చిన్నారిపిల్లల కళ్లుపొడిచి…

చెట్లను మరింత మరింత దగ్గరిగా చూడడంలో మైమరిచిపోతూ అడవిని చూడాలనేది విస్మరించడం, దోమలను పట్టుకోవడంలో తలమునకలయిపోతూ ఏనుగులుదూరే కంతలను వదిలివేయడం మనకు ఎంత బాగా అలవాటయిపోయిందో ఇటీవల బయటపడుతున్న ఒక కుంభకోణం తెలియజేస్తోంది. జిల్లా ప్రాథమిక విద్యా కార్యక్రమం (డిపెప్), సర్వశిక్షా అభియాన్ అనే ప్రభుత్వ కార్యక్రమాలలో జరిగిన అవినీతి కథ అది. చిన్నారి పిల్లలకు విద్యావకాశాలు పెంచడానికి, అనేక ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అంతరాలవల్ల చదువుకు దూరమవుతున్న బాలబాలికలకు చదువునివ్వడానికి, చూపునివ్వడానికి ఉద్దేశించిన పథకాలకు తూట్లు పొడిచి చిన్నారిపిల్లల కళ్లుపొడిచిన విషాదగాథ అది. విదేశీ నిధులతో 1994లో ప్రారంభమయి చాలచోట్ల ముగిసిపోయిన డిపెప్ ప్రాథమిక విద్యను ఎంతగా విస్తరింపజేసిందో, ప్రధానంగా కేంద్రప్రభుత్వ నిధులతో, రాష్ట్రప్రభుత్వాల భాగస్వామ్యంతో 2001 నుంచీ నడుస్తున్న సర్వశిక్షా అభియాన్ సర్వులకూ శిక్షణ ఇచ్చిందో శిక్షగా మారిందో తెలియదుగాని వందలకోట్ల ప్రజాధనం కొల్లగొట్టే కార్యక్రమాలుగా మాత్రం మారాయి. చిన్నారిపిల్లలవిద్య పేరుమీద పుస్తకాల వ్యాపారులు, విద్యాపరికరాల వ్యాపారులు, అధికార యంత్రాంగం, అమ్మడానికీ ఇవ్వడానికీ ఏమీ లేకపోయినా విధాన నిర్ణేతలను మాటలతో బురిడీ కొట్టించగల పైరవీకారులూ, నాయకులకూ అధికారులకూ లెక్కప్రకారం వాటాలు పంచిఇవ్వగల ‘నీతిమంతులూ’ కోట్లకు పడగెత్తడానికి ఈ విద్యాపథకాలు రాజమార్గాలుగా తయారయ్యాయి.

ఆ విద్యా కార్యక్రమాల అవినీతి మహాసముద్రంలో పైన తేలిన ఒక అలలో నురుగుమీది ఒకానొక బుడగను బద్దలుకొట్టి ఏదో సాధించామనుకుంటున్న మహాసంరంభం ఇప్పుడు నడుస్తోంది. ఏదో ఒక కుంభకోణమైనా ఏదో ఒకచోటనైనా బహిర్గతం కావడం చాల ఆహ్వానించవలసిన విషయమే. ఈ రెండు విద్యాకార్యక్రమాలకు కలిపి దేశవ్యాప్తంగా సాలీనా ఏడువేలకోట్ల రూపాయల పైనే ఖర్చు అవుతోంది. ప్రతి ప్రభుత్వ పథకంలోనూ ఖర్చుపెట్టే రూపాయిలో 15 పైసలు మాత్రమే నిజమైన లక్ష్యాన్ని చేరుతున్నాయని రాజీవ్ గాంధీ రెండు దశాబ్దాల కింద చేసిన వ్యాఖ్య ఇవాళ్టికీ వర్తిస్తుందని అనుకుంటే, ఈ ఏడువేల కోట్లలో వెయ్యికోట్ల రూపాయలు కూడ నిజంగా చిన్నారి పిల్లల విద్యావకాశాలకోసం ఖర్చు కావడం లేదన్నమాట. రాజీవ్ గాంధీ ఆ మాట అన్నతర్వాత మొదలయిన నూతన ఆర్థికవిధానాల వెల్లువలో దేశంలో అవినీతి, కుంభకోణాలు, అక్రమార్జన, పిడికెడుమంది నాయకుల, అధికారుల విలాసాలు పెరిగిపోయాయని 1996 లో బ్లాక్ ఎకానమీ ఆఫ్ ఇండియా అనే సమగ్ర అధ్యయనంలో ఆర్థికవేత్త అరుణ్ కుమార్ విశ్లేషించారు. ఆ తర్వాత గడిచిన పది సంవత్సరాలలో అవినీతి అక్రమార్జనలు మరింత పెరిగాయేగాని తగ్గలేదు.

