పత్రికాస్వేచ్ఛా బట్టతలా మోకాలూ

బట్టతలా మోకాలూ ఒకే శరీర భాగాలయినప్పటికీ ఆ రెంటికీ ముడిపెట్టడం అసంబద్ధమైన విషయమని మామూలు లోకజ్ఞానం చెపుతుంది. అయినా ఒక ఆర్థిక సంస్థ చట్టవ్యతిరేక, మోసపూరితచర్యలనూ పత్రికా స్వేచ్ఛనూ ముడిపెట్టడానికి దేశంలోని విజ్ఞులెందరో ప్రయత్నిస్తున్నారు. పెసరుచేను నుంచే పప్పు తయారయినప్పటికీ, పెసరు చేన్లో పోగొట్టుకున్న కడియాన్ని పప్పుదాకలో వెతకడం తెలివితక్కువతనమని మన ప్రాచీన వివేకం ఒక సామెతలో ప్రకటించింది. కాని ఆర్థికలావాదేవీలలో అక్రమాలవల్ల కోల్పోతున్న పరువును అక్షరాల గౌరవనీయతలో వెతికి పట్టుకుందామని విజ్ఞులు ప్రయత్నిస్తున్నారు. పత్రికాస్వేచ్ఛను మట్టుపెట్టే ఒక దుర్మార్గమైన ఉత్తర్వు తెచ్చి ఈ గందరగోళపు స్థితిని మరింత సంక్లిష్టం చేసింది ప్రభుత్వం. ఈ రెండు విడివిడి అంశాలు కలగలిసిపోయి, కలగాపులగమై మన ప్రచార సాధనాలలో హోరెత్తాయి. విడివిడిగా చూడవలసినవాటిని కలిపి చూడడం, కలిపి చూడవలసిన వాటిని విడివిడిగా చూడడం ఒక దృష్టిదోషం. ఇటీవలికాలంలో విజ్ఞులు కొందరిలో ఈ దృష్టిదోషం విస్తారంగా కనబడుతోంది. ఈ వారంఘటనలే చూస్తే ఈ దృష్టిలోప దృశ్యం రసవత్తరంగా వ్యక్తమయింది.

కాలక్రమంలో రెండోది అయినప్పటికీ మొదట చెప్పుకోవలసినది, తీవ్రంగా పరిగణించవలసినది జీవో 938. ప్రచార సాధనాలలో ప్రభుత్వానికి ప్రతికూలంగా వార్తలు వచ్చినప్పుడు, వాటికి సవరణలు, వివరణలు, ఖండనలు ఇవ్వడంతోపాటుగా, పరువునష్టం దావాలు వేసేందుకు ఆయా ప్రభుత్వ శాఖలను అనుమతిస్తూ జారీ అయిన జీవో అది. చాలస్పష్టంగా పత్రికాస్వేచ్ఛను హరించే దుర్మార్గమైన, నిరంకుశపూరితమైన వైఖరికి నిదర్శనం అది. ఏదయినా ఒక సందర్భంలో ప్రచారసాధనాలలో తప్పుడు వార్తవచ్చిందంటే దాన్ని సవరించడానికి, ఖండించడానికి ప్రభుత్వానికీ, దాని శాఖలకూ పూర్తి అవకాశాలున్నాయి. ఆ అవకాశాలు కూడ పనిచేయకపోతే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశాన్ని కూడ భారత నేరశిక్షాస్మృతి కల్పించింది. అయినా అవన్నీ చాలవన్నంతగా మన పాలకుల అసహనం అవధులు దాటిపోయింది. మరొక జీవో ద్వారా తమకు వ్యతిరేకంగా రాసేవారిని శిక్షించే, కనీసం భయపెట్టే సాధనాలు సమకూర్చుకోదలిచారు.

ఇప్పటికే చాలమంది వ్యాఖ్యానించినట్టుగా ఇది కచ్చితంగా ఫాసిజంతో, నాజీ జర్మనీలో హిట్లర్ పత్రికలమీద అమలుచేసిన విధానంతో పోల్చదగిన చర్య. ‘ఏకీభవించనోడి పీకనొక్కు సిద్ధాంతం ఫాసిజం’ అని కాళోజీ నిర్వచించాడు. ఎట్లాగూ ఈ ప్రభుత్వం అధికారానికి వచ్చిన నాటినుంచీ ఇందిరమ్మరాజ్యం అని జపం చేస్తున్నది గనుక ఈ ఉత్తర్వు బహుశా ఎమర్జెన్సీ నాటి ప్రిసెన్సార్ షిప్ చీకటిరోజులను మళ్లీ తేవడానికి ఉద్దేశించినదయి ఉండవచ్చు. ప్రచారసాధనాలనుంచి, మేధావులనుంచి, రాజకీయపక్షాలనుంచి పెద్దఎత్తున నిరసన వచ్చిన తర్వాత ప్రభుత్వం ఆ జీవోను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది.

