తెలంగాణ చరిత్ర పునర్నిర్మాణ అవసరం సమస్యలు, అవకాశాలు

తెలంగాణ హిస్టరీ సొసైటీ ఇంకా రూపొందలేదనే వివరణను ఇప్పటికే వివేక్ గారు, లోకేశ్వర్ గారు ఇచ్చి ఉన్నారు. ఇప్పటివరకు జరిగిన ప్రయత్నం ఏమంటే, తెలంగాణ మీద చాల ప్రేమతో కొన్ని అవగాహనలతో ఒక ప్రయత్నం మొదలయింది. ఆ అవగాహనలు: “చరిత్ర రచనలో తెలంగాణ ఇప్పటికి చాల అన్యాయాన్ని ఎదుర్కొన్నది. తెలుగుజాతి చరిత్ర అని వచ్చినవిగాని, ఆంధ్రప్రదేశ్ చరిత్ర అని వచ్చినవి గాని, తెలంగాణ ప్రాంత చరిత్రను తమలో సంపూర్ణంగా భాగం చేసుకోలేదు. ఈ తొమ్మిది పది జిల్లాల చరిత్రను, ఇక్కడి ప్రజల చరిత్రను, ఇక్కడి ప్రజల సంస్కృతిని ఎక్కడో ఒక అధోజ్ఞాపికగానే చూశాయిగాని, మొత్తంగా చూడలేదు, అన్యాయం చేశాయి, లేదా అధ్యాయాలకు అధ్యాయాలు రాయవలసిన చరిత్రను ఎక్కడో ఒకటి రెండు వాక్యాలలో కుదించాయి. ఒకటి రెండు పరిచ్ఛేదాలలో ముగించేశాయి, వక్రీకరించాయి.” ఈ అవగాహనతో, తెలంగాణ మీద ప్రేమతో తెలంగాణ చరిత్రను పునర్నిర్మించడానికి ఒక ప్రయత్నం ఇప్పుడు ప్రారంభమవుతున్నది. జరిగిన అన్యాయాన్ని కొంతమేరకైనా సరిదిద్దగలమా, విస్మరణకూ వివక్షకూ వక్రీకరణకూ గురైన చరిత్రను పునర్నిర్మించగలమా అనే తపనతో ఈ ప్రయత్నం జరుగుతున్నది.

ఈ చరిత్ర పునర్నిర్మాణ బాధ్యతను నిజంగా చేపట్టవలసినది చరిత్రకారులు, సామాజికశాస్త్రవేత్తలు. చరిత్రనుంచి, అర్థశాస్త్రంనుంచి, సామాజికశాస్త్రాలనుంచి అటువంటి ఒక నిర్మాణాత్మకమైన కృషి జరగవలసిఉన్నది. తెలంగాణ ప్రత్యేకరాష్ట్ర ఆకాంక్షలలో భాగంగా గత పది సంవత్సరాలుగా ఎంతో కొంత అటువంటి కృషి జరుగుతున్నది. ఇప్పటికైనా ఆకృషినంతటినీ సంఘటితం చేయవలసిఉన్నది. నిర్మాణబద్ధమైన కృషిగా మార్చవలసిఉన్నది. విభిన్నరంగాల సాంఘికశాస్త్రవేత్తల సామూహిక, సమన్వయపూరితమైన కృషి అవసరం ఉన్నది. తెలంగాణ హిస్టరీ సొసైటీ ఆ దిశలో పనిచేయవలసి ఉంటుంది.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ ఉన్నది, ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ ఉన్నది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ హిస్టారికల్ రిసర్చ్ ఉన్నది. అటువంటి సంస్థలు చేస్తున్న కృషి వంటి కృషిని మన నేలగురించి మనం చేసుకోగలమా, మన నేలగురించి జరగకుండా ఉండిపోయిన పనిని మనం చేయగలమా అనే తపనతోనే ఈ ప్రయత్నం జరుగుతున్నది. ఆ తపనతో ఒక ఐదారుగురు ఔత్సాహికులం, ఎవరమూ నేరుగా చరిత్ర అధ్యయనంలో, చరిత్ర రచనలో ప్రవేశం ఉన్నవాళ్లం కాదు, ఈ ప్రయత్నం ప్రారంభిస్తున్నాం. తెలంగాణ మీద ప్రేమ మాత్రమే మా అర్హత. ఆ ప్రయత్నంలో భాగంగా మేం నాలుగైదు సమావేశాలలో ఇందుకు సంబంధించి తర్జన భర్జనలు పడ్డాం.

