట అత్యంత సన్నిహితమైన అంశాన్ని మరొకచోట విస్మరణకు గురిచేయవలసివస్తుంది, కనీసం అప్పటికి పక్కనపెట్టవలసి వస్తుంది. ఇక చరిత్రతో ప్రాంతీయ ఆకాంక్షలను అనుసంధానించినప్పుడు ఉద్వేగభరితంగానో, అస్తిత్వం వల్లనో నమ్ముతున్న చరిత్రకూ వాస్తవ చరిత్రకూ అంతరం ఉంటుంది. ఒకరికి చరిత్ర అయినది మరొకరికి కల్పన అవుతుంది. ఒకరికి వాస్తవంగా కనబడినది మరొకరికి వక్రీకరణగా కనబడుతుంది. కాని అది ప్రాంతీయ ఉద్యమం గనుక చరిత్ర అనుకునేవాళ్లు, కల్పన అనుకునేవాళ్లు, వాస్తవం అనుకునేవాళ్లు, వక్రీకరణ అనుకునేవాళ్లు కూడ ఒకే ఉద్యమంలో భాగం కావలసివస్తుంది. నిజమైన చరిత్ర తెలిసినవాళ్లు కూడ ఉద్వేగపూరితమైన అవాస్తవాలను అంగీకరించడం అయినా, కనీసం మౌనం పాటించడం అయినా చేయవలసివస్తుంది.

చరిత్ర నిర్మాణక్రమంలో, చరిత్ర గ్రహణక్రమంలో, చరిత్ర రచనాక్రమంలో వ్యక్తమయ్యే ఈ సంక్లిష్టత, సంకీర్ణతలు ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షలకూ, ‘సెప్టెంబర్ 17 విమోచనదినం’ గుర్తింపుకూ మధ్య స్పష్టంగా కనబడుతున్నాయి. ఐక్యతనూ, ఘర్షణనూ సృష్టిస్తున్నాయి. తెలంగాణ చరిత్రలో ముఖ్యమైన సెప్టెంబర్ 17, 1948 అనే తేదీని తెలంగాణవాదులు విభిన్నంగా గుర్తిస్తున్నారు. అది విమోచన దినమా, విద్రోహదినమా, ఉస్మాన్ అలీ ఖాన్ ఓటమి దినమా, అటు నెహ్రూనూ ఇటు రామానంద తీర్థనూ కాదని హైదరాబాద్ మీదికి సైన్యం నడిపించిన సర్దార్ పటేల్ విజయదినమా, విలీనదినమా, విశాలాంధ్ర లో తెలంగాణను దోపిడీ చేయడానికి వేసుకున్న ఒక తొలి మెట్టా, లేక ప్రత్యేకతేమీలేని ఒకానొక మామూలు రోజు మాత్రమేనా అనే విషయంలో చాల భిన్నాభిప్రాయాలున్నాయి.

ఆ రోజుకు యాభై ఏళ్ళు నిండిన సందర్భంగా, భారతీయ జనతా పార్టీ, అప్పటి ఉప ప్రధాని ఎల్ కె అద్వానీ 1998 సెప్టెంబర్ 17 న ‘హైదరాబాద్ విమోచన స్వర్ణోత్సవాల’ను జరపడంతో ఈ చర్చకు ప్రాధాన్యత మరింతగా పెరిగింది. భారతీయ జనతా పార్టీ ఈ విమోచన దినాన్ని, ముస్లిం పాలననుంచి హిందూ హైదరాబాదు విముక్తి చెందిన దినంగా, అంటే తమ ముస్లిం వ్యతిరేక ఎజెండాలో భాగంగా జరపడం మొదలుపెట్టింది. హైదరాబాద్ రాజ్యపు ప్రత్యేకతలనూ, చరిత్రనూ పక్కనపెట్టి, ఆ రాజ్యాన్ని కేవలం హిందువులు విముక్తి కోరుకున్న ముస్లిం రాజ్యంగా చూపడం ప్రారంభించింది. ‘విమోచన దినం’ మీద మీ వైఖరి ఏమిటి అని అన్ని రాజకీయ పక్షాలనూ బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టింది. అసలు భారతీయ జనతా పార్టీకీ, 1948 నాటి తెలంగాణకూ ఎటువంటి సంబంధం లేకపోయినా, ఈ ప్రశ్న వేసే అర్ హత గాని స్థాయి గాని లేకపోయినా, ఈ బ్లాక్ మెయిల్ కి లొంగి అన్ని రాజకీయపక్షాలూ సెప్టెంబర్ 17 గురించి నంగినంగిగా మాట్లాడడం ప్రారంభించాయి. ఆ తేదీని ఎన్నడూ విమోచనదినంగా గుర్తించని రాజకీయపక్షాలు కూడ నట్లుకొట్టడం, అసమంజసమైన వాదనలు ముందుకుతీసుకురావడం మొదలుపెట్టాయి. అప్పటి తెలంగాణలో ప్రజాఉద్యమాలను నడిపించిన స్టేట్ కాంగ్రెస్ కూ, కమ్యూనిస్టు పార్టీకీ ఏదో ఒక రకమయిన వారసత్వం ప్రకటించుకోగలిగిన కాంగ్రెస్ , భారత కమ్యూనిస్టు పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) గందరగోళపడడం మొదలుపెట్టాయి. అది విమోచన అవునా కాదా అనే స్పష్టమయిన వైఖరిని ఇప్పటికీ ప్రకటించలేకపోయాయి. తెలంగాణ వాదులకు మొత్తంగా హైదరాబాదు రాజ్య చరిత్ర మీద, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు దారి తీసిన పరిణామాలమీద మీద తమదైన వైఖరి ప్రకటించవలసిన అవసరం వచ్చింది. అందువల్ల సెప్టెంబర్ 17 మీద స్పష్టమైన అభిప్రాయం తెలియజేయవలసివచ్చింది. ప్రత్యేకరాష్ట్రం ఏర్పాటు మాత్రమే తెలంగాణ సమస్యలకు పరిష్కారం అని భావించే వారిలో ఈ విషయంలో తీసుకోవలసిన వైఖరి ఏమిటని గందరగోళం, భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి.

