ఒక నెమలీకకోసం అన్వేషణ – ఒకటవ భాగం

ఇరవైఐదేళ్ల తర్వాత రాజారం ప్రయాణం

అమ్మలేని ఆ ఊరిని చూడగలమా, ఆ ఊరికి మళ్లీ ఎప్పుడైనా వెళ్తామా, వెళ్లగలమా అనుకుంటూ వదిలేసివచ్చిన ఇరవైఐదుఏళ్లకు, బాపు బతికిఉన్నన్నాళ్లూ ఆయననుకూడ అటువైపు వెళ్లవద్దని కట్టడిచేసిన మాకు గత కొంతకాలంగా మా ఊరిమీదికి గాలితిరుగుతోంది. మా పుట్టినఊరు రాజారంను మళ్లీ ఒకసారి చూడాలని, మా అందరి బాల్య కౌమారాలు, అక్కయ్యలిద్దరికీ అన్నయ్యకూ యవ్వనం కూడ గడిచిన ఆ ఇంట్లో, ఆ వీథుల్లో ఒక్కసారి తిరగాడాలని మేం ఆరుగురమూ కొంతకాలంగా అనుకుంటున్నాం. మా పుట్టినింటి మీద, అక్కడి వాతావరణం మీద అంతరాంతరాలలో ఉన్న ప్రగాఢ ప్రేమను మళ్లీ ఒకసారి ప్రకటించుకోవాలనే ఆలోచన మాలో బలంగా తలెత్తి, పెరుగుతోంది. వివిధ జీవనవ్యాపారాలలో, క్షణం తీరికలేని వ్యావృత్తులలో ఉన్న మాకూ, మా కుటుంబ సభ్యులందరికీ ఒక ఆటవిడుపుగా, ఒక భావోద్వేగపూరిత ప్రయాణంగా, మా ఆరుగురికీ, మా ఆరుగురిలో కనీసం ఇద్దరి సహచరులకూ, అక్కయ్య పిల్లలు ముగ్గురికీ హృదయాంతరాళంలోని ఒక నెమలీక కోసం అన్వేషణగా, కన్నీటితడి ఆరని జ్ఞాపకాల పునర్నిర్మాణ ప్రయత్నంగా ఆ ప్రయాణం మొదలయింది.

నిజానికి మా ఆరుగురమూ మా పుట్టినఊరిలో ఉన్నది చాల తక్కువ రోజులే. మాలో ఏఒక్కరమూ మామా జీవితాలలో పావువంతు కూడ పూర్తిగా ఆ ఊళ్లో గడపలేదు. కాని అందరికీ ఆ ఊరంటే ఎనలేని ప్రేమ. ‘ప్రేమ అతి స్వల్పం, మరపు అనంతం’ అని నెరూడా అన్నట్టు మా అందరికీ ఆ ఊరితో కలయిక కాలం స్వల్పం, ఎడబాటులో జ్ఞాపకాలు సుదీర్ఘం.

ఆ ఊరిగురించిన గుర్తులు, జ్ఞాపకాలు, అనుభవాలు, స్మృతులు, గాథలు, మా అమ్మచుట్టూ, బాపుచుట్టూ అల్లుకున్న అనేక చిన్నాపెద్దా సంఘటనల ఆనంద విషాదాల తలపులు…ఒకటో రెండో కాదు, వందలూ వేలూ క్షణక్షణమూ మా ఆలోచనల్లో ఇప్పటికీ సుళ్లు తిరుగుతూనేఉంటాయి.

చాలరోజులు ఆ ఊరిపేరుకు సంస్కృతీకరణ రూపమైన రాజవరం అని వాడేవాణ్ని కాని, దానిబదులు, అందరి వాడకంలోనూ ఉన్న రాజారం అనేపేరే ఇక్కడ వాడుతున్నాను. కాని ఊళ్లో కాకతీయులనాటి చెరువు, దానిపక్కన కాకతీయ శిల్పాల శిథిల శివాలయం చూస్తే, ఆ ఊరిపేరు రాజవరం కావచ్చుననీ అనిపిస్తుంది.