ఆ క్రమంలో మేం పైన చెప్పిన చరిత్ర పరిశోధన సంస్థల పత్రాలు పరిశీలించాం. అవన్నీ వృత్తి చరిత్రకారుల సంస్థలు. ఆ సంస్థలన్నిటిలో ప్రవేశానికి యోగ్యత వృత్తి చరిత్రకారులయి ఉండడమే. హిస్టరీ లో ఎంఎ, ఎంఫిల్ పిహెచ్ డి లాంటివి ఉండాలి. కాని ఇక్కడ అందుకు భిన్నంగా, తెలంగాణ పట్ల ప్రేమ ఉండి, తెలంగాణ చరిత్రను తవ్వితీయాలనే ఆసక్తి ఉండి, స్థూలంగా, సామాజిక శాస్త్రాలలోనో, భాషలోనో, సాహిత్యంలోనో, కళలలోనో పనిచేసినవాళ్ల సమష్టి కృషి ద్వారా ఈ చరిత్ర పునర్నిర్మాణ, చరిత్రపరిశోధక, చరిత్ర రచనా సంస్థను ఏర్పాటు చేయవచ్చుననుకున్నాం.

ఈ ఆసక్తులు సమానంగా ఉండి కూడ భిన్న భిన్న దృక్పథాలు, భావజాలాలు, అవగాహనలు ఉన్నవాళ్లు ఉండవచ్చు. ఇప్పటికే ఇక్కడ మాట్లాడిన ముగ్గురు వక్తలు మూడు భిన్నమైన అవగాహనలను ప్రకటించారని మీరు చూశారు. అటువంటి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, ఉంటాయి. అందువల్ల తెలంగాణ చరిత్ర పునర్నిర్మాణం అనే ఏకైక లక్ష్యంతో, తెలంగాణ పట్ల ప్రేమ ఏకైక షరతుగా మన భావజాలాలనుకూడ పక్కనపెట్టి, ఈ చరిత్ర పరిశోధనా కార్యక్రమానికి పూనుకోగలమా, ఒక వేదికను ఏర్పర్చగలమా, అని ప్రశ్నించుకున్న ఫలితంగా ఈ ప్రయత్నం సాగుతున్నది.

కనుక ఇప్పటివరకూ తెలంగాణ హిస్టరీ సొసైటీ అని ఏవైనా ప్రస్తావనలు వచ్చినా, అవి ఒక ఏర్పడి ఉన్న సంస్థ గురించి కాదు. ఆ ఆలోచన గురించి మాత్రమే. మనందరి ఉమ్మడి ఆలోచనలతో, కృషితో అటువంటి సంస్థ ఏర్పడవలసిఉన్నది. అటువంటి వేదిక గాని, సంస్థ గాని ఏర్పడితే దానికి విధివిధానాలు ఎట్లా ఉండాలి, దాని పరిధి ఏమిటి, పరిమితులు ఏమిటి, ఏ ప్రతిపాదనలు ఆలోచించవలసి ఉన్నాయి అని చర్చించడానికే ఈ సమావేశం.

అసలు ఈ అవసరం ఏమిటి? ప్రస్తుతం తెలంగాణగా ఉన్న ప్రాంతానికి అత్యద్భుతమైన, చాల వైభవోపేతమైన చరిత్ర ఉంది. ఈ మాట మనం చాల రోజులుగా చెప్పుకుంటున్నాం. మరీ ముఖ్యంగా గత పది సంవత్సరాలుగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆందోళనలో భాగంగా ఈ అభిప్రాయాలు చాల భావోద్వేగపూరితంగా ముందుకు వస్తున్నాయి. కాని ఆ అభిప్రాయాలను నిర్దిష్టంగా, శాస్త్ర ప్రతిపత్తితో, సాధికారికంగా, కచ్చితమైన సాక్ష్యాధారాలతో ప్రకటించగలమా? అలా ప్రకటించేందుకు అవసరమైన కృషిని ఇప్పటికైనా ప్రారంభించగలమా? తెలంగాణ పట్ల ప్రేమను భావోద్వేగాలస్థాయిలో ఎంత బలంగా ముందుకు తెస్తున్నామో, బలోపేతం చేస్తున్నామో, ఆ స్థాయిలో శాస్త్రీయమైన, ప్రామాణికమైన చరిత్ర రచనకు పూనుకోగలమా? తెలంగాణకు గల వైభవోపేతమైన చరిత్ర ప్రామాణిక చరిత్ర రచనలలోకి రాకుండా, వచ్చినా అరకొరగా, వక్రీకరణలతో వచ్చిఉంది. చరిత్ర రచన జరగవలసిన ఏ రంగం, కోణం వైపు నుంచి చూసినా తెలంగాణ చరిత్రను పునర్నిర్మించవలసిన అవసరం కనబడుతుంది.

