ఒక నెమలీకకోసం అన్వేషణ – రెండవ భాగం

ఇరవైఐదేళ్ల తర్వాత రాజారం ప్రయాణం

అప్పుడు రాజారం పోయివచ్చినప్పటినుంచీ, రాజారం మా అందరి ఆలోచనలను మరింత ఎక్కువగా ఆక్రమించడం మొదలుపెట్టింది. రాజారానికి తిరిగివెళ్తే ఎట్లా ఉంటుందనీ, అమ్మ-బాపుల జ్ఞాపకంగా తిరిగి ఇల్లయినా ప్రభాకరరెడ్డి నుంచి వెనక్కి తీసుకుంటే ఎట్లాఉంటుందనీ ఆలోచనలు మొదలయ్యాయి. ఆ ఆలోచనలు ఎట్లా ఉన్నా, కనీసం అందరమూ తీరిగ్గా రాజారం వెళ్లాలనీ, ఆ ఇంట్లో, అమ్మ, బాపుల జ్ఞాపకాలు నెమరువేసుకోవాలనీ అనుకున్నాం. సరిగ్గా సద్దుల బతుకమ్మ నాడు రాజారం చేరి చెరువు దగ్గరికి వెళ్లి బతుకమ్మ కూడ ఆడాలని అక్కయ్యలు, రజని, పిల్లలు నిర్ణయించుకున్నారు. వీలయితే పుట్టిమునగల్లకూ, కరెంటుబంగ్లాకూ ఇంటికీ మధ్యన ఉన్న గుట్టలబండలదగ్గరికీ, బోడుదగ్గరికీ, చిల్పూరుగుట్టకు కూడ వెళ్ళాలని అనుకున్నాం. ఒకరకంగా మా బాల్యస్మృతులనూ, మాచిన్ననాటి విహారస్థలాలనూ పునర్జీవించాలనుకున్నాం. ఆ ప్రయాణ ప్రయత్నాలు మొదలయినప్పటినుంచీ మాలో చెప్పరాని ఉద్వేగం, పిల్లల్లో బోలెడంత కుతూహలం, ఉత్సాహం. ఎన్నో ఆలోచనలు, ప్రణాళికలు…

సెప్టెంబర్ 30 మధ్యాహ్నం భోజనాలవేళకు అందరమూ రాజారం చేసుకున్నాం. ఇల్లు ఎనిమిదేళ్లకింద మేం చూసినప్పుడు ఎట్లాఉందో ఇప్పుడూ అట్లాగేఉంది. బహుశా ఇంకా కొంచెం పాతబడి, ఇంకా కొంచెం ఎక్కువ బావురుమంటోందేమో! ఈసారి అందరికీ చెప్పి, అన్ని ఏర్పాట్లూ చేసుకునిపోయాం గనుక ఇల్లు శుభ్రం చేసిఉంది. ఇంట్లోకి అడుగుపెట్టగానే అందరికీ దుఃఖం ముంచుకొచ్చింది. ఇంట్లో అడుగడుగూ చూస్తూ ఆ స్థలానికి సంబంధించిన జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ మార్పులను లెక్కిస్తూ ఒక్కొక్క అర్రా తిరిగాం. బంగ్లాపైకి ఎక్కి అక్కడి విషాద మధురస్మృతులను తలచుకున్నాం. ఏ ముప్పై ఏళ్లకిందనో పండుగలకో, ప్రభోజనాలకో, తద్దినాలకో మన్సాలలో అందరమూ వరుసగా కూచునితిన్న జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ అందరమూ కూచుని భోజనాలు చేశాం. నిజంగానే మళ్లీ ఆ రోజు కూడ పండుగే, సద్దులు. చాలీ చాలకుండా గడిపిన ఆ చివరి రోజుల్లో కూడ అమ్మ సద్దుల రోజు తొమ్మిది రకాల అన్నాలు – ఓరలు – వండేది. ఆ స్మృతులతోనే అందరూ తలా ఒక వంటకం తేగా మళ్లీ సద్దులభోజనాలు జరిగాయి.

మేం ఇల్లు చేరామో లేదో చాకలి లచ్చమ్మ వచ్చింది. మేర వినోద వచ్చింది. కిషన్ సరేసరి. కాసేపటికి హనుమకొండ నుంచి ప్రభాకర్ కూడ వచ్చాడు. మాదిగ ఎడ్ల కొమరయ్య కొడుకు యాదగిరి వచ్చాడు. బావండ్ల వెంకన్న వచ్చాడు. పాత రోజుల్లోలాగనే ఎలకర్రలు పట్టుకుని ఎలవాళ్లు వచ్చారు. తెలిసినవాళ్లూ, తెలియనివాళ్లూ ఎంతోమంది వస్తూనే ఉన్నారు.

