అక్షరాల దారుశిల్పి

దేవేంద్ర తన కథల పుస్తకానికి నాలుగుమాటలు రాయమని నన్ను అడగడం నామీద తనకున్న అభిమానం వల్లనే గాని నా శక్తిసామర్థ్యాలవల్లకాదు. ఎండి సారం పోగొట్టుకున్న చెట్టుకొమ్మకు మళ్లీ ప్రాణం అద్ది అద్భుత శిల్పంగానో, జీవితావసర వస్తువుగానో, పనిముట్టుగానో మలచగలిగిన ఆ అపురూప హస్తకళానైపుణ్యం ముందర, ఆ ప్రాచీన జ్ఞానసంపదను తరిగి కుప్పలుపోస్తున్న ఆధునికత్వపు దూగోడా చప్పుడును అక్షరాలకెక్కించాలని ఆరాటపడుతున్న ఆ జీవితానుభవం ముందర నాబోటి బుద్ధిజీవి వినమ్రంగా తలవంచుకోవలసిందే. దేవేంద్ర చేతులకు శ్రమలో సౌందర్యం సృష్టించడమూ తెలుసు, అక్షరాన్ని చెక్కడమూ తెలుసు. శారీరక, మానసిక శ్రమలను అవిభాజ్యంగా కలగలిపి అపూర్వమైన కళాకృతులను రచిస్తున్న ఆ కథకుడి పట్ల నా అభిమాన ప్రకటన కోసం ఈ మాటలు.

ఇవన్నీ అచ్చయినప్పుడు చదివిన కథలే, దాదాపు రెండునెలలుగా మళ్లీ చదువుతున్నాను. వడ్రంగం గురించీ, వ్యవసాయం గురించీ, పల్లెల గురించీ, ప్రకృతి గురించీ, ప్రకృతిలాంటి నిసర్గమైన మనసులున్న మనుషులగురించీ తలచుకుంటూ ఉన్నాను. ఆ తలపోతలలో పురాస్మృతులూ వర్తమానమూ భవిష్యత్తూ ఒకదానిలో మరొకటి కలిసిపోయాయి. మా రాజారంలో చిరునవ్వు చెరగని నిలువెత్తు విగ్రహం వడ్ల బ్రహ్మయ్య బాడిశతో చెక్కుతున్నప్పుడో, రంపంతో కోస్తున్నప్పుడో, దూగోడా పడుతున్నప్పుడో పక్కనకూచుని చకితుడినై ఆ వేళ్లకొసలనుంచి ప్రవహిస్తున్న అందాన్నీ విద్యనూ విద్యుత్తునూ అనుభవించినప్పటి నాలుగుదశాబ్దాలవెనకటి జ్ఞాపకం నుంచి భామ్రాగడ్ లో ఇంద్రావతి, పాముల గౌతమి, పరల్ కోట్ సంగమస్థలిలో ఒక చెట్టుకాండాన్ని తొలిచి ఒక్క మేకు వాడకుండా ఒక్క అతుకులేకుండా తయారుచేసిన దోనెపడవలో నదిదాటుతూ ఆ వడ్రంగపు నైపుణ్యానికి దిగ్భ్రాంతి చెందిన నిన్నమొన్నటి అనుభవం దాకా ఎన్నెన్నిసార్లు దారుశిల్పుల ప్రజ్ఞకు శిరసు వంచానో. ఇవాళ దారుశిల్పీ అక్షరశిల్పీ కలిసిపోయిన దేవేంద్రను చూసి అంతే వివశుడినైపోతున్నాను.

దేవేంద్ర పది సంవత్సరాలుగా కథలు రాస్తున్నాడనీ నలభైదాకా కథలూ మూడు నవలలూ రాశాడనీ ‘కథ2005’లో పరిచయం తెలుపుతుంది. కాని గత ఐదారు సంవత్సరాలనుంచీ, బహుశా 2001లో అచ్చయిన ‘నీడ’ కథ నుంచీ, కథాపాఠకుల దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తున్నాడు. నావరకు నాకు 2002లో అచ్చయిన ‘అన్నంగుడ్డ’ తో దేవేంద్ర పరిచయం. కథలు ఎట్లా ఉండాలని నేను కోరుకుంటానో ‘అన్నంగుడ్డ’ అట్లా ఉండడం వల్ల నన్ను చాల ఆకర్షించింది. ఆ కథ పాఠకుడిగా నాకు తెలియని ఒక కొత్త జీవనదృశ్యాన్ని నాముందు ఆవిష్కరించింది. నాకు తెలియడానికి అవకాశంకూడలేని నుడికారాన్ని నాకు పరిచయంచేసింది. ఇది కేవలం కొత్త సమాచారాన్ని అందించడం మాత్రమే కాదు, ఆ సమాచారాన్ని జ్ఞానంగా, వివేకంగా మార్చగల శక్తి కూడ ఆ కథలో ఉంది. భారీ పారిశ్రామికోత్పత్తుల యుగంలో కులవృత్తులకు, ముఖ్యంగా వడ్రంగం వంటి సున్నితమైన, ప్రత్యేకనైపుణ్యంగల హస్తకళలకు, ప్రాధాన్యత ఎట్లా తగ్గిపోతున్నదో ఆ కథ చెప్పింది. వానలకూ వ్యవసాయానికీ చేతివృత్తులకూ ఉండే సంబంధాన్ని, జనజీవనంతో వాటి అవినాభావ సంబంధాన్ని ఆ కథ చెప్పింది. అన్నంగుడ్డ అనే అరుదయిన, ఇతరసామాజికవర్గాలకు తెలియని ఒక ప్రత్యేక నుడికారంద్వారా చితికిపోతున్న వడ్రంగం వృత్తినీ, వడ్రంగాన్ని చిన్నచూపుచూస్తున్న సమాజాన్నీ చిత్రించి, ఆ విలువలచట్రాన్ని ప్రశ్నించే చైతన్యాన్ని ఆ కథ అందించింది. జీవితాన్ని, జీవిత దర్శనాన్ని ఉన్నతీకరించడమే సాహిత్యం పని అని నమ్మేవాడిగా నన్ను ‘అన్నంగుడ్డ’ కథ సంపూర్ణంగా సంతృప్తిపరిచింది.

ఇక అప్పటినుంచి దేవేంద్ర కథలకోసం ఎదురుచూడడం మొదలయింది.

ఇక్కడ ఇంకొక్క విషయం కూడ చెప్పాలి. ‘అన్నంగుడ్డ’ చదివినప్పుడు నాకు చాల ఇష్టమైన రాబర్ట్ ట్రెస్సెల్ నవల ‘రాగ్డ్ ట్రౌజర్డ్ ఫిలాంత్రొపిస్ట్స్’ గుర్తుకు వచ్చింది. బ్రిటిష్ శ్రామికవర్గ రచయిత, స్వయంగా గృహనిర్మాణ కార్మికుడు ట్రెస్సెల్ భవంతులు నిర్మిస్తూ, వాటికి రంగులువేస్తూ, తన సహచర కార్మికులతో సామాజిక రాజకీయార్థిక విషయాలు చర్చిస్తూ ఆ చర్చల ఆధారంగా ఆ నవల రాశాడు. కార్మికుడూ కళాస్రష్టా ఒకరే అయిన అపూర్వ సన్నివేశం అది. నిజానికి ప్రాచీన సమాజాలన్నిటిలోనూ పనీ పాటా, శ్రమా కళా, ఆచరణా ఆలోచనా కలిసే ఉండేవి. అక్షరాన్నీ కళనూ పాటనూ శ్రమనుంచి వేరుచేసి అందలం ఎక్కించినతర్వాత, రచన తీరికవర్గాల గుత్తసొమ్ము అయినతర్వాత మళ్ళీ వాటి సంగమం అపూర్వంగా, అపురూపంగా కనబడుతోంది. ఒక శతాబ్దం వెనుక ట్రెస్సెల్ రాసిన ఆ నవల అందువల్లనే ఇవాళ్టికీ గొప్పప్రేరణగా నిలుస్తోంది.

