బాబ్లీలో అసలు ప్రశ్నలు గల్లంతు

పాత హైదరాబాదు రాష్ట్రంలోని దుర్భిక్ష మరాఠ్వాడ ప్రాంతానికి చెందిన నాందేడ్ జిల్లా బాబ్లీ దగ్గర మహారాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఒక ఆనకట్ట నుంచి ఆ ప్రాంతానికి నీళ్లు ప్రవహిస్తాయో లేదో గాని ఇప్పటికైతే అనేక వివాదాలు, రాజకీయాలు, అబద్ధాలు, అతిశయోక్తులు, మోసాలు, హామీలు, ఉల్లంఘనలు, మొసలి కన్నీళ్లు, శవదహనాలమీద పేలాలు వేయించుకు తినడాలు ఉరవడిగా ప్రవహిస్తున్నాయి. రెండు రాష్ట్రాలమధ్య రెండు దేశాల మధ్య జరిగినంత కల్లోలం జరుగుతున్నది.

మహారాష్ట్ర ప్రభుత్వం ఇతర నదీ పరీవాహక రాష్ట్రాలతో కుదుర్చుకున్న ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నదనే విషయం, కేంద్రప్రభుత్వ సంస్థలకు, సుప్రీంకోర్టుకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతున్నదనే విషయం పూర్తిగా వాస్తవాలే. కాని అవి వాస్తవాలయినంతమాత్రాన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇవాళ ఇల్లెక్కి అరుస్తున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయ పక్షాలు చేసినదంతా, చేస్తున్నదంతా న్యాయమని కాదు. సాంకేతిక అంశాలను పక్కన పెట్టినా, ఆంధ్రప్రదేశ్ ను ఇంతవరకూ పాలించిన ప్రభుత్వాలు, ఆ ప్రభుత్వాలను నడిపిన రాజకీయ పక్షాలు బాధ్యత వహించవలసిన రాజకీయ, ఆర్థిక, సామాజిక తప్పిదాలెన్నో ఉన్నాయి. ఇవాళ్టి బాబ్లీ వివాదం ఆ తప్పిదాలన్నిటి తార్కిక ఫలితమే.