ఈ చరిత్ర పునర్నిర్మాణ క్రమంలో కొన్ని ఆలోచించవలసిన ప్రతిపాదనలు, ప్రాతిపదికలు మీ ముందు సూచించడం మాత్రం నా పని.

రెండువేలఏళ్ల తెలుగు భాషా ప్రజల చరిత్రలో అత్యధికభాగానికి ఇవాళ్టి తెలంగాణనే రాజకీయ కేంద్రంగా ఉండింది. పెదబంకూరు, కోటిలింగాల, కొండాపూర్, ఎలగందుల, ధూళికట్ట, కీసర, హనుమకొండ, ఓరుగల్లు, గోల్కొండ, హైదరాబాదు – ఇవాళ తెలంగాణలో ఉన్న ఈ నగరాల నుంచే తెలుగు భాషాప్రాంతాల పాలన గత రెండువేల ఏళ్లలో కనీసం పదిహేనువందల ఏళ్లపాటు జరిగింది. ప్రస్తుత కర్ణాటక -రాయలసీమలోని హంపి – విజయనగరం, కంపిలి, ఆనెగొంది, పెనుకొండ లనుంచి ఒక రెండు శతాబ్దాలపాటు పాలన సాగింది. ఇవాళ్టి కోస్తాంధ్ర నుంచి మొత్తం తెలుగుభాషాప్రాంతాల పాలన జరిగిన సందర్భం ఒక్కటికూడ లేదు. ధరణికోట, రాజమహేంద్రి, వేంగి, కొండపల్లి, కొండవీడు, శ్రీకాకుళం వంటి రాజధానులనుంచి పాలించిన వాళ్లందరూ తక్కువప్రాంతాన్ని పాలించినవాళ్లే. కాని తెలుగుప్రజల చరిత్రలోనూ, దక్కన్ పీఠభూమి చరిత్రలోనూ ఈ ప్రాంతానికి దక్కవలసినంత స్థానం దక్కలేదు. ఈ ప్రాంతం విస్మరణకు, వివక్షకు గురయింది. ఒక రెండువేలఏళ్ల చరిత్రగల జాతి గురించి మాట్లాడేటప్పుడు, అందులో అధికార కేంద్రం పద్నాలుగు, పదిహేను వందలఏళ్లపాటు ఉండిన ప్రాంతం పట్ల ఈ వివక్ష ఉండడమేమిటి, ఎప్పుడూ అధికార కేంద్రం ఉండకపోయినా, ఒక రెండువందల ఏళ్లపాటు ఆర్థికాధికారాన్ని మాత్రం అనుభవించి అందువల్ల రాజకీయ చక్రంతిప్పగలిగిన ప్రాంతానిది పైచేయి కావడమేమిటి? ఇది ఆలోచించవలసిన, అన్వేషించవలసిన, పరిశోధించవలసిన ప్రశ్న.

ఈ నూటయాభై, రెండు వందలఏళ్లలోనే ఎక్కువగా చరిత్ర రచన జరిగింది కాబట్టి, అంతకు ముందరి వెయ్యి సంవత్సరాల వైభవోపేత చరిత్రను తుడిచిపెట్టడమో, విస్మరించడమో, వక్రీకరించడమో జరిగిందా? దాన్ని తవ్వితీయవలసిన అవసరం ఉంది.

అట్లాగే కళలో, భాషలో, సాహిత్యంలో, ప్రజల సృజనాత్మక శక్తిలో, ప్రజాపోరాటాల, ధిక్కారాల సంప్రదాయంలో ఎక్కడ చూసినా ఇవాళ్టి తెలంగాణ ప్రాంతానికి అసాధారణమైన చరిత్ర ఉన్నది. కాని అది సమగ్రంగా, సముచితంగా నమోదు కాలేదు. ఈ చరిత్రకు మూలాలు, పరిణామాలు ఎక్కడ వెతకగలం? తెలుగు సంస్కృతిలోని రెండు ప్రధానమైన జానపదగాథలకు కథాస్థలం ఇవాళ్టి తెలంగాణ భూభాగమే అని సాహిత్యవిమర్శకులు ముదిగంటి సుజాతా రెడ్డి గారు విశ్లేషించి ఉన్నారు. ఇక ప్రజా పోరాటాల చరిత్ర తీసుకుంటే, కనీసం ఐదు వందలసంవత్సరాలుగా ఈ ప్రాంతం, తెలంగాణ, దక్కన్ పీఠభూమి ధిక్కారాలకు వేదికగా ఉన్నదని, ఇక్కడి రైతు కూలీలు, సామాన్య ప్రజలు అసామాన్యులుగా తమ తిరుగుబాట్లతో ఈ నేలలో గొప్ప చరిత్ర నిర్మించారని చరిత్రకారుడు ఇనుకొండ తిరుమలి గారు ఒక సదస్సులో ప్రతిపాదించారు. ఇక్కడి ప్రజలకు రాజ్యాధికారాన్ని, ఇతరేతర ఆధిపత్యాలను ధిక్కరించిన చరిత్ర ఉంది అని ఆయన అన్నారు. దీనికి మూలాలు తవ్వితీసి ఈ అవగాహనను బలోపేతం చేయవలసి ఉన్నది.

