తీహార్ లో ఆ సభ, చెర్లపల్లిలో ఈ సభ !

“మన జైళ్లలో ఉన్న చాలామంది అక్కడ ఉండవలసినవాళ్లు కాదు. చాలమంది అక్కడ ఉండవలసిన వాళ్లు బయటి ప్రపంచంలో స్వేచ్ఛగా జీవిస్తున్నారు.”

“భారత ప్రధానులుగా పూర్తికాలం పదవిలో ఉన్నవారు నలుగురు. వారిలో ప్రతిఒక్కరి పాలనాకాలంలో అవినీతి ఒక ప్రత్యేకదశకు ఎదిగింది. అందరిలోకీ నీతిమంతుడైన నెహ్రూ మంత్రుల అవినీతిపట్ల సంపూర్ణ సహనం వహించి అవినీతికి సాధికారత కల్పించాడు. ఇందిరాగాంధీ అయితే తన యుద్ధనిధులఖజానాను నింపుకునే క్రమంలో రాజకీయ అవినీతిని వ్యవస్థీకరించింది. రాజీవ్ గాంధీ ఆ పనిని ఎంతదూరం తీసుకుపోయాడంటే, వ్యక్తిగతస్థాయిలో కూడ ఆరోపణలకు గురయి ఆ ఉన్నతస్థానానికి ఎనలేని హాని కలిగించాడు. ఇక పి వి నరసింహారావు ఈ ప్రయాణాన్ని దాని తార్కిక ముగింపుదాకా లాగి అవినీతి అరోపణలపై విచారణను కూడ ఎదుర్కొన్నాడు. రానున్న పూర్తికాలం ప్రధానమంత్రి ఈ దేశాన్ని నేరుగా తీహార్ జైలు నుంచి పాలించే పరిస్థితి రాగూడదని ఆశిద్దాం.” వీటిలో మొదటి వ్యాఖ్య 1978 నాటిది. బీహార్ లోని జైళ్లను పరిశీలించిన అప్పటి జాతీయ పోలీస్ కమిషన్ సభ్యుడు కె ఎఫ్ రుస్తుంజీ ఆ మాట అన్నారు. ఇరవైఏళ్లు గడిచేసరికి, 1998లో, రెండో వ్యాఖ్య వచ్చింది. సుదీర్ఘకాలంపాటు కేంద్రప్రభుత్వ సమాచార, పౌరసంబంధాల శాఖలో అధికారిగా పనిచేసి, పదవీ విరమణ తర్వాత, ప్రసారభారతి ప్రధాన కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తుండిన ఎస్ ఎస్ గిల్ రాసిన ‘ది పాథాలజీ ఆఫ్ కరప్షన్’ పుస్తకంలో ఆ మాట అన్నారు. ఆయన భయపడిన స్థితి ఇంకా రాలేదుగాని, ఆయన వ్యాఖ్య తర్వాత పూర్తికాలం పనిచేసిన ప్రధాని కాలంలో హవాలా, రక్షణశాఖ ముడుపులు, శవపేటికల కుంభకోణాలు దేశాన్ని కుదిపేశాయి.

