తెలుగులో మార్క్సిస్టు సాహిత్య విమర్శ – పునరాలోచనలు

తెలుగులో మార్క్సిస్టు సాహిత్య విమర్శ ఆరు దశాబ్దాలకు పైగా ఉనికిలో ఉంది. 1930ల మధ్యనుంచీ తెలుగు సాహిత్యంలోకి మార్క్సిస్టు భావాల ప్రవేశం ఉన్నప్పటికీ, 1930లలోనే కొడవటిగంటి కుటుంబరావు రాసిన వ్యాసాలు, జి.వి.కృష్ణారావు రాసిన వ్యాసాలు, ‘కావ్యజగత్తు’ పుస్తకం ఉన్నప్పటికీ, మద్దుకూరి చంద్రశేఖరరావు రాసిన, 1944లో అచ్చయిన రెండు వ్యాసాలను తెలుగులో మెరుగయిన మార్క్సిస్టు సాహిత్య విమర్శకు ప్రారంభంగా గుర్తించవచ్చు. వీటిలో ఒకటి కురుగంటి సీతారామయ్య రాసిన ‘నవ్యాంధ్ర సాహిత్యవీథులు’ పై మద్దుకూరి చంద్రశేఖరరావు రాసిన, 1944 మార్చిలో వెలువడిన ‘అభ్యుదయ రచనల సంపుటి’ లో అచ్చయిన సమీక్షావ్యాసం. రెండవది, ‘సాహిత్యం – రాయిస్టులు’ పేరుతో మద్దుకూరి చంద్రశేఖరరావు ‘తెలుగుతల్లి’ పత్రికలో 1944 డిసెంబర్ సంచికలో రాసిన వ్యాసం. వీటికి కొనసాగింపుగా మద్దుకూరి చంద్రశేఖరరావు రాసిన ‘ఆంధ్ర సాహిత్యంలో కొత్తపోకడలు’, శ్రీశ్రీ రాసిన ‘ఏది విప్లవ పంథా?’ వ్యాసాలను కూడ చెప్పుకోవాలి. ఇవి రెండూ కూడ 1946 అక్టోబర్ లో ప్రచురితమైన అభ్యుదయ మొదటి సంచికలో అచ్చయ్యాయి. వీటిలో ‘ఆంధ్రసాహిత్యంలో కొత్త పోకడలు’ వ్యాసంలో మార్క్సిస్టు దృక్పథం సరిగా వ్యక్తం కాలేదని, యాంత్రికంగా ఉందని, తేల్చివేశారని పుచ్చలపల్లి సుందరయ్య 1947లోనే విమర్శించారు. ఆ విమర్శతో ప్రత్యేకంగా కమ్యూనిస్టు పార్టీ ఒక సర్క్యులర్ ను సభ్యులకు పంపింది. అంటే, తెలుగులోకి మార్క్సిస్టు సాహిత్యవిమర్శ ప్రవేశమే దృక్పథం గురించిన వివాదంతో మొదలయింది.

ఈ ఆరు దశాబ్దాలలో మార్క్సిస్టు సాహిత్యవిమర్శగా గుర్తింపు పొందిన పుస్తకాలు దాదాపు వంద వెలువడి ఉంటాయి. విడిగా పత్రికలలో ఐదారువేల పేజీల విమర్శరచనలు మార్క్సిస్టు సాహిత్యవిమర్శగా పేరు తెచ్చుకుని ఉంటాయి. మద్దుకూరి చంద్రశేఖరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, జి వి కృష్ణారావు, కంభంపాటి సత్యనారాయణ, తాపీ ధర్మారావు, పాములపర్తి సదాశివరావు, కొడవటిగంటి కుటుంబరావు, శ్రీశ్రీ, కె వి రమణారెడ్డి, తుమ్మల వెంకటరామయ్య, ఆవంత్స సోమసుందర్, రాచమల్లు రామచంద్రారెడ్డి, ఆరుద్ర, చేకూరి రామారావు, త్రిపురనేని మధుసూదనరావు, వల్లంపాటి వెంకటసుబ్బయ్య, వరవరరావు, వెల్చేరు నారాయణరావు, కేతు విశ్వనాథరెడ్డి, కె కె రంగనాథాచార్యులు, రంగనాయకమ్మ, అద్దేపల్లి రామమోహనరావు, సొదుం రామ్మోహన్, వై విజయకుమార్, రాంభట్ల కృష్ణమూర్తి, నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, సి వి సుబ్బారావు, ఓల్గా, కె బాలగోపాల్, రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, జె సి, వి చెంచయ్య, జయధీర్ తిరుమలరావు, చేకూరి శ్రీనివాసరావు, ఆర్వియార్, బి సూర్యసాగర్, సంజీవమ్మ, టి ఎల్ కాంతారావు, ఎస్వీ సత్యనారాయణ, కాత్యాయనీ విద్మహే, పాపినేని శివశంకర్, కె రాంమోహన్ రాయ్, తక్కోలు మాచిరెడ్డి, తెలకపల్లి రవి వంటి తెలుగు సాహిత్యవిమర్శకులెందరో మార్క్సిస్టు సాహిత్యవిమర్శకులుగానో, కనీసం కొన్ని మార్క్సిస్టు సాహిత్య విమర్శా పరికరాలు ఉపయోగించిన విమర్శకులుగానో గుర్తింపు పొందారు, పొందుతున్నారు. మార్క్సిస్టు సాహిత్యవిమర్శ పరికరాలను వినియోగించడంలో, దృక్పథ స్పష్టతలో వీరిమధ్య తరతమ భేదాలు, భిన్నాభిప్రాయాలు ఉండవచ్చుగాని వీరందరినీ ఏదో ఒక రూపంలో తెలుగు సాహిత్యవిమర్శ రంగంలో మార్క్సిస్టు వైఖరికి ప్రతినిధులుగా చూసే సంప్రదాయం ఉంది. ఏడు దశాబ్దాలకు మించని చరిత్రగల ఒక సాహిత్యవిమర్శ రంగంలో కనీసం యాభైమంది పనిచేసి ఉండడం, దాదాపు వంద పుస్తకాలు వెలువడడం గణనీయమైన విషయమే.