మేం చదువుకున్నప్పటికీ ఇప్పటికీ బడి చాల మారిపోయింది. మార్పు చాల సహజమూ, అనివార్యమూ కావచ్చుగాని, గత జ్ఞాపకానికీ వర్తమాన వాస్తవానికీ పోల్చి చూస్తున్నప్పుడు ఒక సాక్షి-వ్యాఖ్యాత పొందే అనుభూతి బహుశా అనిర్వచనీయమైనది, అపూర్వమైనది. ఆ అనుభూతిలో ఒక ఆశ్చర్యం, ఒక ఆనందం, ఒక దుఃఖం, ఒక అపనమ్మకం, ఒక దిగ్భ్రాంతి, ఏదో కోల్పోయిన భావన, తనకు తెలియని, తాను తెలుసుకోలేని ఏదో పరిణామం జరిగిపోయిందనే భావన, తనకూ తన ఎదుటి వస్తువుకూ మధ్య దూరం పెరిగిపోయిందనే భావన వంటి ఎన్నో భావాలు ముప్పిరిగొనిఉంటాయి.

ఉదాహరణకు మా బడిని చూడగానే కొట్టవచ్చినట్టు కనబడే విషయాలు – మా చిన్నప్పుడు అప్పుడప్పుడే నాటుకుని పెరుగుతూ మాచేతికందేంత ఎత్తు ఉండిన దిరిశెనచెట్టు ఇప్పుడు తాటిచెట్టుకన్న ఎత్తు పెరిగి మహావృక్షంలా మారింది. మాచిన్నప్పుడు బడి ముందర, హెడ్ మాస్టర్ కూచునే, ఐదోతరగతి జరిగే గది ముందు ఉండిన చిన్న తోట, మధ్యలో పెద్ద గన్నేరుచెట్టు, దానిచుట్టూ వృత్తాకారంలో క్రోటన్లు (అప్పుడు వాటిని ఏదో పేరుతో పిలిచేవాళ్లం – వాటికి చిన్నచిన్న ఎర్రని మొగ్గలు ఉండేవి, అవి తుంచుకుని తింటే దాంట్లో ఒక్కచుక్క పూదేనె ఉండేది), అక్కడ ఇసుకకుప్పలో ఆకుదాచి కనిపెట్టే తుడుం అనే ఆట…ఎన్నో ఉండేవి. ఆ తోట ముందర ఒక పెద్ద బొడ్డుమల్లెచెట్టు ఉండేది. పొద్దున్నే బడికివచ్చేవరకు అక్కడ నేలంతా ఆ పూలు పరుచుకుని ఉండేవి, లేదా చెట్టు కాండం పట్టుకుని ఊపితే పూలు జలజలా రాలేవి. ఇప్పుడా పచ్చదనమంతా మాయమయిపోయింది. అక్కడ ఒక సభావేదిక అరుగు కట్టారు. అప్పుడు మేం కబడ్డీ ఆడుతుండిన చోట ఇప్పుడు కొత్తగా మూడు గదులు వచ్చాయి. అన్నిటికన్న విచిత్రం అప్పుడు ఎంతో ఎత్తు అనిపించిన బడి అరుగులు ఇప్పుడు చాల కిందికిఉన్నట్టు అనిపించాయి. అప్పుడు మేం గుంజలాట ఆదుకుంటూ ఉండిన బడిగుంజలు అట్లాగే ఉన్నాయి. అప్పుడు బడినుంచి ఇల్లు కనబడుతూ ఉండేది, దూరంగా ఉన్నట్టనిపించేది. ఇప్పుడు కనబడడం లేదు గాని దగ్గరగా ఉన్నట్టనిపిస్తోంది. కొంత పాత కనబడకుండాపోయింది. కొంత కొత్త వచ్చిచేరింది. తెలిసినది కొంత లేదు, తెలియనిది కొంత ఉంది.

