తెలంగాణ వైతాళికుడుగా వట్టికోట ఆళ్వారుస్వామి

ఆళ్వారుస్వామికి పూర్వరంగం
భూస్వామ్య, రాచరిక సమాజాలలో భూస్వామినీ రాజునూ మేల్కొలపడానికి స్తోత్రపాఠాలు పాడే వ్యక్తిగా ఉనికిలోకి వచ్చిన వృత్తి వైతాళికుడు. ఆ పదాన్నే ఆధునిక సమాజాలలో ప్రజలను చైతన్యపరచిన తొలితరం ఆలోచనాపరులను, మేధావులను, ప్రచారకులను, సామాజిక కార్యకర్తలను, ప్రజానాయకులను ఉద్దేశించి కూడ వాడడం జరుగుతున్నది. సర్వసాధారణంగా భూస్వామ్య, రాచరిక, మధ్యయుగ సమాజాలు పెట్టుబడిదారీ, ప్రజాస్వామిక, ఆధునిక సమాజాలుగా మారే పురుటినొప్పులు పడుతున్నప్పుడు ఆ మార్పును త్వరితంచేసిన, గానంచేసిన, ఆ మార్పుకు విస్తృత ప్రజాసంఘీభావం సమకూర్చిపెట్టిన మేధావులను, బుద్ధిజీవులను, సృజనకర్తలను వైతాళికులని పిలవడం జరుగుతున్నది.

యూరపియన్, అమెరికన్ సమాజాలలో కూడ అటువంటి మార్పులు జరగడం, ఆ మార్పులలో వైతాళికుల పాత్ర, వారి నేపథ్యాల గురించి ఇక్కడ అప్రస్తుతంగాని, భారతీయ సమాజాల లోని వైతాళికులగురించి అధ్యయనం చేస్తున్నప్పుడు వారిమధ్య తీవ్రమైన అంతరాలు, సామ్యాలు, భేదాలు, వారిలో ఒక్కొక్కరి ప్రత్యేకతలు ఆశ్చర్యం గొలుపుతాయి. బెంగాలీ సమాజంలోని రాజారామమోహనరాయ్ (1772-1833), ఈశ్వరచంద్ర విద్యాసాగర్ (1820-1891), కేశవచంద్రసేన్ (1838-1884), రామకృష్ణ పరమహంస (1836-1886), ల నుంచి, గుజరాతీగా పుట్టినా ఆర్యసమాజంద్వారా హిందూసమాజమంతా ప్రముఖుడైన దయానంద సరస్వతి (1824-1883), కోస్తాంధ్ర తెలుగు సమాజంలోని కందుకూరి వీరేశలింగం (1848-1919), రఘుపతి వెంకటరత్నం నాయుడు (1862-1939), గురజాడ అప్పారావు (1861-1915) ల వరకూ ఈ భారతీయ వైతాళికుల సంప్రదాయం విస్తృతమైనది, సుదీర్ఘమైనది. దానికదిగా ప్రత్యేకంగా అధ్యయనం చేయవలసినది. అయితే దాదాపుగా ఆయా సమాజాలలోని వైతాళికులందరూ ఒక నిర్దిష్ట, సంపన్న, విద్యాధిక వాతావరణం నుంచి, ప్రత్యేకమైన అవకాశాలతో వైతాళికులుగా ఎదిగారు. తమిళ సమాజంలోని సుబ్రహ్మణ్య భారతి (1882-1921), మరాఠీ సమాజంలోని జ్యోతిబా ఫూలే (1827-1890), మలయాళీ సమాజంలోని నారాయణ గురు (1856-1928) వంటి వైతాళికులు మాత్రమే సంపదలోనో, కులంలోనో, అవకాశాలలోనో ఈ సంప్రదాయానికి మినహాయింపు.

వట్టికోట ఆళ్వారుస్వామి (1915–1961) ని తెలంగాణ వైతాళికులలో ఒకరిగా చెప్పేటప్పుడు ఆయనకూడ ఈ మినహాయింపు కిందికే వస్తాడు. తెలంగాణ వంటి ఒక వెనుకబడిన ప్రాంతంలో, ఇరవయో శతాబ్దపు తొలి అర్థభాగంలో వైతాళికుడిగా ఎదిగేందుకు వట్టికోట ఆళ్వారుస్వామికి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టడం మినహా ఇతర ప్రత్యేకమైన అర్హతలేమీలేవు. వంశపారంపర్య ఆస్తి, అధికారం, తల్లిదండ్రుల ఉన్నతస్థానం, కుటుంబానికి బయటిప్రపంచంతో సంబంధం, ఉన్నతవిద్య, ఉద్యోగం, సామాజికజీవనం – ఇవేవీ ఆయనకు అందివచ్చినవి కావు. వీటిలో కొన్ని ఆయన తన జీవితక్రమంలో, అనన్యసాధ్యమైన సాధనతో, కృషితో సంపాదించి ఉండవచ్చుగాని, ఇతర సమాజాలలో వైతాళికులుగా ఎదిగినవారికి ఉన్న ఇటువంటి అవకాశాలలో చాల భాగం ఆయనకు పుట్టుకతో రాలేదన్నది ఒక వాస్తవం.

