ప్రపంచ బ్యాంకుకు అతివిశ్వాస ప్రకటన

ప్రపంచబ్యాంకు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వానికి అందనున్న ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థా సంస్కరణల రుణం మూడవ విడత గురించి ఒక్కొక్క వివరమూ క్రమక్రమంగా బయటపడుతున్నాయి. తనకు ముందరి ఏలికను “ప్రపంచబ్యాంకు జీతగాడి”గా అభివర్ణించి, గంభీరోపన్యాసాలుచేసి అధికారపీఠం అధిరోహించినవారు మరెంత పెద్ద డిటో గా మారుతున్నారో ఆ వివరాలు రుజువుచేస్తున్నాయి.

1996 సెప్టెంబర్ లో రహస్య పత్రంగా తయారయి, 1997 జనవరిలో బహిరంగంగా వెలువడిన ‘ఆంధ్రప్రదేశ్ – ఎజెండా ఫర్ ఎకనమిక్ రిఫార్మ్స్’ అనే పత్రంద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం పైన ప్రపంచబ్యాంకు ప్రత్యక్ష పాలన ప్రారంభమయిందని ఇప్పుడు అందరికీ తెలుసు. తెలుగుదేశం ప్రభుత్వం 1995లో నియమించిన హితేన్ భయ్యా (విద్యుత్ రంగం), గంగోపాధ్యాయ (ప్రభుత్వోద్యోగులు), కె సుబ్రహ్మణ్యం (ప్రభుత్వ రంగసంస్థలు), కోనేరు రామకృష్ణారావు (విద్యారంగం) కమిటీలు, 1996 లో ప్రకటించిన ఏడు శ్వేతపత్రాలు ఆ ప్రపంచబ్యాంకు సంస్కరణల ఆదేశ పత్రానికి రంగం సమకూర్చి పెట్టగా, 1999లో వెలువడిన ‘విజన్ 2020’ ఆ సంస్కరణల క్రమాన్ని బలోపేతం చేసింది. ఇవికాక చంద్రబాబునాయుడు పాలనాకాలంలో వచ్చిన అనేక పథకాలు, వాటి రుణ ఒప్పందాలు, ఆ ఆదేశ పత్రాలు – ఆ కథ అంతా అందరికీ తెలిసిందే.

విచిత్రమేమంటే, ఆ తొమ్మిది సంవత్సరాల కాలంలో ఏయే పత్రాలనూ, విధానాలనూ అప్పటి ప్రతిపక్ష నాయకులూ, ఇప్పటి ముఖ్యమంత్రీ ప్రతిరోజూ దుమ్మెత్తిపోశారో, అవే పత్రాలనూ విధానాలనూ ప్రస్తుత ప్రభుత్వం ఔదలదాలుస్తోంది. చంద్రబాబునాయుడు ఆపివేసినచోట అందుకుని ప్రపంచబ్యాంకు, రాష్ట్రప్రభుత్వం కలిసికట్టుగా, మహోత్సాహంగా యుగళగీతం పాడుతున్నారు.

