ఎన్ కౌంటర్ వీరులపై హత్యానేరం

పాపం ఎప్పటికయినా పండుతుందంటారు. ఎట్టకేలకు కాశ్మీర్ లో అబ్దుల్ రహమాన్ పద్దర్ ను చంపేసి, దానికి ఎన్ కౌంటర్ అని పేరు పెట్టిన వీరులమీద హత్యకేసు నమోదయింది. ఈ దేశంలో ప్రభుత్వ సాయుధబలగాలు పథకం ప్రకారం, ఉద్దేశ్యపూర్వక పాలనా విధానంగా ఎన్ కౌంటర్ల పేరిట రాజకీయ ప్రత్యర్థులమీద, ప్రజలమీద జరుపుతున్న హత్యలను మిగిలిన సాధారణమైన హత్యలలాగనే పరిగణించి న్యాయస్థానాలలో విచారణ జరపాలని ఎన్నోసంవత్సరాలుగా వినిపిస్తున్న డిమాండ్ కు చిట్టచివరికి జవాబు దొరికింది. ఎన్నోసార్లు సుప్రీంకోర్టు, జాతీయ మానవహక్కులసంఘం, రాష్ట్రాల హైకోర్టులు, మానవహక్కులసంఘాలు చెప్పిన తీర్పులు, చేసిన సూచనలు, దేశవ్యాప్తంగా పౌరహక్కుల ఉద్యమం చేస్తూ వస్తున్న డిమాండ్ చిట్టచివరికి విజయంసాధించాయి. ఈ కేసులో విచారణ అంతా సవ్యంగా జరుగుతుందా, నేరస్తులకు తగిన శిక్ష పడుతుందా అనే ప్రశ్నలు ఎట్లాగూ ఉంటాయిగాని, ఇప్పటికైతే ఈమాత్రం సాధించడమే గొప్ప విజయంలా, ప్రభుత్వ సాయుధ బలగాల మితిమీరిన అధికారంమీద ఒక కనీస అవరోధంగా కనబడుతోంది.

ఎవరీ అబ్దుల్ రహమాన్ పద్దర్ ? ఆతను కాశ్మీర్ లో లర్నూ అనే గ్రామానికి చెందిన వడ్రంగి. వయసు ముప్పై ఐదేళ్లు. అన్నిచోట్లా జరుగుతున్నట్టుగానే అక్కడా ఊళ్లో బతుకుతెరువులేక రాజధాని శ్రీనగర్ కు వెళ్లి ఉపాధి చూసుకుందామనుకున్నాడు. అప్పటికే అతనికి ఐదుగురు కూతుళ్లు. శ్రీనగర్ లో ఉద్యోగం ఇప్పిస్తాననీ అందుకు డెబ్బై ఐదువేల రూపాయలు కావాలసి ఉంటుందనీ అన్నాడు సమీప బంధువు, శ్రీనగర్ లో పోలీసు శాఖలో డ్రైవర్ గా పనిచేస్తున్న పరూఖ్ అహ్మద్ పద్దర్. ఉన్నదంతా ఊడ్చీ అప్పులుచేసీ ఆ డబ్బు ఇచ్చాడు అబ్దుల్. నెలలు గడిచిపోయాయిగాని ఉద్యోగం జాడలేదు. అడగ్గా అడగ్గా ఒకరోజు ఫరూఖ్ అబ్దుల్ ను శ్రీనగర్ రమ్మన్నాడు. అది డిసెంబర్ 8, 2006. అబ్దుల్ శ్రీనగర్ వెళ్లి బత్మలూ లో ఫరూఖ్ ను కలుసుకున్నాడు. ఏం జరిగిందో తెలియదుగాని, గుర్తుతెలియని వ్యక్తులు అబ్దుల్ ను ఒక కార్లోకి లాక్కుపోయారు. ఆ రాత్రి అతను ముప్పై కిలోమీటర్ల దూరంలోని గందర్ బాల్ పోలీసు స్టేషన్ లో గడపవలసి వచ్చింది. మర్నాడు రాత్రి ఒక పోలీసు జిప్సీ వాహనంలో అబ్దుల్ ను అనంతనాగ్ జిల్లాలో వక్సర్ అనే చిట్టడివిప్రాంతానికి తీసుకువెళ్లి కాల్చిచంపేశారు. పాకిస్తాన్ లోని ముల్తాన్ కు చెందిన కరడుగట్టిన తీవ్రవాది అబు హఫీజ్ అతనేనని, అతనిని అరెస్టు చేయడానికి ప్రయత్నించగా కాల్పులు జరిపాడనీ, ఆత్మరక్షణార్థం జరిపిన ఎదురుకాల్పులలో అతను మరణించాడనీ అలవాటయిన కథ మర్నాడు పత్రికలలో వచ్చింది. మృతదేహం ముఖం జల్లెడలా తూట్లు పడిందిగనుక నిజమేమిటో ఎవరూ గుర్తించడానికి వీలు లేకపోయింది. ఆ “సాహసోపేతమైన చర్య జరిపి ఒక కరుడుగట్టిన తీవ్రవాదిని అంతం చేసినందుకు” గందర్ బాల్ పోలీసులు – స్పెషల్ సూపరింటెండెంట్ హంస్ రాజ్ పరిహార్, డి ఎస్ పి బహదుర్ రాం, ఎ ఎస్ ఐ ఫరూఖ్ అహ్మద్ లకు ఒక లక్షా ముప్పైవేల నగదు ప్రతిఫలం అధికారికంగా ముట్టింది. అనధికార ప్రతిఫలం ఎంతో లెక్కలేదు.

ఈ హత్యకు బలిపశువును సమకూర్చిన ఫరూఖ్ అహ్మద్ పద్దర్ కు కూడ తన వంతు ప్రతిఫలం ముట్టింది. నిజానికి ఫరూఖ్ కు తన పైఅధికారుల మృగయావినోదంకోసం, రివార్డులకోసం బలిపశువులను సమర్పించడం ఇది మొదటిసారి కాదు. ఇప్పటికి కనీసం ఐదుగురు గ్రామస్తులను, అమాయకులను తీసుకువెళ్లి చంపించిన ఘనత ఫరూఖ్ ది. చంపి ప్రతిఫలాలు పొందిన మహా ఘనత పై అధికారులది. ప్రతిసందర్భంలోనూ హంతకులకు భూరి బహుమానాలు అందితే, హతులకు చనిపోయినతర్వాత ఒక పాకిస్తానీపేరు, ఒక తీవ్రవాద సంస్థ సభ్యత్వం అందేవి. ఇటువంటి బూటకపు ఎన్ కౌంటర్లలో చనిపోయిన కశ్మీరీ యువకుల సంఖ్య ఎన్నివేలు ఉంటుందో ఎవరూ కచ్చితంగా చెప్పగలిగిన పరిస్థితి లేదు. అంతర్జాతీయ మానవహక్కుల సంస్థలు, రాష్ట్రంలోని ప్రజాస్వామికవాదులు, తమ పిల్లల్ని పోగొట్టుకున్న నిర్భాగ్యులైన తల్లిదండ్రులు ఏర్పాటుచేసుకున్న “అదృశ్యమైన వ్యక్తుల తల్లిదండ్రుల సంఘం” చెపుతున్న ప్రకారం ఇటువంటి అదృశ్యమైపోయి, బూటకపు ఎన్ కౌంటర్లలో చనిపోయిన వారిసంఖ్య పదివేలు ఉండవచ్చు.

గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ – పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ కూటమి భారత ప్రభుత్వ సైనికచర్యలద్వారా కాశ్మీరీ ప్రజాహృదయానికి తగిలిన గాయాలను మానుస్తానని వాగ్దానంచేసి అధికారానికి వచ్చింది. మానవహక్కుల ఉల్లంఘన ఒక్కటికూడ జరగకుండా చూస్తామనీ, అంతకుముందు జరిగిన పోలీసు కస్టడీ మరణాలన్నిటిమీద విచారణ జరిపిస్తామని కూడ ఆ పార్టీలు వాగ్దానం చేశాయి. అయినా గత నాలుగు సంవత్సరాలలో లెక్కలేనన్ని పోలీసు అత్యాచారాలు, మానవహక్కుల ఉల్లంఘన సంఘటనలు, బూటకపు ఎన్ కౌంటర్లు, కేవలం నగదు బహుమతుల కోసం, పదోన్నతులకోసం అమాయకులను చంపి, పాకిస్తానీ తీవ్రవాదులుగా చూపెట్టడం జరుగుతూనేవచ్చాయి.ఈ నేపథ్యంలో బయటపడిన అబ్దుల్ రహమాన్ పద్దర్ అదృశ్యం సంఘటన రాష్ట్రాన్ని కుదిపివేసింది. తప్పుడు పేరుతో చంపి ఖననం చేసిన అతని మృతదేహాన్ని, దానితోపాటే పాతిపెట్టిన మరొక మృతదేహాన్ని తవ్వితీసి డిఎన్ ఎ పరీక్షలకోసం చండీఘర్ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబ్ కు పంపించాలని ప్రభుత్వం నిర్ణయించవలసివచ్చింది. ఆ రెండో మృతదేహంకూడ పోలీసులు చెప్పినట్టు పాకిస్తానీ తీవ్రవాదిది కాదని, మోల్వి షౌకత్ కటారియా అనే మతబోధకుడిదనీ బయటపడింది. ప్రభుత్వంలో భాగస్వామి అయిన పిడిపి శాసనసభలో ఈ బూటకపు ఎన్ కౌంటర్ మృతులకు సంతాపం తెలియజేయాలని పట్టుబట్టవలసి వచ్చింది. ఈ పరిస్థితిలో ఇక ఈ బూటకపు ఎన్ కౌంటర్లో భాగస్తులయిన ఎస్ ఎస్ పి, డి ఎస్ పి లతో సహా ఏడుగురు పోలీసు అధికారులమీద నేరస్వభావం గల కుట్ర (భారత శిక్షాస్మృతి సెక్షన్ 120 బి), హత్య (302), అపహరణ (364), సాక్ష్యాలు తారుమారుచేయడం (201) ల కింద నేరారోపణలు చేసి, అభియోగపత్రం దాఖలు చేయకతప్పలేదు. ఇప్పుడిక ఆ ఏడుగురు పోలీసు అధికారులూ తాము ఉద్దేశ్యపూర్వకంగా హత్య చేయలేదనీ, ఆత్మరక్షణ అవసరం కోసమే ఆ పని చేయవలసి వచ్చిందనీ రుజువుచేసుకోవలసి ఉంటుంది. ఈ కథంతా మనకు రెండున్నర వేల కిలోమీటర్ల అవతల, మన భాష మాట్లాడని, మన తిండి తినని, మన ఆచారవ్యవహారాలతో ఏ సంబంధమూలేని మనుషులకు జరిగినట్టు కనబడుతుందిగాని, ఆ నామవాచకాలు మార్చేస్తే అంతా మనకథలాగనే కనబడుతుంది. తమ దౌర్జన్యానికీ, దోపిడీకీ ఆటంకంగా ఉన్నవారిని, ఇబ్బందికరమైన రాజకీయ ప్రత్యర్థులను భౌతికంగా నిర్మూలించడమే మార్గమని, ఆ నిర్మూలనకు ఎన్ కౌంటర్ అని సర్వజనామోదకరమైన పేరుపెట్టి, ఆత్మరక్షణ అనే సాకు కింద మినహాయింపు పొందవచ్చునని ఆశించే పాలకవర్గాలూ, వారు ఇచ్చే రక్షణకింద తమ పబ్బం గడుపుకోవాలనుకునే సాయుధబలగాలూ ఉన్నంతకాలం ఎన్ కౌంటర్లకు అడ్డుకట్టవేయడం కష్టం కావచ్చు. కాని హత్య ఎవరు ఎందుకుచేసినా హత్యేననీ, ఒకరు హత్యచేస్తే కేసుపెట్టే పోలీసులు, తాము చేసే హత్యలకు మినహాయింపు ఇచ్చుకోవడానికి వీలులేదనీ గందర్ బాల్ ఉదంతం రుజువుచేస్తోంది. గందర్ బాల్ స్ఫూర్తి దేశమంతా వ్యాపించాలి.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Andhra Jyothy, Telugu, Vartamaanam. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s