అసలు ఇరవయో శతాబ్ది తొలి అర్థభాగపు తెలంగాణ వాతావరణమే విశిష్టమైనది. దాని ప్రత్యేక లక్షణాలను సరిగా అర్థం చేసుకున్నప్పుడుమాత్రమే ఆ సమాజంలో వైతాళికుడి పాత్రకు ఉన్న విశిష్టత అవగతమవుతుంది. ఆనాటి తెలంగాణ ఒక భూస్వామ్య సమాజంగా ఉండింది. భారత ఉపఖండంలోకి బ్రిటిష్ వలసవాద ప్రవేశం వల్ల దిగుమతి అయిన అరకొర ఆధునికతా వాసనలు కూడ సోకని సంస్థాన ప్రాంతం నాటి తెలంగాణ. బ్రిటిష్ వారినుంచీ, ఫ్రెంచి వారినుంచీ కూడ తన కుటుంబ, ప్రభువర్గ విలాసాల కొరకు, కొంతవరకు హైదరాబాదు లోని కులీన వర్గాలకొరకు నిజాం ప్రభువులు ఆధునిక జీవనశైలులను స్వాగతించారుగాని అవి సంపన్నవర్గాలను దాటి కిందికి, కనీసం మధ్యతరగతి దాకా కూడ ప్రవహించలేదు. మతం, కులం, సంపద, భాష అనే ప్రధాన భూమికలపై నిలిచిన అంతరాల వ్యవస్థలో పిరమిడ్ పైన నిరంకుశ ప్రభువు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఉండగా ఆ కింది వరసలలో వేరువేరుస్థాయిలలో, అనేక పేర్లతో పిలవబడిన ప్రభు వంశ ఆశ్రితులు, భూస్వాములు ఉండేవారు. ఈ భూస్వామ్యవ్యవస్థను యథాతథంగా ఉంచి, సంరక్షిస్తూ కప్పం వసూలు చేసుకున్నది మిగిలిన భారతదేశంలో రాజ్యం చలాయించిన బ్రిటిష్ వలసవాదం. అందువల్ల నాటి తెలంగాణ అటు వలసవాదం కిందా, ఇటు భూస్వామ్యంకిందా నలిగిపోతూ ఉండింది.

నాటి తెలంగాణలో రెండు ప్రధాన జీవనదులు ఉండి, సారవంతమైన భూమి ఉన్నప్పటికీ, అతికొద్దిభాగం మినహా ఆధునిక నీటిపారుదల సౌకర్యాలను, వ్యవసాయోత్పత్తిపద్ధతులను ఎరగదు. పారిశ్రామికాభివృద్ధి హైదరాబాదు నగరానికీ, సంస్థానంలోని మరి ఒకటిరెండు నగరాలకూ మినహా ఇతర చోట్ల తెలియదు. ఆధునిక విద్యా, వైద్య, రవాణా అవకాశాలేవీ నాటి సమాజానికి తగినంతగా కాదు సరిగదా, నాటికి బ్రిటిష్ ఆంధ్రప్రాంతంలో ఉన్నంతగాకూడ లేవు.

ఈ విధంగా ఆనాటి తెలంగాణ సమాజం అనేక రకాలుగా వెనుకబాటుతనాన్ని అనుభవిస్తుండింది గనుక, తన ప్రజ్ఞాపాటవాలను, సృజనాత్మకతను సంపూర్ణంగా వికసింపజేసుకునే అవకాశాన్ని కోల్పోయి ఉండిందిగనుక, ఆ సమాజంలో వైతాళికుడి పాత్ర చాల అవసరమయినది, లోతయినది, విస్తృతమైనది. ఆ వైతాళికుడు కేవలం ఏదో ఒక రంగంలో మాత్రమే తన శక్తియుక్తులు ప్రదర్శిస్తే సరిపోయేదికాదు. ఆ సమాజం ఆ వైతాళికుడినుంచి అనేకరంగాలలో కృషిని ఆశించింది. ఆ వైతాళికుడు సవ్యసాచి కావాలని ఆశించింది.