రాజారం పేరు తలచుకుంటేనే, ఆ ఊరి గురించి ఏ విషయమైనా వింటేనే, ఆ ఊరికి వెళ్లే దారివైపు చూస్తేనే మా అందరికీ దుఃఖం ఆగదు. ఆ ఊరిపేరు తలచుకుంటేనే మా అందరికీ ఉద్వేగభరిత, విషాదకర, అశ్రుసిక్త, ఆర్ద్ర జ్ఞాపకాలు పోట్లెత్తుతాయి. ఇప్పటికి ఎన్నోసార్లు, ఎన్నోచోట్ల రచనల్లో రాజారం ప్రస్తావన చేశాను. దాదాపు పదిహేను సంవత్సరాలుగా నేను రాయదలచుకుని ఆలోచిస్తున్న నవలలో ప్రధానపాత్ర ఒక సంక్లిష్ట సందర్భంలో ప్రశాంత వాతావరణం కోరుకున్నప్పుడు, నేను ఊహించిన కల్పిత ప్రవాసస్థలం వాస్తవికమైన రాజారమే. అమెరికన్ సామ్రాజ్యవాద దుర్మార్గానికి పదవీచ్యుతుడయిన సద్దాం హుస్సేన్ తన ప్రవాసంగా ఎంచుకున్న స్థలం పుట్టినఊరు తిక్రిత్ అని విన్నప్పుడు నావరకు నాకు ఈ పుట్టిన ఊరికి తిరుగుప్రయాణం ఒక కవితాన్యాయం అనిపించింది.

అంతగా ప్రేమించే మా రాజారాన్ని మేం ఎందుకు వదిలేశాం? అది హృదయాన్ని బద్దలుచేసిన అనుభవం. మా అమ్మను పోగొట్టుకున్నప్పుడే మేం మా ఊరినీ పోగొట్టుకున్నాం.

ఇరవైఐదేళ్లకింద సంక్రాంతికి కొంచెం అటూఇటూగా అమ్మకు తీవ్రంగా జబ్బు చేసింది. అప్పటికి చాల ఏళ్లుగా అమ్మ ఎప్పుడూ ఏదో నలతతోనే ఉంటోందిగాని, ఈసారి అనారోగ్యం మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉండింది. మొదట అది ఒళ్లంతా ఎర్రటి దద్దులుగా వచ్చింది. అప్పటికి దశాబ్దాలుగా బాధిస్తున్న కీళ్లనొప్పులు, తలనొప్పి, కుడిచేతినొప్పి సరేసరి. అప్పటికి వరంగల్ లో మంచి డాక్టర్లుగా పేరున్నవాళ్లందరూ అమ్మను చూశారు. అమ్మకు అప్పటికే ఉన్న రుమటాయిడ్ ఆర్తరైటిస్ వల్లనే ఆ ఒంటి నొప్పులు వచ్చాయని అనుకున్న డాక్టర్లు దానికోసం చికిత్స మొదలుపెట్టారు. కోతిపుండు బ్రహ్మరాక్షసి లాగ రోజురోజుకూ అమ్మ సుస్తీ పెరిగిందిగాని తగ్గలేదు. ఒక జబ్బు అనుకుని ఇచ్చిన మందులు మరొక జబ్బును తీసుకొచ్చాయి. చివరికి ఎంజిఎం ఆస్పత్రిలో చేర్చవలసి వచ్చింది. ఆ ఆస్పత్రిలో పదిరోజులు ఉన్నతర్వాత మార్చి 14 తొలివేకువజామున అమ్మ కన్నుమూసింది. జనవరి రెండోవారంలోనో, మూడోవారంలోనో రాజారం వెళ్లి అమ్మను హనుమకొండ తీసుకొచ్చినవాణ్ని, మరొక రెండునెలలకు ఎంజిఎం ఆస్పత్రిలో నా చేతులమీదనే పోగొట్టుకున్నాను. ఆ 1981 మార్చి 13 రాత్రి ఒక రాక్షసరాత్రి. ఆ రాత్రి ఆ ఆస్పత్రిలో అమ్మ అనుభవించిన బాధనూ, ఆ బాధ తగ్గించడానికి ఏమయినా చేయమని అడుగుతుంటే ఏమీ చేయలేకపోయిన నా నిస్సహాయతనూ, ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యాన్నీ, అమ్మ ఆఖరి శ్వాసనూ, అమ్మ వెళిపోయినవార్తను అందరికీ చెప్పవలసివచ్చిన నా దౌర్భాగ్యాన్నీ నేను ఎప్పటికీ మరచిపోలేను.