బాబ్లీ ఆనకట్ట విషయంలో మహారాష్ట్రప్రభుత్వ ఉల్లంఘనలను మాత్రం బహిర్గతం చేస్తూ ప్రధాన రాజకీయ పక్షాలన్నీ అసలు ప్రశ్నల మీద దృష్టి ప్రసరించకుండా చేస్తున్నాయి. ఆ మాటకువస్తే కేంద్రజలసంఘం అనుమతి లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ యాభై ఏళ్లలో ఎన్నో నిర్మాణాలను చేపట్టింది. ఇతర రాష్ట్రం సంగతి పక్కన పెట్టండి, ఒక్క రాష్ట్రంలోనే పై ప్రాంతాలకు చుక్క నీరు వదలకుండా కింది ప్రాంతాల అవసరాలకోసం అవసరమయినదానికన్న ఎక్కువ, జలవివాదాల ట్రిబ్యునల్ అనుమతించే వాటా కన్న ఎక్కువ వినియోగించుకునేలా ఆనకట్టలు కట్టింది. ఎప్పుడన్నా ఎక్కడన్నా ప్రశ్నలు వస్తే అవి నికర జలాలలో భాగం కాదనీ, మిగులు జలాలనీ బూటకపు వాదనలు చేసింది. అటువంటి పనులు అటు కాంగ్రెస్ ప్రభుత్వాలు, ఇటు తెలుగుదేశం ప్రభుత్వాలు అన్నీ చేశాయి. అందువల్ల కాంగ్రెస్ కు గాని, తెలుగుదేశానికి గాని ఇవాళ మహారాష్ట్ర సాగిస్తున్న అక్రమాల గురించి, ఉల్లంఘనల గురించి మాట్లాడే నైతిక అధికారం లేదు. ఆ నైతిక అధికారం సంగతి కూడ పక్కనపెట్టి, గుర్తించవలసిన అసలు ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి.గోదావరి జలాల వినియోగం కోసం మొట్టమొదటి అంతర్రాష్ట్ర ఒప్పందం ప్రణాళికా సంఘం ఆధ్వర్యంలో 1951 జులైలో అప్పటి బొంబాయి, మద్రాసు, హైదరాబాదు, మధ్యప్రదేశ్, మైసూరు రాష్ట్రాల మధ్య కుదిరింది. అప్పటి అంచనాలప్రకారం 1900 టిఎంసిల జలాలు ఉన్నాయని, అందులో 3 శాతం బొంబాయికి, 26 శాతం హైదరాబాదుకు, 24 శాతం మధ్యప్రదేశ్ కు, 47 శాతం మద్రాసుకు కెటాయించారు. ఆ కెటాయింపులు 25 సంవత్సరాలపాటు ఉంటాయని, ఆతర్వాత సమీక్షించవచ్చునని అనుకున్నారు. కాని నాలుగైదు సంవత్సరాలు తిరగకుండానే ఈ గోదావరి పరీవాహక రాష్ట్రాలలో పునర్విభజన జరిగి రాష్ట్రాల సరిహద్దులే మారిపోయాయి. కొత్త రాష్ట్రాలు పాత ఒప్పందాన్ని తమ ఇష్టారాజ్యంగా వ్యాఖ్యానించడం, పాత ఒప్పందాన్ని మార్చాలని కోరడం వంటి వివాదాలు సాగుతూ వచ్చాయి. ఈ వివాదాలను పరిష్కరించడానికి కేంద్రప్రభుత్వం గాని, ప్రణాళికా సంఘం గాని చేసిన ప్రయత్నాలు ఫలించకపోగా, 1963 మార్చ్ లో అప్పటి కేంద్ర నీటిపారుదల, విద్యుచ్ఛక్తి శాఖల మంత్రి లోక్ సభలో “నా మంత్రిత్వ శాఖ న్యాయ మంత్రిత్వ శాఖతో ఈ వివాదాన్ని పరిశీలింపజేసింది. 1951 ఒప్పందం చట్టపరంగా సంపూర్ణంగా అసమర్థంగా, అమలు చేయడానికి వీలులేనిదిగా ఉన్నదని అభిప్రాయపడుతున్నది” అని ప్రకటించారు.ఈ గందరగోళాల నేపథ్యంలో 1969లో కేంద్ర ప్రభుత్వం ఈ జల వివాదాన్ని పరిష్కరించడానికి ఆర్ ఎస్ బచావత్ నాయకత్వాన ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేసింది. ఆ ట్రిబ్యునల్ విచారణ మొదలయినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్కటే 1951 ఒప్పందం సంబద్ధమైనదని వాదించింది. మిగిలిన రాష్ట్రాల ప్రభుత్వాలన్నీ ఆ ఒప్పందాన్ని ప్రాతిపదికగా తీసుకోరాదని వాదించాయి. ఒకవైపు ట్రిబ్యునల్ విచారణలు జరుగుతుండగానే, ట్రిబ్యునల్ ముందు తమ వాదనలు వినిపిస్తూనే, ట్రిబ్యునల్ కు తమ లిఖిత వాదనలు సమర్పిస్తూనే, మరొకవైపు ద్వైపాక్షిక, బహుముఖ ఒప్పందాలు చేసుకోవడం మొదలు పెట్టాయి.ఈ మధ్య కాలంలోనే ప్రణాళికా సంఘం అనుమతులతో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు గోదావరి జల వినియోగం కోసం నీటి పారుదల పథకాలు తయారు చేసుకుని అమలు చేయడం మొదలు పెట్టాయి.ఇక బచావత్ ట్రిబ్యునల్ కు ఆ రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందాలను ధృవీకరించడం తప్ప గత్యంతరం లేకపోయింది. ఆ విధంగా బచావత్ ఆమోద ముద్ర వేయించుకున్న 1975 అక్టోబర్ ఒప్పందం ఇప్పుడు వివాదాస్పదమైపోయింది. ఆ ఒప్పందం ప్రకారం బాబ్లీ కట్టడానికి వీలులేదని ఆంధ్రప్రదేశ్ వాదిస్తుంటే, ఆ ఒప్పందం ప్రకారమే బాబ్లీ కడుతున్నామని మహారాష్ట్ర వాదిస్తున్నది. ఆ వివాదాన్ని ఎట్లాగూ సుప్రీంకోర్టు తీరుస్తుందిగాని, ఈ లోగా ఆలోచించవలసిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. ఆ 1975 ఒప్పందం ప్రకారమైనా, బచావత్ తీర్పు ప్రకారమైనా ఆంధ్రప్రదేశ్ కు గోదావరి జలాలలో 1480 టిఎంసిల మీద హక్కు ఉంది. ఆ తీర్పు 2000 లో సమీక్షకు రావలసి ఉంది గనుక 1975 నుంచి 25 ఏళ్లలోపల ఈ వాటా వినియోగానికి వీలుగా ఆనకట్టలు కట్టుకోవలసిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం మీద ఉండింది. ఆ 25 సంవత్సరాలలో 13 సంవత్సరాలు కాంగ్రెస్, 12 సంవత్సరాలు తెలుగుదేశం ఈ రాష్ట్రాన్ని పాలించాయి. ఈ 25 సంవత్సరాలలోను కొత్తగా వినియోగంలోకి వచ్చిన వాటా 200 టిఎంసి ల కన్న తక్కువే. మొత్తం ఆంధ్ర ప్రదేశ్ కు అందిన వాటాలో ఇప్పటికీ సగం వాటా కూడ వినియోగం జరగడం లేదు.

గోదావరి జలాల వాటాలో సగం కూడ వినియోగించుకునే ఆలోచనలు చేయకుండా, ఇదే కాలంలో కృష్ణా జలాలలో ఆంధ్రప్రదేశ్ వాటా మొత్త6 811 టిఎంసి వాడుకునే పథకాలు రచించి, వాటిని కూడ ఎగువ జిల్లాలయిన మహబూబ్ నగర్, నల్లగొండలకు కాకుండా, దిగువ ప్రాంతాలకు తరలించడం జరిగింది. బహుశా గోదావరి జలాల వినియోగ ఆలోచనలు జరగకపోవడానికి కారణం గోదావరి పరీవాహకప్రాంతంలో తెలంగాణ ఐదు జిల్లాలుండడమేనా? ఇప్పుడు గోదావరి జలాలను కూడ అటు విశాఖపట్నానికో, కాకినాడ-విశాఖ బహుళజాతి పారిశ్రామిక కారిడార్ కో, ఇటు కృష్ణా డెల్టా స్థిరీకరణకో ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తూ, బాబ్లీ గురించి ఇంత వివాదం రేపడం ఎవరి కళ్లు కప్పడానికి? బాబ్లీ ఎంత అన్యాయమయినా మహారాష్ట్ర చెప్పే లెక్క ప్రకారం అది రెండు టిఎంసిల ప్రాజెక్టు, ఆంధ్రప్రదేశ్ చెప్పే లెక్క ప్రకారం 60 టిఎంసిల ప్రాజెక్టు కూడ కావచ్చు. కాని 600 టి ఎంసిల విషయలో జరిగిన మోసం సంగతి మాట్లాడకుండా, తలకాయలు తెగిపోతుంటే చెవిపోగులకోసం ఏడవడం తగునా?

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Andhra Jyothy, Telugu, Vartamaanam. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s