మాడపాటి హనుమంతరావు (1885-1970), ఆదిరాజు వీరభద్రరావు (1892-1973), సురవరం ప్రతాపరెడ్డి (1896-1953) వంటి తొలితరం తెలంగాణ నాయకుల బహుముఖకృషికి కారణం ఇదే. తెలంగాణ వైతాళికులందరూ సామాజిక, రాజకీయ, సాహిత్య, మత, సాంస్కృతిక రంగాలన్నిటిలోనూ పనిచేయవలసి వచ్చింది. ఏకకాలంలో నాయకులుగానూ, కార్యకర్తలుగానూ ఉండవలసివచ్చింది. రచయితలుగానూ, ఆ రచనల ప్రచారకులుగానూ ఉండవలసివచ్చింది. సాంఘికకార్యకర్తలుగానూ, ఉపన్యాసకులుగానూ, రాజకీయ కార్యకర్తలుగానూ కూడ ఉండవలసివచ్చింది.

మరో మాటల్లో చెప్పాలంటే, ఒక భూస్వామ్య సమాజంలో సహజమైనదిగా కనబడే మానసిక, శారీరక శ్రమవిభజనను వాళ్లు తుడిచేయవలసివచ్చింది. మేధో శ్రమకూ, శారీరక శ్రమకూ మధ్య గీసిఉన్న అసహజమైన విభజనరేఖ అఖాతంగా మారిపోయిన ఇవాళ్టి స్థితినుంచి చూస్తే, ఆ విభజనరేఖను తుడిచేయడానికి ఒక శతాబ్దం వెనుక వారు జరిపిన అటువంటి కృషి ఎంత మహత్తరమైనదో, ఎంత అపూర్వమైనదో అర్థమవుతుంది.

అటువంటి బహుముఖ కృషిచేసిన, శ్రమవిభజనను తుడిచేసిన తెలంగాణ వైతాళికులలో వట్టికోట ఆళ్వారుస్వామికి మరింత ప్రత్యేకత ఉంది. ఆయన తాను చేసిన పనులు కేవలం సామాజిక అవసరాలను తీర్చడంగా మాత్రమే కాక, పరిస్థితులు తోసినందువల్ల మాత్రమే కాక, ఇతర వైతాళికులకన్న ఎక్కువ అవగాహనతో, ఎక్కువ చైతన్యపూర్వకంగా చేసినట్టనిపిస్తుంది. ఆ ప్రత్యేకతకు కారణమైనవి ఆయన జీవితం, ఆయన కృషి, ఆయన ప్రభావం.

ఆళ్వారుస్వామి జీవితం తెలంగాణ వైతాళికుడిగా ఆళ్వారుస్వామిని అంచనా కట్టేముందు ఆయన జీవితం గురించీ, కృషి గురించీ, ప్రభావం గురించీ స్థూలంగానైనా తెలుసుకోవాలి.

ఆళ్వారుస్వామి నల్లగొండ జిల్లాలోని నక్రేకల్లు సమీపంలోని చెరువుమాధవరం అనే గ్రామంలో ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. చిన్ననాటనే తండ్రి చనిపోగా, పరాయి ఇళ్లలో వంటలు చేసిపెట్టి, పనులు చేసి, ఒక రకంగా సేవక-యాచక వృత్తితో పొట్టపోషించుకోవలసివచ్చింది. అందువల్ల ప్రాథమిక దశలో కూడ నియత విద్య అభ్యాసానికి ఆయన నోచుకోలేదు. పదమూడు పద్నాలుగేళ్ల వయసులో సూర్యాపేటలో గ్రంథాలయం ద్వారా ఆయనకు ప్రపంచంతో పరిచయం మొదలయింది. సొంతంగా తెలుగు మాత్రమే కాక ఇంగ్లిషు కూడ నేర్చుకున్నాడు. ఈ క్రమంలోనే నక్రేకల్లు, సూర్యాపేట, కందిబండలలో ఇళ్లలో వంటపనులు, బెజవాడలో హోటల్ సర్వర్ వృత్తి, హైదరాబాదులో ప్రూఫ్ రీడర్ పని వంటి అనేక జీవన వ్యాపారాలు చేశాడు. చివరికి, బహుశా 1936-37 ప్రాంతాలలో హైదరాబాదు చేరి గోల్కొండ పత్రికలో ప్రూఫ్ రీడర్ ఉద్యోగంలో చేరాడు.

అప్పటివరకూ గడిపిన జీవితం మాత్రమే ఆయన సొంతం అనుకోవాలి. అప్పటినుంచి, 1961 ఫిబ్రవరి లో మరణించేవరకూ ఆయన జీవితమంతా బహిరంగ, సామాజిక జీవితమే. ఆ ఇరవైమూడు, ఇరవై నాలుగేళ్లలో జైలు జీవితానికి మూడేళ్లపైగా ఖర్చయిపోగా, మిగిలిన రెండు దశాబ్దాలలో ఆయన చేసినపనులు రాశి రీత్యా చూసినా, వాసి రీత్యా చూసినా అసాధారణమైనవి.