ఈనేపథ్యంలో అసలు సెప్టెంబర్ 17, 1948న ఏమి జరిగింది, ఆ ఘటనను సమకాలీన వ్యాఖ్యాతలు ఎట్లా అర్థం చేసుకున్నారు, ఇవాళ ఎట్లా అర్థం చేసుకోవలసిఉంది అనే అంశాలు చర్చించడం ఈ వ్యాస లక్ష్యం.

రెండో ప్రపంచ యుద్ధానంతరం బ్రిటిష్ వలసవాదులు భారత దేశానికి స్వాతంత్ర్యం ఇవ్వదలచుకున్నప్పుడు జరిగిన చర్చోపచర్చలలో భారతదేశం, పాకిస్తాన్ అనే రెండు సర్వసత్తాక దేశాలు ఏర్పడతాయని, అప్పటికి స్వతంత్ర సంస్థానాలుగా ఉండిన 554 రాజ్యాలు అటు పాకిస్తాన్ లో కలవడమో, ఇటు భారతదేశంలో కలవడమో, ఎటూ చేరకుండా స్వతంత్రంగా ఉండడమో నిర్ణయించుకోవచ్చునని అంగీకారం కుదిరింది. ఆ కాలపు చిక్కుముడుల సంక్లిష్ట చరిత్రలోకి ఇక్కడ పోనక్కరలేదు గాని, హైదరాబాదు పాలకుడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కొంతకాలం స్వతంత్రంగా ఉండాలనీ, కొంతకాలం పాకిస్తాన్ తో కలవాలనీ ఆలోచనలు చేశాడు. తన స్వతంత్ర ప్రతిపత్తి గురించి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ముందు కూడ వాదనలు జరిపాడు. బ్రిటిష్ ప్రభుత్వ ప్రతినిధులకు, భారత ప్రభుత్వ ప్రతినిధులకు, నిజాం ప్రభుత్వ ప్రతినిధులకు మధ్య ఎడతెగని చర్చలు జరిగాయి. ఒకవైపు ఈ హోరాహోరీ చర్చలు జరుగుతుండగానే, భారత ప్రభుత్వం నిజాం ప్రభుత్వంతో 1947 నవంబర్ 29 న యథాతథ ఒడంబడిక జరుపుకుంది. అంటే సంస్థానవ్యవహారాలలో జోక్యం చేసుకోబోనని నిజాంకు వాగ్దానం ఇచ్చింది. ఈ ఒడంబడికను అప్పటి హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులందరూ విమర్శించారు. మళ్లీ 1948 జులై లో విడుదల చేసిన శ్వేతపత్రం నుంచి ప్రారంభించి, భారత ప్రభుత్వం హైదరాబాద్ ప్రభుత్వం మీద దాడి మొదలుపెట్టింది. ఆ దాడిలో నిజాలు ఎన్నో అబద్ధాలు ఎన్నో ఎవరూ చెప్పలేరు. ఒకవైపు రజాకార్లను, మరొకవైపు కమ్యూనిస్టు గెరిల్లాలను అణచివేయడంలో నిజాం ప్రభుత్వం విఫలమవుతున్నదని, అందువల్ల ఆ అరాచకాలను ఆపడానికి జోక్యం చేసుకోకతప్పదని భారత ప్రభుత్వ నాయకులు బహిరంగంగానే ప్రకటిస్తూ వచ్చారు. హైదరాబాదు సంస్థానాన్ని భారత యూనియన్ లో భాగం చేయడం అంగీకారమేనా కాదా అని ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు ప్లెబిసైట్ జరపాలనే ప్రతిపాదన కూడ వచ్చింది. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ భద్రతా సమితికి చేసిన ఫిర్యాదు 1948 సెప్టెంబర్ లో చర్చకు రాబోయింది.

ఈ పరిస్థితులలో భారత సైన్యం హైదరాబాద్ సంస్థానం మీదికి నాలుగు వైపులనుంచీ దండయాత్ర ప్రారంభించింది. ఈ సైనిక చర్య అసలు లక్ష్యం కమ్యూనిస్టుల నాయకత్వాన సాగుతున్న రైతాంగ సాయుధపోరాటాన్ని అణచివేయడమేననే వాదనలు కూడ ఉన్నాయి. సంస్థానాలను భారత యూనియన్ లో విలీనం చేయడంలో ప్రధాన పాత్ర వహించిన వి పి మీనన్ పుస్తకం చదివితే కూడ ఆ వాదనలలో నిజం ఉందని అర్థం అవుతుంది. భారత సైన్యం రజాకార్లపట్ల కూడ కఠినమైన అణచివేత వైఖరినే అవలంబించింది. నిజాంప్రభుత్వాన్ని కూలదోసింది గాని, ఉస్మాన్ అలీ ఖాన్ అనుభవిస్తుండిన అన్ని అధికారాలనూ, సంపదనూ యథాతథంగా ఉంచింది. కమ్యూనిస్టుల నాయకత్వంలో రైతుకూలీలు ఆక్రమించుకున్న భూములను సైనికుల సాయంతో భూస్వాములకు కట్టబెట్టింది. నిజాం పోలీసులు చంపినవారికంటె ఎక్కువ మంది తెలంగాణ రైతుకూలీలను, మూడువేలమందిని భారత సైనికులు కాల్చిచంపారు.