అమ్మ పార్థివశరీరాన్ని ఏ పదకొండుగంటల వేళకో హనుమకొండ కుమార్ పల్లిలో అక్కయ్య ఇంటికి చేర్చాం. స్వగ్రామం రాజారం తీసుకుపోవాలనుకోకుండా కిరాయ ఇల్లయినా సరే అక్కయ్య ఇంటికి తీసుకుపోవాలని ఎందుకు అనుకున్నామో తెలియదు. బాపు రాజారంనుంచి ఏడుస్తూ ఉరుకులు పరుగులమీద హనుమకొండ చేరాడు. హైదరాబాదునుంచి రావలసిన చిన్నక్కయ్య, బావ, అన్నయ్య, రజని, రాహీ మధ్యాహ్నానికి చేరారు. అది అందరికీ ఒక ఊహించని, తట్టుకోలేని ఉత్పాతం. అశనిపాతం. దిగ్భ్రాంతి. భరించలేని దుఃఖం. ఎవరికీ ఆలోచించడానికి ఏమీ మిగలలేదు. అమ్మను రాజారం తీసుకుపోదామని, అంతిమసంస్కారం అక్కడే చేద్దామని బాపుకు ఉండిందేమో తెలియదు. యాభైఐదు ఏళ్ల జీవితంలో దాదాపు నాలుగు దశాబ్దాలు ఆమె సంసారం చేసిన, ఎంతోమందికి తలలో నాలుకగా, అన్నపూర్ణగా, అన్నదాతగా, ఆపన్నహస్తంగా, పెద్దదిక్కుగా ఉండిన ఆ ఇంటికీ, ఆ నేలమీదికీ తీసుకుపోవాలని ఎవరమూ అనుకోలేదు. ఆనేలతో ఆమె అనుబంధాన్ని మృత్యువు మాత్రమే కాదు, ప్రకృతి మాత్రమే కాదు, ఆమె కడుపునపుట్టిన పిల్లలం మేం ఆరుగురం కూడ హఠాత్తుగా తెంచేశాం. ఎవరో రాజారం తీసుకుపోదాం అని అంటే కూడ మా దుఃఖాతిశయంలో వద్దువద్దనే అన్నాం. నిజానికి, హనుమకొండతో ఆమెకూ మాకూ ఏ సంబంధం లేకపోయినా, ఆ దహనవాటికలో మరొక వారానికే ఏ గుర్తూ మిగలదని తెలిసినా, అక్కడే దహనం చేయాలని నిర్ణయించుకున్నాంగాని, ఆమె తిరుగాడిన నేలలో, ఒక స్మారక చిహ్నానికి అవకాశంఉన్న నేలలో దహనంచేద్దామని అనుకోలేదు. కాకతీయుల తొలిరాజధాని పక్కన, పద్మాక్షమ్మ గుట్ట కింద కుంట పక్కన అమ్మ పార్థివ శరీరాన్ని దహనం చేసిన చోటును ఆ తర్వాత మూడునాలుగేళ్లు వెళ్లిచూసేవాణ్నిగాని, ఇప్పుడక్కడ అప్పటిలాగ ఖాళీస్థలమేమీ లేదు. మార్వాడీలు కట్టించిన ఒక అత్యాధునిక శ్మశానవాటిక, చుట్టూ భవనాలు నిండిపోయాయి. అమ్మను కట్టెలపరుపుమీద చివరిసారి పిలిచీ పిలిచీ, చివరిసారి ముద్దుపెట్టుకున్నచోటు ఇదని గుర్తుపట్టేవీలేలేదు.