ఆ ఇరవై ఏళ్లలో ఆయన కథకుడిగా, వ్యాసకర్తగా, నవలారచయితగా, విమర్శకుడిగా, కవిగా, ఉపన్యాసకుడిగా, పత్రికా రచయితగా, పత్రికా సంపాదకుడిగా, ప్రచురణకర్తగా, పుస్తకాల అమ్మకందారుగా, పరిశోధకుడిగా, గ్రంథాలయ నిర్వాహకుడిగా, మొట్టమొదటి సూచీగ్రంథాలయ స్థాపకుడిగా – ఒక్కమాటలో చెప్పాలంటే, అక్షరంతో, మాటతో సంబంధం ఉన్నపనులన్నీ చేశాడు. స్టేట్ కాంగ్రెస్, ఆర్యసమాజం, ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టు పార్టీ, అభ్యుదయ రచయితల సంఘం, తెలంగాణ రచయితల సంఘం వంటి సామాజిక రాజకీయ సాహిత్య సంస్థలన్నిటిలో కార్యకర్తగా, నాయకుడిగా పనిచేశాడు. ఆల్ హైదరాబాద్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, గుమస్తాల సంఘం, రిక్షా కార్మికులసంఘం, రైల్వే ఉద్యోగుల ఆందోళన వంటి కార్మికోద్యమ సంస్థలకు నాయకత్వం వహించాడు. బహుశా తెలంగాణలో తొట్టతొలి పౌరహక్కుల పరిరక్షణా కార్యక్రమాన్ని నిర్వహించాడు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట విరమణ తర్వాత బహుశా నిర్లిప్తతతో కమ్యూనిస్టుపార్టీకి దూరమయినా, 1959 లో కేరళలో నంబూద్రిపాద్ మంత్రివర్గాన్ని కేంద్రప్రభుత్వం బర్తరఫ్ చేయగానే, అందుకు నిరసనగా మళ్లీ కమ్యూనిస్టుపార్టీలో చేరాడు.

ఇన్ని రంగాలలో, ఇంత బహుముఖంగా విస్తరించిన ఆయన వ్యక్తిత్వాన్ని సమగ్రంగా అంచనా కట్టవలసిన పని ఇంకా మిగిలే ఉంది.

ఆళ్వారుస్వామి కృషి

పైనే చెప్పినట్టు ఆళ్వారుస్వామి నలభై ఐదు సంవత్సరాల జీవితంలో మొదటి ఇరవై సంవత్సరాలు బతుకుతెరువు వెతుక్కోవడంలోనే గడిచిపోయాయి. మూడు సంవత్సరాలకు పైగా జైలు నిర్బంధంలో గడిచాయి. అంటే ఆయనకు సామాజిక కృషి సాగించడానికి నిండా ఇరవైరెండు సంవత్సరాలు కూడ దొరకలేదు. ఆ ఇరవైరెండు సంవత్సరాల కాలంలోనే ఆయన సాగించిన సామాజిక, సాహిత్య, సంఘనిర్మాణ కార్యక్రమాలు చూస్తే ఆయన ఎంత నిర్విరామంగా, ఎంత పట్టుదలతో, ఎంత విస్తృతంగా పనిచేశాడో తెలుస్తుంది.

