ఒక నెమలీకకోసం అన్వేషణ – మూడవ భాగం

ఇరవైఐదేళ్ల తర్వాత రాజారం ప్రయాణం

పోచయ్య అక్కయ్య పుట్టుకనాటినుంచీ బాపుకూ తనకూ ఉన్న సంబంధాన్ని, బాపు తనపట్ల కనబరచిన నమ్మకాన్ని, ప్రేమను తలచుకుని చెపుతూ ఏడుస్తూ ఉండిపోయాడు. అమ్మచనిపోవడానికి ఐదారేళ్లముందే వ్యవసాయం కుప్పకూలింది గనుక జీతగాడి అవసరమే లేకపోయింది. అంటే పోచయ్యతో మా ఇంటి సంబంధం తెగిపోయి దాదాపు ముప్పైఏళ్లయి ఉంటుంది. కాని ఆ మూడు దశాబ్దాల వెనుకటి కథలనూ గాథలనూ పోచయ్య నిన్నమొన్నటి సంగతులలాగ తవ్విపోస్తున్నాడు.

ఎడ్ల యాదగిరి అయితే మేం ఊరు వదిలేనాటికి పుట్టిఉన్నాడోలేదో గాని మేమందరమూ చిరపరిచితులమయినట్టుగా మాట్లాడుతున్నాడు. ఇంట్లో తన తండ్రి, పినతండ్రులిద్దరూ ఎప్పుడూ తమ దొరలగురించి, దొరల మంచితనంగురించి చెపుతుంటారని యాదగిరి చాల ప్రేమగా చెప్పాడు. ఊళ్లో కరణాల వ్యవసాయం ఎప్పుడో పోయినప్పటికీ, ఇప్పటికీ యాదగిరిని కూడ కరణాల యాదగిరి అనే అంటుంటారట.

ఇక చాకలి లచ్చమ్మ. మా ఇంటిముందర రెండు వరుసలుగా ఉండిన ఆరు చాకలి కుటుంబాలలో చాకలి వెంకటయ్య – లచ్చమ్మ కుటుంబం ఒకటి. వాళ్ల పెద్దకొడుకు రాజయ్య నాకు ఒక సంవత్సరం జూనియర్ కాని పక్కపక్కనే ఉండడం వల్ల కలిసి ఎన్నో ఆటలు ఆడుకుంటుండేవాళ్లం. నారాయణస్వామి కవితాసంపుటం ‘సందూక’ ముందుమాటలో పురాశోకం గురించి రాస్తూ లచ్చమ్మ శోకాన్ని గుర్తు చేసుకున్నాను. లచ్చమ్మ వచ్చి అమ్మ అనారోగ్యంతో హనుమకొండ వెళ్లేటప్పుడు తనతో మాట్లాడినమాటలు గుర్తుచేసుకుని మా అందరినీ కంట తడి పెట్టించింది. నేను తనగురించి రాశానని అక్కయ్య చెపితే ‘చిన్నదొరకు అన్నీ గుర్తే’ అని ప్రేమగా అంది. ఊరిసంగతులు మాట్లాడుతూ రాజారం, గణపురం చెరువులు కలిపేయడం గురించి చెప్పినప్పుడు నేను రాజారం చెరువు కట్ట చివరన వడ్డెరాజులవిగ్రహాలను ఏం చేయబోతున్నారని అడిగాను. ‘వావ్వో, దొరకు అన్ని యాదికున్నాయే’ అని మరొకసారి ఆశ్చర్యపోయింది. మేర వినోద ముప్పైఏళ్లకింద ఎట్లా ఉందో ఇప్పుడూ అట్లాగే ఉంది. ఇప్పుడు యాభైల్లో ఉందేమోగాని మేర వెంకటాద్రి చనిపోయి వితంతువుగా మారినప్పుడు ఇద్దరో ముగ్గురో చిన్నపిల్లలతో ఊరివాళ్ల సానుభూతి సాయంతో కష్టాలన్నీ గట్టెక్కి ఇప్పుడు కొంచెం స్థిమితంగానే ఉన్నట్టుంది. అమ్మతో తన జ్ఞాపకాలు, పండుగలముందు అక్కయ్యలకోసం హడావుడిగా కొత్తబట్టలు కుట్టిఇచ్చిన సందర్భాలు గుర్తుచేసుకుంది. మారెపల్లి కుటుంబాలతో, ముఖ్యంగా పెదమల్లారెడ్డి, లక్ష్మారెడ్డి కుటుంబాలతో బాపుకూ, ఇంట్లో అందరికీ చాల స్నేహం ఉండేది. ఇప్పుడు ప్రభాకర్ , కిషన్ ల ఆప్యాయతలో ఆ స్నేహం ఇంకా సజీవంగా ఉంది. దానికన్న ఆశ్చర్యం తిరుపతిరెడ్డి పిల్లలు ముగ్గురూ చూపిన అభిమానం. ఆ ముగ్గురు పిల్లలకూ ఊహతెలిసేనాటికే మేం ఊరు వదిలిపోయాం. కాని మేమందరమూ ఎంతో తెలిసినవాళ్లలాగ వాళ్లు తమ ఇంటికి తీసుకుపోయి ఎంత అభిమానంగా ఉన్నారో చూస్తే కళ్లలో నీళ్లు తిరిగాయి. తిరుపతిరెడ్డి ఇప్పుడు అనారోగ్యంతో ఉన్నాడుగాని, ముప్పైఏళ్లకింద సినిమాల్లో చేరడానికి మద్రాసు వెళ్లి, ఏవో ఒకటి రెండు సినిమాలలో నటించి, ఎప్పుడూ తెల్ల పైజామా లాల్చీలలో హీరో లా తిరుగుతుండిన రూపమే గుర్తువస్తుంది.