అట్లాగే ఇప్పటివరకూ జరిగిన చరిత్రరచనలో కొంత అసమగ్రత ఉన్నది. పాత చరిత్ర పుస్తకాలు ఏవైనా తీసుకోండి, ఏటుకూరి బలరామమూర్తి గారు, మల్లంపల్లి సోమశేఖరశర్మగారు, కంభంపాటి సత్యనారాయణగారు వంటి గౌరవనీయులైన చరిత్ర రచయితలనైనా తీసుకోండి, లేదా, కాకతీయుల చరిత్ర మీద ప్రామాణికమనదగిన గ్రంథంరాసిన పి వి పరబ్రహ్మ శాస్త్రిగారిని తీసుకొండి. ప్రస్తుతతెలంగాణ ప్రాంతం గురించి ఉండవలసినంత సమగ్రంగా ఉండదు. పరబ్రహ్మశాస్త్రిగారి పుస్తకం ప్రారంభంలోనే, కాకతీయుల పాలనా ప్రాంతం ఇంతకాలం పరాయి పాలనలో ఉండడం వల్ల చారిత్రక ఆధారాలు దొరకడంలేదు అని రాశారు. అది అసత్యం, లేదా అర్థ సత్యం. ఎందుకంటే చాలా ఆధారాలున్నాయి. ఇరవయో శతాబ్దం తొలి రోజులనుంచీ, ఇక్కడ చారిత్రకాధారాలకోసం పరిశోధన ప్రారంభమయింది. లక్ష్మణరాయ పరిశోధక మండలి 1920 లనుంచీ చారిత్రక ఆధారాలకోసం అన్వేషణ ప్రారంభించింది. శాసనాల సేకరణ ప్రారంభించింది. ఆదిరాజు వీరభద్రరావుగారు, మారేమండ రామారావు గారు, శేషాద్రి రమణ కవులు, యాజ్దానిగారు, అటువంటి తొలితరం పరిశోధకులు ఎంతో కృషి చేశారు. 1935లో మొదటిసారిగా తెలంగాణా ఇన్ స్క్రిప్షన్స్ అనే గ్రంథం వెలువడింది. అయినా ఈకృషి అంతా కూడ విస్మరణకు గురయింది. తెలంగాణ చరిత్రలో ఆధారాలు దొరకకపోవడం, ఆకరాలు లేకపోవడం అనే ఒక అసమగ్రత కొనసాగుతూ ఉన్నది. అది నిజానికి ఒక నింద. బట్ట గాల్చి మీద వేసినలాంటి ఆకరాలు లేవనే నింద. అసలది నిజమేనా? అసలు ఆధారాలు దొరకలేదా, దొరికినవాటిని పక్కకు పెట్టారా? దొరికిన ఆధారాలను సరిగా వ్యాఖ్యానించకుండా, సమన్వయంచేయకుండా వదిలేశారా? లోతుగా ఆలోచించవలసిఉంది. ఒక సాహిత్య ఆధారమున్నది, ఒక జానపద, మౌఖిక గాథా అధారమున్నది, ఒక శిలాశాసన, తామ్రశాసన ఆధారమున్నది – వీటన్నిటినీ సమన్వయం చేయకుండా వదిలేశారా? ఇటువంటి సమస్యలన్నిటినీ పరిష్కరించవలసి ఉన్నది.