ఇంత ఘనమైన చరిత్ర, సంప్రదాయం ఉన్నప్పటికీ, తెలుగులో అసలు మార్క్సిస్టు సాహిత్యవిమర్శ అంటే ఏమిటి, మార్క్సిస్టు సాహిత్యవిమర్శగా దేన్ని గుర్తించాలి, మార్క్సిస్టు సాహిత్యవిమర్శగా గుర్తించడానికి మౌలిక ప్రాతిపదికలేమిటి అనే ప్రాథమిక విషయాలలోనే విస్పష్టమైన, సర్వాంగీకారమైన అభిప్రాయం ఏర్పడినట్టులేదు. సాహిత్యవిమర్శకుడు మార్క్సిస్టుగా గుర్తింపు పొంది ఉన్నట్టయితే అతను రాసిందల్లా మార్క్సిస్టు సాహిత్య విమర్శగా చలామణీ అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. మార్క్సిస్టు సాహిత్యధార నుంచి, మార్క్సిస్టు సాహిత్యకారుల సంఘాల నుంచి వెలువడిన సాహిత్యవిమర్శ అంతా మార్క్సిస్టు సాహిత్యవిమర్శగా పరిగణించబడింది. మార్క్సిస్టు సాహిత్యధారలో వచ్చిన పుస్తకాలపై విమర్శ మార్క్సిస్టు సాహిత్యవిమర్శగా గుర్తింపు పొందింది. మార్క్సిస్టు రచయితలైనా సాంప్రదాయక అంశాలపైన, సాంప్రదాయక రచయితలపైన, పుస్తకాలపైన రాసినప్పుడు అది మార్క్సిస్టు సాహిత్య విమర్శగా గుర్తింపు పొందడం ఇబ్బంది అయింది. కొన్ని సందర్భాలలో కేవలం మార్క్సిస్టు సాహిత్య విమర్శలోని పారిభాషికపదాలను వాడడమే మార్క్సిస్టు సాహిత్యవిమర్శగా గుర్తింపు పొందింది. మార్క్సిస్టు సాహిత్య విమర్శ చెప్పే విషయాలనే చెప్పినప్పటికీ, ప్రత్యేక పదజాలంలో చెప్పకపోతే అది మార్క్సిస్టు సాహిత్యవిమర్శగా గుర్తింపు పొందలేదు. తాము రాస్తున్నది మార్క్సిస్టు సాహిత్యవిమర్శ అనుకున్నవాళ్లు కూడ తమ రచనలలో మార్కిస్టేతర, అమార్క్సీయ సాహిత్యవిమర్శా పరికరాల, భావనల సాయం తీసుకున్నారు. మార్క్సిస్టు సాహిత్యవిమర్శకులమని తమనుతాము గుర్తించుకున్నవాళ్లలో కూడ అన్ని సందర్భాలలోనూ దృక్పథస్పష్టత లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే మార్క్సిస్టు సాహిత్య విమర్శ అంటే ఏమిటి అనే ప్రశ్నకు సూటి సమాధానాన్ని తెలుగు సాహిత్యలోకం ఇంకా తయారు చేయలేదు. ఆ దిశగా చెప్పుకోదగిన, గౌరవించదగిన ప్రయత్నాలు జరిగినప్పటికీ, ఆ ప్రయత్నాలన్నిటినీ సమన్వయపరచిన సమగ్ర కృషి జరగలేదు.

ఇందుకు కారణమేమిటో గుర్తించాలంటే, అసలు మార్క్సిస్టు సాహిత్యవిమర్శకు ప్రాతిపదికలు ఏమిటో, అవి తెలుగు మార్క్సిస్టు సాహిత్యవిమర్శలో వ్యక్తమయ్యాయోలేదో పరిశీలించాలి.

ఒక సాహిత్యవిమర్శ రచనను మార్క్సిస్టు సాహిత్యవిమర్శగా గుర్తించడానికి కనీసం ఐదు ప్రధాన ప్రాతిపదికలు ఉండాలి. అవి 1. మార్క్సిస్టు సాహిత్యవిమర్శా సిద్ధాంతం, 2. మార్క్సిస్టు సాహిత్యవిమర్శా పద్ధతి, 3. సమాజసాహిత్యసంబంధాల అవగాహన, అది విమర్శలో వ్యక్తమయే తీరు, 4. వస్తుశిల్పాల చర్చ, విశ్లేషణ, 5. సాహిత్యానికి గల తక్షణ – దీర్ఘకాలిక ప్రయోజనాల స్పృహ. ఈ ఐదు ప్రాతిపదికలలోనూ తెలుగు మార్క్సిస్టు సాహిత్యవిమర్శలో కొంతకృషి జరిగినప్పటికీ, జరగవలసిన కృషి ఎంతో ఉంది.