మళ్లీ ప్రస్తుత విద్యాపథకాల అవినీతి దగ్గరికే వస్తే, ప్రతి ఏడాదీ వందలకోట్లరూపాయలు కెటాయింపులు జరిగే ఈ కార్యక్రమాల్లో ప్రకటితలక్ష్యాలు ఒక్కటి కూడ సగమో పావో కూడ నెరవేరలేదు సరిగదా, ఆ కెటాయింపుల్లోనుంచి సింహభాగం దొంగవ్యాపారులకు, పైరవీకారులకు, అధికారులకు, రాజకీయనాయకులకు చేరుతోంది. ప్రాథమిక విద్యను సార్వత్రికం చెయ్యాలనే లక్ష్యంతో మొదలయిన డిపెప్ గాని, 2007 నాటికి 14 ఏళ్ల లోపు పిల్లలందరికీ కనీసం ఐదు సంవత్సరాల విద్యను అందించాలనీ, బాలికల పట్ల వివక్షను తొలగించాలనీ, సామాజిక అంతరాలు తగ్గించాలనీ, 2010 నాటికి బడికి వెళ్లని బాలబాలికలు లేకుండా చెయ్యాలనీ లక్ష్యాలు పెట్టుకున్న సర్వశిక్షాఅభియాన్ గాని ఇప్పటివరకూ కేటాయించిన నిధులలో సగమైనా ఆ లక్ష్యాలకోసమే వెచ్చించి ఉంటే ఎంతోకొంత ఫలితాల్ని సాధించి ఉండేవే. కాని ఈ ఉదాత్త ఆదర్శాల పథకాలు మిగిలిన అన్ని ప్రభుత్వ పథకాలలాగనే పందికొక్కుల పాలవుతున్నాయి. ఇప్పుడు ఏదో ఒక కారణం వల్ల ఈ పథకాల కుంభకోణాలు బయటపడినప్పుడు ఈ తీగను లాగి డొంకంతా కదల్చవలసి ఉండింది. ఈ కుంభకోణం ఆలోచనాపరులందరిలోనూ అసలు మొత్తంగా ప్రభుత్వ పథకాలలో పెద్ద ఎత్తున సాగుతున్న అవినీతి గురించి చర్చను రేకెత్తించవలసి ఉండింది.