అట్లా ఒక ఉద్విగ్న సందర్భంలో, అమ్మలేని రాజారానికి పోయే ప్రశ్నేలేదు అనే ఒక అర్థంలేని మూర్ఖపు నిర్ణయం పుట్టి పెరిగి మమ్మల్ని శాసించడం మొదలుపెట్టింది. అమ్మ జ్ఞాపకాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఆమె జీవితంలో అతి ఎక్కువ కాలం గడిపిన ఆ ఇంటికి వెళ్లి వాటిని పునర్నిర్మించుకోవలసిఉంటుందని ఆలోచించేబదులు, అసలు ఆ జ్ఞాపకాలను తలచుకుని భయపడే ఒక విచిత్ర మానసికస్థితికి ఆమె పిల్లలమందరమూ లోనయ్యాం. మేం ఆ ఊరికి పోదలచుకోకపోవడంమాత్రమేకాదు, ఆ ఊరిని ఎంతో ప్రేమించి, అన్నతో కొట్లాటలో ఆ ఊరినే ఎంచుకుని అక్కడే తనంతట తను స్వయంకృషితో ఇల్లు, ఆస్తి సంపాదించుకున్న బాపును ఆ ఊరికి వెళ్లవద్దని నిర్బంధించడం మొదలుపెట్టాం. ఆయన ఒక ఐదారు సంవత్సరాలు చెప్పీ చెప్పకా పోయివస్తూ, మా వ్యతిరేకత అర్థమై, ఇక రాజారం మీద మమకారం వదులుకున్నాడు. రాజారంలో పోయింది పోగా మిగిలిందేదో అడ్డికిపావుసేరు లెక్కన అమ్మి వలసపక్షి అయిపోయాడు. రాజారం పాత ఊరికి బైట, చుట్టూ పది ఎకరాల చెలకలో నెల్లుట్ల వరవరరావు స్వయంగా కట్టుకున్న ఇల్లు, మారెపల్లి ప్రభాకరరెడ్డి ఆస్తి అయిపోయింది. నీళ్లు పడితే ద్రాక్ష తోట పెంచాలని, కూరగాయల తోట పెంచాలని, ఎన్నో వ్యవసాయ ప్రయోగాలు చేయాలని కలలు గన్న బాపు, ఒకదానితర్వాత ఒకటిగా ఆ చెలకలో ఐదారు బావులుతవ్వినా ఆ రాళ్ల రాజారంలో నీళ్లు పడక, ఇంటిచుట్టూ తుమ్మలబీడుగా మారిన ఆ చెలక మరొకరిదైపోయింది. తర్వాత ఆయన బతికిన పది సంవత్సరాలూ రాజారం ఆయన హృదయంమీద రక్తాశ్రువులు చిప్పిల్లే పచ్చిగాయంగానే ఉందనుకోవాలి.
బాపు చనిపోయినప్పుడుగాని మాకు లోలోపల రాజారంతో ఎంత అనుబంధం ఉందో, రాజారం కోసం మేం ఎంత తపించిపోతున్నామో, రాజారం వెళ్లాలని ఎంత ఉవ్విళ్లూరుతున్నామో అర్థంకాలేదు. నిద్ర కోసమని దామన్నమామయ్య పెండ్యాల తీసుకుపోతే, భయపడుతూ భయపడుతూ ఒక గంటకోసమో, రెండుగంటలకోసమో రాజారం వెళ్లాం. అప్పటికే ఆ ఇంట్లో ఎవరూ ఉండడంలేదు. కిషన్ పది, పదకొండు సంవత్సరాలు ఆ ఇంట్లో ఉండి, సొంత ఇల్లు కట్టుకుని వెళ్లిపోయాడు. బాపు ప్రయత్నించిన వైపు కాకుండా, చెలకలో మరొక వైపు (నైరుతి మూలన, వడ్డెరగూడెం వైపు) ప్రభాకర్ రెడ్డి తవ్వించిన బావిలో విపరీతంగా నీళ్లు పడ్డాయి. దానికి మోటర్ పెట్టి మంచి తోట పెంచాడు. ఇల్లు బావురుమంటోందిగాని, చుట్టూ తోట, నిండా మామిడి మొక్కలతో, ఇతర పండ్ల, పూల చెట్లతో పచ్చపచ్చగా ఉంది. చిన్నప్పుడు ఎంతో పెద్దగా అనిపించిన అరుగు, మన్సాల, అర్ర, వంటిల్లు, ఇంటిముందరి వాకిలి, ఇంటెనుకపెరడు అన్నీ కూడ చిన్నచిన్నగా అనిపించాయి. అవ్వ ఇల్లు తీసేశారు. ఇంటి ముందర చిన్న అరుగు, వాకిలి కలిపేశారు. ప్రహారీ గోడకు ముందరివైపు ఉన్న కిటికీ మూసేశారు. ఇంటిముందర వేపచెట్టు కొట్టేశారు. పైకప్పు కుమ్మరిగూనపెంకులు తీసేసి, బెంగళూరు గూన పెంకులు వేశారు. బంగ్లామీద అర్రలో తూర్పువైపు కిటికీ మూసేశారు. ఇంటి ప్రహరీ ముందర బొడ్డుమల్లెచెట్టు కూడ కొట్టేశారో, చచ్చిపోయిందో గాని లేదు. అప్పటికి పదిహేడు సంవత్సరాలుగా చూడకపోయినా, మా కంటిపాపలమీద ఎప్పుడూ చెరిగిపోని మా ఇంటిరూపం చాల మారిపోయింది. అందరమూ ఏడుస్తూ, ఒక్కొక్క అర్రా తిరుగుతూ, ఏడుస్తూ, ఒక గంటో రెండు గంటలో అక్కడ గడిపి, కిషన్ ఇంటికివెళ్లి మక్కజొన్నకంకులు తిని, చాయలుతాగి వచ్చేశాం. ఊరంతా తిరిగి చూడాలని, బాపు వ్యవసాయం తొలిరోజుల్లో మోటబావికింద బాగా సాగిన పుట్టిమునగల్లకూ, ఆ తర్వాత మోట బావికింద బాగా సాగి, డీజెల్ పంప్ సెట్ తో, లాండ్ మార్ట్ గేజ్ బ్యాంకు అప్పుతో చితికిపోయిన తాళ్లల్ల పొలందగ్గరికీ వెళ్లాలని ఎంత ఉన్నా, అవేవీ జరగలేదు. పదిహేడేళ్ల ప్రవాసంతర్వాత ఆ రాజారం ప్రయాణం భయంభయంగా, అర్థమనస్కంగా, అన్య మనస్కంగానే సాగింది.