మార్క్సిస్టు సాహిత్య విమర్శా సిద్ధాంతం తెలుగులో మార్క్సిస్టు సాహిత్య విమర్శ ఎక్కువగా పుస్తక సమీక్షల రూపంలో, అనువర్తిత, అన్వయ విమర్శగానే సాగింది గాని సాహిత్యవిమర్శా సిద్ధాంతం వైపునుంచి ఎక్కువ కృషి జరగలేదు. అసలు సైద్ధాంతికస్థాయిలో మార్క్సిస్టు సాహిత్యవిమర్శా పద్ధతి ఏమిటనే చర్చ ఎక్కువగా జరగలేదు.

నిజానికి మార్క్సిస్టు సాహిత్యవిమర్శను ఇతర సాహిత్యవిమర్శల నుంచి వేరుచేసేది దాని సిద్ధాంతం, దాని పద్ధతి. సాహిత్యసృజన గురించీ, సమాజ సాహిత్యసంబంధాల గురించీ, సాహిత్య ప్రభావం గురించీ, సాహిత్య ప్రయోజనం గురించీ మార్క్సిస్టు దృక్పథంలో ప్రత్యేకమైన సైద్ధాంతిక అవగాహన ఉంది. ఆ అవగాహన మార్క్స్ ఎంగెల్స్ ల రచనలలోనే ప్రారంభమై, గత నూట అరవై సంవత్సరాలలో ఎంతగానో విస్తరించింది. సోవియట్ యూనియన్, చైనా వంటి దేశాలలో ఆచరణలోకి వచ్చి, ఆ ఆచరణక్రమంలో మార్పులు చేర్పులకు గురయిన సాహిత్య సైద్ధాంతిక అవగాహన ఒకవైపు ఉండగా, జర్మనీ, ఫ్ర్రాన్స్, హంగరీ, బ్రిటన్, చెకొస్లవేకియా, అమెరికా లలో విశ్వవిద్యాలయాలలోనూ, కమ్యూనిస్టుపార్టీలలోనూ మేధావుల విశ్లేషణా కృషిలో అనేక కొత్త అంశాలు, ఆలోచనలు వెలికివచ్చాయి. ఇరవయో శతాబ్ది పొడవునా అద్భుతంగా వికసించిన ఈ మార్క్సిస్టు సాహిత్య సిద్ధాంతాన్నంతా మదింపు వేసి, మన సామాజిక, సాంస్కృతిక ప్రత్యేకతలతో జతచేసి మనకై మనం ఒక విస్పష్టమైన మార్క్సిస్టు సాహిత్య సిద్ధాంతాన్ని రూపొందించుకోవలసి ఉంది. అందులో మార్క్సిస్టు దృక్పథంలోని సార్వజనీన, సార్వకాలీన అంశాలూ ఉంటాయి, వాటిలో అదనంగా వచ్చిచేరే అంశాలూ ఉంటాయి, మన సమాజ, సాహిత్య ప్రత్యేకతలను వివరించగల ప్రత్యేక అంశాలూ ఉంటాయి. తెలుగులో అటువంటి మార్క్సిస్టు సాహిత్య సిద్ధాంతం అభివృద్ధి చేయడానికి అవసరమయిన కృషి చాల తక్కువ జరిగింది.

అటువంటి స్వతంత్ర సాహిత్యసిద్ధాంతం రూపొందించడానికి కృషి తగినంతగా జరగకపోవడం మాత్రమే కాదు, ఇతర భాషలలో జరిగిన అటువంటి కృషిని తెలుగులోకి అనువదించే ప్రయత్నం కూడ తగినంత జరగలేదు. సాహిత్యం గురించి లెనిన్ ఒక ప్రత్యేక సందర్భంలో ప్రకటించిన అభిప్రాయాలు, విముక్తప్రాంతంలో ఎర్రసైనికులను, రచయితలను ఉద్దేశించి మావో చేసిన ప్రసంగం మినహా, మొత్తంగా సాహిత్యం గురించి మార్క్సిస్టు సైద్ధాంతిక అవగాహనలు తెలుగులోకి ఇంతవరకూ రానేలేదు. మార్క్స్ ఎంగెల్స్ లు సాహిత్యం గురించి వెలిబుచ్చిన అద్భుతమైన విశ్లేషణలు గానీ, స్థూలంగా మార్క్సిస్టు అవగాహనా చట్రంలోనే అయినప్పటికీ, విభిన్నమైన పద్ధతిలో ప్లెహనోవ్, మయకోవ్ స్కీ, లూనషార్ స్కీ, క్రిస్టఫర్ కాడ్వెల్, ఎర్నెస్ట్ ఫిషర్, అల్థుజర్, జార్జి లూకాచ్, బెర్టోల్ట్ బ్రెహ్ట్, జీన్ పాల్ సార్త్రే, అలెక్ వెస్ట్, హొవార్డ్ ఫాస్ట్, రేమండ్ విలియమ్స్, వాల్టర్ బెంజమిన్, టెర్రీ ఈగిల్ టన్, ఫ్రెడరిక్ జేమ్ సన్ వంటి ఎందరో మేధావులు చేసిన అపారమైన సాహిత్య విమర్శ చర్చ గాని, కొత్త భావాలుగాని, కనీసం వాటి పరిచయాలుగాని తెలుగులోకి రానే లేదు. (మాగ్జిం గోర్కీ, రాల్ఫ్ ఫాక్స్ , ఇల్యా ఎహ్రెన్ బర్గ్ , జార్జి థామ్సన్ ల రచనలలోంచి కొన్ని మాత్రం తెలుగులోకి రావడం మినహాయింపు). ఆయా సైద్ధాంతిక చర్చల మౌలికాంశాలు, భావనలు పరిచయం కాలేదుగాని, ఆ చర్చలలోని వివాదాలు, అనవసర అంశాలు మాత్రం పరోక్షంగా చిలవలు పలువలతో తెలుగు చర్చా సంప్రదాయంలోకి వచ్చిచేరాయి. సిద్ధాంతం మీద కన్న ఎక్కువ పూనిక వివాదం మీద ఉండిందనేది ఒక చేదు వాస్తవం.

