హత్యలకు తాయిలాలు

నక్సలైటు ప్రభావిత ప్రాంతాలలో పని చేసే పోలీసులకు సత్వర పదోన్నతులు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎంచుకున్న పద్ధ్దతిని దేశం లోని అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. జస్టిస్‌ ఎకె. మాధుర్‌, జస్టిస్‌ తరుణ్‌ చటర్జీలతో కూడిన బెంచ్‌ మొన్నటి శుక్రవారం ప్రకటించిన ఈ తీర్పుకు మామాలు మాటల్లో అర్థం చె ప్పాలంటే ఎంత ఎక్కువ మంది నక్సలైట్లను చంపితే అంతతొందరగా పదోన్నతులు సంపాదించుకొని, పైపైకి ఎగబాకి పోవడం సమర్థనీయమేనని, అలా ఎక్కువ మందిని చంపిన వారికి సత్వర పదోన్నతి ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సరైన పనే చేస్తున్నదని సుప్రీం కోర్టు అన్నదన్న మాట. “చంపినందుకు కానుకలు, బహుమతు లు,పదోన్నతులు ఇవ్వవచ్చు” అనడం ద్వారా చంపడంమంచిదే అని స్వయంగా సర్వోన్నత న్యాయ స్థానమే సూచిస్తున్నట్టు కాదా?

అసలు ఈ వ్యవహారమంతా ఎట్లా మొదలయిందో, ఎట్లా సాగుతున్నదో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగులందరికి వారి ఉద్యోగ నియామకాలు, పని పరిస్థితులు, పదోన్నతులు, పదవీ విరమణ ప్రతిఫలాలు మొదలయిన విషయాలలో నిర్దిష్టమైన నిబంధనలు ఉన్నట్టే పోలీసులకు కూడా ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ (సివిల్‌) సర్వీసు రూల్స్‌-1998 అనేవి ఉన్నాయి. వాటికి 2001 నవంబర్‌లో చేసిన ఒక సవరణ మేరకు నక్సలైట్‌ ప్రభావిత ప్రాంతాలలో పని చేసిన, ఎక్కువ ఎన్‌ కౌంటర్లలో పాల్గొన్న పోలీసు అధికారులకు, సాధారనణ నిబంధనలు వర్తించవనీ, కనీస నిర్దిష్ట వ్యవధి లేక పోయినా సత్వర పదోన్నతులు ఇవ్వవచ్చునని సూచించారు. దీన్ని మామూలు మాటల్లో చెప్పాలంటే, మిగిలిన ప్రాంతాల్లో పనిచేసే సర్కి ల్‌ ఇన్‌స్పెక్టరు పదేళ్ల పైన పనిచేస్తేగాని డిఎస్పీగా పదోన్నతి పొందడనుకుం టే, నక్సలైటు ప్రాంతాల్లో పనిచేసే, ఏడాదికి ఓ పదిమందినో, ఇరవై మందినో చంపిన ఘనత సంపాదించుకున్న ఏ సర్కిల్‌ ఇన్‌స్పెక్టరయినా ఐదేళ్ళలోనే డి ఎస్పీ అయిపోవచ్చు. ఇటుంటి పదోన్నతుల కోసం ఇతర పారితోషికాల కోసం నిజంగా జరగని ఎన్‌ కౌంటర్లెన్నిటినో మన పోలీసు అధికారులు సృష్టించార నీ, కనీసం సాయుధంగా కూడ లేని ఎందరో అమాయక గ్రామస్తులను చం పి, శవాలకు యూనిఫారాలు తొడిగి, ఆయుధాలు చేతబెట్టారని అందరికీ తెలుసు. ఈ సత్వర పదోన్నతుల పథకంలో పదోన్నతి ఆశ చూపి నరహంతకతత్వాన్ని ప్రోత్సహించే ప్రభుత్వ కుట్ర గురించీ, ప్రమోషన్లకోసం మనుషులను చంపడాన్ని ఒక మార్గంగా చేసుకునే అమానుషత్వాన్నిగురించీ కాసేపు పక్కన పెడతాం. ఈ సమస్య ఆ రకమైన నైతికకోణం దగ్గర ప్రారంభ కాలే దు. అచ్చమైన సాంకేతిక కారణాల దగ్గర మొదలయింది. నక్సలైటు ప్రాంతాలుగా గుర్తింపు పొందని ప్రాంతాలలో పని చేసే పోలీసు అధికారులకు, పదోన్నతి కోసం మరీ ఇంతగా చేతులకు నెత్తురు అంటించుకోవాలా అనుకునే పోలీసు అధికారులకు ఈ సర్వీసు రూల్స్‌ సవరణ మింగుడు పడలేదు. న్యాయంగా, వృత్తి ధర్మపు మార్గంలో వయసు కొద్దీ పదోన్నతులు ఉండాలి గాని ఈ అక్రమ మార్గం ఎమిటి అని వారు ప్రశ్నించారు. ఆశ చూపి మనుషులను చంపించే ఈ దుర్మార్గం ఏమిటి అని కూడ వారు ప్రశ్నించినట్టు లేదు. వారు ప్రశ్నించిందల్లా పద్ధతిలో అక్రమాన్ని గురించి మాత్రమే. వారు వేసిన ప్రశ్న ఆంధ్రప్రదేశ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యూనల్‌కు న్యాయమేననిపించిది. ఇటువంటి సత్వర పదోన్నతులు చట్ట వ్యతిరేకమైనవని, వివక్షకు దారితీసేవని, రాజ్యాంగ వ్యతిరేకమైనవని భావించిన ట్రిబ్యునల్‌ ఆ సవరణను కొట్టి వేసింది.

