నెత్తురు చిందిన నందిగ్రామ్‌

దేశంలోకెల్లా నిజమైన ఏకైక వామపక్షమని తనకుతాను కితాబులిచ్చుకుంటున్న పార్టీ నాయకులు ఏమన్నారో సరిగ్గా అవే మాటలను ఆ రాష్ట్రపు పోలీసు ఉన్నతాధికారులు కూడా అంటున్నారంటే అది ఆ పోలీసధికారులు వామపక్ష భావజాలం నేర్చుకున్నందుకు గుర్తా?

పశ్చిమబెంగాల్‌లోని తూర్పు మేదినీపూర్‌ జిల్లా నందిగ్రామ్‌లో తమ భూమిని మరొకరు ఆక్రమించకూడదన్నందుకు, ఆ ఆకాంక్షను సమరశీలంగా ప్రకటించినందుకు రైతుకూలీల నెత్తురు చిందింది. హల్దీనదికి దక్షిణభాగం నుంచి ఒక కొన్నెత్తుటి నది ఉప నదిగా చేరింది. ప్రభుత్వం చెబుతున్నట్టు పదకొండు మందా, పద్నాలుగుమందా, ప్రభుత్వంలో భాగస్వామి అయిన ఆర్‌ఎస్‌పికి చెందిన మంత్రి క్షితిగోస్వామి స్వయంగా ఆస్పత్రిలో మృతదేహాలను చూశానని చెబుతున్నట్టు యాభై మందా, ప్రతిపక్ష తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ, కొన్ని పత్రికలు, కొందరు స్వతం త్ర పరిశీలకులు చెబుతున్నట్టు దాదాపు వందమందా- పోలీసు కాల్పుల్లో కచ్చితంగా చనిపోయినవాళ్లు ఎందరు ఎవరి అంచనాలు వాళ్లకున్నాయి.

వాస్తవం ఈ అన్ని అంకెలమధ్యన ఎక్కడో ఒకచోట ఉంటుంది. కానీ ఎవరూ నిరాకరించలేని నిజం మాత్రం అంతమంది ప్రజలూ తనను తాను మార్క్సి స్టు ప్రభుత్వమని పిలుచుకునే ప్రభుత్వ పోలీసుల కాల్పులలోనే అసువులు బాశారన్నదే. అన్నిచోట్లా ప్రజలమీద అమానుషమైన అత్యాచారాలు చేసిన పోలీసులు అన్నట్టుగానే, నందిగ్రామ్‌లోని ‘మార్క్సిస్టు’ పోలీసులు కూడా ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపామని సమర్థించుకుంటున్నారు. పశ్చిమబెంగాల్‌ను గత మూడు దశాబ్దాలుగా పాలిస్తున్న వామపక్ష కూటమికి నాయకత్వం వహిస్తున్న భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఈ కాల్పులను ఏ పద్ధతిలో సమర్థించుకోజూచినా, ఏ కారణాలు చూపినా సమర్థించడం సాధ్యంకాని నరమేధం ఇది.

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, పౌరహక్కుల ఉద్యమంలో కురువృద్ధుడు విఆర్‌ కృష్ణయ్యర్‌ తన తొంభైమూడేళ్ల వయసులో నందిగ్రామ్‌ దుర్మార్గంపై చలించి సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌కరత్‌కు రాసిన లేఖలో ప్రకటించిన ఆగ్రహం, ఆక్రోశం, ఆవేదన ఆ పార్టీ వర్గాలలో ఇసుమంతయినా పశ్చాత్తాపాన్ని కలిగించినట్టులేదు. ఆ పార్టీ పత్రికలు, మేధావులు అసలు పోలీసుకాల్పులు ఖండించదగిన దారుణ సం ఘటన కానేకాదన్నట్టు, హతులే ఆ కాల్పులకు బాధ్యులన్నట్టు, ప్రజల మొం డితనం వల్లనే కాల్పులు అనివార్యమైనట్టు వాదిస్తున్నారు. అచ్చంగా అన్నిచోట్లా గద్దెలమీద ఉన్నవాళ్లు ఆందోళనకారుల గురించి మాట్లాడేమాటలే వల్లిస్తున్నారు. అగ్రనాయకుడు సీతారం యేచూరి మరొక అడుకు ముందుకువేసి కాల్పులకు తృణమూల్‌ కాంగ్రెస్‌, మావోయిస్టు కార్యకర్తలే బాధ్యులని కూడా అన్నారు.