ఈ విధంగా తెలుగులో మార్క్సిస్టు సాహిత్యవిమర్శగా పేరుతెచ్చుకున్న రచనలకు అవసరమైన తాత్వికపునాది, సైద్ధాంతిక భూమిక కొంత సమస్యాత్మకంగా ఉంది. అందువల్ల దాదాపుగా మినహాయింపులు లేకుండా అందరు “మార్క్సిస్టు సాహిత్యవిమర్శకుల”లోనూ ఎక్కడో ఒకచోట సైద్ధాంతిక పటుత్వం లేకపోవడం కనబడుతుంది. మన సమాజంలో మార్క్సిస్టులుగా మారదలచుకున్నవారి మీద ఏదో ఒకరూపంలో హైందవ బ్రాహ్మణ్య ఆలోచనల ప్రభావం కొనసాగినట్టుగానే, మార్క్సిస్టు సాహిత్యవిమర్శకులు కాదలచుకున్నవారి మీద కూడ ఆలంకారిక సాహిత్యవిమర్శాపరికరాల గతకాలపు భారం కొనసాగడం కనబడుతుంది. మరొకవైపు వారే పాశ్చాత్య సాహిత్యవిమర్శ ముందుకు తీసుకొచ్చిన కొన్ని మిరుమిట్లు గొలిపే పరికరాల మోజులో పడి మార్క్సిస్టు దృక్పథపు మౌలిక పునాదులను విస్మరించడం కూడ కనబడుతుంది. అందువల్ల మార్క్సిస్టు సాహిత్యసిద్ధాంత అవగాహన పటిష్టంగా ఉండవలసినచోట, కొన్ని మార్క్సిస్టు భావాలు, కొన్ని ఆలంకారిక సాహిత్యసిద్ధాంత భావనలు, కొన్ని పాశ్చాత్య సాహిత్యసిద్ధాంత భావనలు, కొన్ని సాదాసీదా సాహిత్య ఆలోచనలు శాంతియుత సహజీవనం చేయడం కనబడుతుంది.

మార్క్సిస్టు సాహిత్య విమర్శా పద్ధతి మార్క్సిస్టు సాహిత్యవిమర్శ కూడ ఇతర సాహిత్య విమర్శలలాగనే ఒక సాహిత్య రచనలోని వస్తువును, శిల్పాన్ని, ఉద్దేశ్యాన్ని, ప్రయోజనాన్ని, ప్రభావాన్ని పరిశీలిస్తుంది. రచనను వివరించడానికి, విశ్లేషించడానికి ప్రయత్నిస్తుంది. రచనను ఒక నేపథ్యంలో పెట్టి పాఠకులు ఆ రచనను గ్రహించే భూమికను విశాలం చేస్తుంది. అంటే స్థూలంగా చూసినప్పుడు మార్క్సిస్టు సాహిత్య విమర్శ కూడ ఇతర సాహిత్య విమర్శలలాగనే పనిచేస్తుందని అనిపిస్తుంది. కాని, మార్క్సిస్టు సాహిత్య విమర్శ స్పష్టంగా విభిన్నంగా, విశిష్టంగా ఉండేది దాని సంవిధానంలోనే.

ఆ సంవిధానాన్ని నిర్ణయంచేవి చారిత్రక, రాజకీయార్థిక, సామాజిక, సాంస్కృతిక కోణాలు. ఇతర సాహిత్యవిమర్శా రూపాలలో వీటిలోని ఒకటో రెండో కోణాలు ఉండవచ్చుగాని అవి కూడ సమగ్రంగా ఉండే అవకాశంలేదు. ఉదాహరణకు, ప్రాచీన, ఆలంకారిక సాహిత్యవిమర్శలో చారిత్రక, రాజకీయార్థిక, సామాజిక కోణాలు లేవుగాని, సాంస్కృతిక కోణం ఎక్కువగానే ఉంటుంది. అయితే, ఆ సాహిత్యవిమర్శలో సంస్కృతి అంటే ఏమిటని నిర్వచించే విషయంలో, సాంస్కృతిక కోణాన్ని ఆధ్యాత్మిక అర్థంలో నిర్వచించే విషయంలో సమస్యలు ఉన్నాయి. అట్లాగే సామాజికశాస్త్రాల స్పర్శతో సాగే ఆధునిక సాహిత్యవిమర్శలో సామాజిక, చారిత్రక, రాజకీయార్థిక కోణాలు ఎంతో కొంత కనబడవచ్చుగాని అవి సమగ్రంగానూ, ఒక మొత్తంగానూ ఉండే అవకాశం లేదు. మౌలికప్రశ్నల దగ్గరికి వెళ్లే అవకాశం లేదు.