మరొక పదిసంవత్సరాలు గడిచేసరికి మన రాజకీయ అవినీతి స్థితి మరింత దిగజారి అసలు చట్టసభలన్నీ చెరసాలల్లో జరగడమే సముచితమనిపించే స్థాయికి చేరుకున్నట్టున్నాయి. మహాఘనత వహించిన ప్రజాస్వామ్యం, రెండో పెద్ద ప్రజాస్వామికదేశం, చట్టబద్ధంగా అత్యధిక పౌరుల మద్దతుతో ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, చట్టబద్ధపాలన, విశాలమైన కార్యనిర్వాహకవర్గం, బలమైన న్యాయవ్యవస్థ, నిత్యజాగరూకమైన పత్రికావ్యవస్థ వగైరా వగైరా మాటలతో ఇంతకాలమూ భారతదేశాన్ని అభివర్ణిస్తున్న అమాయకులందరూ ఆ మాటలు ఎంత హాస్యస్ఫోరకంగా ఉన్నాయో తెలుసుకునే సందర్భం వచ్చింది. ప్రశ్నలడగడానికి ముడుపులు వసూలుచేసే ప్రజా ప్రతినిధులను ఇంకా మరిచిపోకముందే, ప్రజా ప్రతినిధులుగా అందిన దౌత్యపరమైన మినహాయింపులను, రక్షణలను వ్యాపార సరుకులుగా మార్చి, నకిలీ పాస్ పోర్టుల తయారీ, మనుషుల అక్రమ రవాణాల ద్వారా సొమ్ము చేసుకుంటున్న శాసన నిర్మాతల వ్యవహారం బయటపడుతోంది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టొరంటో వెళ్లే విమానం ఎక్కబోతుండగా అనుమానంతో అరెస్టు చేయబడిన భారతీయ జనతాపార్టీ లోకసభ సభ్యుడు బాబూభాయి కటారా తో లాగిన తీగ ఇంకా డొంకనంతా పూర్తిగా కదిల్చినట్టులేదు. మరికొన్ని తీగలు కదిలితేగాని నిజంగా అవసరమైన చర్యలు జరిగేటట్టులేవు. తొంభై మంది పార్లమెంటు సభ్యులకు సంబంధం ఉండవచ్చునని వస్తున్న ఊహాగానాలలో సగం నిజమైనా బహుశా పార్లమెంటరీ రాజకీయ పక్షాలలో ఏ ఒక్కటీ ఈ బురదనుంచి తప్పించుకోలేకపోవచ్చు. ఇవాళ నిష్కళంకచరితులమని ప్రగల్భాలు పలుకుతున్నవాళ్లు రేపు దొంగలని తేలిపోవచ్చు. లేదా, అందరూ దొంగలే కనుక, దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్టు గప్ చిప్ సాంబరుబుడ్డి అని గజం మిధ్య, పలాయనం మిధ్య అనవచ్చు.ఇప్పటికి కటారా పట్ల అటు భారతీయ జనతా పార్టీ, ఇటు లోకసభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ, నరేంద్ర పట్ల తెలంగాణ రాష్ట్రసమితి, కాసిపేట లింగయ్య పట్ల పోలీసులు తీసుకుంటున్న వైఖరి చూస్తే ఇటువంటి నేరాన్ని పైపైన చూడడం, సస్పెన్షన్లు, బహిష్కరణలు, క్రిమినల్ నేరాలు వంటి ఉపరితలాన్ని కూడ అంటని పరిష్కారాలు మినహా లోతుగా మరేమీ జరగనున్నట్టులేదు. మరో రెండు మూడు వారాల్లో మన ప్రచారసాధనాలకు మరొక కొత్తొక వింత మోజు దొరుకుతుంది. నకిలీ పాస్ పోర్టుల, మనుషుల అక్రమ రవాణా కుంభకోణం మన మతిమరుపు కాలబిలంలోకి వెళ్లిపోతుంది.

గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరవద్దన్న ప్రాచీన వివేకాన్ని గుర్తు తెచ్చుకుంటూ అయినా సరే మన అవినీతిమయ రాజకీయ వ్యవస్థ అనే గొంగట్లోనే ఈ నకిలీ పాస్ పోర్టుల, మనుషుల అక్రమ రవాణాల సహాయంతో ఏరవలసిన మరికొన్ని వెంట్రుకలున్నాయి. వాటిలో ఆక్రోశంతోనో, ఉక్రోషంతోనో కాశిపేట లింగయ్య వేసిన ఒక ప్రశ్న ముఖ్యమైనది. నిజంగా ఈ కుంభకోణంలో రాజకీయ నాయకుల పాత్ర గురించి మాట్లాడుతున్నంతగా ఇతర రంగాల పెద్దమనుషులగురించి మాట్లాడుతున్నామా? లింగయ్య అడిగినట్టు ఐ ఎ ఎస్, ఐపిఎస్ అధికారులు, సీనియర్ జర్నలిస్టుల పాత్ర ఏమిటి? ఇమిగ్రేషన్ అధికారులు, పాస్ పోర్టు కార్యాలయాలు, ట్రావెల్ ఏజెన్సీలు, మాఫియా, పైనుంచి కిందిదాకా ప్రభుత్వం సహాయం లేకుండా ఈ దుర్మార్గం సాగి ఉండేదేనా? పైపైన కొందరు బలిపశువులను మాత్రం, అదికూడా నాలుగురోజులు ప్రచారసాధనాల ఆర్భాటంలో బలి ఇచ్చినంత మాత్రాన ఈ సమస్య సమసిపోతుందా?ఆ తర్వాత ఆలోచించవలసిన సమస్య మన సామాజిక విలువలకు సంబంధించినది. ఇప్పటికి బయటపడిన పేర్లు భారతీయ జనతాపార్టీ నాయకులవే అయి ఉండడం, లేదా ఇతర పార్టీలలో చేరిన పూర్వాశ్రమ సంఘపరివారానివే అయి ఉండడం వారు గత ఎనిమిది దశాబ్దాలుగా ప్రవచిస్తున్న వ్యక్తిశీలపు విలువలను అపహాస్యం చేస్తున్నాయి. అట్లని ఇతర పార్టీల నాయకులేదో మచ్చలేని మహాత్ములని కాదు. వారిలో అత్యధికులు ఇప్పటికి బయటపడని దొంగలు మాత్రమే. కాని సమాజానికి ఆదర్శవంతులుగా ఉండవలసిన, చట్టసభలలో సమాజాన్ని నడిపే శాసనాలు చేయవలసిన, ప్రజల ప్రతినిధులుగా ప్రజా సమస్యల పరిష్కారాలు కనిపెట్టవలసిన ఈ నాయకులు ఇంతగా అక్రమాలకు, అవినీతికి, నీచత్వానికి ఎందుకు దిగజారుతున్నట్టు? ఇది ఆయా అనుమానితుల ప్రశ్న మాత్రమే కాదు, ఇది సమాజమంతా వేసుకోవలసిన ప్రశ్న. అసలు ఇవాళ్టి రాజకీయరంగమే అవినీతి మయమైపోయిందనే నిర్వేదం సమస్యను పరిష్కరించజాలదు. రాజకీయపార్టీల, నాయకుల డబ్బు అవసరాలు విపరీతంగా పెరిగిపోయి అక్రమార్జన ద్వారా తప్ప సంపాదించడం సాధ్యంకాని స్థితి వచ్చిపడింది. ఒక లోకసభ స్థానానికో, శాసనసభ స్థానానికో ఎన్నిక కావడమంటే కోట్లు పెట్టుబడి పెట్టడమన్న నిర్వచనం ఏర్పడినతర్వాత ఆ పెట్టుబడికి కనీస ప్రతిఫలం రావాలనుకున్నా, పెట్టుబడీ సంపాదించాలి, పైన లాభమూ సంపాదించాలి గనుక అవినీతి తప్పదనే సమర్థనలు ఏ ప్రజాప్రతినిధి అయినా చెపుతారు. ఎన్నికల ఖర్చుతో పాటే, నిరాడంబర జీవనం అనే విలువే చాదస్తమైపోయి, ఎన్ని కోట్లయినా సరిపోని జీవనసరళి గొప్పదనే విలువలు రాజ్యంచేస్తున్నప్పుడు, టీవీకోసమో, రిఫ్రిజిరేటర్ కోసమో, మోటర్ సైకిల్ కోసమో కట్టుకున్న భార్యను చంపినట్టుగానే, భూములకోసమో, భవనాలకోసమో, దేశదేశాల్లో ఆస్తులకోసమో ఆత్మగౌరవాన్ని చంపుకుంటారు, పాస్ పోర్టులను అమ్ముకుంటారు, భార్యాబిడ్డలపేర్లు మారుస్తారు, దేశాన్ని ఏమారుస్తారు.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Telugu. Bookmark the permalink.

4 Responses to తీహార్ లో ఆ సభ, చెర్లపల్లిలో ఈ సభ !

  1. మరి ప్రస్తుత ప్రధాని హయాంలో ఎలా ఉంది, ఎలా ఉండబోతోంది … మీ వ్యాఖ్యానం రాసి వుంటే బాగుండుననిపించింది.

  2. మిత్రులు రానారె గారికి,

    మీ అభిప్రాయానికి కృతజ్ఞతలు. అసలు వ్యాసమే ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఎలా ఉంది అనే విషయం రాయడానికి ఉద్దేశించింది. పాత ప్రభుత్వాల గురించి రెండు ఉటంకింపులతర్వాత ప్రస్తుత స్థితి ఎలా ఉందో రాశాను. చూడండి.

  3. ప్రాథమికంగా మన దేశ పౌరులు ఏమి నేర్చుకోవాలో, ఏది సరైనది కాదని తెలుసుకోవాలో, దేనిని గమనించాలో, దేనిని ఖండించాలో, దేనిని ప్రోత్సహించాలో … చెబుతున్నారు. అందరూ చదివి గమనించవలసిన మీ వ్యాసాలను చదవటానికి చాలా ఇబ్బందిగా ఉంటోంది. చిన్న అక్షరాల వల్ల కావచ్చు, కళ్ళు శ్రమకు గురవుతున్నాయి. పూర్తిగా చదవడం కష్టమౌతున్నది. ఈ విషయం మీరు కాస్త ఆలోచిస్తే మీ ఆలోచనలు మరింత మందికి చేరువ అవుతాయని నా అభిప్రాయం. ఇవి అందరికీ చేరువ కాదగ్గవి.

  4. రానారే గారు
    మీకు అక్షరాలు చిన్నవిగా అనిపించినప్పుడు “control and +” నొక్కండి. తగ్గించటానికి “control and – “నొక్కండి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s