ట్రిబ్యునల్‌ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లింది. హైకోర్టు కూడ ట్రిబ్యునల్‌ తీర్పును ఆమెదించి ఆ సవరణ చట్టవిరుద్ధమైనదనీ, వివక్షాపూరితమైనదనీ, రాజ్యాంగ వ్యతిరేకమైనదనీ చెప్పింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది. ఎన్నో ప్రజా ప్రయోజనాల కేసులలో ప్రజలకు వ్యతిరేకంగా కింది కోర్టులు తీర్పులు ఇస్తే వాటిని సవాలు చేస్తూ పై కోర్టులకు పోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ అనుకోలేదు. ఈ హత్యలకు పారితోషికాల పథకం విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అపారమైన ఆసక్తిని ప్రదర్శించింది. మొదట్లో, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ వై.కె. సభర్వాల్‌, జస్టిస్‌ సికె ఠక్కర్‌లు ఇటువంటి హంతక పద్ధతి ఉండడం నిజమే నా అని ఆశ్చర్యపోయారు. కానీ నాలుగు నెలల తర్వాత ఇప్పుడు మరొక ఇద్దరు న్యాయమూర్తులు ఈ పద్ధతిలో రాజ్యాంగ వ్యతిరేకమైనదేమీ లేదని, ప్రమాదాన్ని ఎదుర్కొంటూ కష్టభరిత ప్రాంతాలలో పనిచే స్తూ, అంత సాహసికంగా లేని సహోద్యోగుల కన్న వీరిని భిన్నంగా చూడవలసిందేనని అన్నా రు. ఈ పదోన్నతులకు వేరు వేరు స్థాయిలలో పర్యవేక్షణ ఉన్నది గనుక దానిలోని వివక్షను తొలగించవచ్చునని అన్నారు.

