ఏమవుతున్నదీ జాతికి?

..అటువంటి పని ఒక్కసారి కూడా చేయడం అలవాటు లేని పోలీసులు, ఎంతో కాలంగా తాము కక్షపెట్టుకుని ఉన్న ఒకవ్యక్తి పెళ్ళి ఖర్చులకోసం ఇంట్లోడబ్బు ఉన్నదని తెలుసుకుని దాడిచేసి, ఆ డబ్బుకు రంగు అంటగట్టడం, దాని ఆధారంగా నేరారోపణ చేయడం కక్ష సాధింపే అవుతుంది తప్ప చట్టబద్ధపాలన కాదు.

ఈ దేశంలోనూ రాష్ట్రంలోనూ ఒకపక్కన అమాయకులైన సాధారణ ప్రజానీకంమీదా, భిన్నమైన రాజకీయ, తాత్విక అభిప్రాయాలున్న వాళ్ళమీదా నేరారోపణలూ బెదిరింపులూ విచారణలూ శిక్షలూ కక్షలూ నిరాటంకంగా సాగిపోతున్నాయి.మరోపక్కన నిజమైన నేరస్తులు గురించీ,అక్రమార్జన పరుల గురించీ,వారి కుంభకోణాల గురించీ ఎన్ని వాస్తవాలు బయటపడ్డా, ప్రసారసాధనాలూ ప్రజాందోళనలూ గగ్గోలుపెట్టినా వారి అక్రమాలు బేపర్వాగా కొన సాగుతున్నాయి. నిర్దోషిత్వానికి శిక్షా, నేరానికి అందలమూ కలగలసిన ఈ వైరుధ్యంచూస్తే అసలు ఈదేశంలో ఒకచట్టబద్ధమైన పాలనఅనేది ఉన్నదా, కనీసం మంచీచెడూ అనే మానవీయపద్ధతి ఉన్నదా,నేరాన్ని అరికట్టవలసిన ఒక ప్రభుత్వశాఖ అనుసరించవలసిన క్రమపద్ధతి ఉన్నదా అని అనుమానం కలుగుతున్నది.

కాశ్మీర్‌లో సాయుధబలగాలు ఎన్ని అక్రమాలకు పాల్పడుతా యో, ఎన్ని అబద్ధాలుచెబుతాయో, ప్రజలమీద ఎటువంటి ఘోరమైన అత్యాచారాలు సాగిస్తాయో,మళ్ళీ వారిమీదనే ఎటువంటి నిరాధారమైన తప్పుడు ఆరోపణలు చేస్తాయో, ప్రసార సాధనాలనూ,ప్రజలనూ,న్యాయస్థానాలనూ కూడా ఎట్లా తప్పుదారిపట్టిస్తా యో ‘ ఔట్‌లుక్‌’ పత్రికలో ప్రఖ్యాత నవలారచయిత్రి అరుంధతీరా య్‌ కళ్ళకు కట్టినట్టు వివరించి ఇంకా ఎన్నో రోజులు గడవలేదు.కాశ్మీర్‌ విషయంలో అరుంధతీరాయ్‌చేసినలాంటి కృషి ఆంధ్రప్రదేశ్‌ కు సంబంధించి ఎవరయినా చేయగలిగితే ఇక్కడ కాశ్మీర్‌ కంటే ఎన్నిరెట్ల ఎక్కువ ఘోరాలు,దారుణాలుబయటపడతాయో తెలియదు. ఎన్నో గౌరవనీయమైన ప్రజా ఉద్యమాలు,క్రియాశీలకమైన ప్రచార సాధనాలు, అపారమైన శక్తిసామర్థ్యాలుగల మేధావులు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ గురించి అంత క్రమబద్ధమైన సమాచార సేకరణ,వివరణ జరగలేదు.

మరీముఖ్యంగా గత నలభైసంవత్సరాలుగా విప్లవోద్యమాన్ని అణచివేయడానికనే పేరుమీద పోలీసు యంత్రాంగానికి పాలకులు అందించిన బారాఖూన్‌ మాఫ్‌పద్ధతి వల్ల, జవాబుదారీతనం లేని అధికారం వల్ల మొత్తం సమాజంమీదనే ఎన్ని అక్రమాలు, ఎన్ని చట్టవ్యతిరేక పద్ధతులు, ఎన్ని అబద్ధారోపణలు, హత్యాయత్నాలు, హత్యలు జరుగుతూ వచ్చాయో జాబితా తయారుచేయడంకూడా అసాధ్యమైన స్థితి నెలకొన్నది. ఒక తాజా ఉదాహరణ చెప్పాలంటే, వరంగల్‌లో ఒక సీనియర్‌ జర్నలిస్టుమీదా ఒక హైకోర్టు న్యాయవాదిమీదా పోలీసులు ఒక కేసు బనాయించారు. ఆ జర్నలిస్టు మీద కనీసం ఐదారుసంవత్సరాలుగా పోలీసులు కక్షబూని ఉండకపోతే ఆ కేసులో ఏదయినా నిజముందేమో అని ఎవరయినా అనుమానపడడానికి ఆస్కారం ఉండేది. కాని ఆ జిల్లా పోలీసుయంత్రాంగం ఆ జర్నలిస్టుమీద కత్తిగట్టి ఉన్నదని కొన్ని సంవత్సరాలుగా అందరికీ తెలుసు. అందువల్ల ఇప్పుడు పోలీసులు పొరపాటున నిజంచెప్పినా నమ్మలేనిస్థితి ఉంది. ఇంతకూ ఇప్పుడు కూడా పోలీసులు నిజంచెప్పడంలేదు. ఆ జర్నలిస్టుదగ్గర ఐదులక్షలరూపాయలు దొరికాయనే ఆధారం తప్ప ఇప్పుడు పోలీసుల నేరారోపణకుమరే ఆధారమూ లేదు.