అయితే ఆశ్చర్యకరమైన విషయమేమంటే ప్రభుత్వం ఈ ఉత్తర్వు ప్రకటించడానికి ఎంచుకున్న సమయం. అది ముఖ్యమంత్రికి తెలిసివచ్చిందా లేదా అనేది సాంకేతిక అంశం గాని అప్పటికే మార్గదర్శి ఫినాన్షియర్స్ పై జరుగుతున్న సోదాలను పత్రికాస్వేచ్ఛపైదాడిగా కొందరు అభివర్ణించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, నిజంగానే పత్రికాస్వేచ్ఛపై దాడిచేసే ఈ జీవో వెలువడింది. ఒక ఆర్థికసంస్థ (నిజానికి అది చట్టబద్ధంగా నమోదయిన ఆర్థిక సంస్థకూడ కాదు, ఒక హిందూ అవిభక్త కుంటుంబం) అక్రమాలపై జరిగే చట్టబద్ధచర్యలను పత్రికాస్వేచ్చపై దాడి అని ఎట్లా అంటారు అని ప్రశ్నలు తలెత్తుతూ, ఒకరకంగా ఆ ఆర్థికసంస్థ కప్పుకోదలచుకున్న ముసుగు తొలగిపోతూ ఉన్నప్పుడు సెల్ఫ్ గోల్ చేసుకున్నట్టుగా ప్రభుత్వం ఈ జీవో 938 ని తీసుకొచ్చింది. దాదాపు ప్రతి శాసనసభ సమావేశంముందూ ప్రభుత్వం ఇటువంటి సెల్ఫ్ గోల్స్ చేసుకుంటూనే ఉంది. అదివేరే కథ.

ఇక జీవో 938 కన్న ముందు జరిగిన మార్గదర్శి ఫినాన్షియర్స్ పై సిఐడి సోదాలను చూడాలి. ఢిల్లీ నుంచి గల్లీ వరకూ, కాంగ్రెస్ మినహా దాదాపు అన్ని రాజకీయపార్టీల నాయకులూ, కులదీప్ నయ్యర్, ఎన్ రామ్ ల నుంచి ఎందరో పేరున్న మేధావులూ ఆ సోదాలను ఖండించారు. సోదాలను ఖండించడానికి వాళ్లకున్న హక్కును కూడ కాదనడానికి లేదు. కాని వారు ఆ సోదాలను పత్రికాస్వేచ్ఛతో ముడిపెట్టడమే విచిత్రం. ఆ సోదాలు పత్రికాసంస్థమీద కాదు. ఆ పత్రికాసంస్థకు కూడ పత్రికాస్వేచ్ఛను గౌరవించిన ఘన చరిత్రఏమీలేదు.

ఒక ప్రచారసాధనాల యాజమాన్యం చేసే ఇతరపనులకు ప్రచారసాధనాల ప్రతిష్ఠనూ, రక్షణలనూ వాడుకోవచ్చునా అనేది ప్రశ్న. ఆ ఇతరపనులు కూడ రాజకీయసంబంధమైనవి అయినప్పుడు ఎంతోకొంత రాజకీయ కక్ష అనే వాదనలు తీసుకురావచ్చుగాని, ఆ పనులు ఆర్థికరంగంలోనో, నైతిక రంగంలోనో చట్టవ్యతిరేకమయినవి అయినప్పుడు వాటిమీద చర్యకు ప్రచారసాధనాల మినహాయింపు రక్షణ కవచంగా నిలుస్తుందా? వాదనకోసం ఉదాహరణకు హర్షద్ మెహతా ఒక పత్రికో టీవీచానెలో పెడితే అతని మీద జరిగే విచారణ పత్రికాస్వేచ్ఛమీద దాడి అని కులదీప్ నయ్యర్, ఎన్ రామ్ లు అనగలరా?

ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ తనకు వ్యతిరేకంగా రాసిన, రాసే అవకాశం ఉన్నపత్రికలమీద, సంపాదకులమీద, యజమానులమీద పూర్తిగా రాజకీయ కారణాలతోనే దాడులుచేయించింది. అప్పుడుకూడ గోయెంకా నడుపుతున్న ఇతర వ్యాపారాల మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది గాని ఆ వ్యాపారాలలో ప్రభుత్వం చూపడానికయినా ఇప్పుడున్నస్థాయిలో అక్రమాలు లేవు.

ఒకేమనిషికి వ్యాపారి గానూ, పత్రికా యజమానిగానూ రెండు అస్తిత్వాలున్నప్పుడు అది చాల సున్నితమైన అంశమవుతుంది. ఒక అస్తిత్వం చేసిన, చేయని పనులమీద వచ్చే స్పందనను మరొక అస్తిత్వంమీద స్పందనగా పొరపాటుపడే అవకాశం ఉంటుంది. ఆ భిన్న అస్తిత్వాలలో ఒకటి పత్రికా యాజమాన్యంవంటి ప్రజాహిత, ప్రజాసేవారంగం అయినప్పుడు, మరొక అస్తిత్వం సందేహాస్పదమైనది కాగూడదు. ప్రస్తుత సందర్భంలో రెండో అస్తిత్వం సంశయరహితమైనదని చెప్పడానికి ప్రస్తుతానికయితే వీలులేదు. అటువంటప్పుడు ప్రచారసాధనపు అస్తిత్వాన్ని కూడ సమర్థించడం కష్టతరమవుతుంది. ఇంత సంక్లిష్టమైన, సున్నితమైన వివాదంలోకి బుద్ధిమంతులు దిగడం ఎవరిని కాపాడడానికి?

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Andhra Jyothy, Telugu, Vartamaanam. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s