ఈ పద్ధతి రాజ్యాంగ అధికరణం 21 హామీ ఇస్తున్న జీవించే హక్కును కాలరాచివేసేదనీ, ఒక అధికారి తన సత్వర పదోన్నతి కోసం అధికరణ 21ని ఉల్లంఘిస్తూ ఎవరినైనా చంపి, ఆ హతుడికి నక్సలైటు అని పేరు పెట్టవచ్చుననీ న్యాయమూర్తులు గుర్తించక పోవడం ఆశ్చర్యం. స్వయంగా న్యాయమూర్తులు కొందరు పోలీసు అధికారులను సాహసవంతులుగా పేర్కొని, మిగిలి న అధికారులను “సాధారణ పోలీసు వృత్తి నిర్వహించే వారిగా”-అంటే అం త సాహసికులు కానివారుగా-ప్రకటించడం మరింత ఆశ్చర్యకరం.

సరిగ్గా న్యాయమూర్తులు తీర్పు ప్రకటిస్తున్న సమయానికే కాశ్మీర్‌లో అమాయకులను తీసుకు పోయి చంపి పారవేసి, వారికి పాకిస్తానీ తీవ్రవాదులని పేరు పెట్టి. పోలీసులు, భద్రతాదళాలు ఎట్లా పారితోషికాలు సంపాదిం చుకుంటున్నారో, ఆ పద్ధతిలో వారు ఎన్ని వేల మందిని చంపారో బయపడుతున్నది. గుజరాత్‌లో 2005 నవంబర్‌లో జరిగిన ఒక ఎన్‌ కౌంటర్‌ ఘటన బూటకమైనదనీ,ఆ ఎన్‌ కౌంటర్‌లో చనిపోయిన సొహ్రాబుద్దీన్‌ షేక్‌ ను ఇంటి నుంచి పట్టుకుపోయి చంపివేసి ఎన్‌ కౌంటర్‌ కథ అల్లడం జరిగిందని స్వయంగా గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టు ముందు సరిగ్గా ఈ తీర్పు వెలువడిన రోజునే నివేదించింది. ఇటువంటి వార్తలెన్నో వస్తున్న నేపథ్యంలో చంపడమే పదోన్నతికి రాజమార్గం అని సుప్రీంకోర్టు కూడ నిర్ధారిస్తే ఇక ఈ దేశంలో జీవించే హక్కును కాపాడేదెవరు..? ‘బారాఖూన్‌ మాఫ్‌’ అని మాత్రమే కాదు, ఒక్కొక్క హత్యకూ ఒక్కొక్క బహుమతి అని పాలకులు సిగ్గువిడిచి చెపుతుంటే , ప్రజల మీదికి భ ద్రతా బలగాలను ఎగదోస్తుంటే, ఆపవలసిన న్యాయ వ్యవస్థ ఇంతగా దౌర్జన్యానికి దాసోహం అంటుంటే ఇక తీర్పరి ఎవరు..?

నక్సలైట్లను చంపిన పోలీసు అధికారులకు బహుమానాలు ఇవ్వడం సరైనదేనని చెప్పిన ఈ తీర్పు-మార్చి 23న అంటే భగత్‌ సింగ్‌ బలిదానం రోజున- వెలువడడం బహుశా గొప్ప కవితా న్యాయం ‘తెల్లవాడు నాడు నిన్ను భగత్‌ సింగువన్నాడు.. నల్లవాడు నేడు నిన్ను నక్సలైటువన్నాడు. ఎల్లవారు రేపు నిన్ను వేగుచుక్కవంటారు’ అని ఎప్పుడో ముఫ్పై సంవత్సరాల కింద శ్రీ శ్రీ రాశాడు. సరిగ్గా భగత్‌ సింగ్‌ ప్రాణాలు తీసిన రోజున నక్సలైట్ల ప్రాణాలు తీసిన వారిని సత్కరించడం మంచిదేనని చెప్పిన ధర్మాసనం- ఈ దేశ సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యం- వలస పాలన కన్న ఒకడుగు వెనక్కి వేసింద ని చెప్పిందన్న మాట.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Telugu, Vartamaanam. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s