బహుశా ఆ పద్నాలుగుమందో, యాభైమందో హతులు పోలీసులముందుకు దూసుకెళ్లి ‘కాల్చండి, కాల్చండి, మేం మీ చేతుల్లో చచ్చిపోవడాని కి తహతహలాడుతున్నాం’ అని అంటున్న దృశ్యం ఆయన సులోచనాలకు స్పష్టంగా కనబడుతున్నట్టుంది. దేశంలోకెల్లా నిజమైన ఏకైక వామపక్షమని తనకుతాను కితాబులిచ్చుకుంటున్న పార్టీ నాయకులు ఏమన్నారో సరిగ్గా అవే మాటలను ఆ రాష్ట్రపు పోలీసు ఉన్నతాధికారులు కూడా అంటున్నారం టే అది ఆ పోలీసధికారులు వామపక్ష భావజాలం నేర్చుకున్నందుకు గుర్తా? లేక వామపక్షనేతలు నరహంతక పోలీసు అధికారులలాగ మాట్లాడటం నేర్చుకుంటున్నారనుకోవాలా? సిపిఎం నాయకులు కాల్పుల తర్వాత మరొక కొత్త పాట ఎత్తుకున్నారు.

నందిగ్రామ్‌లో భూసేకరణ జరపబోమని ప్రభుత్వం నెలకిందనే ప్రకటిం చిందని, కనుక అక్కడ సమస్యే లేదని, సమస్యలేనిచోట తృణమూల్‌ కాంగ్రె స్‌ సమస్య సృష్టించడానికి ప్రయత్నించిందని, అందువల్లనే హింస జరిగింద ని అంటున్నారు. అసలు సిపిఎం పత్రికల్లో పోలీసు కాల్పులు అనే వార్తే రాలే దు. అన్ని పత్రికలూ ఆ రోజు ఆ వాస్తవ ఘటనను పతాక శీర్షికగా ఉంచగా, సిపిఎం పత్రికలు మాత్రం ‘నందిగ్రామ్‌లో హింస’ అని మాత్రం అన్నాయి! మరి అసలు సమస్య లేనిచోటికి ఐదువేలమంది పోలీసులను తరలించాలని ప్రయత్నించాలని ప్రభుత్వం ఎందుకు అనుకున్నట్టు? అంతమంది పోలీసులు అక్కడ ఏ సమస్యను పరిష్కరించడానికి వెళ్లారు? లేదా ఏ సమస్యను సృష్టించడానికి వెళ్లారు? నిజానికి కాల్పులకు రెండు రోజులముందే ఆ ప్రాం తంలోకి పెద్ద ఎత్తున సాయుధబలగాలను పంపించబోతున్నామని రాష్ట్ర హోం కార్యదర్శి ప్రకటించాడు. అంటే కాల్పులు పోలీసులు, సిపిఎం నాయకులు చెబుతున్నట్టు ఆత్మరక్షణకోసం, అనివార్యంగా జరిగినవి కావన్నమాట.

ఉద్దేశ్యపూర్వకంగా, ప్రజలను భయభ్రాంతులను చేయడానికి, పరిస్థితులు చక్కబడగానే భూ సేకరణ జరగడానికి వీలుగా రంగం సిద్ధం చేయడానికీ అంటే శ్మశానశాంతి నెలకొల్పడానికి ఐదువేలమంది పోలీసులను పంపించారన్నమాట. అసలు విషయం అది. ఆ పోలీసులు వెళ్లినది ప్రజలకు ఒక హెచ్చరిక చేయడానికి. అది కేవలం నందిగ్రామ్‌ ప్రజలకు మాత్రమే హెచ్చరిక కాదు. దేశంలో ఏర్పడబోతున్న అన్ని ప్రత్యేక ఆర్థికమండలాలను వ్యతిరేకిస్తున్న ప్రజాశక్తులన్నిటికీ హెచ్చరిక. ‘ఎక్కడయినా ప్రత్యేక ఆర్థిక మండలాను వ్యతిరేకించేవారిని కాల్చి చంపిఅయినా సరే ముందుకేపోతాము. భూసేకరణ జరి పి బహుళజాతి సంస్థలకు అప్పగిస్తాము’ అని ఈ దేశంలోని పాలకవర్గాలన్నీ, బహుళ జాతి సంస్థల తరపున, దేశదేశాల పెట్టుబడిదారులందరి తరపున ఈ దేశ ప్రజలందరికీ ఒక సందేశం పంపదలచుకున్నాయి.