వీటిన్నిటితో పాటు మేం చాల వ్యగ్రంగా, తీవ్రంగా ఆలోచిస్తున్న సమస్య వక్రీకరణ. మరీ ముఖ్యంగా తెలంగాణ చరిత్రరచనలో, 1956 నుంచి, ఆ మాటకొస్తే 1940ల నుంచి చాల వక్రీకరణ జరిగింది. ఇందులో కొంత ఉద్దేశ్యపూర్వకమైనదీ ఉన్నది, కొంత అమాయకమైనదీ ఉన్నది. ఇందులో కొంత సైద్ధాంతిక స్థాయి వక్రీకరణ. తమ తమ భావజాలాలవల్ల, సైద్ధాంతిక దృక్పథాలవల్ల తమకు ఇష్టంలేని, తమకు నచ్చని వాస్తవాలను పక్కనపెట్టడం, నమోదు చేయకపోవడం, తప్పుగా నమోదు చేయడం జరిగింది. అట్లాగే రచయితల స్థలకాలాలు ఈ వక్రీకరణలకు చాలవరకు కారణమయ్యాయి. ఒకవేళ ఆ చరిత్రకారుడు తెలంగాణ వాడు కాకపోతే ఆ పుస్తకాలలో ఆమేరకు తప్పులు వున్నాయి. ఒకవేళ తెలంగాణ వాళ్లయిఉంటే కూడ అటువంటి తప్పులే చేశారనుకోండి, అది వేరే కథ. కాని చరిత్ర రచయిత కోస్తాంధ్ర ప్రాంతం నుంచో, రాయలసీమ నుంచో వచ్చి ఉన్నట్టయితే, తెలంగాణకు సంబంధించిన చారిత్రక వాస్తవాలు తప్పులతడకగా నమోదయ్యాయి. ఉదాహరణకు ఇవాళ బిఎ, ఎంఎ విద్యార్థులందరూ చదువుతున్న పి. రఘునాథరావు గారి ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర చూడండి. అందులో హైదరాబాదు రాజ్యానికి సంబంధించీ, తెలంగాణకు సంబంధించీ ఎన్నో తప్పులు ఉన్నాయి. చరిత్ర విద్యార్థులందరూ అదే నిజమైన చరిత్ర అనుకుని చదువుతున్నారు.
ఇలా స్థలకాలాలవల్ల రచయితలు చేసిన పొరపాట్లను సవరించవలసి ఉన్నది. గత రెండు శతాబ్దాలలో జరిగిన కృషినంతటినీ మళ్ళీ ఒక్క దగ్గరికి చేర్చి, దానికి సముచితమైన గౌరవం కల్పించవలసి ఉన్నది. కె జితేంద్రబాబు, కె శ్రీనివాస్, సంగిశెట్టి శ్రీనివాస్, లోకేశ్వర్ వంటి పరిశోధకులెందరో చేస్తున్న కృషినంతటినీ సంఘటితం చేయవలసి ఉంది. సురవరం ప్రతాపరెడ్డి గారు, ఆదిరాజువీరభద్రరావుగారు, వట్టికోట ఆళ్వారుస్వామి గారు, బిరుదురాజు రామరాజుగారు లాంటివారు చేసిన కృషిని మళ్లీ కొనసాగించవలసి ఉన్నది.

ఇక మరికొన్ని అంశాలున్నాయి. ముందే వివేక్ గారు చెప్పినట్టు తెలంగాణ చరిత్ర అని ఇప్పటిదాకా వచ్చినదాన్ని కొంత ధ్వంసంచేయవలసి ఉన్నది, కొంత నిర్మాణం చేయవలసిఉన్నది. అయితే ఏది ధ్వంసం చేయాలి, ఏది నిర్మాణంచేయాలి అనేవి ముఖ్యమైన ప్రశ్నలు. ఆధునిక తెలంగాణ చరిత్ర, ఇటీవలి తెలంగాణ చరిత్ర, 1950లనుంచీ తెలంగాణ చరిత్రనే తీసుకొండి. రాష్ట్రాల పునర్విభజన కమిషన్ నివేదిక ఆధారంగానే ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడిందని చాలమంది రాస్తున్నారు. సి శ్రీనివాస్ అని ఒక రచయిత ఆంధ్రప్రదేశ్ విడిపోగూడదని పుస్తకాలు రాస్తున్నారు, ఆయన ఫజల్ అలీ కమిషన్ నివేదికను పూర్తిగా తప్పుగా ఉటంకిస్తున్నారు. తెలంగాణకు వ్యతిరేకమైన ఉటంకింపులుచేస్తున్నారు. నిజంగా ఫజల్ అలీ కమిషన్ ఏమిచెప్పింది ఇప్పుడు తవ్వితీయవలసిఉంది. కొనసాగుతున్న ప్రచారాల నిజానిజాలను వెలికితీయవలసిఉంది. అసలు ఫజల్ అలీ నివేదిక ఎక్కడుంది, అది బహుళ ప్రచారంలో ఉందా లేదా, ఆ నివేదిక, దానికంటె ముందరి ఎస్ కె దర్ కమిషన్ నివేదిక, ఆ తర్వాతి జస్టిస్ వాంఛూ కమిటీ నివేదిక – ఇవన్నీ ఆధునిక తెలంగాణ చరిత్రకు, లేదా తెలంగాణను కోస్తాంధ్రతో విలీనంచేసిన చరిత్రకు ముఖ్యమైన ఆకరాలు. ఇవన్నీ తవ్వితీసి, అందరికీ అందుబాటులో ఉంచాలి, వాటిమీద అన్నికోణాలనుంచీ వ్యాఖ్యానాలు, విశ్లేషణలు రాయాలి. 1940ల నుంచీ తెలంగాణ చరిత్రలో విస్మరణకు గురయిన అంశాలు, వక్రీకరణకు గురయిన అంశాలు సవరించాలి.