ఎంతచెడినా మరీ ఇంత దగుల్బాజీతనం ఉంటుందా, నిన్న తిట్టిననోటితో ఇవాళ పొగడడానికి అది నాలికా తాటిమట్టా అని ఎవరికైనా అనుమానం వస్తే, ప్రపంచబ్యాంకు వారి తాజా ప్రోగ్రామ్ డాక్యుమెంటు చదవండి. నివేదిక నం. 36927 – ఐ ఎన్ అని పేరు పెట్టుకున్న ఈ నివేదిక ఐ బి ఆర్ డి, ఐ డి ఎ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వానికి 225 మిలియన్ డాలర్ల (దాదాపు రు. 1100 కోట్లు) రుణం ఇవ్వడం కోసం తయారుచేసినది. ఈ పత్రం 2006 డిసెంబర్ 11 న తయారయిందిగాని “పరిమిత ప్రచారం” కొరకు మాత్రమే ఉద్దేశించబడింది. అది రాష్ట్రంలోని ఎనిమిది కోట్ల ప్రజల జీవితాలను ధ్వంసంచేయడానికి, ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలను బుగ్గి చేయడానికి వస్తున్నదిగాని అది చదివిచర్చించే అధికారం మాత్రం మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి లేదు. కనీసం తమను తాము ప్రజాప్రతినిధులమని పిలుచుకుంటున్న 294 మందికి కూడ లేదు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయార్థిక వ్యవస్థను అల్లకల్లోలం చేయనున్న ఈ ఎనబై పేజీల పత్రం గత పది సంవత్సరాలుగా రాష్ట్రంలో అమలవుతున్న ప్రపంచబ్యాంకు నిర్దేశిత సంస్కరణలను స్తోత్రం చేస్తూ మొదలయింది. సరిగ్గా ‘ఎజెండా ఫర్ ఎకనమిక్ రిఫార్మ్స్’ లాగనే, అతివిశాలమైన రాజకీయార్థిక మార్పులనుంచి, ప్రభుత్వం స్వయంగా చేయవలసిన అతిచిన్న పనులవరకూ అనేక సూచనలు, ఆదేశాలు చేసింది. ఇవన్నీ రుణంతో కలిసివస్తున్నాయిగనుక ఇవన్నీ అప్పు తీసుకుంటున్నందుకు షరతులన్నమాట.
ఆరు అధ్యాయాలు, ఆరు అనుబంధాలు ఉన్న ఈ పత్రం జాతీయ, రాష్ట్ర స్థాయిలోని ఆర్థిక, రాజకీయ పరిణామాలను చర్చించి ఆ తర్వాతి చర్చకు పూర్వరంగం సిద్ధం చేసింది. ఆ తర్వాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వ సంస్కరణ కార్యక్రమం, ప్రపంచబ్యాంకు సహాయం అనే అధ్యాయంలో చంద్రబాబు నాయుడి పాలననూ, విజన్ 2020నీ ప్రశంసించి, రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఆ సంస్కరణలక్రమాన్ని కొనసాగిస్తున్నదని కితాబు ఇచ్చింది. విద్యుత్ సరఫరా ను ప్రైవేటీకరించాలనే లక్ష్యం నుంచి కొంచెం వెనక్కి తగ్గవలసి వచ్చిందని సన్నాయి నొక్కు నొక్కి, కొత్త రుణంతో ఆ లక్ష్యంవైపు వెళ్లవచ్చునని ఆశను వ్యక్తంచేసింది.

రాష్ట్రప్రభుత్వ విధానాలవల్ల రాష్ట్రం దేశదేశాల పెట్టుబడిదారుల నోరూరిస్తున్నదని, పెట్టుబడిదారుల ప్రయోజనాలు రక్షించడంలో రాష్ట్రప్రభుత్వం అగ్రభాగాన ఉన్నదని పొగిడింది. ఈ వ్యవహారంలో రాష్ట్రప్రభుత్వం ఎంతగా పెట్టుబడిదారులకు సాగిలపడుతున్నదో నివేదిక ఎంత స్పష్టంగా రాసిందో చూడండి: “కాంట్రాక్టు కార్మికుల చట్టాన్ని సవరించి కార్మికులను పనిలో పెట్టుకోవడం, తొలగించడం సులభతరం చేసిన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ అగ్రభాగాన నిలిచింది. ఆ తర్వాత 2003లో పారిశ్రామిక వివాదాల చట్టాన్ని కూడ సవరించి కార్మికుల మార్కెట్లో ఉన్న సంకుచితత్వాన్ని రద్దుచేయదలచింది. కాని ఈ చట్టం రాష్ట్రపతి ఆమోదం పొందనందువల్ల అవే నిబంధనలను 2005లో ఆమోదించిన ప్రత్యేక ఆర్థిక మండలాల చట్టంలో భాగం చేసింది”. అంటే, మన మహా ఘనత వహించిన రాష్ట్రప్రభుత్వం, “మాకు మాకార్మికులు ఏమయిపోయినా ఫరవాలేదు, మా రాష్ట్రపతి కూడ మాకు లెక్కలేదు, సదా మీసేవలోనే మేమున్నాం” అని పెట్టుబడిదారులకు చెప్పదలిచాయన్నమాట. అలా చెప్పినందుకు ప్రపంచబ్యాంకు “ఎంత దండి బంటువో” అని వీరతాడు వేస్తున్నదన్నమాట.