సామాజిక రంగంలో ఆయన ఆంధ్రమహాసభలో సాగించిన కృషి అందరికీ తెలిసిందే అయినా మళ్లీ ఒకసారి ఇక్కడ చెప్పుకోవడం అవసరం. ఆయన మొదటిసారిగా 1937 లో నిజామాబాదులో జరిగిన ఆరవ ఆంధ్రమహాసభలో పాల్గొన్నాడు. ఆ ఆంధ్రమహాసభే తొలిసారిగా నిజాం బాధ్యతాయుత ప్రభుత్వం నిర్వహించాలని మనవి చేసి ఒక బహిరంగ రాజకీయ ప్రస్తావనకు నాంది పలికింది. ఆ మహాసభలో ఆయనకు పెద్ద పాత్రలేకపోవచ్చు గాని, ఆయన ఆ తర్వాత మల్కాపురం (ఏడవ ఆంధ్రమహాసభ, 1940), చిల్కూరు (ఎనిమిదవ ఆంధ్ర మహాసభ, 1941), భోనగిరి (పదకొండవ ఆంధ్రమహాసభ, 1944) లలో క్రియాశీలపాత్ర నిర్వహించారు. ముఖ్యంగా, భోనగిరి ఆంధ్రమహాసభకు ముందు అందులోని ఇరు పక్షాలకూ మధ్య వచ్చిన ఘర్షణను నివారించడానికి ఆళ్వార్ స్వామి చేసిన ప్రయత్నం ‘మీజాన్’ పత్రికలో అచ్చుకుకూడ ఎక్కింది. రెండు పక్షాలమధ్య వచ్చిన వివాదాన్ని గాంధీ సహాయంతో పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. ఆ క్రమంలో ఆయన రాసిన సుదీర్ఘ వ్యాసాలు ‘మీజాన్’ లో అచ్చయ్యాయి. ఇక చీలిక తప్పనప్పుడు, ఆయన ఆపటికి ఇంకా కమ్యూనిస్టుపార్టీ సభ్యుడు కానప్పటికీ, కమ్యూనిస్టుల నాయకత్వంలోని, రావి నారాయణ రెడ్డి అధ్యక్షతలోని ఆంధ్రమహాసభ వైపే ఉండిపోయారు. ఆ చీలిక జరిగిన 1944 నుంచి కడివెండిలో కాల్పులు జరిగిన 1946 జూలై 4 దాక, ఆ తర్వాత కూడ చాల చోట్ల ఆయన రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డిలతో పాటు ప్రధానవక్తగా కూడ ఉన్నాడని ఆధారాలున్నాయి. బహుశా 1944 నాటికే ఆయనలో కమ్యూనిస్టుభావాలు బలపడినట్టు కనిపిస్తుంది. అందువల్లనే 1944లోనే గుమస్తాల సంఘం ఏర్పాటుచేయడం, దాని బాధ్యతలు నిర్వహించడం జరిగిఉంటుంది. అధికారికంగా మాత్రం ఆయన 1945లోనే కమ్యూనిస్టుపార్టీలో చేరినట్టు ఆధారాలున్నాయి.

ఒకవైపు ఆంధ్రమహాసభ కార్యకర్తగా పనిచేస్తూనే ఆయన తొలిరోజుల్లో స్టేట్ కాంగ్రెస్ సత్యాగ్రహంలో కూడ పాల్గొన్నాడు. అందులో భాగంగా జైలు నిర్బంధాన్ని కూడ అనుభవించాడు. కమ్యూనిస్టుపార్టీ కార్యకర్తగా ఉన్నప్పుడు కూడ ఆయనలో గాంధీ పట్ల అభిమానం కొనసాగినట్టే కనబడుతుంది. అయితే, బ్రిటిష్ ఇండియాలో స్వాతంత్ర్యం అనబడేది వచ్చి, తెలంగాణలో రైతాంగ సాయుధపోరాటాన్ని విరమించినతర్వాత ఆయనకు అన్ని రాజకీయపక్షాల ఆచరణతోనూ అసంతృప్తి ఏర్పడినట్టనిపిస్తుంది. ‘రామప్ప రభస’లో 1957 ఆగస్టు 15 గురించి రాస్తూ, “నాటి పాలకులు, సంపన్నులు పాలితులను, బీదలను హింసించడం, దోచుకోవడం హక్కుగాను, అధికారంగాను, చట్టరీత్యా పొందిన వరంగాను బాహాటంగా చెప్పుతూ చేశారు. అందువల్ల వారి వాదంలోని అసహజత్వాన్ని బాధితులు బాహాటంగా, బలంతో ఎదుర్కొని, వారి బూటకాన్ని లోకానికి చాటారు. వారి ఆటలను కట్టివేశారు. వారి జాతకాలను మార్చివేశారు. వారిచట్టాలను చెత్తబుట్టల్లో చేర్చారు. వారి నిజస్వరూపాలను నగ్నం చేశారు. వారి పశుశక్తిని భగ్నంచేశారు. కాని నేటి పరిస్థితులు వేరు. ‘నేషనల్ సోషలిజం’ పేర హిట్లర్ ప్రపంచాన్ని మింగి చూచాడు. ‘కంట్రోల్డ్ డెమాక్రసీ’ పేర నాసర్ నాయకత్వం చేపట్టాడు. ‘ప్రజల ప్రజాస్వామ్యం’ పేర మార్క్సిజం ముద్రతో, కమ్యూనిస్టులు మనుషుల విలువలను మంట కలుపుతున్నారు. దేశాన్ని కుల, ముఠా, ప్రాంత, భాషా భేదాలను ‘గాంధీ వారసులు’ గా కాంగ్రెసువారు రేకెత్తిస్తున్నారు. నాడు రాజ్యాలను, రాజరికాలను నిలబెట్టుకోవడానికి ప్రజలపై దౌర్జన్యాలు సాగితే నేడు ప్రజలపేర, ప్రజలకొరకు, ప్రజాప్రతినిధులుగా ప్రజలపై దౌర్జన్యాలు జరుగుతున్నాయి, ప్రజలను మభ్యపెట్టుతున్నారు” అని రాశారు.