(…ఇంకా ఉంది)

– ఎన్ వేణుగోపాల్ , అక్టోబర్ 1 – 18, 2006

( ఒకటవ భాగం | రెండవ భాగం | మూడవ భాగం )

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Anveshana, Telugu. Bookmark the permalink.

6 Responses to ఒక నెమలీకకోసం అన్వేషణ – ఒకటవ భాగం

 1. radhika says:

  మీరు ఈ టపా కావాలనే ఈ రోజు పోస్ట్ చేసారా?ఈ రోజు మార్చ్ 14.

 2. cbrao says:

  స్వగ్రామము వెళ్ళటానికి భయమెందుకో స్పష్టంగా లేదు.

 3. వ్యక్తీకరణ విశదంగా చాలా బావుంది. కాని ఒక చిన్న సందేహం. తెలుగులో “ఒకటవ” అనొచ్చునా ? “మొదటి” అని కదా అనాల్సింది ?

 4. తా.బా.సు. గారూ!

  “ఇది ఒకటో నంబరు బస్సు” అనే పాపులర్ పాటలోనూ, “ఒకటో స్సారి…రెండో స్సారి…” అంటూ సాగే వేలం పాటల్లోనూ వినిపించేది “ఒకటవ” రూపాంతరమే కదా?

 5. మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్‌గారు రేడియోలో బాలానందం కార్యక్రమంలో ఈ సంగతి చెప్పారు. ఆయన ఒకసారి పాకిస్థాన్‌లో ఒక టాక్సీలో ప్రయాణిస్తూండగా డ్రైవర్‌ మాటలు మొదలెట్టాడట. ఈయన ఎవరో తెలుసుకొని, హిందీ సినిమా కళాకారుల గొంతులను అనుకరించమని ప్రాధేయపడి, ఎంతో ఆనందంగా విని, మరెంతో మెచ్చుకొని చివరగా ఆ డ్రైవర్ చెప్పాడట – “మహాశయా, నేనెంతో ఆనందించాను. ప్రతిఫలంగా మీకేదీ ఇవ్వలేను. ఒక్క మాట మాత్రం చెబుతాను. గుర్తుంచుకోండి. ఉర్దూలో ఒక సామెతుంది – నిన్ను ఓదార్చేవాడిదగ్గర మాత్రమే ఏడ్చు – అని. ” వేణుగోపాల్‌గారూ, ఇక్కడి వ్యాఖ్యలు చూసి నాకిది గుర్తొచ్చింది.

 6. venkatesham says:

  this comment is so good keep it up…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s