విధాన పరమైన సంస్కరణలు, రాష్ట్రాన్ని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చే సంస్కరణలు, ద్రవ్య సంస్కరణలు, ప్రభుత్వరంగ సంస్కరణలు, పాలనాపరమైన సంస్కరణలు, విద్యుత్ రంగ సంస్కరణలు, పాఠశాల విద్యా సంస్కరణలు, ఆరోగ్యసేవారంగ సంస్కరణలు అని విడివిడిగా ఈ నివేదికలో ఒక్కొక్క రంగంలో తేవలసిన మార్పుల గురించి ప్రపంచబ్యాంకు ఏ ఆదేశాలు ఇచ్చిందో, వాటివల్ల ప్రజాజీవనానికి జరగబోయే హాని ఏమిటో వివరంగా చర్చించవలసి ఉంది. ఇక్కడ స్థలాభావం వల్ల ఆ చర్చ సాధ్యంకాదు గాని, ఒకటి రెండు ముఖ్యమైన విషయాలు చూడాలి.

ప్రభుత్వరంగ సంస్థల పునర్నిర్మాణంలో మొదటి రెండు దశల లక్ష్యాలు సాధించామని రాసిన నివేదిక, మూడో దశ సంస్కరణల్లో భాగంగా ఏమి చేయనున్నారో సూచించింది. “రెండో దశ సంస్కరణల్లో 27 సంస్థలను పక్కన పెట్టడం జరిగింది. వీటిలో రాజకీయంగానూ, సామాజికంగానూ ఇబ్బందికరమైన పెద్ద సంస్థలున్నాయి. వాటిలో సంస్కరణలకు ముందస్తుగా చాల పనులు చేయాలి…రానున్న రెండుమూడు సంవత్సరాలలో మిగిలిన 27 సంస్థల విషయంలో కూడ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది” అని రాసింది. ఆ రెండు సంస్థలు సింగరేణి, ఆర్టీసీ అని కొత్తగా చెప్పనక్కరలేదు. ఇక విద్యారంగ సంస్కరణల గురించి మాట్లాడుతూ చేయనున్న పనులలో పాఠశాలల నిర్వహణను విద్యాకమిటీలకు అప్పగించడం, ఉపాధ్యాయుల నిర్వహణ పద్ధతులను సంస్కరించడం, పాఠ్యాంశాలను సంస్కరించడం మొదలయినవి ఉన్నాయని సూచించింది.

ఈ నివేదికకు అనుబంధంగా అచ్చువేసిన రాష్ట్రప్రభుత్వ లేఖలో2000-01 నుంచి ఇప్పటివరకు ప్రపంచబ్యాంకు చెప్పిన పనులు ఎంత పకడ్బందీగా చేశారో, 2006-07 నుంచి 2008-09 వరకు ఇంకా ఎట్లా అమలు చేయనున్నారో పట్టికలు వేసిమరీ విశ్వాసప్రకటన చేశారు.

1956 కు ముందు హైదరాబాదు ఎప్పుడూ ఢిల్లీ పాలనలో లేదు, ఇప్పుడు ఢిల్లీకి మాత్రమేకాదు, వాషింగ్టన్ కూ సామంతుల పాలనలో ఉన్నట్టున్నాం.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Andhra Jyothy, Telugu, Vartamaanam. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s