మార్క్సిజమంటే సంవిధానమే అనే అతివాద సూత్రీకరణ చేసిన విశ్లేషకులు కూడ ఉన్నారుగాని, దానిలోని అతివాదాన్ని పక్కనపెట్టి, మార్క్సిస్టు పరిశీలనా, విశ్లేషణా, పరివర్తనా క్రమంలో సంవిధానానికి చాల ప్రాధాన్యత ఉందని గుర్తించవలసిఉంది. ఒక వస్తువును పరిశీలించడంలో, విశ్లేషించడంలో, దానిలో మార్పుకు పునాది అయిన అంశాలను గుర్తించి ఎత్తిపట్టడంలో, ఆ పరివర్తనా అంశాలను సమర్థించి వాటి భవిష్యత్తును సూచించడంలో ఇతర అన్ని దృక్పథాలనుంచి మార్క్సిస్టు దృక్పథాన్ని ఆ సంవిధానమే వేరుచేసి చూపుతుంది.

మార్క్సిస్టు సంవిధానం ఏమిటి అనే అంశంమీద గత నూటయాభైఏళ్లుగా చాల చర్చ జరిగింది, జరుగుతోంది. ప్రధానంగా రాజకీయార్థిక శాస్త్రానికి అన్వయించి జరిగిన ఈ చర్చనుంచి ఇతర శాస్త్రాలకు ఉపయోగపడే సంవిధానాన్ని రూపొందించడానికి కూడ ప్రయత్నం జరిగింది. ఆ చర్చ గురించి ఇక్కడ వివరంగా ప్రస్తావించనక్కరలేదుగాని, రూపం – సారం, నిర్దిష్టత – సాధారణీకరణ, చారిత్రక దృష్టి, వైరుధ్యాలు అనే నాలుగయిదు ప్రమేయాలు మార్క్సిస్టు సంవిధానంలో ప్రధానమయినవి. ఈ ప్రమేయాలన్నీ కూడ సాహిత్యవిమర్శకు అన్వయించగలిగినవే.

అయితే, ఆరు దశాబ్దాల తెలుగు మార్క్సిస్టు సాహిత్యవిమర్శలో ఈ మార్క్సిస్టు సంవిధానాన్ని సంపూర్ణంగా వినియోగించడం జరగలేదనే చెప్పాలి. నిజానికి సాహిత్యవిమర్శ చేసే పని, సాహిత్యాన్ని పరిశీలించడం, వివరించడం, విమర్శించడం, విశ్లేషించడం, భవిష్యత్ రచనకు మార్గదర్శక ప్రాతిపదికలు సూచించడం అని అనుకుంటే, ఆ అన్ని పనులూ చేయడానికి ఉపయోగపడే మార్క్సిస్టు సంవిధానాన్ని వాడుకోకుండా, మార్క్సిస్టు సాహిత్యవిమర్శ సాగిందంటే అది ఉండవలసినంత సమగ్రంగా లేదనే అనుకోవాలి. తెలుగు మార్క్సిస్టు సాహిత్యవిమర్శ చాలవరకు మార్క్సిస్టు సంవిధానం జోలికి వెళ్లకుండానే, అంటే, సాహిత్యవిమర్శ చేయవలసిన పనులన్నీ చేయకుండానే ముగిసిపోయింది. ఎక్కువలో ఎక్కువ పరిశీలనను, వివరణను మాత్రం చేపట్టిందిగాని విమర్శ, విశ్లేషణ, భవిష్యత్ సూచనలు జరగవలసినంతగా జరగలేదు.

రూపానికీ సారానికీ మధ్య అంతరం లేకపోతే ఒక వస్తువును విశ్లేషించడానికి శాస్త్రం అవసరమే లేదని మార్క్స్ చేసిన మౌలిక ఆలోచనాస్ఫోరక సూత్రీకరణను తెలుగు సాహిత్యవిమర్శకులలో చాలమంది గుర్తించినట్టు కనబడదు. రూపం గురించీ, సారం గురించీ తగినంత లోతులకు వెళ్లకుండానే, ఉపరిశోధనలతోనే విమర్శ రాసి, అదే మార్క్సిస్టు సాహిత్యవిమర్శ అనుకున్నవాళ్లు చాలమంది ఉన్నారు. సారం జోలికే పోకుండా రూపాన్ని తిరగరాసే సంప్రదాయం, రూపం గురించి ఎంత మాత్రం పట్టించుకోకుండా సారాన్ని వివరించే సంప్రదాయం తెలుగులో విస్తృతంగానే ఉన్నాయి. మార్క్సిస్టు సాహిత్యవిమర్శకులుగా పేరుతెచ్చుకున్నవాళ్లలో కూడ చాలమంది ఈ పనే చేశారు.