అయిదో తరగతి వరకూ కలిసిచదువుకున్న శాలోల్ల బుచ్చిరాజం, ఆ తర్వాత బతుకుతెరువుకోసం బొంబాయికీ, మరెక్కడెక్కడికో వెళ్లి, మళ్లీ ఊరికి తిరిగి వచ్చిన బుచ్చిరాజం మేం వచ్చామని తెలిసి పరుగెత్తుకొచ్చాడు. ‘నీతో కలిసి ఒక ఫొటో కావాలి’ అని అడిగి ఫొటో తీయించుకున్నాడు. చిన్నక్కయ్య క్లాస్ మేట్ బైరగోని సాయిలు పళ్లు ఊడిపోయి, చెంపలు లోపలికిపోయి, జుట్టంతా నెరిసిపోయి ముసలితనం మీదపడినట్టున్నాడు. ఆ రోజుల్లో ఊళ్లోని అతి తక్కువమంది ఉద్యోగుల్లో ఒకడిగా, కండక్టర్ గా పనిచేస్తూ ఇన్ షర్ట్ తో టిప్ టాప్ గా కనబడుతుండేవాడు.

రాజారం వెళ్లిన సందర్భమే సద్దుల బతుకమ్మ గనుక, తంగేడుపూలు, గునుగుపూలు తెప్పించి బతుకమ్మ పేర్చి, లచ్చమ్మ పట్టుకుని ముందర నడుస్తుండగా, కాలాన్ని ముప్పై ఏళ్లు వెనకితిప్పి, ఆ వెనుక అందరమూ – నెల్లుట్ల వరవరరావు – రంగనాయకమ్మల సంతానమంతా – ఊళ్లోకి ఊరేగింపుగా తరలివెళ్లాం. దారిపొడుగునా పలకరింపులే, కంటతడే, ఆనందమూ విషాదమూ కలగలిసిన అనుభూతులే. శివాలయం పక్కన పాతరోజుల్లోలాగనే పెద్ద ఎత్తున బతుకమ్మ ఆడుతున్నారు. వందలాదిమంది స్త్రీలు, చుట్టూ ఊరుఊరంతా అక్కడే ఉంది. అక్కయ్యలు, రజని, పిల్లలు కాసేపు బతుకమ్మ ఆడినతర్వాత అప్పటికే ముసిముసిచీకట్లు పడుతున్నాయిగనుక చెరువు చూద్దామని వెళ్లాం. కొన్నిఏళ్లపాటు చెరువులోకి నీళ్లు రాలేదుగనుక మత్తడి దగ్గర చెరువుమధ్యలో తుమ్మలు మొలిచి పెద్దపెద్ద చెట్లయిపోయాయి. కాని ఈసారి చెరువు నిండి, కట్ట తెగిపోతుందేమోనని మత్తడి తెగగొట్టవలసివచ్చిందట.

బతుకమ్మలదగ్గర నిలబడి ఉండగా, “గుర్తు పడ్తవా దొరా” అని ఒక యువకుడు. ముఖం పోల్చుకునేటట్టే ఉందిగాని తెలియడంలేదు. యాదగిరి. అక్కయ్య, మామయ్య జడ్చర్ల నుంచి హనుమకొండకు వచ్చిన కొత్తలో, అంటే 1969లో, ఇప్పటి కొత్తబస్ స్టాండ్ రోడ్డులో విజయేందర్ రెడ్డి ఇంట్లో అద్దెకు ఉండేవాళ్లు. అప్పుడు సాజి, చిన్ని చిన్నపిల్లలు గనుక ఇంట్లో పనికి అవసరమని ఈ యాదగిరిని రాజారం నుంచి తీసుకుపోయారు. అప్పుడు వాడికి ఎనిమిదేళ్లో, పదేళ్లో. నా వయసే. మేం ఇద్దరం కలిసి ఆడుకునేవాళ్లం. అప్పుడు ఒక వానకాలం జోరున వానలు పడి జూనియర్ కాలేజి గ్రౌండ్స్ పక్కన ఉన్న కాలువ నిండా పారింది. మధ్యలో ఒక హౌజ్ లాగ కట్టి ఉంటే యాదగిరీ నేనూ ఇద్దరమూ అందులోదిగి చేపలు పట్టాం. ఆ సంగతులన్నీ – ముప్పైఅయిదు ఏళ్లవెనుకటి సంగతులన్నీ – గుర్తు చేశాడు.