గత ఐదు ఆరు దశాబ్దాల గురించి మాత్రమే కాదు, ఇటీవలి కాలంగురించి కూడ మనం ఇప్పటిదాకా చేయవలసిన పనులు చేయలేదు. ఉదాహరణకు కాళోజీ మ్యూజియం అవసరం గురించి నేను ఇప్పటికే రాసిఉన్నాను. ఆయన తెలంగాణ సృష్టించిన ఒక అద్భుతం. ఆయన గురించి తరతరాలు అధ్యయనంచేయవలసిఉంది, తెలుసుకోవలసిఉంది. ఆయన రచనలు, ఆయన అభిప్రాయాలు, ఆయన వాడిన వస్తువులు, ఆయన చదివిన పుస్తకాలు, ఆ పుస్తకాలలో ఆయన రాసుకున్న మార్జినల్ నోట్స్ మొదలయినవన్నీ సేకరించి ఒక మ్యూజియం ఏర్పాటు చేయవలసిఉంది.

అట్లాగే, 1969 ఉద్యమం ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో వెలువడుతున్నంత సాహిత్యాన్ని సృష్టించి ఉండకపోవచ్చు. కాని కనీసం ఒక డజను పుస్తకాలైనా అచ్చయ్యాయి. ఎన్నో కరపత్రాలు వచ్చాయి. పాటలు వచ్చాయి. వేలకొద్దీ పత్రికావార్తలు వచ్చాయి. అవి అందుబాటులోఉన్నాయా? వాటన్నిటినీ ఒక్కచోట చేర్చి భవిష్యత్ పరిశోధనకొరకు పరిరక్షించవలసిఉంది.

అదేవిధంగా, మన ప్రయత్నం 19,20 శతాబ్దాలకే పరిమితమా, ఇంకా వెనక్కి తీసుకుపోగలమా అని సుజాతారెడ్డిగారు అడిగినప్రశ్న చాల అవసరమైనది. ఈమని శివనాగిరెడ్డిగారు ప్రాచుర్యంలోకి తెచ్చిన తెల్లాపూర్ శాసనం పద్నాలుగో శతాబ్దంలో తెలంగాణ అనేమాట వాడకంలో ఉన్నదని తెలుపుతోంది. అటువంటి ఆకరాలను ఇంకా ఎక్కువగా కనిపెట్టవలసి ఉన్నది.

తెలంగాణ చరిత్ర పునర్నిర్మాణంలో మనకు చాల ఎక్కువగా ఉపయోగపడేవి సాహిత్య ఆధారాలు. జాయపసేనాని నృత్తరత్నాకరంలో ఈ ప్రాంతపు నృత్యరీతులను వివరిస్తూ చిందు, కోలాటం, వీథిభాగవతం మొదలయిన రూపాలగురించి రాశాడు. వినుకొండ వల్లభరాయడు క్రీడాభిరామంలో ఓరుగల్లులో జనజీవనంగురించి వివరంగా రాశాడు. అటువంటి ఆధారాలెన్నో లిఖితసాహిత్యంలో ఉన్నాయి.

అంతకన్న ముఖ్యమైన ఆధారాలు మౌఖిక సాహిత్యంలో, గాథలలో, పాటలలో, సాంప్రదాయిక ఆచారాలలో ఉన్నాయి. ఉదాహరణకు కాకతీయ సామ్రాజ్యంలో పగిడిద్దరాజు తిరుగుబాటుగురించీ, యుద్ధం గురించీ, సమ్మక్క – సారలమ్మల వీరోచిత పోరాటం గురించీ జానపదగాథలలోనే ఉన్నది. పరబ్రహ్మశాస్త్రి గారి ప్రామాణిక చరిత్ర కేవలం శాసన ఆధారాలనే పరిశీలించిందిగాని ఇటువంటి ఇతర ఆధారాలను పట్టించుకోలేదు. ఇప్పటికైనా తెలంగాణ చరిత్ర గురించి రాసేటప్పుడు ఇలా విస్మరణకు గురయిన మౌఖిక సాహిత్య ఆధారాలను పరిగణనలోకి తీసుకోవాలి. వాటన్నిటినీ తవ్వితీసి, నమోదు చేయాలి. చరిత్రరచనలో భాగంచేయాలి.