నిర్దిష్టత – సాధారణీకరణ గురించి, వాటి అంతస్సంబంధాన్ని గురించి మార్క్సిస్టు సంవిధానం చేసిన అద్భుత సూత్రీకరణలెన్నో ఉన్నాయి. స్వయంగా మార్క్స్ ఈ ప్రమేయాన్ని పరిశోధనా పరికరంగానూ, వివరణ పరికరంగానూ ఎట్లా వాడుకోవచ్చునో చెప్పాడు. తెలుగు మార్క్సిస్టు సాహిత్యవిమర్శలో ఈ అంశం పొందవలసినంత గుర్తింపు పొందలేదు. ఒక రచన అనే నిర్దిష్ట వస్తువును తీసుకుని సాధారణీకరణ ఎట్లా చేయవచ్చును, ఆ సాధారణీకరణను మళ్లీ ఎట్లా నిర్దిష్ట వస్తువులకు అన్వయించవచ్చును, అసలు సామాజిక నిర్దిష్టత సాహిత్య సాధారణీకరణగా ఎట్లా మారుతుంది, సాహిత్యంలోనూ, సమాజంలోనూ నిర్దిష్టతలకూ సాధారణీకరణలకూ ఉన్న గతితార్కికసంబంధం ఎట్లా వ్యక్తమవుతుంది అనే వైపునుంచి సాహిత్యవిమర్శ సాగిస్తే అద్భుతమైన నిర్ధారణలకు రావచ్చు.

అట్లాగే చారిత్రక దృక్పథం అనేది మార్క్సిస్టు సంవిధానంలో చాల ప్రధానమైనది. అది ఏ పరిశీలనావస్తువునైనా ఒక పూర్వరంగంలో ఉంచడానికి, దాని పుట్టుక, పెరుగుదలలను సవ్యంగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అదే సమయంలో సాహిత్యవిమర్శకు అత్యవసరమైన, సాహిత్యానికి వనరుగా నిలిచే సామాజిక, రాజకీయార్థిక, సాంస్కృతిక నేపథ్యాన్ని గుర్తించడం చారిత్రక దృక్పథం సహాయంతోనే సాధ్యమవుతుంది. తెలుగు సాహిత్యవిమర్శలో ఈ సంవిధాన పరికరాన్ని తగినంతగా వాడుకోలేదని అనిపిస్తుంది.

ఇక వైరుధ్యాలు, ఒకే వస్తువులో విరుద్ధాంశాల ఐక్యత, ఘర్షణ ప్రధానంగా తాత్విక ప్రమేయాలుగా కనిపించినప్పటికీ, ప్రకృతిలోనూ, సమాజంలోనూ, మానవమేధలోనూ జరిగే పరిణామాలన్నిటినీ అర్థంచేసుకోవడానికి ఉపయోగపడే ప్రమేయాలు అవి. ఆ ప్రమేయాల్ని సృజనాత్మకంగా ఉపయోగిస్తే, ఒక సాహిత్య రచనను ఇంకా ఎక్కువగా అర్థం చేసుకోవడమూ, చేయించడమూ సాధ్యమవుతుంది. కాని తెలుగు సాహిత్యవిమర్శలో ఈ ప్రమేయాన్ని వాడుకున్నప్పుడు యాంత్రికంగా వాడుకోవడమూ, లేకపోతే అసలే వాడుకోకపోవడమూ జరిగింది.

సమాజ సాహిత్య సంబంధాలు
మార్క్సిస్టు సాహిత్యవిమర్శలో ప్రధానశక్తి సమాజ సాహిత్య సంబంధాలను అర్థం చేసుకోవడంలోనే, వివరించడంలోనే ఉంది. మిగిలిన అన్ని సాహిత్యవిమర్శ పద్ధతులూ సమాజానికి ఇవ్వవలసినంత ప్రాధాన్యం ఇవ్వవు. సాహిత్యానికి ఇవ్వవలసిన స్థానం కన్న ఎక్కువ స్థానం ఇస్తాయి. మార్క్సిజం మాత్రమే సమాజంలోని విభిన్న పార్శ్వాలమధ్య అంతస్సంబంధాలు ఏ పద్ధతిలో రూపొందుతాయో, వాటిమధ్య ఏయే రంగాలకు ఎంత స్థానం ఉంటుందో సరిగా వివరిస్తుంది. ఎ కాంట్రిబ్యూషన్ టు ది క్రిటిక్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ ముందుమాటలో సుప్రసిద్ధమైన సూత్రీకరణలో పునాది – ఉపరితలం అనే ప్రతీకల ద్వారా మార్క్స్ ఈ అంతస్సంబంధాన్ని వివరించాడు. తర్వాతకాలంలో ఈ సూత్రీకరణకు తప్పుడు వ్యాఖ్యానాలు వచ్చినప్పుడు, స్వయంగా మార్క్స్ ఎంగెల్స్ లు, ఆ తర్వాత ఎందరో మార్క్సిస్టు సిద్ధాంతవేత్తలు, సాహిత్యవిమర్శకులు దాన్ని వివరించడానికి ప్రయత్నించారు.