బడి దగ్గరికి పోయినప్పుడు ముప్పైనాలుగేళ్లవెనుక ఆ ఆవరణలో గడిపిన క్షణాలు, రోజులు, సంవత్సరాలు గుర్తొచ్చి దుఃఖం ఆగలేదు. నిజానికి ఆ బడిలో చదివినవి ఐదు సంవత్సరాలేగాని అవి ఎప్పటికీ మరపుకురావు. ఒకటో తరగతిలో, రెండో తరగతిలో బడికిపోనని మొండికివేస్తుంటే, బాపు చింతబరిగె పట్టుకుని నన్ను తరుముతూ బడికి చేర్చిన దృశ్యం మనసుమీదినుంచి ఎట్లా చెరిగిపోతుంది? రెండో తరగతిలో ఉన్నప్పుడు ఒక హస్త సాముద్రికుడు బడికివస్తే పెద్దన్నయ్య (నెల్లుట్ల వెంకటేశ్వర రావు – మా పెదబాపు కొడుకు, రాజారం బడికి చాలరోజులు హెడ్ మాస్టర్) రెండు రూపాయలు ఇచ్చి మొత్తం బడిపిల్లలందరికీ జ్యోతిష్యం చెప్పించాడు. ఎట్లాగూ దొరకొడుకుగదా, భవిష్యత్తు బాగుండకపోతుందా అని ఆ హస్తసాముద్రికుడు నా చెయ్యి చూసి, ‘మహర్జాతకుడు, పెద్దపెద్ద చదువులు చదువుతాడు, దేశాలు ఏలుతాడు, దేశదేశాలు తిరుగుతాడు’ అని చెప్పిన జ్యోతిష్యం ఎప్పుడూ గుర్తొచ్చి, వాటిలో ఒక్కటి కూడ నిజం కాలేదనితెలిసి నవ్వు వస్తూ ఉంటుంది. చిన్ని గుర్తు చేసుకున్నట్టు, తన రాజారం చదువు అయిపోయేటప్పుడు ‘పెదసారుమామయ్య’ దద్దులు తేలేట్టు తొడపాశం పెట్టడం, అమ్మ ఆయనను ఇంటికిపిలిచి కోప్పడడం – ఎప్పటికైనా మరిచిపోలేని విషయాలెన్నిఉన్నాయో!

నిజానికి ఆ బడి వచ్చినదే బాపువల్ల. ఇప్పుడక్కడ ఆ ప్రస్తావనే లేదుగాని, బాపు ఉచితంగా స్థలం ఇచ్చినందువల్లనే ఆబడి నిర్మాణమయింది. పెద్దక్కయ్య పెండ్యాలలో చదువుకుని కష్టపడుతున్నదని, మిగిలిన పిల్లలకయినా ఆ కష్టం ఉండొద్దని బాపు బడికట్టడానికి స్థలం ఉచితంగా ఇచ్చాడు. అందులోనూ ఇప్పుడు బడిఉన్న స్థలం ఎవరో మాదిగవాళ్లదయితే, వాళ్లకు అంతేస్థలం వేరేచోట ఇచ్చి, ఈ స్థలం తానుతీసుకుని అది బడికోసం ఇచ్చాడు.

ఊళ్లో కొట్టవచ్చినట్టు కనబడిన విషయాలు ఇంకా చాల ఉన్నాయి. బస్సు ఆగేదగ్గర ఆంజనేయుల విగ్రహం స్థానంలో పక్కా గుడి వచ్చింది. ఆ విగ్రహం మీద కప్పుగా ఉండిన రావిచెట్టు అట్లాగే ఉందిగాని, అక్కడి పెద్ద చీమచింతచెట్టు పోయింది. అక్కడ ఒకప్పుడు శాల వీరం ఒకవైపు వైద్యంచేస్తూ, మరోవైపు హోటల్ నడిపితే నడవలేదుగాని, ఇప్పుడు కనీసం నాలుగు చాయ, టిఫిన్ల హోటళ్లున్నాయి. ఒక హోటల్ లోపలికి మాదిగ యాదగిరి సులభంగానే పోయివస్తున్నాడు. ఊళ్లో ఇంతకుముందు సన్నటి సందుగా ఉండిన పానాది – ఊరి రహదారి – ఇప్పుడు సిమెంటు రోడ్డు అయిపోయింది. ఇదివరకు కనీసం మూడుచోట్ల మలుపులు ఉండే ఆ తోవ ఇప్పుడు సిమెంటురోడ్డు కావడంవల్లనో ఏమో ఆ మలుపులన్నీ పోయాయి. అబ్బాసలీ ఇంటిపక్కన పెద్దమానుచెట్టు అనిమేం పిలుస్తుండిన పెద్దచెట్టు లేదు. వడ్ల బ్రహ్మయ్య ఇల్లు కనబడకుండాపోయింది. ఇదివరకు ఎత్తున ఉన్నట్టనిపించే మారెపల్లి వాళ్ల ఇళ్ల వరుస పాతబడి కూలిపోతున్నట్టుగా ఉన్నాయి. ఒకప్పుడు దర్పంగా నిలిచిఉండే నారాయణరెడ్డి ఇల్లూ, బంకులూ అంతే. పక్కన పోస్టుమాస్టర్ రమణారెడ్డిగారిల్లు కూలిపోయి ఆయన కళ్లుకనబడని స్థితిలో ఒంటరిగదిలో ఉంటున్నారు. పెద్దపెద్ద బంకులన్నీ శిథిలాలలాగ ఉన్నాయి. బొడ్రాయి, అక్కడ కచ్చీరు అట్లాగేఉన్నాయిగాని అటునుంచి పాగాల వాళ్ల ఇళ్లవైపు తిరిగితే మళ్లీ శిథిలగృహాలే. అమృతమ్మ ఇల్లు అనీ, కుట్టుసెంటర్ అనీ తెలిసిన ఇల్లు పాటకులమీద ఒత్తుగా బఠానీ తీగ పారిఉండేది. అదంతా పోయింది. ఆ పక్కన పాగాలవాళ్ల ఇల్లుకూడ చీకటికొట్టులాగ ఉంది. బాపుకు బాల్యమిత్రుడు, ఒక్కరోజుకూడ కలవకుండా ఉండని గోపాలరెడ్డి ఇల్లు కూలిపోతున్నట్టుగా ఉంది.