కాని జరుగుతున్నది వేరు. అది ఒక చెట్టు కొమ్మ మీద ఒకానొక ఆకు గురించి చర్చే తప్ప నిజంగా వేరుగురించి చర్చకాదు. ఈ ఒకానొక అవినీతి కుంభకోణంలో భాగస్తురాలయిన ఒక స్త్రీ పేరు మీద అక్షరక్రీడ దగ్గర ప్రారంభించి ఆమె గతజీవితం మీద, ఆమె సంబంధాలమీద, ఆమె ఇంటిలోని విలాససౌకర్యాలమీద ప్రతిఒక్కరూ అత్యుత్సాహపు పత్తేదార్లుగా మారిపోయారు. ఆమె ప్రభుత్వశాఖలను వంచించడం ద్వారా ఎంత ప్రజాధనాన్ని కొల్లగొట్టిందో, ఎటువంటి ఆర్థిక నేరాలు చేసిందో తేల్చవలసి ఉండగా దానితోపాటుగానో, దాని బదులుగానో ఆమె జీవితం మొత్తంలోనూ ఏయే అనైతికతకు పాల్పడిందో తేల్చడానికి చాలమంది ఉత్సాహపడుతున్నారు ! ఆమె ఆర్థిక అవినీతిని నూటికినూరు శాతం అత్యంత తీవ్రంగా ఖండించవలసిందే. అధికారపీఠంతో సాన్నిహిత్యంవల్ల ఆమె ప్రజాధనాన్ని ఎట్లా కొల్లగొట్టిందో సవివరంగా ప్రజలకు తెలియజెప్పవలసిందే. కాని గతంలో ఆమెకన్న వందలరెట్లో, వేలరెట్లో ప్రజాధనాన్ని కైంకర్యంచేసిన మగమహారాజుల కుంభకోణాలు బయటపడినప్పుడు ఈ విధమైన జీవితకథలు, అనైతికత, సంబంధాలు, ఇళ్లలోని విలాససౌకర్యాలు వగైరా వగైరా కథలు చదివిన గుర్తులేదు. ఒక స్త్రీ ఆర్థిక అవినీతికి పాల్పడి దొరికిపోతే ఆమె గురించి ఏమయినా అనడానికీ రాయడానికీ మనకు లైసెన్సు దొరుకుతుందన్నమాట.నిజానికి డిపెప్ లో, సర్వశిక్షా అభియాన్ లో, ఆ మాటకొస్తే ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యక్రమంలోనూ అవినీతి నిండిపోయింది. పైనుంచికిందిదాకా అవినీతిమయంకాని ప్రభుత్వ పథకం, కార్యక్రమం ఒక్కటికూడ లేదు. రాష్ట్రపతి భవన్ నుంచి గ్రామ పంచాయత్ కార్యాలయందాకా అవినీతి ఆరోపణ లేని ప్రభుత్వసంస్థ ఒక్కటికూడ లేదు. ఇదేదో ఏఒక్క రాజకీయ పక్షానికో గుత్తవ్యవహారం కూడ కాదు. రాష్ట్రాలలోనూ, కేంద్రంలోనూ అధికారపగ్గాలు చేపట్టిన అన్ని పార్లమెంటరీ రాజకీయ పక్షాలూ ఈ అక్రమ సంపాదనకోసం పోటీలు పడుతున్నాయి. స్థాయీభేదాలు, చిన్నగీత-పెద్దగీతలు, దొరికితేనే దొంగ అనే పద్ధతి తప్ప ఈ తిలాపాపంలో తలాపిడికెడు భాగస్వామ్యం వహించని రాజకీయపక్షం ఒక్కటి కూడలేదు. మనరాష్ట్రంలో ముఖ్యమంత్రులుకూడ ఇటువంటి ఆరోపణలను ఎదుర్కొన్నారు. చందారెడ్డి, ధనార్జనరెడ్డి, బిగ్ బాస్ అని పేరు తెచ్చుకున్న ముఖ్యమంత్రులు, దేశదేశాల పెట్టుబడిదారులతో భుజాలు పూసుకు తిరిగి, వారికి రాష్ట్ర సంపదలు దోచిపెట్టిన ముఖ్యమంత్రులు, అధికారులు లెక్కలేనంతమంది ఉన్నారు.

ఆ వేల కోట్ల, వందలకోట్ల రూపాయల అవినీతిని, కుంభకోణాలను ప్రశ్నించకుండా, అసలు విధాన నిర్ణయంలోనే అవినీతికి ఉన్న అవకాశాలను ప్రశ్నించకుండా కిందిస్థాయిలో ఉన్న అవినీతిని ఎంతగా బహిర్గతం చేసినా ఫలితం ఏమీ ఉండదు. చిన్న అవినీతిని కూడ తప్పకుండా ప్రశ్నించవలసిందే, ఎండగట్టవలసిందే, కాని పెద్దల పైస్థాయి అవినీతి పట్ల మౌనం, కిందిస్థాయి అవినీతి పట్ల గర్జనలు మధ్యతరగతికి ఆత్మసంతృప్తిని ఇస్తాయేమోగాని, అవినీతిని నిర్మూలించజాలవు.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Andhra Jyothy, Telugu, Vartamaanam. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s