అట్లా ఒకవైపు, ఆంధ్రమహాసభ, మరొకవైపు స్టేట్ కాంగ్రెస్ పనులు చేస్తూనే ఆయన దేశోద్ధారక గ్రంథమాల పేరుతో పుస్తకప్రచురణసంస్థను కూడ 1938 లోనే ప్రారంభించాడు. 1942లో నిర్బంధం వల్ల ఆగిపోయి, 1943లో విడుదల తర్వాతకూడ ఇతరపనుల ఒత్తిడివల్ల పునరుద్ధరించలేకపోయిన గ్రంథమాలను 1951లో రెండోసారి జైలు నుంచి విడుదల అయినతర్వాత పునరుద్ధరించాడు. ఈ రెండు విడతలలో కలిసి ముప్పై పుస్తకాలు ప్రచురించాడు. వాటిలో తెలంగాణ పాఠకులకోసం అవసరమైన పుస్తకాల అనువాదాలూ ఉన్నాయి, స్వతంత్ర రచనలూ ఉన్నాయి. వాటిని తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో పాఠకులు ఉన్నదగ్గరికల్లావెళ్లి ప్రచారం చేశాడు.

ఆళ్వారుస్వామి రచనలన్నీ విశిష్టమైనవే గాని ఇంతవరకూ ఎక్కువగా వెలుగు ప్రసరించని ‘రామప్పరభస’ వ్యాసాల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిఉంది. ఆయన చివరి రచనలలో ఒకటి, మరణానంతరం పుస్తకరూపంలో వచ్చినది ‘రామప్ప రభస’. ఇది మచిలీపట్నం నుంచి వెలువడే తెలుగు విద్యార్థి మాస పత్రికలో 1956-57లో శీర్షికగా అచ్చయి, 1984 లో పుస్తకరూపంధరించింది. అటు అప్పటివరకూ తాను సభ్యుడిగా ఉండిన కమ్యూనిస్టుపార్టీకి రాజీనామా చేసి, ఇటు స్వాతంత్ర్యానంతర గాంధీవాదంతో నిరాశచెంది, ఒకరకంగా నిర్లిప్తతలోకి ప్రయాణించిన మేధావి అభిప్రాయాలుగా ఈ వ్యాసాలు కనబడతాయి. మరొక దశాబ్దంతర్వాత ఈ దేశంలో పాలక కాంగ్రెస్ పార్టీకీ, కమ్యూనిస్టుపార్టీల దిగజారుడుకూ వ్యతిరేకంగా వచ్చిన తిరుగుబాటుకు ఒక భవిష్యసూచనగా ఈ వ్యాసాలకు చాల ప్రాధాన్యత ఉంది.

ఆళ్వార్ స్వామి ప్రభావం
ఆళ్వారుస్వామి ప్రభావం ఆయన సహరచయితలమీద, తర్వాతి తరం రచయితలమీద, తెలంగాణ ప్రత్యేక అస్తిత్వం గురించి ఆలోచించే అందరిమీదా గణనీయంగా ఉంది. నిజానికి ఆయన ప్రభావం ఆయన మరణానంతరమే ఎక్కువగా ఉ6దన్నా, పెరుగుతున్నదన్నా అతిశయోక్తి కాదు. ఆయన రచనల గురించీ, కృషిగురించీ చెప్పుకోవడం, మననం చేసుకోవడం, దాన్ని ఆదర్శంగా గ్రహించడం ఇటీవలి కాలంలో చాల ఎక్కువగా జరుగుతున్నది. తెలంగాణ ప్రజాజీవితాన్ని ప్రతిభావంతంగా నవలలకెక్కించిన రచయితగా, తెలంగాణ భాషను సజీవంగా అక్షరాలకెక్కించిన కథకుడిగా, గ్రంథాలయోద్యమ కార్యకర్తగా, తెలంగాణ చరిత్ర పరిశోధనపై ఆసక్తి ప్రేరేపించిన వ్యక్తిగా ఆయన ప్రభావం ఇప్పుడు మరింతగా, మరింత ఎక్కువమందికి అవగాహనకు వస్తున్నది.