భారత ప్రభుత్వం 1948 సెప్టెంబర్ 13 నుంచి 18 వరకు జరిపిన సైనికచర్య వల్ల హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనమయిందన్నది ఒక చారిత్రక సత్యం. కాని అది నిజంగా హైదరాబాద్ సంస్థానాన్ని విముక్తి చేసిందా? అసలు విమోచన అన్న మాటను ఎట్లా అర్థం చేసుకోవాలి? భారత ప్రభుత్వంగాని, ప్రజలుగాని దాన్ని విమోచన అనుకున్నారా లేదా, సైనికచర్య ముందూ వెనుకా జరిగిన పరిణామాలు దాన్ని విమోచనంగా అభివర్ణించడానికి వీలు కల్పిస్తాయా విశ్లేషించవలసి ఉంటుంది.

‘మా నిజాము రాజు తరతరాల బూజు’ అని తెలంగాణ ప్రజానీకం నిజాం రాజరిక పాలన నుంచి, ముఖ్యంగా ఉస్మాన్ అలీ ఖాన్ దుర్మార్గ పాలన నుంచి విముక్తి కావాలని ఆశించిందన్న మాట నిజమే. అయితే ఆ ఉస్మాన్ అలీ ఖాన్ గాలిలో లేడు. మతం అనే ఒకానొక ఊతకర్ర మీద కూడ ఆధారపడ్డాడేమో గాని అంతకన్న బలంగా కిందా పైనా ఆధారాలున్నాయి – కింద ఆధారం పాయెగాలు, జాగీర్దార్లు, దేశముఖ్ లు, మక్తేదార్లు అనే పేర్లతో రాజ్యమంతటా వ్యాపించిన పెద్దపెద్ద భూస్వాములు. మత ప్రకారం చూస్తే వీరిలో హిందువులే ఎక్కువ. ఇక నిజాంకు పైన ఆధారంగా బ్రిటిష్ వలసపాలకులు ఉన్నారు. స్వయంగా బ్రిటిష్ రాణి ఏడవ నిజాం కు ‘విశ్వాసపాత్రుడయిన మిత్రుడు’ అని బిరుదు ఇచ్చిఉంది. అందువల్ల ఇటు భూస్వామ్యం కింద, అటు రాచరికం కింద, దాన్ని బలపరుస్తున్న వలసవాదం కింద నలిగిపోయిన ప్రజలు తప్పనిసరిగా విముక్తి కోరుకున్నారు. ఈ విమోచనాకాంక్ష అటు చివరన ఆర్యసమాజ్ నుంచి ఇటు చివరన గుత్పలసంఘం – సాయుధపోరాటం దాకా అనేకరూపాల్లో వ్యక్తీకరణ పొందింది. ఈ విమోచనాకాంక్షకు భాషా, మత, సాంస్కృతిక కోణాలు, విద్యావకాశాలు, అభివృద్ధి, ఆధునిక వైద్య, ఆరోగ్య, రవాణా సౌకర్యాలు, భూమి సమస్య వంటి విభిన్న రూపాలున్నాయి. ఈ విమోచనాకాంక్షలలో ఏ ఒక్కటైనా సెప్టెంబర్ 18 సైనికచర్య ద్వారా తీరిందా అనేది కీలకమైన ప్రశ్న. ఏయే అంశాలలో ప్రజలు విముక్తి కోరుకున్నారో వాటిలో ఏఒక్క అంశంలోనైనా విముక్తి దొరికిందా, విముక్తిమార్గం సుగమమయిందా అన్నది ప్రశ్న.

సమకాలీన వ్యాఖ్యలు
ఆశ్చర్యకరంగా సెప్టెంబర్ 17, 1948 న హైదరాబాదు రాజ్యంమీద పోలీసు చర్య పేరుతో జరిగిన సైనికచర్య (దానికి భారత సైన్యం ముద్దుపేరు ‘ఆపరేషన్ పోలో’) ను సమకాలీన పత్రికలు గానీ, వ్యాఖ్యాతలుగానీ, రాజకీయ నాయకులుగానీ ‘విమోచన’ అని అనలేదు. ఆ తర్వాత పద్నాలుగు సంవత్సరాలకు గోవా ను పోర్చుగీసు పాలన నుంచి విడిపించి భారత ప్రభుత్వ పాలన కిందికి తెచ్చిన సందర్భంలో ప్రభుత్వ పత్రాలలోను, సైనిక పత్రాలలోను దాన్ని ‘గోవా విముక్తి’ గా ప్రస్తావించిన వాళ్లు, తూర్పు పాకిస్తాన్ ను బంగ్లాదేశ్ గా మార్చడానికి ముక్తిబాహినిని తయారుచేసి, బంగ్లాదేశ్ విమోచనగా అభివర్ణించినవాళ్లు, హైదరాబాద్ విషయంలో సమకాలీనంగా ఆ మాట వాడలేదని జాగ్రత్తగా గుర్తించడం చాల అవసరం. అప్పుడు ‘హైదరాబాద్ ను ఇండియన్ యూనియన్ లో విలీనం చేయడం’ అనే మాటనే పదేపదే అందరూ వాడారు తప్ప, విమోచన అనే మాటే ఎక్కడా కనిపించదు. మెర్జర్ , అన్నెక్సేషన్ , ఆక్సెషన్ , పోలీస్ ఆక్షన్ , అటాక్ , ఆక్షన్ , మిలిటరీ ఆపరేషన్ , నిజామ్స్ సరెండర్, ఎండ్ ఆఫ్ అసఫ్ జాహి రూల్ లాంటి మాటలతోనే దాన్ని ప్రస్తావించడం కనబడుతుంది. సమకాలీన కమ్యూనిస్టులలో కొందరు, ప్రజాస్వామికవాదులలో కొందరు, నిజాం ప్రభుత్వ మద్దతుదారులు కూడ ఆ చర్యను ‘హైదరాబాదు పై యుద్ధం’గా, ‘ఆక్రమిత సైన్యం’ కూడ అభివర్ణించారు. ఆ పనికి బాధ్యుడైన సర్దార్ వల్లభ్ భాయి పటేల్ గురించి ఆరాధనతో రాసిన వాళ్లు కూడ ఆయనను భారతయూనియన్ ను సమైక్యం చేసిన ఉక్కుమనిషిగా అభివర్ణించారే గాని, హైదరాబాదును ‘విముక్తి’ చేసినవ్యక్తిగా చెప్పలేదు. సర్దార్ పటేల్ కూడ హైదరాబాద్ విమోచన అనే మాట వాడలేదు.

హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్ లో విలీనం చేసే విషయంలో అందరికన్నా ఎక్కువ సమాచారం ఉండే అవకాశం ఉన్నది వి పి మీనన్ కు. ఆయన చివరి గవర్నర్ జనరల్ కు రాజ్యాంగ సలహాదారు గాను, కేంద్ర మంత్రివర్గంలో అప్పుడే ఏర్పాటయిన సంస్థానాల మంత్రిత్వశాఖకు కార్యదర్శిగాను పని చేశారు. ఆ హోదాలో ఆయన నేరుగా అప్పటి ఉప ప్రధాని సర్దార్ పటేల్ కింద పనిచేశారు. ఆ అనుభవంతో, సమాచారంతో ఆయన 1956లో ‘ది స్టోరీ ఆఫ్ ది ఇంటిగ్రేషన్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్స్’ అనే గ్రంథం రాశారు. అందులో మూడు అధ్యాయాలలో 7ం పేజీలకుపైగా హైదరాబాదు వ్యవహారాలకే కేటాయించారు. అందులో ఆయన దండయాత్ర, చర్య, దాడి అనే మాటలే వాడారు గాని విమోచన అనే మాట వాడలేదు.

హైదరాబాదు మీద పోలీసుచర్య జరిగిన వెంటనే, 1948 లోనే, సోషలిస్ట్ పార్టీ హైదరాబాద్ స్ట్రగుల్ కమిటీ, జయప్రకాశ్ నారాయణ్ ముందుమాటతో ‘ది హైదరాబాద్ ప్రాబ్లం: ది నెక్స్ట్ స్టెప్’ అని ఒక పుస్తకాన్ని ప్రచురించింది. ఆ పుస్తకం హైదరాబాదు మీద భారత ప్రభుత్వం సైనిక విజయం సాధించింది అని ఒప్పుకుంటూనే, హైదరాబాదు ప్రజల విముక్తికోసం అది సరిపోదని అంది. ఇంకా ఏయే చర్యలు అవసరమో సూచించింది.

పటేల్ ను అభిమానించి, అటు కమ్యూనిస్టులనూ, ఇటు కాంగ్రెస్ లోని స్వామి రామానంద తీర్థ వంటి నాయకులనూ వ్యతిరేకించిన వందేమాతరం వీరభద్రరావు, రామచంద్రరావు సోదరులు 1949 లోనే ‘ఇండియాస్ పోలీస్ ఆక్షన్ అగెనెస్ట్ హైదరాబాద్’ అనే పుస్తకం ఇంగ్లిష్ లో రాశారు. రెండు నెలల లోపే దానికి తెలుగు అనువాదం కూడ వెలువడింది. ఆ పుస్తకంలో ఆయన కూడ ఒక్క చోట, ఫొటో వ్యాఖ్యలో మాత్రమే “ముక్తిదాతలు” అని సర్దార్ పటేల్, కె ఎం మున్షీ, మేజర్ జనరల్ జె ఎన్ చౌదరి ల ఫొటోల పైన రాశారు తప్ప, పుస్తకంలో మరెక్కడా దాన్ని విమోచనగా ప్రస్తావించలేదు.

మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ జీవితచరిత్ర మీద ఇప్పటివరకూ అత్యంత సాధికారికమైన పుస్తకం రాసిన వి కె బావా ఆ సంక్షుభిత కాలం గురించి అసంఖ్యాకమైన ఆధారాల సహాయంతో ఏమి జరిగిందో పునర్నిర్మించారు. చాల చిన్న చిన్న వివరాలు కూడ పొందుపరచుకున్న ఈ పుస్తకంలో కూడ ఎక్కడా సెప్టెంబర్ 17 ను విమోచనగా అభివర్ణించడం ఉండదు. ఇక సరోజినీ నాయుడు కొడుకు, హైదరాబాదు రాజ్యంలో ప్రముఖ ప్రజాస్వామికవాది, డా. ఎన్ ఎం జయసూర్య అయితే, 1948లో మాత్రమే కాదు, 1952లో కూడ, భారత సైన్యాలను ఆక్రమిత సైన్యంగా అభివర్ణించారు. ముల్కీ ఉద్యమంమీద జరిగిన కాల్పుల పై విచారణ జరిపిన జగన్మోహన రెడ్డి కమిషన్ ముందు వాంగ్మూలం ఇస్తూ 1952 నవంబర్ లో ఆయన, “ప్రపంచంలో ఇప్పుడు మూడే మూడు దేశాలలో ఆక్రమిత సైన్యాలు ఉన్నాయి. అవి, జర్మనీ, జపాన్ , హైదరాబాద్” అని అన్నారు.