ఆ డబ్బు ఒక నిషిద్ధ పార్టీ నాయకుడినుంచి ఆ జర్నలిస్టుకు అందిందని పోలీసుల ఆరోపణ. శ్రీరామనవమి కథ చెప్పి వస్తున్న కళాకారుడినీ, రాత్రిపూటే కరెంటు వస్తుంది కనుక నీళ్లు కట్టడానికి పొలానికి వెళ్లి వచ్చే రైతును కాల్చిచంపి వాళ్ళను నక్సలైట్ల ఖాతాలో వేసినట్టుగా నే, కరెన్సీని చూడగానే అది ఎవరిదో, ఎవరు పంపించారో పసిగట్టగలిగిన పోలీసు ప్రతిభను కొనియాడడం తప్ప మరేం చేయగలం? ఇది ప్రజల డబ్బును అక్రమంగా, చట్టవ్యతిరేకంగా పోగుచేసి, వందల ఎకరాలు కబ్జాచేసి, బయటపడగానే జర్నలిస్టు రక్షణ తీసుకోవడం లాంటిది కాదు. అది అక్రమాదాయం అయితే, తెలిసిన ఆదాయవనరులకు మించిన ఆస్తి అయితే చట్టప్రకారం చర్యతీసుకోవచ్చు. నిజంగానే అక్రమాదాయాలను పట్టుకునే పనిని పోలీసులు చేయదల్చుకుంటే ఏ రాజకీయనాయకుడి ఇంటికి వెళ్ళినా, ఏ ఐఎ ఎస్‌, ఐపిఎస్‌ అధికారి ఇంటికివెళ్ళినా ఇంతకన్నా ఎక్కువ కరెన్సీ కట్టలు దొరుకుతాయి. అవి కూడా చూసిచూడగానే ఎవరు పంపిం చారో ఊహాగానాలేమీ చేయనక్కరలేదు.అక్రమాదాయమనీ అననక్కరలేదు. వారి ఆదాయాలకూ ఆస్తులకూ పొంతన ఉన్నదా వెతికితే చాలు.

అటువంటి పని ఒక్కసారి కూడా చేయడం అలవాటు లేని పోలీసులు, ఎంతో కాలంగా తాము కక్షపెట్టుకుని ఉన్న ఒకవ్యక్తి పెళ్ళి ఖర్చులకోసం ఇంట్లోడబ్బు ఉన్నదని తెలుసుకుని దాడిచేసి, ఆడబ్బుకు రంగు అంటగట్టడం, దాని ఆధారంగానేరారోపణ చేయడం కక్ష సాధింపే అవుతుంది తప్ప చట్టబద్ధపాలన కాదు. ఈ రకంగా ఈ రాష్ట్రంలో నేరమే అధికారమై జబర్దస్తీగా నేరాలు చేస్తూనే ఉంది. తమ వారి నేరాలను చూసీచూడనట్టుగా వదిలివేస్తూ, నేరమేలేనిచో ట కక్షతో నేరారోపణలుచేస్తున్నది. ఇటువంటి స్థితిని ప్రశ్నించడం ఏ ఒకరికో కీడు జరిగిందన్న బాధతోనో, ఏ ఒకరికో మేలు జరిగిందన్న అసూయతోనో కాదు. ఈ స్థితి కొనసాగితే సమాజమనుగడే ప్రశ్నార్థకమైపోతుంది. చట్టం పట్లగౌరవం భగ్నమైపోతుంది. గత పదిసంవత్సరాల్లో బయటపడిన పాలనాపరమైన కుంభకోణాలనే చూస్తే వాటిపట్ల ఎటువంటి చర్య లు లేకపోవడం చూస్తే నిజంగా ఈ రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఉన్నదా, ఇక్కడ భారత శిక్షాస్మ­ృతి అమలువుతుందా అని అనుమానం వస్తుంది.

ఇరవై సంవత్సరాల కింద అవినీతిపరులైన ఐఎఎస్‌, ఐపి ఎస్‌ అధికారుల పేర్లు వేళ్ళమీద లెక్కపెట్టేంతగా ఉండేవి. ఇవాళ నీతి మంతులైన అధికారుల సంఖ్య వేళ్లమీద లెక్కపెట్టేంతగా పరిస్థితి మారిపోయింది.పాలనాయంత్రాంగం ఇంతగా దిగజారిపోతే ఈ రాష్ట్రంలో పౌరసమాజం ఉన్నదా, అది ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న దుర్మార్గానికి మౌనసాక్షిగా ఉండిపోతున్నదా అని విచారం కలుగుతుంది. ఒక గొప్పజాతి, ఎప్పుడూ అన్యాయానికీ అక్రమానికీ వ్యతిరేకంగా గొంతెత్తి ఉద్యమాలు నిర్మించి, కొనసాగించి జాతి ఇవాళ ఇం త నిర్లిప్తతలోకి, సమ్మతిలోకి ఎట్లా జారిపోయిందా అని విచారం వేస్తుంది. మాట్లాడగలిగే గొంతు ఉన్నవారికి నిజాయితీ లేదు. నిజాయితీ ఉన్న అసంఖ్యాక జనబాహుళ్యానికి గొంతులేదు. ఏమయిపోతున్నదీ జాతికి?

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Andhra Jyothy, Telugu, Vartamaanam. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s