తెలంగాణ చరిత్ర రచనలో, పాత చరిత్ర సవరణలలో కొన్ని సమస్యలు కూడ ఉన్నాయి. పాలకుల తెలంగాణ ఉంది, పాలితుల తెలంగాణ ఉంది. ఇందులో మన చరిత్ర రచన ఎవరి తెలంగాణను గురించి రాయదలచుకున్నదనేది ముఖ్యమైన ప్రశ్న. అది ఒక్కటేనో, ఇది ఒక్కటేనో రాయడం కూడ సాధ్యం కాకపోవచ్చు. చాల సందర్భాలలో రెండూ కలగలిసి ఉండవచ్చు. రెంటిమధ్య ఐక్యత – ఘర్షణ ఉండవచ్చు. ఏ ఒక్కటీ చివరి అభిప్రాయం కాకపోవచ్చు. కాని ఈ రెండు కోణాలనూ పరిగణనలోకి తీసుకోవడం మాత్రం అత్యవసరం.

ఫజల్ అలీ కమిషన్ ముందు వచ్చిన వాదనలలో హైదరాబాదు రాజ్యాన్ని యధతథంగా ఉంచాలనే వాదన కూడ ఒకటి. నిజంగానే ఇవాళ తెలంగాణ చరిత్రను అధ్యయనం చేసేటప్పుదు కొన్ని వందల సంవత్సరాలు తెలంగాణ జిల్లాలు కన్నడ, మరాఠీ జిల్లాలతో కలిసి ఉండిన చరిత్ర కనబడుతుంది. 1724 నుంచి 1948 దాకా ఆ సంపర్కం మరింత గాఢంగా ఉండింది. ఆ రోజుల ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక వివరాలలో ఆయా భాషా ప్రాంతాలకు సంబంధించినవాటిని విడదీసి చూడడం కష్టం. కనుక ఆ సమస్యను కూడ ప్రస్తుత చరిత్ర రచనలో పరిష్కరించుకోవలసే ఉంటుంది.

తెలంగాణ చరిత్ర రచనలో మరొక ముఖ్యమైన సమస్య పాత వక్రీకరణలను సరిదిద్దే క్రమంలో కొత్త తప్పులు జరగడం. అది ఒక ప్రతీకార వాంఛవల్ల కావచ్చు. అతివాదంవల్ల కావచ్చు. సమన్వయపూర్వకంగా పనిచేయలేకపోవడం వల్ల కావచ్చు, భావజాల చట్రాలవల్ల కావచ్చు. ఉదాహరణకు, తెలంగాణ చరిత్రలో 1942 – 56 చీకటి కాలం అనే ఒక విశ్లేషణను మీరు విన్నారు. ఆ కాలంలో తెలంగాణ కమ్యూనిస్టుల ప్రభావంలోకి వచ్చి భూస్వామ్య వ్యతిరేక పోరాటం జరపడం వల్ల ఆ అభిప్రాయం వచ్చింది. కాని ఆ కాలమే తెలంగాణ చరిత్రలో ఒక ఉజ్వలశకమని నేననుకుంటాను. కమ్యూనిస్టులవల్ల మాత్రమే కాదు. నిరక్షరాస్యుడైన తెలంగాణ రైతు, కూలీ, సామాన్యులు తలెత్తి లేచి నిలిచిన కాలం అది. రాజునూ, భూస్వామినీ, అధిపతినీ, అధికారాన్నీ సామాన్యులు ఎదిరించిన కాలం అది. ప్రజల సృజన శక్తులు అత్యద్భుతంగా వికసించిన కాలం అది. యాదగిరి వంటి నిరక్షరాస్య కవి కట్టిన పాట దేశమంతా మార్మోగిన కాలం అది. అందువల్ల, చరిత్రలో ఇవాళ్టి మన అభిప్రాయాలతో చూస్తే భిన్నంగా విశ్లేషణలు తీయగల వాస్తవాలు ఉండవచ్చు. అతివాదానికి పోకుండా అన్ని వైపులనుంచీ ఆలోచించి ఒక సమ్యగ్ దృక్పథంతో సమగ్ర చరిత్రను రచించవలసి ఉన్నది.