అప్పటి స్టేట్ కాంగ్రెస్ నాయకుడు, అనేక విషయాలలో ఇతర రాజకీయవేత్తలకన్న భిన్నంగా, విశిష్టంగా ఆలోచించిన స్వామి రామానంద తీర్థ తన ఆత్మకథ ను 1966 లో ఇంగ్లిషులో రాశారు. అది 1984 లో తెలుగులోకి అనువాదమయింది. దాని శీర్షికే ‘హైదరాబాదు స్వాతంత్ర్య పోరాటం – అనుభవాలు, జ్నాపకాలు’ అని ఉన్నప్పటికీ, 1947 ఆగస్ట్ 15 నుంచి 1948 సెప్టెంబర్ వరకూ, ఆ తర్వాత కూడ నిజాం ప్రభుత్వంతో భారత ప్రభుత్వం ప్రవర్తించిన తీరుపై ఆయనకు ఎన్నో అభ్యంతరాలు ఉన్నాయి. నిజాం ప్రభుత్వంతో భారత ప్రభుత్వం యథాతథ ఒడంబడిక కుదుర్చుకోవడం పట్ల, విలీనం తర్వాత ఉస్మాన్ అలీ ఖాన్ ను రాజప్రముఖ్ గా గుర్తించి సకల గౌరవాలు అందించడం పట్ల ఆయనకు తీవ్రమయిన అభ్యంతరాలు ఉన్నాయిగాని సెప్టెంబర్ 17 పట్ల ఆయన విమోచన అనే వైఖరి తీసుకోలేదు.

తెలంగాణ ప్రజల పోరాటాల చరిత్ర గ్రంథాలను, ప్రజానాయకుల ఆత్మకథలను, జీవితచరిత్రలను నిశితంగా అధ్యయనం చేస్తే, 1970ల వరకు కూడ, తెలంగాణ ప్రజా పోరాటాలను “స్వాతంత్ర్యోద్యమం” అన్నవాళ్లు కూడ, సెప్టెంబర్ 17, 1948 ని “స్వాతంత్ర్యం” గానో, “విమోచన” గానో అభివర్ణించినట్టు కనబడదు. బహుశా, ఈ మార్పు క్రమక్రమంగా 1970ల చివరినుంచీ మొదలయినట్టుంది. మందుముల నరసింగరావు ఆత్మకథ ‘50 సంవత్సరాల హైదరాబాదు’ 1977లో అచ్చయింది. అందులో ఆయన ‘పోలీసు చర్య’ ‘స్వాతంత్ర్యం’ ‘స్వేచ్చా వాయువులు పీల్చడం’ అనే వ్యక్తీకరణలను సమానార్థకంగా, పర్యాయపదాలుగా వాడారు. 1980లలో కాంగ్రెస్ ప్రచురణగా వెలువడిన ‘హైదరాబాదు స్వాతంత్ర్యోద్యమ చరిత్ర’ కొంతవరకు విముక్తి, స్వాతంత్ర్యం, విలీనం అనే మాటలను స్పష్టత లేకుండా కలగాపులగంగా వాడింది.

తెలంగాణ ప్రజాపోరాటాల కాలంలో ఆర్యసమాజ్ లోనో, కాంగ్రెస్ లోనో ఉండి తర్వాత క్రమక్రమంగా మతోన్మాద రాజకీయాలలోకి వెళ్లిన కొందరు నాయకులు తమ పాత పోరాట అనుభవాలను ఇప్పటి దృక్పథం నుంచి వడపోయడం ప్రారంభించినతర్వాత, నిజాము రాజ్యాన్ని ప్రధానంగా మత రాజ్యంగా, ముస్లింరాజ్యంగా చూడడం, చూపడం మొదలయింది. ఈ దృష్టి నుంచి చూసినప్పుడు సెప్టెంబర్ 17 హిందువుల విమోచనదినంగా కనబడడం మొదలయింది. అప్పటివరకూ తెలంగాణ చరిత్రతో, ప్రజాపోరాటాలతో ఎటువంటి సంబంధం లేని సంఘ పరివార్ శక్తులు తెలంగాణ పోరాట వారసత్వాన్ని కోరుకోవడం మొదలుపెట్టాయి. ఆ క్రమంలో బహుశా మొదటి ప్రచురణగా, ఆర్ ఎస్ ఎస్ సంస్థ నవభారతి ఖండేరావు కులకర్ణి రాసిన ‘హైదరాబాద్ అజ్నాత చరిత్ర పుటలు’ అనే పుస్తకాన్ని 1979 లో ప్రచురించింది. ఆ పుస్తకం హైదరాబాద్ సంస్థానంలో జరిగిన ప్రజాపోరాటాన్ని ఒక మత పోరాటంగా చిత్రించడానికి ప్రయత్నించింది. అప్పటి నుంచి క్రమక్రమంగా సెప్టెంబర్ 17 ఒక నిరంకుశ, భూస్వామ్య, రాచరిక పాలన రూపంలో మాత్రమే అంతమైన రోజుగా కాక ఒక ముస్లిం రాజు దిగిపోయి హిందూ పాలితులకు విముక్తి దొరికినరోజుగా ప్రచారం మొదలయింది.

