తెరాసకు కొన్ని ప్రశంసలు, కొన్ని ప్రశ్నలు

ఏప్రిల్ 27న తన ఆరవ వార్షికోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి వరంగల్లులో విశ్వరూప ప్రదర్శన జరుపుకుంటున్నది. మూడున్నరకోట్ల తెలంగాణ ప్రజల ప్రగాఢ ఆకాంక్ష అయిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రసాధనే లక్ష్యంగా రూపొందిన తెలంగాణ రాష్ట్రసమితి బతికి బట్టకట్టి ఆరుసంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవసంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆ పార్టీ నాయకత్వానికి, కార్యకర్తలకు, సానుభూతిపరులకు హృదయపూర్వక అభినందనలు తెలపవలసిఉంది.

చరిత్రలో తెలంగాణ ప్రజాప్రయోజనాలే లక్ష్యంగా ఏర్పడిన పార్లమెంటరీ రాజకీయపక్షాలలో ప్రతిఒక్కదాని సగటు జీవితకాలం ఐదుసంవత్సరాలకన్న తక్కువ ఉండడంతో పోల్చిచూసినప్పుడు తెరాస ప్రత్యేకత మరింతగా అర్థమవుతుంది. అట్లాగే ఎన్నికల రాజకీయాలలో ఘనవిజయం సాధించికూడ అసలు తెలంగాణ ఆశయానికే తలవంపులు తెచ్చేలా కాంగ్రెస్ లో విలీనమైపోయిన తెలంగాణ ప్రజాసమితితో పోల్చినప్పుడు కూడ తెలంగాణ రాష్ట్రసమితి విశిష్టత అర్థమవుతుంది. పుట్టిన సంవత్సరమే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల నుంచి 2006 కరీంనగర్ లోకసభ ఉపఎన్నిక వరకూ తెలంగాణ రాష్ట్రసమితి ఎన్నో పరీక్షలలో గణనీయమైన విజయాలు సాధించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను స్థానిక, రాష్ట్ర స్థాయిలో మాత్రమే గాక జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో కూడ విస్మరించడానికి వీలులేని స్థాయిలో స్థాపించింది, విస్తరించింది. లోకసభ, శాసనసభల దగ్గరినుంచి గ్రామస్థాయి సమావేశాలవరకూ అన్నివేదికలనూ ఉపయోగించుకుని సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను బహిర్గతంచేయడంలో ప్రధానపాత్ర వహించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ఆవశ్యకతను తిరుగులేనివిధంగా ప్రకటిస్తూ, అనేక వర్గాల ప్రజానీకాన్ని తెలంగాణ ప్రత్యేకరాష్ట్ర ఆందోళనల్లో భాగం చేయడానికి ప్రయత్నాలు చేసింది. తెలంగాణ ప్రత్యేక అస్తిత్వాన్ని చాటిచెప్పేలా తెలంగాణ సృజనాత్మక వికాసాన్ని ప్రదర్శించిన అనేక సంస్థలకు, సామాజిక సంచలనాలకు బలాన్ని సమకూరుస్తూ, ఎక్కడో ఒకచోట ఆశాహేతువుగా నిలుస్తూవచ్చింది.

అయితే తెలంగాణ రాష్ట్రసమితి తన ఆరు సంవత్సరాల జీవితక్రమంలో చెప్పుకోదగిన విజయాలు ఎన్ని సాధించినప్పటికీ, దాని అపజయాలు, లోపాలు, అసమగ్రతలు కూడ విస్మరించదగినవేమీ కాదు. ఏ సామాజిక సంస్థకయినా, మరీ ముఖ్యంగా మన సమాజంలోని సంక్లిష్ట స్థితిలో పనిచేస్తున్న ఏ రాజకీయ సంస్థకయినా ఒడిదుడుకులు, జయాపజయాలు తప్పనిసరి. మొత్తంలో విజయాల శాతం ఎంత, అపజయాల శాతం ఎంత, గుణాల శాతం ఎంత, లోపాల శాతం ఎంత అని సంయమనంతో కూడిన అంచనా వేయవలసి ఉంటుంది. ఏ రాజకీయ పక్షానికయినా జయాపజయాలు ఉండవచ్చుగాని, దాని దిశ, మైలురాళ్లు ఏమిటనేది ప్రధానం. ఒక రాజకీయ పక్షపు గమనం దాని జయాల వైపుగా సాగుతున్నదా, అపజయాలవైపుగా సాగుతున్నదా అనేది కీలకమైన ప్రశ్న. దాని తాత్విక, రాజకీయ, ఆర్థిక, సామాజిక దృక్పథాలు దాని మార్గాన్ని ఏ విధంగా నిర్దేశిస్తున్నాయో, దాని పనితీరును ఏవిధంగా నిర్ణయిస్తున్నాయో అర్థం చేసుకున్నప్పుడే అది అంతిమంగా విజయం సాధిస్తుందా, అపజయం పాలవుతుందా అర్థమవుతుంది.