ఆ పాలకవర్గాలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కపేరున ఉండవచ్చు. పశ్చిమ బెంగాల్‌లో యాదృచ్చికంగా ఆ పాలకవర్గాల పేరు భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) కావచ్చు. మళ్లీ ఆ పాలకవర్గాల ముఠా తగాదాలలో భాగంగా అవే ఒక రాష్ట్రంలో ప్రత్యేక ఆర్థిక మండలాలను వ్యతిరేకిస్తున్నట్టు, వ్యతిరేకంగా పోరాడుతున్నట్టు కూడా నటిస్తుండవచ్చు. మరొక రాష్ట్రంలో తామే అగ్రభాగాన నిలిచి ప్రత్యేక ఆర్థిక మండలాలను ఏర్పాటుచేస్తూ, బహుళజాతి సంస్థలకు, పెట్టుబడిదారులకు తాము ఎంతవిశ్వాసపాత్రులమో చూపుకోవడానికి పోటీ పడుతుండవచ్చు. మన పార్లమెంటరీ రాజకీయ పార్టీలన్నీ ఈ క్రీడలో అనితర సాధ్యమైన నైపుణ్యం సంపాదించాయి. అందువల్లనే ఎన్‌డిఏ ప్రభుత్వ హయాంలో మొదలయిన ప్రత్యేక ఆర్థిక మండలాల విధానం యుపిఏ హయాంలో మరింతగా దాసోహం అని, లోకసభలోనూ రాజ్యసభలోనూ చిరుచిరు మార్పులతో కేవలం చెరి ఒక రోజు చర్చతో ఆమోదం పొందింది.

అక్కడ సిపిఎం నాయకులు కోరిన సవరణలు మొత్తం అధికారం కేంద్రానికి మాత్రమే ఉండగూడదని, రాష్ట్రాలకు కూడా అధికారాలు పంచాలని మాత్రమే. ఆ సవరణ నాటినుంచీ నందిగ్రామ్‌ పరిణామాలన్నీ చూస్తే, సిపిఎం తప న అర్థమవుతుంది. ఆ తపన ఫలితమే నందిగ్రామ్‌ కాల్పులు. ఆ తపన ఏమంటే, ఆ పార్టీ దేశదేశాల సంపన్నవర్గాలకు తాను ఒక పాలకవర్గ పార్టీననీ, తనపేరు చూసి భయపడవద్దని, తనను ప్రతినిధిగా ఎంచుకొమ్మని సూ చిస్తున్నది. ‘కాంగ్రెస్‌నుంచి భాజపా దాకా ఎన్నో పార్టీలతో ప్రయోగాలు చేశా రు. ఒకసారి నాకూ అవకాశం ఇవ్వండి, మీకు నమ్మకమైన ప్రతినిధిగా ఉం టాను’ అని ఆ పార్టీ చెప్పదలచుకున్నది.

అందుకే ఇటు టాటాలకు సింగూ రునూ, అటు సలీంగ్రూపుకు నందిగ్రామ్‌నూ బలి ఇవ్వదలచింది. ఇంకొకవైపు తాను ప్రజల పార్టీనేనని ప్రజలకు నమ్మకం కలిగించడానికి ప్రయత్నా లు చేస్తూ ఉంటుంది. ప్రజానుకూలంగా, విప్లవకరంగా మాట్లాడుతుంటుం ది. కానీ నిజమైన పరీక్ష వచ్చినప్పుడే అంటే టాటాలకూ ప్రజలకూ, సలీం గ్రూపుకూ ప్రజలకూ ఘర్షణ వచ్చినప్పుడు మాత్రం ఎటువైపు ఉండదలచుకున్నదో సింగూరు ఘటనలు చూపాయి. ఇప్పుడు నందిగ్రామ్‌ కాల్పులూ చూపుతున్నాయి.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Andhra Jyothy, Telugu, Vartamaanam. Bookmark the permalink.

One Response to నెత్తురు చిందిన నందిగ్రామ్‌

  1. Ajit Kumar says:

    మీరు చంద్రబాబునాయుడుగారిలాగా డిఫెన్సు లాయరు మెధడ్ లో వాదిస్తున్నారు.యన్ టీ ఆర్ గారు “నక్సలైటులే నిజమైన దేశభక్తులు” అని అన్నారు.ఆరోజుల్లో బాగా చదువుకున్నావారు పార్టీలో చేరేవారు.నేడాపరిస్థితి లేకపోవడానికి కమ్యూనిస్టుల్లో కులతత్వం పెరగడమే కారణమని నా అభిప్రాయం.ఈవ్యాసం వొక మావోయిస్టుల సానుభూతిపరుడు వ్రాసినట్లుంది.నా అంచనా నిజమైతే మీరు ఇలా వ్రాయకూడదు.
    వాస్తవాలు ప్రజలకు తెలుసు. కాంగ్రేసు, బి జే పి, తౄణమూల్ వారు గతంలో అనేక మార్గాలలో బెంగాల్ లో సి పి ఎం ప్రభుత్వాన్ని దింపడానికి ప్రయత్నించి ఓడిపోయి నేడు మావోయిస్టుల నాయకత్వం క్రిందకు వచ్చారంటే అది మావోయిస్టులకు విజయమేనని నేననుకుంటున్నాను.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s