విమోచన అని ఎప్పుడు అనవచ్చు?
అధికార మార్పిడి మాత్రమే విమోచన కాదు. ఏదయినా ఒక సైనికచర్యను విమోచనగా చెప్పుకోవాలంటే, దాన్ని మూడుకోణాల నుంచి అధ్యయనం చేయవలసిఉంటుంది. మొట్టమొదట అది ప్రజలను విముక్తి చేసిందా, ప్రజలు దాన్ని విముక్తిగా భావించారా, కనీసం అది ప్రజల విముక్తి అనే సువిశాల పరిణామాన్ని సాధించే దిశలో ఒక అడుగు అయినా ముందుకు వేసిందా ఆలోచించాలి. రెండవది, అప్పటివరకూ ఉన్న పాలకుల స్థితిలో అది ఎటువంటి మార్పు తెచ్చిందో పరిశీలించాలి. మూడు, ప్రజల ఆకాంక్షలను వ్యక్తీకరించడానికి ప్రయత్నం చేస్తూ ఉండే రాజకీయపక్షాలు, కులసంఘాలు, ప్రజాసంఘాలు, సంఘటిత బృందాలు ఆ ఘటనను ఎట్లా పరిగణించాయో పరిశీలించాలి.

ప్రజల విముక్తి గురించి మాట్లాడాలంటే, ముందుగా ప్రజలు ఏ బంధనాలలో ఉండేవారు, ఏ బంధనాల నుంచి విముక్తి కోరుకున్నారు అనే విషయాలు అర్థం చేసుకోవాలి. 1948 నాటి తెలంగాణ లో భూస్వామ్య బంధనాలున్నాయి. కుల, మత ఆచారాల రూపంలో సామాజిక పీడన, భూసంబంధాలలో తీవ్రమైన అసమానత రూపంలో ఆర్థిక దోపిడీ, వెట్టి రూపంలో ఆర్థికేతర దోపిడీ, స్త్రీ -పురుష అసమానత, విద్యావకాశాలు లేనిస్థితిలో ఆరు శాతంకన్న తక్కువ అక్షరాస్యత, సరైన వైద్య, ఆరోగ్య, రవాణా సౌకర్యాలు లేని అభివృద్ధిరాహిత్యం – ఇవీ నాటి సామాజిక సమస్యలు.

అంటే సామాజిక పీడన, ఆర్థిక దోపిడీ, అర్థికేతర దోపిడీ, అభివృద్ధి రాహిత్యం అనే ప్రధాన, నిత్యజీవిత సమస్యలనుంచి నాటి తెలంగాణ ప్రజలు విముక్తి కోరుకున్నారు. ఆ విముక్తి ఏ మార్గంలో దొరుకుతుందని అనుకున్నారో ఆ మార్గంలో, వేరువేరు సమూహాల ప్రజలు దాదాపు ఇరవయో శతాబ్ది ప్రారంభం నుంచీ కూడ తమకు తోచిన పద్ధతులలో సంఘటిత ఆచరణలకు పూనుకున్నారు.

సెప్టెంబర్ 17, 1948 తర్వాతి పరిణామాలు
విలీనం ఈ సమస్యలలో ఏ ఒక్కదాన్నీ పరిష్కరించడానికి కనీస ప్రయత్నమయినా చేయలేదు. సామాజిక పీడనలను తొలగించడమో, తగ్గించడమో అసలు విలీన లక్ష్యాలలో భాగం కానేలేదు. ఇంకా వివరమయిన పరిశోధన జరపవలసిఉందిగాని, వందేమాతరం సోదరుల పుస్తకం లో, రజాకార్ల పట్ల, నిజాం ప్రభుత్వం పట్ల అనుకూలవైఖరిని ప్రదర్శించినందుకు, అప్పటి మాదిగ నాయకుడు బి ఎస్ వెంకట రావు పట్ల చాల అన్యాయమయిన, అగ్రవర్ణ అహంకారంతోకూడిన వ్యాఖ్యలు చూస్తే, విలీనాన్ని సమర్థించినవారికి అణగారిన వర్గాల ఆకాంక్షలపట్ల కనీస సానుభూతి కూడ లేకపోయిందని కనబడుతుంది.

విలీనం తర్వాత భారత సైన్యం గాని, మొదట ఏర్పడిన సైనిక ప్రభుత్వంగాని ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించలేదని వందలకొద్దీ ఆధారాలున్నాయి. సమకాలీన రచయితలెందరో ఆ విషయాలు రాశారు. తమ సమస్యల పరిష్కారానికి ఒక మార్గం గా భావించి లక్షలాదిమంది రైతు కూలీలు, ప్రధానంగా దళితులు, వృత్తి కులాలవారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని సమర్థించారు. వేలాదిమంది అందులో కార్యకర్తలుగా, దళ సభ్యులుగా, దళ నాయకులుగా పాల్గొన్నారు. విలీనం తర్వాత తెలంగాణ జిల్లాలలోకి ఆక్రమిత సైన్యాలలాగ చొరబడిన భారత సైనిక దళాలు గ్రామాలమీద పడి నానా బీభత్సం సృష్టించాయి. ప్రజలు పోరాటం ద్వారా ఆక్రమించుకున్న పది లక్షల ఎకరాల భూమి మీద అదుపును, మూడు వేల గ్రామాల మీద బీజరూపంలో రాజ్యాధికారాన్ని సాధించి సంపాదించిన విముక్తిని పోలీసు చర్య రద్దు చేసింది. అంటే విలీనం ప్రజలను పాత సమస్యలనుంచి విముక్తి చేయడం అలాఉంచి, కొత్త సమస్యలు తెచ్చిపెట్టిందన్నమాట.