మనదగ్గరకూడ అట్టడుగుజీవితాలగురించి రచనలు ఎన్నో వచ్చాయిగాని, వాటిలో చాలఎక్కువభాగం ఆ జీవితాలనుంచి మధ్యతరగతిలోకి, భద్రజీవనంలోకి, ఆర్థిక స్థిరత్వంలోకి, ఎంతోకొంత తీరికలోకి ఎదిగివచ్చిన వారు రాసినవే. దేవేంద్ర ఇప్పుడు ఒక పత్రికారచయితగా మారాడేమోగాని, ఈ కథలలోని అస్థిర, అనిశ్చిత వడ్రంగి జీవితం స్వయంగా తాను అనుభవించినదే. అందువల్ల దేవేంద్ర మీద, తన రచనమీద నాగౌరవం ఇంకా పెరిగింది. నిజంగా ఏ మట్టిమనుషులు, శరీరకష్టం స్ఫురింపజేసే సహస్రవృత్తుల మనుషులు, చెవుల్లో సీసంపోయబడి అక్షరాల నుంచి దూరంచేయబడిన మనుషులు, ఇంకా ఈఆధునిక దేశంలో సగంకన్న ఎక్కువ జనాభా నిరక్షరాస్యులుగా ఉంచబడిన మనుషులు తమ జీవితానుభవాలను కళలో రచనలో వ్యక్తీకరించవలసి ఉన్నదో, ఆ మట్టిమనుషులకథలు ఇవి. వారినుంచే ఎదిగివచ్చిన దారుశిల్పి చెక్కిన కళాకృతులివి.

సాహిత్యంలో వందలసంవత్సరాలుగా చిత్రణ పొందుతున్న అగ్రవర్ణ జీవితాన్ని ఉండవలసిన స్థానానికి తగ్గించి, అంతకు ఎన్నోరెట్లుగా దళిత, బహుజన జీవితాల చిత్రణను తేవలసి ఉన్నది. ఆ పని గత రెండు శతాబ్దాలుగా కొంత జరుగుతున్నప్పటికీ, గత రెండుమూడు దశాబ్దాలుగా ప్రత్యేకమైన పూనికతో జరుగుతున్నది. ఆకృషిలో దేవేంద్ర వంటి సహస్రవృత్తుల సమస్తచిహ్నాల రచయితలు ఎంతోమంది రావలసి ఉన్నది.

ఆరకంగా మొత్తంగా తెలుగు సాహిత్యంలో ఆహ్వానించదగిన వస్తువునూ ఇతివృత్తాన్నీ దేవేంద్ర ఎంచుకున్నాడు. ఇక్కడ సంకలితమవుతున్న పదమూడు కథలనే చూస్తే అవన్నీ వ్యవసాయ జీవితాన్ని, కులవృత్తులు, ముఖ్యంగా వడ్రంగం, కంసాలిపని వంటి హస్తకళా నైపుణ్యాలు చితికిపోతుండడం వల్ల జరుగుతున్న గ్రామీణ జీవన విధ్వంసాన్ని, పల్లెజీవితంలోని అమాయకత్వాన్నీ, సహజత్వాన్నీ చిత్రిస్తాయి. డబ్బుకిందా, పెత్తనంకిందా, ప్రభుత్వం కిందా, ప్రకృతి వైపరీత్యం అనేసాకుతో సాగే సామాజిక దౌష్ట్యం కిందా ఆ అమాయకత్వం, సహజత్వం ఎట్లా నలిగిపోతున్నాయో చిత్రిస్తాయి.