ఈ క్రమంలో పాత ఆధారాలమీద కొత్త వెలుగులు ప్రసరింపజేయవచ్చు. కొత్త ఆధారాలు కనిపెట్టవచ్చు. ఏ చిన్న ఆధారానికైనా, ఇటీవలి ఆధారానికైనా పురావస్తు పరిశోధన లాంటిది అవసరం కావచ్చు. 1904లో హనుమకొండలో ఏర్పాటయిన రాజరాజ నరేంద్రాంధ్ర గ్రంథాలయం ఆనవాలు లేకుండా మాయమైపోయింది. ఇంకా శ్రీకృష్ణదేవరాయాంధ్రభాషానిలయం, శబ్దానుశాసన ఆంధ్రగ్రంథాలయం వంటి కొన్ని పాత గ్రంథాలయాలు మిగిలి ఉన్నాయి. వాటిని సంరక్షించి, అక్కడ దొరికే పాత ఆధారాలను ఇప్పటికైనా నమోదుచేయవలసిఉంది.

ప్రస్తుతం రాయవలసినది కేవలం రాజకీయ చరిత్ర మాత్రమే కాదు, ప్రతాపరెడ్డిగారు సాంఘిక చరిత్రను ఎంత విశాలార్థంలో స్వీకరించారో అంత విశాలమైన అర్థంలో అన్ని రంగాల చరిత్రను రాయవలసి ఉంది. ఆ ప్రయత్నంలో మౌఖిక చరిత్ర ఆధారాలకు చాల ప్రాధాన్యత ఉంటుంది.

తెలంగాణ నుంచి వెలువడిన ఆత్మకథలు, జీవితచరిత్రలు ఎక్కువగా లేకపోవచ్చు. ఇప్పటికైనా ఆ ప్రయత్నానికి పూనుకుని ఆయావ్యక్తుల జీవితచరిత్రలు, సాంఘిక చరిత్రలు కలగలిసి సాగే జీవితచరిత్రలను రచించవలసిఉన్నది. తెలంగాణ చరిత్రలో ఎన్నో ఆసక్తికరమైన, విశిష్ట అంశాలున్నాయి. అటువంటి ప్రత్యేక అంశాలమీద పరిశోధన చేయవలసి ఉన్నది. సదస్సులు, చర్చావేదికలు, సమావేశాలు నిర్వహించి తెలంగాణ చరిత్రకు సంబంధించిన ఎన్నో అంశాలమీద విశ్లేషణలు నిగ్గుదేల్చవలసిఉన్నది. తెలంగాణ చరిత్రకు సంబంధించిన ఎన్నో పుస్తకాలు ప్రచురించవలసి ఉన్నది. తెలంగాణ చరిత్ర పరిశోధన, చర్చ, రచన ప్రధాన ప్రమేయాలుగా ఉండే పత్రికను ప్రచురించవలసిఉన్నది. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలలో భాగంగా నీటిపారుదల ప్రాజెక్టులయాత్ర జరిగినట్టుగా, తెలంగాణలో విస్మృతికి గురయిన చారిత్రక స్థలాల యాత్ర ఒకటి నిర్వహించి, తెలంగాణ చరిత్ర పట్ల ఆసక్తిని పెంపొందించవలసిఉన్నది. అంతిమంగా, తెలంగాణ మీద ప్రేమతో, అభిమానంతో, తెలంగాణ చరిత్ర అధ్యయనం, పరిశోధన, రచన చేసే పరిశోధకులకూ, అభిమానులకూ ఉపయోగపడే ఒక రిసర్చి, రెఫరల్ , రిపాజిటరీ సెంటర్ ను ఏర్పాటు చేయవలసిఉన్నది.

ఇవన్నీ ఏర్పడబోయే తెలంగాణ హిస్టరీ సొసైటీకి ఇప్పటికి మాకు తోస్తున్న కర్తవ్యాలు. ఇంతకన్న మించిన కర్తవ్యాలు ఉండవచ్చును. మీ దగ్గర విలువైన సూచనలు ఉండవచ్చును. మన అభిప్రాయాలు, ఆలోచనలు, ఆసక్తులు కలబోసుకుని ఈ అవసరమైన కృషిలో మనందరమూ కలిసి ముందుకు నడవాలని, తెలంగాణ చరిత్ర రచన పునర్నిర్మాణ బాధ్యతలో అందరమూ కలిసి ముందుకుసాగాలని కోరుకుంటూ మీ అందరినీ, సగౌరవంగా, సాదరంగా ఆ కృషిలోకి ఆహ్వానిస్తున్నాను.

(2006 జూన్ 4 న తెలంగాణ హిస్టరీ సొసైటీ సన్నాహక సమావేశంలో ప్రసంగపాఠం)

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Telangana, Telugu. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s