ఏమీ మారనట్టు కనబడినది రాజారం మనుషుల ఆప్యాయత కాగా, ఊళ్లో బ్రాహ్మల ఇల్లూ అట్లాగే మారకుండా ఉంది. నారాయణ చిన్నాయన, అనసూయమ్మత్త, పిల్లలు అందరూ రోజూ కలుస్తున్న మనుషులతో మాట్లాడినట్టే మాట్లాడారు. పుట్టిమునిగల్ల వాగు, కరెంటుబంగ్లా చూద్దామని బాగా ఉండింది గనుక కార్లు వేసుకుని పుట్టిమునగల్ల బయల్దేరాం. దేవాదుల పైప్ లైన్ వల్ల ఇప్పుడు పుట్టిమునగల్లకు, ఒకప్పడు బాపు వ్యవసాయం చేసిన చెలక వరకూ కార్లమీద పోవచ్చు. వాగు మొన్నమొన్నటివరకూ పారుతూఉందటగాని ఇప్పుడు నీళ్లు లేవు. ఇసుకంతా తోడి తీసుకుపోవడంవల్ల వాగు పారకం ఆగిపోయింది. ఒర్రెలోకూడ నీళ్లు లేవు గాని, ఒర్రె వాగులో కలిసేచోట ఎప్పుడో ముప్పైఅయిదేళ్లకిందట రాగడిమట్టికట్ట కట్టి, దానికి మోదుగాకు తూములు ఏర్పాటుచేసి ప్రాజెక్టులు కట్టిన జ్ఞాపకాలు అక్కడే సజీవంగా ఉన్నాయి. ఆ అనుభవాన్ని ఒక కవితలో రాసి ఏడెనిమిదేళ్లకింద గుర్తుతెచ్చుకున్నానుగాని, ఆ స్థలాన్ని చూసి, అక్కడ ముట్టుకుని ఆ తలపులు తెచ్చుకోవడం అపూర్వమైన అనుభవం. అక్కడ ఒక చెక్ డామ్ కట్టారటగాని అది మొన్నటి వరదలకు తెగిపోయింది. ఇప్పుడక్కడ కాసిన్ని నీళ్లు నిలిచి ఉంటే, పిల్లలందరూ ఆ నీళ్లలోనే కేరింతలుకొట్టారు.

రాజారం ఒక అర్థంలో చాల మారిపోయింది. మరొక అర్థంలో ఏమీ మారకుండానూ ఉంది. మన గ్రామీణ సామాజికవ్యవస్థలోని కొత్తపాతలమేలుకలయిక, పాత కొనసాగింపు, కొత్త మార్పు అన్నిటికీ సాక్షీభూతంగా ఉంది రాజారం. అక్కడి మనుషుల ఆప్యాయత, అభిమానం చూస్తుంటే, ఈ దేశంలో ప్రపంచీకరణగాని, మార్కెటీకరణగాని ఎందుకు విజయం సాధించలేవో మరొకసారి అర్థమయింది. ఇక్కడ ఇంకా మార్కెటేతర సంబంధాలు, సహజ మానవసంబంధాలు ఏదో ఒకస్థాయిలో కొనసాగుతున్నాయి. అవి ధ్వంసం కావడం మొదలయి ఉండవచ్చు, కొన్నిచోట్ల మార్కెట్ దురాక్రమణ ఎక్కువగానే ఉండవచ్చు. కాని ఇంకా మన పల్లెటూరిమనుషులకు లాభనష్టాలతో సంబంధంలేని మానవసంబంధాలమీద, అభిమానాలమీద, ఆప్యాయతలమీద, ప్రతిఫలం ఆశించని విధేయతలమీద నమ్మకం ఉంది. ఆ విధేయతలలో మనువాదం, కులం చేర్చిన మకిలి ఎక్కువగానే ఉండవచ్చు, దాన్ని కడిగేయడం తక్షణ అవసరమే కావచ్చు. కాని, ఆ అనుబంధాలలోంచి ఆ అమానవీయ అంశాలను తొలగించి, మానవసహజమైన అనుబంధాలను, ఆప్యాయతలను పునరుద్ధరించవలసిన అవసరంఉంది. నావరకు నాకు రాజారం ప్రయాణం ఒక నెమలీక అన్వేషణగా మొదలయిందిగాని, మార్కెటీకరణ మీద ఎక్కువ ద్వేషంతో, విప్లవ అవసరం గురించి ఎక్కువ స్పృహతో, గ్రామీణ మానవసంబంధాలమీద ఇనుమడించిన గౌరవంతో ముగిసింది.

– ఎన్ వేణుగోపాల్ , అక్టోబర్ 1 – 18, 2006

( ఒకటవ భాగం | రెండవ భాగం | మూడవ భాగం )

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Anveshana, Telugu. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s