ఆ చర్చ వివరాలలోకి ఇక్కడ పోనక్కరలేదుగాని, ఆ సూత్రీకరణను తెలుగు సమాజ ప్రత్యేకతకు అన్వయించి ఇక్కడ పునాది ఏమిటో, చారిత్రక క్రమంలో ఆ పునాది ఎట్లా మారుతూ వచ్చిందో, ఆ మార్పులు వివిధ ఉపరితల రంగాలలో ఎట్లా ప్రతిఫలించాయో, అవి సాహిత్యంలో ఎట్లా వ్యక్తమయ్యాయో వివరించడానికి ఎంతో అవకాశం ఉంది. ఆ దిశగా చాల తక్కువ ప్రయత్నం జరిగింది. తెలుగు సమాజ ప్రత్యేకతలు అన్నప్పుడు, ఇక్కడి సమాజంలోని కుల, మత, స్త్రీ-పురుష, ప్రాంతీయ, భాషా అస్తిత్వాల మధ్య అంతరాలు, అద్భుతమైన మౌఖిక సాహిత్య వారసత్వం, వెయ్యి సంవత్సరాలపాటు సాగిన రాజాస్థాన, మార్గ, అగ్రవర్ణ సాహిత్యం, రాజాశ్రయ సంప్రదాయానికి భిన్నంగా, సమాంతరంగా సాగిన దేశి, ధిక్కార, ప్రజా సంప్రదాయం, ఆధునికతా భావాల వల్ల రెండువందల సంవత్సరాలకింద ప్రారంభమై వేర్వేరు పాయలుగా సాగుతున్న ఉద్యమ సాహిత్యం వంటి అనేక అంశాలున్నాయి. వీటిలో ఏ ఒక్కటయినా మార్క్సిస్టు సాహిత్యవిమర్శకు గొప్ప ముడిసరుకు కాగలదు. ఆరు దశాబ్దాల మార్క్సిస్టు సాహిత్యవిమర్శా కృషి తర్వాతకూడ ఆ దృక్పథం నుంచి తెలుగు సాహిత్య చరిత్ర రచన జరగలేదంటే, సమాజసాహిత్య సంబంధాల అధ్యయనంలో తెలుగు సాహిత్య విమర్శకుల అనాసక్తి కనబడుతుంది.
సమాజ సాహిత్య సంబంధాలగురించి మాట్లాడేటప్పుడు తప్పనిసరిగా వస్తుశిల్పాల చర్చ అవసరమవుతుంది. సాహిత్యానికి వస్తువును సమాజమే సమకూరుస్తుంది. శిల్పం ఒక చారిత్రక క్రమంలో, సామాజిక పరిణామ ఉత్పత్తిగా రూపొందుతుంది. అది ప్రయోగాల ద్వారా కొత్త అభివ్యక్తిని సంతరించుకుంటుంది. అందువల్ల సమాజ సాహిత్య సంబంధాల చర్చ, వస్తు శిల్పాల చర్చ ఒకదానితో ఒకటి అవినాభావంగా సాగవలసినవే. తెలుగు మార్క్సిస్టు సాహిత్య విమర్శలో ఎక్కువభాగం వస్తుశిల్పాల చర్చ తగినంత లోతుగా, విస్తృతంగా జరగలేదు గనుక, అది సమాజ సాహిత్య సంబంధాల చర్చదాకా విస్తరించలేదు. మార్క్సిస్టు సాహిత్యవిమర్శ వస్తువును మాత్రమే పట్టించుకుంటుందనే అపోహ వచ్చేంతగా, వస్తువు మీద శ్రద్ధాసక్తులు, చర్చ, విశ్లేషణ జరిగాయి. మార్క్సిజం రూపవాదాన్ని వ్యతిరేకిస్తుందిగాని రూపాన్ని కాదు అని మార్క్సిస్టు సాహిత్య సిద్ధాంతకారులందరూ పదేపదే చెప్పిన విషయాన్ని పక్కనపెట్టి, రూపాన్ని వ్యతిరేకిస్తున్నారేమోనని అనుకునే స్థాయిలో రూపంపట్ల వ్యతిరేకత, వస్తువు మీద పూనిక కొనసాగాయి. నిజానికి, వస్తువుమీద పూనిక కూడ శిల్పం మీద పూనికతో కలిసి సాగకపోతే, అది వస్తువుకు కూడ ఏమీ మేలుచేయదు.

అటు సమాజ సాహిత్యసంబంధాల మీద తక్కువ శ్రద్ధ, ఇటు వస్తుశిల్పాల ఐక్యత మీద చిన్నచూపు కలిసి సాహిత్యానికి సంబంధించిన మరొక రెండు అంశాలపట్ల తెలుగు మార్క్సిస్టు సాహిత్యవిమర్శకు చిన్నచూపు కలిగించాయి. అవి సాహిత్యకత, తాత్వికత. ఒక సాహిత్య రచనను ఇతర రచనలతో వేరుచేసేది ఏమిటి? కరపత్రానికీ, కవితకూ తేడా ఏమిటి? ఒకటి గొప్ప ఒకటి తక్కువ అనుకోకుండానే, సాహిత్యరచనల ప్రత్యేకతను గుర్తించవలసి ఉంటుంది. ఈ చర్చలో భాగంగా సాహిత్యవిమర్శలో సాహిత్యకత అనే ఒక కొత్త భావన అభివృద్ధి అయింది. ఆ సాహిత్యకత సమాజాన్ని విడిచి సాముచేయగూడదనడం వరకూ ఫరవాలేదుగాని, అసలు సాహిత్యకత లేని రచనను సాహిత్యం గా అంగీకరించడం కష్టం. అట్లాగే, జీవితాన్ని ఉన్నతీకరించే ఒక సాధనంగా సాహిత్యం తప్పనిసరిగా తాత్వికతను తనలో భాగం చేసుకుంటుంది. సాహిత్యంలో ప్రాపంచిక దృక్పథం, తాత్వికత ఉంటాయి. మార్క్సిస్టు సాహిత్య విమర్శ కర్తవ్యాలలో ఈ సాహిత్యకతను, తాత్వికతను వెలికితీసి ప్రదర్శించడం, విశ్లేషించడం కూడ భాగమే. తెలుగు మార్క్సిస్టు సాహిత్యవిమర్శ ఈ పనిని చేయవలసినంత సమగ్రంగా చేసిందా అనేది అనుమానమే.