పునః పునరాగమనమే వైతాళికుడి సారం

కొనసాగుతున్న, విస్తరిస్తున్న ప్రభావమే ఆళ్వారుస్వామి వైతాళికుడనడానికి ప్రబలమైన నిదర్శనం. ఒక మేధావి వైతాళికుడైనప్పుడు మాత్రమే అతని గురించి మళ్లీ మళ్లీ చర్చ జరుగుతుంది. ఆయన భావాలు ఎంత సంబద్ధమైనవో, ఎంత సార్వకాలికమైనవో మళ్లీ మళ్లీ కనిపిస్తూ ఉంటుంది. ఆయన ఒక ఉదాహరణప్రాయమైన, ఆదర్శ ప్రాయమైన చిహ్నంగా మారిపోతాడు. ఆ చిహ్నం నుంచి ఎప్పటికప్పుడు కొత్తకొత్త అర్థాలు గ్రహించడానికి, నిన్న కనిపించకుందా ఉండిపోయిన వెలుగులు ఇవాళ గ్రహించడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఆయన రచనలగురించీ, కృషి గురించీ ఇంకా ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని కొత్త తరాలలో ఆకాంక్షలు పెల్లుబుకుతూ ఉంటాయి.

ఒక సమాజపు వైతాళికుడి పని తన సమకాలీన సమాజంలో, తన స్థలకాల పరిమితులలోపల మాత్రమే జరగదు. వైతాళికుడిగా ఉండడమంటేనే ఆ వ్యక్తి పునః పునరాగమనం కోసం సమాజం నిరీక్షిస్తూ ఉండడం. తెలంగాణ సమాజంలో ఆళ్వారుస్వామి అట్లా పునః పునరాగమిస్తూనే ఉన్నాడు. ఆయన రచనల అధ్యయన అవసరం, ఆ రచనల మీద ఆసక్తి రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. ప్రస్తుతం విస్తరిస్తున్న తెలంగాణ ప్రత్యేక అస్తిత్వ ఆకాంక్షలు వట్టికోట ఆళ్వారుస్వామిని సగౌరవంగా సంస్మరించుకుంటున్నాయి. ఆయన స్మృతినుంచి నేర్చుకోవలసినదెంతో ఉన్నదని గ్రహిస్తున్నాయి. తెలంగాణ సమాజం ఆళ్వారుస్వామిని అట్లా మళ్లీమళ్లీ ఆహ్వానిస్తూనేఉంది. ఆయన తెలంగాణ వైతాళికుడనడానికి అంతకన్న పెద్ద రుజువు అవసరంలేదు.

ఉపయుక్త గ్రంథాలు కొన్ని:

 • కె శ్రీనివాస్ (1999), తెలంగాణలో సాహిత్య పునర్వికాసం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి సమర్పించిన పి హెచ్ డి సిద్ధాంతగ్రంథం, అముద్రితం వట్టికోట ఆళ్వారుస్వామి (1952), జైలు లోపల, సర్వోదయ ప్రెస్ , సికింద్రాబాదు
 • వట్టికోట ఆళ్వారుస్వామి (సం.) (1956), తెలంగాణం – రెండో భాగం, దేశోద్ధారక గ్రంథమాల, సికింద్రాబాదు వట్టికోట ఆళ్వారుస్వామి (1984), రామప్ప రభస, తెలుగువిద్యార్థి ప్రచురణ, మచిలీపట్నం
 • వరవరరావు (1983), తెలంగాణ విమోచనోద్యమం – తెలుగు నవల, హనుమకొండ
 • సంగిశెట్టి శ్రీనివాస్ (2003), షబ్నవీస్ – తెలంగాణ పత్రికారంగచరిత్ర (18886-1956), కవిలె, హైదరాబాద్
 • సంగిశెట్టి శ్రీనివాస్ (2004), దస్త్రమ్ – తెలంగాణ తొలితరం కథలసూచి, కవిలె, హైదరాబాద్ సంగిశెట్టి శ్రీనివాస్ , ఎన్ వేణుగోపాల్ (2006) – తెలంగాణ వైతాళికుడు వట్టికోట ఆళ్వారుస్వామి సార్థకజీవనం, కవిలె, హైదరాబాద్
 • D N Dhanagare (1986), Peasant Movements in India – 1920-1950, Oxford University Press, Delhi
 • V Ramakrishna Reddy (1987), Economic History of Hyderabad State, Gian Publishing House, Delhi
 • Foot Notes :