కొన్ని ఇళ్ల శైథిల్యానికి సమానంగా కొట్టవచ్చినట్టుగా కనిపించిన మరో విషయం ఊరంతా పచ్చపచ్చగా ఉండడం. ఎక్కడచూస్తే అక్కడ చెట్లూ చేమలూ, పచ్చనిపొలాలూ, కనుచూపు ఆనినంతమేరా పచ్చదనం – ఒకప్పుడు రాళ్లరాజారం గా పిలిచిన ఊరేనా ఇది అని ఆశ్చర్యం కలిగింది. గత రెండు సంవత్సరాలుగా మంచికాలం కావడంతో, ఊరికి రెండు వైపులా వాగులుపొంగిపొర్లడం, చెరువు మత్తడి పడడంతో ఊరు పచ్చపచ్చగా ఉంది. ఊళ్లో దేవాదుల ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. గణపురం చెరువునూ, రాజారం చెరువునూ కలిపి పెద్ద ప్రాజెక్టుగా మార్చబోతున్నారని తెలియడంతో అందరి ముఖాల్లోనూ కొంచెం ఆశ, కొంచెం కోరిక, కొంచెం వెలుగు కనబడుతున్నాయి.

ఇక రాజారంలో మనుషుల ఆప్యాయత గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే. అది మనిషిమీద, మానవసంబంధాల ఉదాత్తత మీద, ఔన్నత్యంమీద గొప్ప ఆశనూ నమ్మకాన్నీ కలిగించిన మహత్తర సందర్భం. మేం వచ్చామని తెలియగానే ఎందరెందరో వచ్చారని, వస్తూనే ఉన్నారని ఇదివరకే చెప్పాను. కొందరిగురించయినా వివరంగా చెప్పాలి. బాపు రాజారం వచ్చి సొంత వ్యవసాయం పెట్టినప్పటినుంచీ తనకు పెద్ద జీతగాడుగా ఉన్న ఎడ్ల పోచయ్య ఏడుస్తూ పరుగెత్తుతూ వచ్చాడు. అప్పటికే ఎడ్లకొమరయ్య కొడుకు యాదగిరి వచ్చి ఉన్నాడు, తనే వాళ్ల చిన్నాయనకు మేం వచ్చి ఉన్నామని చెప్పంపాడు. బాపు వాళ్లు అంత ఆచారపరాయణులే గాని ఆశ్చర్యంగా ముగ్గురన్నదమ్ములూ ముగ్గురు మాదిగ అన్నదమ్ములను తమజీతగాళ్లుగా పెట్టుకున్నారు. కొమరయ్య పెదబాపుకూ, పోచయ్య బాపుకూ, వెంకటమల్లయ్య చినబాపుకూ జీతగాళ్లుగా ఉండేవారు (ఆ ‘అజ్ఞానపుటంధయుగంలో’ మాకంటె వయసులో చాల పెద్దవాళ్లయిన ఆ ముగ్గురినీ ఏకవచనంలో మాత్రమేకాదు, తిరస్కారవచనంలో పిలిచేవాళ్లం. పోచయ్యనయితే పోషిగా అని పిలుస్తుండేవాళ్లం). అస్పృశ్యత ఇంటిలోపలి పనులకూ, ముఖ్యంగా వంటింట్లోకీ ఉండేదేమోగాని, వేరేపనుల్లో అంత కచ్చితంగా ఉండేదికాదు. పోచయ్య భార్య ఎల్లమ్మ ఇంటి అరుగుమీద కూచుని బియ్యంచెరుగుతుండే దృశ్యం గుర్తుకొస్తూనే ఉంది.

(…ఇంకా ఉంది)

– ఎన్ వేణుగోపాల్ , అక్టోబర్ 1 – 18, 2006

( ఒకటవ భాగం | రెండవ భాగం | మూడవ భాగం )

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Anveshana, Telugu. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s