ఇక అప్పటి హైదరాబాదు రాష్ట్రంలోని జనాభాలో ముఖ్యమైన భాగమైన, ముస్లిం ప్రజానీకం మీద, భారత సైనిక బలగాలు చెప్పడానికి వీలు లేనంత దమనకాండ సాగించాయి. ఆ దమనకాండ నివేదికలతో కదిలిపోయిన ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, స్వయంగా తన ఆప్తమిత్రుడు పండిత్ సుందర్ లాల్ ను ఈ అత్యాచారాల నిజనిర్ధారణ కొరకు పంపించాడు. నాలుగు దశాబ్దాలపాటు రహస్యంగా ఉండి ఈ మధ్యనే బయటపడిన ఆ నివేదిక ప్రకారం, రెండు లక్షలమంది ముస్లింలను ఊచకోత కోయడం జరిగింది. ముస్లిం స్త్రీలమీద అత్యాచారాలకు, ముస్లింల ఆస్తుల దహనాలకు, విధ్వంసాలకు లెక్కలేదు. ఒకవేళ ఈ రెండు లక్షలమంది హత్య అనేది కొంత అతిశయోక్తి అనుకున్నా, ఈ దమనకాండ దేశవిభజన సమయంలో పంజాబ్ లో జరిగిన మారణకాండతో పోల్చదగినదని ఎంతోమంది విశ్లేషకులు రాస్తున్నారు.

ఇక పాలకుల విషయంలో విలీనం తర్వాత భారత సైనికులు గాని, భారత ప్రభుత్వంగాని వ్యవహరించిన తీరు చూస్తే, అది ప్రజా విమోచనకాదని స్పష్టంగా అర్థమవుతుంది. యథతథ ఒడంబడిక సంగతి పక్కనపెట్టినా, సైనిక చర్య తర్వాతనైనా, ఉస్మాన్ అలీ ఖాన్ ప్రజల పట్ల చేసిన నేరాలకు శిక్ష విధించాలని నెహ్రూ-పటేల్ ప్రభుత్వం అనుకోనేలేదు. ఆయన ప్రజల గోళ్లూడగొట్టి వసూలుచేసి సంపాదించిన ఆస్తులను స్వాధీనం చేసుకుని ప్రజలకు అప్పగించడం కాకుండా, ఎన్నో సంకోచాలతో స్వాధీనం చేసుకున్న సర్ఫెఖాస్ భూమికి కూడ నిజాం ప్రభువుకు అప్పటికి వస్తుండిన ఆదాయం కన్న ఎక్కువ నష్టపరిహారం చెల్లించారు. ఆయనకు గవర్నర్ పదవికి సమానయిన రాజప్రముఖ్ హోదా కల్పించారు. నిత్య అవసరాలకోసం వార్షిక ఆదాయం కల్పించారు. ఒక రకంగా, ఉస్మాన్ అలీఖాన్ పోగొట్టుకున్నదేమీలేదు. కాగా ప్రజలు ఆక్రమించుకున భూస్వాముల మిగులు భూములను మాత్రం వారి దగ్గరినుంచి లాక్కుని మళ్లీ దొరలకు కట్టబెట్టారు. కాకపోతే ఇదివరకు గ్రామం నుంచి పారిపోయిన దొరలు అప్పుడు రూమీ టోపీలు పెట్టుకునేవారు, ఇప్పుడు కాంగ్రెస్ టోపీలు పెట్టుకుని తిరిగి వచ్చారు. కనుక సైనిక చర్య అటు హైదరాబాదు స్థాయి పాలకులకు గాని, ఇటు గ్రామస్థాయి పాలకులకుగాని ఎటువంటి సమస్యలు తేలేదు సరిగదా, పాత హోదాను, అధికారాన్ని, ఆస్తులను కొనసాగించింది.

పోరాట ప్రజానీకం “రంగు రంగులమారి నెవురయ్యా, నీ రంగు బైరంగమాయె నెవురయ్యా” అని పాడుకున్నారంటే, సంఘటిత ప్రజానీకం సైనికచర్యను ఏరకంగా చూశారో తెలుస్తుంది. వివిధ రాజకీయ పక్షాలు సైనికచర్యను ఏ విధంగా పరిగణించాయో పైననే చూశాం.

సంక్లిష్ట నిర్ధారణలు
పైన సాగిన విశ్లేషణ స్థూలమయిన విశ్లేషణ మాత్రమే. ఈ ప్రాతిపదికలమీద ఇంకా వివరమయిన చర్చ జరగవలసిన అవసరం ఉంది. మొత్తంగా తేల్చి చెప్పగలిగినదేమంటే:

 • 1948 సెప్టెంబర్ కన్న ఎంతోముందు నుంచి తెలంగాణ ప్రజానీకం తాము అనుభవిస్తుండిన దోపిడీ, పీడనలనుంచి విమోచన కోరుకున్నారు. అందుకోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు.
 • ఆ ప్రయత్నాల కొనసాగింపుగా కనబడుతూ, వాస్తవంగా ఆ ప్రయత్నాలలో ఒకటయిన సాయుధపోరాటాన్ని అణచివేయడానికి భారతప్రభుత్వం విలీన, సైనిక చర్యకు దిగింది.
 • సైనికచర్యను సమకాలీన వ్యాఖ్యాతలలో ఎక్కువమంది విమోచనగా భావించలేదు.
 • సైనికచర్య ప్రజల విమోచనాకాంక్షలను తీర్చలేదుసరిగదా, కొత్త సమస్యలను తెచ్చిపెట్టింది.
 • హైదరాబాద్ సంస్థాన చరిత్రను హిందూ-ముస్లిం ఘర్షణ చరిత్రగా వక్రీకరించి చూపదలచుకున్న మతోన్మాద రాజకీయనాయకులకు, వ్యాఖ్యాతలకు, విలీనదినం ఒక అవకాశంగా పరిణమించింది.
 • విలీనంనాటినుంచి విశాలాంధ్ర, సమైక్యాంధ్ర నినాదాలు పెచ్చరిల్లడం, ఆ తర్వాతనే మద్రాసు రాష్ట్రంనుంచి వేరుపడి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడం, ఆ కొత్త రాష్ట్రానికి ఒక రాజధాని లేకపోవడం తో, ఒకరకంగా విలీనదినం తెలంగాణ పట్ల విద్రోహానికి తొలిఅడుగు అయింది.
 • ఈ వ్యాసరచనలో ఉపయోగపడిన పుస్తకాలు:

 • సర్దార్ పటేల్ – ఫర్ ఎ యునైటెడ్ ఇండియా – స్పీచెస్ ఆఫ్ సర్దార్ పటేల్ 1947 – 1950 – పబ్లికేషన్స్ డివిజన్ , న్యూ ఢిల్లీ, 1982.
 • వి వీరభద్ర రావు, వి రామచంద్ర రావు – ఇండియాస్ పోలీస్ ఆక్షన్ అగెనెస్ట్ హైదరాబాద్ – శ్రీ రామా బుక్ డిపో, సికింద్రాబాదు, 1949. వి పి మీనన్ – ది స్టొరీ ఆఫ్ ది ఇంటిగ్రేషన్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్స్ – ఓరియంట్ లాంగ్ మన్స, న్యూ ఢిల్లీ, 1969.
 • హైదరాబాద్ స్ట్రగుల్ కమిటీ, సోషలిస్ట్ పార్టీ – ది హైదరాబాద్ ప్రాబ్లం : ది నెక్స్ట్ స్టెప్ , బొంబాయి, 1948. మందుముల నరసింగ రావు – 500 సంవత్సరాల హైదరాబాదు – మందుముల నరసింగ రావు స్మారకసమితి, హైదరాబాదు, 1977.
 • స్వామీ రామానంద తీర్థ – హైదరాబాదు స్వాతంత్ర్యపోరాటం అనుభవాలు, జ్నాపకాలు – స్వామి రామానంద తీర్థ స్మారక సంఘం, హైదరాబాదు, 1984. వి ఎచ్ దేశాయి – వందే మాతరం టు జనగణమన – సాగా ఆఫ్ హైదరాబాద్ ఫ్రీడం స్ట్రగుల్ – భారతీయ విద్యా భవన, బొంబాయి, 1990. ఖండేరావ్ కులకర్ణి – హైదరాబాద్ అజ్నాత చరిత్ర పుటలు – నవభారతి, హైదరాబాద, 1979. ఫరీద్ మీర్జా – పోలీస్ ఆక్షన్ ఇన్ ది ఎర్స్ట్ వైల్ హైదరాబాద్ స్టేట్ – హైదరాబాద్ , 1996.
 • పుచ్చలపల్లి సుందరయ్య – వీర తెలంగాణ విప్లవ పోరాటం – గుణపాఠాలు – నవశక్తి ప్రచురణలు, విజయవాడ, 1983. రావి నారాయణ రెడ్డి – నా జీవనపథంలో… – మూసీ పబ్లికేషన్స్ , హైదరాబాద్, 1992. వి కె బావా –
 • ది లాస్ట్ నిజామ్ – ది లైఫ్ అండ్ టైమ్స్ ఆఫ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ – పెంగ్విన్ బుక్స్, 1992. విలియం డాల్ రింపుల్ – అండర్ ది చార్ మినార్ , ట్రావెల్ ఇంటిలిజెన్స్ డాట్ నెట్
 • ఎన్ వేణుగోపాల్ – తెలంగాణ నుంచి తెలంగాణ దాక – దేవులపల్లి పబ్లికేషన్స్ , హైదరాబాద్ 2004.
 • ఇండియాడిఫెన్స్ డాట్ కామ్ మీద ఆపరేషన్ పోలో గురించి ఉన్న రచనలు మిల్లి గెజెట్ ఆన్ లైన్ మీద పోలీసుచర్య గురించిన రచనలు
 • (తెలంగాణ టైమ్స్ లో ప్రచురణ కొరకు)

  Advertisements

  About ఎన్.వేణుగోపాల్

  Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
  This entry was posted in వ్యాసాలు, Telangana, Telugu. Bookmark the permalink.

  One Response to సెప్టెంబర్ 17 ‘విమోచన’ – తెలంగాణ ఆకాంక్షలు

  1. K Sekhar Reddy says:

   dear viplav,

   A ggod article and we have to do much more research of those days. We have to visit the places of interest such as illenth kunta of karimnager ,birth place of Baddam yella Reddy, Bollepally of Nalgonda district of Ravi Narayan Reddy birth place,BhairanPally and Parkal, where Razakar attrocitis took place.We can assess ground realities that took place at that time. tanking you . Kakula Waram Sekhar Reddy.

  Leave a Reply

  Fill in your details below or click an icon to log in:

  WordPress.com Logo

  You are commenting using your WordPress.com account. Log Out /  Change )

  Google+ photo

  You are commenting using your Google+ account. Log Out /  Change )

  Twitter picture

  You are commenting using your Twitter account. Log Out /  Change )

  Facebook photo

  You are commenting using your Facebook account. Log Out /  Change )

  w

  Connecting to %s