‘నీడ’లో వ్యవసాయం నుంచి వ్యాపారానికి ఉరకలు వేస్తున్న యువతరాన్ని, ‘గొంగళిపురుగు’లో ప్రకృతి, ప్రభుత్వం, వ్యాపారం కలగలిసి రైతుమీద చేస్తున్న దాడిని, ‘అన్నదాత’లో దిగజారుతున్న వ్యవసాయాన్నీ, దానితోపాటే చితికిపోతున్న కులవృత్తులనూ ఆర్ద్రంగా, సున్నితంగా చిత్రించాడు దేవేంద్ర. ‘అన్నంగుడ్డ’, ‘సానరాయి’, ‘బాకీ’ కథల్లో చితికిపోతున్న వడ్రంగి వృత్తిని మాత్రమే కాదు, ఆ కులవృత్తిజీవితంలోని అనేకపార్శ్వాలను చిత్రించాడు. గ్రామాల విధ్వంసంతో వలసకూలీలుగా మారిన అభాగ్యులను మేస్త్రీలు చేసే మోసాన్ని ‘రాబందులు’, కడప-చిత్తూరు సరిహద్దుల్లో కువైట్ కు పనిమనుషులుగా వెళ్లాలనే కోరికతో బుగ్గి అవుతున్న బతుకులను ‘గాలి’, ఈ దేశంలో ఒక సగటుమనిషి జీవితకథనంతా అల్లి దానికొకపేరుపెట్టిన ‘అభివృద్ధి’, సహజ మానవసంబంధాలు, ప్రేమలు ఎట్లా భగ్నమైపోతున్నాయో, మనుషులు ఎట్లా యంత్రాలుగా మారిపోతున్నారో వివరించే ‘ఎంతెంత దూరం’, బలిసిన నగరాల విలాసాలు తీర్చే యమకూపాలకు ఎగుమతి అయి, పీల్చి పిప్పిచేయబడి విసిరేయబడుతున్న రాయలసీమ సుగాలీ యువతుల కథ ‘వెలుగుదారి’, కంసాలి బతుకులోని దుర్భరత్వాన్ని చెప్పిన ‘కడగొట్టోళ్లు’, పల్లెజీవితపు బాల్యపు సువాసనను అద్భుతమైన ప్రతీకాత్మకతతో చిత్రించిన ‘కొమ్మిపూలు’ – ప్రతికథగురించీ వివరంగా చెప్పవలసిందే.

దేవేంద్ర కథాకథనంలోని శిల్పం గురించికూడ చెప్పవలసింది చాల ఉంది. సాధారణంగా కవిత్వంలో ఉండే బహుళార్థ సంయోజనం, పొరలు పొరలుగా అర్థాలు విచ్చుకోవడం దేవేంద్ర కథల్లో కూడ కనబడుతున్నాయి. తానురాస్తున్న విషయం తన హృదయానికి, అనుభవానికి చాల సన్నిహితమైనది కావడం వల్ల కాబోలు చాల సందర్భాలలో దేవేంద్ర దృశ్యాలు కడతాడు. తానుచూస్తున్నదీ రాస్తున్నదీ పాఠకుల కళ్లముందర రూపుకట్టేట్టు చేస్తాడు. ఇక దేవేంద్ర వాడే భాష, నుడికారం, సంభాషణల గురించి ఎంత చెప్పినా తక్కువే. చిత్తూరు జిల్లా ప్రజల భాషను గతంలో కె. సభా, మధురాంతకం రాజారాం, నరేంద్ర, మహేంద్ర, కేశవరెడ్డి, నామిని సుబ్రహ్మణ్యం నాయుడు వంటి రచయితలు సాహిత్యంలోకి తీసుకువచ్చినప్పటికీ, చిత్తూరు-కడప సరిహద్దులలోని ఈ భాషా నుడికారపు సౌందర్యం కోసం దేవేంద్రను చదవవలసిందే.

ఫ్లాష్ బాక్ పద్ధతిని ఎక్కువగా వాడడం, కొన్నిచోట్ల క్లుప్తత లోపించడం వంటి చిన్నలోపాలు కొన్ని ఉన్నప్పటికీ, తెలుగు కథాసాహిత్యంలోకి కొత్త జీవితాన్ని, కొత్త పరిమళాన్ని, కొత్త పరికరాలను, కొత్తచూపును ప్రవేశపెడుతున్న కథకుడిగా, కళాకారుడిగా దేవేంద్రను మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నాను.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Book Reviews. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s