  1. వీరిలో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ , రామకృష్ణ పరమహంసలు మాత్రం పేదకుటుంబాలనుంచి వచ్చారు. విద్యాసాగర్ తన ఉన్నతవిద్య ద్వారా, రామకృష్ణ పౌరోహిత్యం ద్వారా ప్రత్యేకమైన అవకాశాలు పొందారు.
  2. పాయెగాలు, ఉమ్రాలు, సంస్థానాలు, ఎస్టేట్లు, ఇనాంలు, అగ్రహారాలు, సంస్థానాలు, మక్తేదార్లు, జాగీర్దార్లు, దేశముఖ్ లు, దేశపాండ్యాలు వంటి అనేక పేర్లతో ఇవి ఉండేవి,
  3. కాకతీయులనాటి నీటిపారుదల సౌకర్యాలను మినహాయిస్తే, ఆధునిక నీటి పారుదల – వ్యవసాయోత్పత్తి సౌకర్యాలు నాటి తెలంగాణలో చాల తక్కువ. పదహారో శతాబ్దపు హుసేన్ సాగర్, ఇబ్రహీంపట్నం చెరువు, 1920లలో నిర్మాణమైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, నిజాం సాగర్ లలో నిజాం సాగర్ మినహా ఏదీ పెద్దఎత్తున ఆధునిక వ్యవసాయోత్పత్తికీ, వ్యవసాయంలో మిగులుకూ దారి తీసినవి కావు.
  4. వట్టికోట ఆళ్వారుస్వామి సంపాదకత్వంలో వెలువడిన ‘తెలంగాణం’ వ్యాససంకలనం (1956) లో గొబ్బూరు రామచంద్రరావు రాసిన పారిశ్రామిక కార్మికులు వ్యాసం ప్రకారం, 1951 నాటికి తెలంగాణ జనాభా 1,01,07,773 కాగా, అందులో పారిశ్రామిక కార్మికుల జనాభా 64,000, అంటే 0.6 శాతం. అందులోనూ, కేవలం సింగరేణి బొగ్గు గనుల్లోనే 20,000 మంది పని చేసేవారు గనుక, తెలంగాణ లో ఇరవయో శతాబ్ది ప్రథమార్థభాగంలో పారిశ్రామికాభివృద్ధి ఎంత తక్కువగా ఉండేదో అర్థమవుతుంది.
  5. ఇరవయో శతాబ్దపు తొలి అర్థ భాగంలో తెలంగాణలో అక్షరాస్యతా శాతం ఎంత అనే విషయంలో కచ్చితమైన గణాంకాలు దొరకడంలేదు. నాలుగు శాతం నుంచి పది శాతం వరకు ఎంతయినా ఉండవచ్చుననీ, మొత్తానికి పది శాతం కన్న తక్కువేననీ లభ్యమవుతున్న ఆధారాలు చెపుతున్నాయి. వైద్య సౌకర్యాలు, రవాణా సౌకర్యాల విషయంలో హైదరాబాదు, ఒకటిరెండు నగరాల పరిస్థితి కొంత మెరుగు గాని, విశాలమైన తెలంగాణలో ఆ సౌకర్యాలు లేవు.
  6. ఆ కృషిలో ఒక ప్రథమ ప్రయత్నం సంగిశెట్టి శ్రీనివాస్, ఎన్ వేణుగోపాల్ ల రచన ‘తెలంగాణ వైతాళికుడు వట్టికోట ఆళ్వారుస్వామి సార్థక జీవనం’ (కవిలె ప్రచురణ – 2006).
  7. ధర్మవరంలో జరిగిన తొమ్మిదో ఆంధ్రమహాసభ (1942), హైదరాబాదులో జరిగిన పదవ ఆంధ్రమహాసభ (1943) లలో ఆళ్వారుస్వామి పాల్గొన్నట్టులేదు. బహుశా ఆసమయంలో ఆయన జైలులో ఉండడంవల్ల హాజరయినట్టులేదు. లేదా, ఆయన పాల్గొని ఉంటే అందుకు సంబంధించి ఆధారాలు దొరకవలసే ఉంది.
  8. చాల అచ్చుతప్పులతో, గందరగోళంగా వచ్చిన ఈ పుస్తకానికి ‘మామాట’ అనే పేరుతో తెలుగు విద్యార్థి ప్రచురణలు రాసిన ముందుమాటలో దీన్ని రామప్పరగడ అనికూడ ప్రస్తావించారు. ఈ పుస్తకంలో మొత్తం పదహారు వ్యాసాలున్నాయి. ఆ వ్యాసాలు తెలుగువిద్యార్థి పత్రికలో ఏ సంచికనుంచి ఏ సంచికవరకు వెలువడ్డాయో కూడ ప్రచురణకర్తలు రాయలేదు.
  Advertisements

  About ఎన్.వేణుగోపాల్

  Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
  This entry was posted in Reviews, Telangana, Telugu. Bookmark the permalink.

  One Response to తెలంగాణ వైతాళికుడుగా వట్టికోట ఆళ్వారుస్వామి

  1. koresh says:

   oka goppa vyakthi gurinchi entho goppa sahithya karudi gurinchi enlighten chesinanduku danya vaadalu.

  Leave a Reply

  Fill in your details below or click an icon to log in:

  WordPress.com Logo

  You are commenting using your WordPress.com account. Log Out /  Change )

  Google+ photo

  You are commenting using your Google+ account. Log Out /  Change )

  Twitter picture

  You are commenting using your Twitter account. Log Out /  Change )

  Facebook photo

  You are commenting using your Facebook account. Log Out /  Change )

  w

  Connecting to %s