తక్షణ – దీర్ఘకాలిక ప్రయోజనాలు
బహుశా తెలుగు మార్క్సిస్టు సాహిత్య విమర్శ లోపాల గురించి మాట్లాడుకునేటప్పుడు, తక్షణ – దీర్ఘకాలిక ప్రయోజనాల మధ్య తేడాను విస్మరించడం ఒక ప్రధానాంశంగా గుర్తించవలసిఉంటుంది. సాహిత్యానికీ, సాహిత్య విమర్శకూ, ఆ మాటకు వస్తే ఏ ఆలోచనకైనా, ఏ ఆచరణకైనా తక్షణ, దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయి. ఆ ఆలోచనాపరులకూ, ఆ కార్యకర్తలకూ ఈ అవగాహన ఉండడం తప్పనిసరి. తమ ఊహ, తమ పని ఇవాళ్టికివాళ సాధించగలిగినదీ ఉంటుంది, ఎప్పుడో భవిష్యత్తులో సాధించగలిగినదీ ఉంటుంది. ఈ వర్తమాన భవిష్యత్తులమధ్య దూరం సమీపమైనదీ కావచ్చు, సుదూరమైనదీ కావచ్చు. కళలకూ, సాహిత్యానికీ ఐతే ఈ తక్షణ, దీర్ఘకాలాల మధ్య దూరం వేల సంవత్సరాలు కూడ ఉండవచ్చు. గుహల మీద వేటచిత్రాలు గీసుకున్న ఆదిమమానవులు తమ తక్షణ వేట అవసరంకోసమే వాటిని గీసుకుని ఉండవచ్చు. ఆ చిత్రాలు ఇవాళ్టికీ ఆదిమ చిత్రకళగా మన అనుభవంలోకి రావచ్చు. సాహిత్యకారులు కూడ తమ నిర్దిష్ట వర్తమానాన్ని అక్షరీకరించి ఉండవచ్చు, ఆ రచనలు వేల, వందలఏళ్ల తర్వాత సమాజానికి ఉపయోగపడుతుండవచ్చు, సామాజిక అనుభవాన్ని ఉన్నతీకరిస్తుండవచ్చు. సాహిత్యానికీ, సాహిత్యవిమర్శకూ ఈ చారిత్రక విహంగావలోకనాదృష్టి ఉండడం చాల అవసరం. తెలుగు సాహిత్యంలోనూ, తెలుగు సాహిత్యవిమర్శలోనూ ఈ దృష్టి కొంత తక్కువే. సద్యోరచన, సద్యోవిమర్శ ఎక్కువ. మార్క్సిస్టు సాహిత్యవిమర్శలోకి కూడ ఈ తాత్కాలికత ప్రవేశించింది.

తెలుగులో ఉద్యమ సాహిత్య సంప్రదాయం చాల ఎక్కువ గనుక, ఆయా ఉద్యమాలకు తక్షణ అవసరాలు ఉంటాయిగనుక, సాహిత్యంలో కొంతభాగం ఈ తాత్కాలిక అవసరాలు తీర్చడానికి వినియోగపడితే అర్థం చేసుకోవచ్చు. కొంతభాగం సాహిత్యవిమర్శ కూడా ఆ తాత్కాలికత అవసరాలు తీర్చడాన్ని అర్థం చేసుకోవచ్చు. కాని మొత్తంగా సాహిత్య సంప్రదాయం, సాహిత్య విమర్శా సంప్రదాయం తాత్కాలికతకు గురికావడం సమస్యలకు దారితీస్తుంది.

ముగింపు
ఈ లోపాలు గుర్తించడం తెలుగు మార్క్సిస్టు సాహిత్యవిమర్శ లోపభరితంగా ఉన్నదని చెప్పడానికి కాదు. అద్భుత ప్రజాపోరాటాలతో గొప్ప సామాజికానుభవం, ఆ అనుభవాన్ని కళలో, సాహిత్యంలో అనితరసాధ్యంగా గ్రహించిన కళా సాహిత్య సంప్రదాయం ఉన్నచోట, ఆ అనుభవానికీ, ఆ సంప్రదాయానికీ తగినంతగా సాహిత్యవిమర్శ సంప్రదాయం అభివృద్ధి చెందలేదని గుర్తించడానికి. ఇప్పటికైనా తెలుగు సాహిత్యవిమర్శకులందరూ, ప్రత్యేకించి మార్క్సిస్టు సాహిత్యవిమర్శ రంగంలో పనిచేస్తున్నవారు ఈ అంశాలమీద దృష్టి పెట్టి పనిచేయాలని గుర్తు చేయడానికి.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Reviews, Telugu. Bookmark the permalink.

One Response to తెలుగులో మార్క్సిస్టు సాహిత్య విమర్శ – పునరాలోచనలు

  1. Ajit Kumar says:

    దాదాపు 100 కు పైగా విషయాలను 25 పేరాలుగా చిత్ర విచిత్రంగా సంస్కృత పదభూయిష్టంగా అయోమయంగా సాంప్రదాయబద్ధంగా చదువరులకు విరక్తి కలిగేలా వ్రాసినట్లున్నది.తమరు 10 మెట్లు దిగి తేలిక పదములతో వ్రాయుటకు ఏమయినా అవకాశమున్నదా?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s