అసలు తెలంగాణ రాష్ట్ర సమితి అనే ఒక ప్రాంతీయ రాజకీయ పక్షానికి విజయం అంటే ఏమిటి? దాని విజయం కేవలం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రసాధన అనే లక్ష్యాన్ని సాధించడంలోనే ఉన్నదనే ఒక అసమగ్ర నిర్వచనంద్వారా దాని గమ్యాన్ని కుదించివేయడం జరుగుతున్నది. కాని తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన అనే ప్రకటిత లక్ష్యం అంత సులభమైనదీ కాదు, దానికదిగా ముగిసిపోయేదీ కాదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రసాధన ఆకాంక్ష వ్యక్తమయిన ప్రతి సందర్భంలోనూ ఆ ఆకాంక్ష వెల్లువెత్తడానికి ప్రాతిపదిక అయిన ప్రత్యేక సాంస్కృతిక అస్తిత్వం, యాభై సంవత్సరాల సమైక్య రాష్ట్ర అన్యాయాలు, అవమానాలు, ఉల్లంఘనలు, నీళ్లు-నిధులు-నియామకాలలో అక్రమాలు, తెలంగాణ చరిత్ర విస్మరణ వంటి ప్రస్తావనలు ఎన్నో వస్తున్నాయి. అంటే ప్రత్యేకరాష్ట్రం ఏర్పాటు ఈ అన్యాయాలను సరిచేయడం అనే పెద్దలక్ష్యంలో ఒక భాగమే తప్ప దానికదే ఒక లక్ష్యం కాదు. కచ్చితంగా చెప్పాలంటే తెలంగాణ ప్రజాజీవన అభ్యున్నతి గమ్యమైతే ప్రత్యేకరాష్ట్ర సాధన ఆ గమ్యాన్నిచేరే మార్గం మాత్రమే అవుతుంది.

తెలంగాణ రాష్ట్ర సమితి తన ఆరు సంవత్సరాల ప్రయాణంలో ఈ గమ్యానికీ మార్గానికీ మధ్య ఉన్న తేడాను అప్పుడప్పుడు మరిచిపోతున్నట్టు కనబడుతున్నది. మార్గమే గమ్యమని అనుకుంటున్నట్టున్నది. ప్రజాజీవన అభ్యున్నతి అన్నప్పుడు కూడ దాన్నేమీ సమసమాజ లక్ష్యంతోనో, వర్గపోరాట దృక్పథం నుంచో కూడ చూడనక్కరలేదు. భారత రాజ్యాంగం ప్రవేశికలోనూ, ఆదేశిక సూత్రాలలోనూ ప్రకటించుకున్న ఆదర్శాల ఆవరణలోనే ప్రజాజీవన అభ్యున్నతిని నిర్వచించవచ్చు. రాజ్యాంగ చట్రంలోపల పనిచేసే ఒక రాజకీయ పక్షంగా తెలంగాణ రాష్ట్ర సమితికి ఉండగల పరిమితులను గుర్తిస్తూనే, ఆ పరిమితులలోపల అయినా అది ప్రకటిస్తున్న కొన్ని అవగాహనలు, చేసిన కొన్ని పనులు అసలు తెలంగాణ రాష్ట్ర సాధన ఆశయానికి అనుకూలంగా ఉన్నాయోలేవో పరిశీలించాలి. చేయలేకపోయిన ఒప్పులనూ చేసిన పొరపాట్లనూ లెక్కించాలి.

కాంగ్రెస్ చరిత్ర అంతా తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసిన చరిత్రే అయినప్పటికీ, అప్పటికి తెలంగాణ ప్రధాన శత్రువు అయిన తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా 2004 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడంలో తెరాస పార్లమెంటరీ రాజకీయ విజ్ఞతను ప్రదర్శించింది. కాని అదేసమయంలో కాంగ్రెస్ జిత్తులమారితనం పట్ల తగినంత జాగరూకత వహించడంలో తెరాస విఫలమయింది. ఇటు రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ మంత్రివర్గాలలో చేరడంలో చూపినంత ఉత్సాహం, తెలంగాణ రాష్ట్రసాధన ప్రయత్నాలలో చూపకపోవడంతో అధికారంకోసం ఆశయాన్ని తాకట్టుపెడుతున్నదనే విమర్శకు అవకాశం ఇచ్చినట్టయింది. యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ తయారుచేసిన జాతీయ కనీస ఉమ్మడి కార్యక్రమంలో తెలంగాణ గురించి ఒక వాక్యం రాయించగలిగినందుకు ఎన్ని గొప్పలు చెప్పుకున్నా ఆ వాక్యం “ఒక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం వస్తున్న డిమాండును యుపిఎ ప్రభుత్వం అవసరమయిన సంప్రదింపులు, ఏకాభిప్రాయ సాధన సాధించిన తర్వాత తగిన సమయంలో పరిశీలిస్తుంది” అని నాలుగుమెలికలతో ఎప్పటికీ వాస్తవం కాజాలని పద్ధతిలో రాయబడింది. తెరాస తలచుకుంటే ఆ వాక్యంలోని హామీ మరింత స్పష్టంగా, నిర్దిష్టంగా, మెలికలు లేకుండా ఉండేట్టు చూడడం 2004 మే నాటి స్థితిలో సాధ్యమయి ఉండేది. ఆ పని తెరాస చేయలేకపోయింది.

దేశ చరిత్రలో మరే ఇతర రాష్ట్రం ఏర్పాటు సమయంలోనూ లేని “సంప్రదింపులు, ఏకాభిప్రాయసాధన” ప్రస్తావనలు తెలంగాణ విషయంలోనే ఎందుకువస్తున్నాయో ప్రశ్నించి, నిలదీసి ఆ స్థితిని మార్చేబదులు, తెరాస ఆ వలలో పడిపోయింది. ఆ సంప్రదింపుల, ఏకాభిప్రాయ సాధన బాధ్యతను తానే తలకెత్తుకుంది. తెలంగాణ ఎక్కడ ఉందో, ఎందుకు ప్రత్యేక రాష్ట్రం కావాలో కనీస అవగాహన కూడ లేని ఇతర రాష్ట్రాల రాజకీయ పక్షాల సమ్మతి లేఖలు సంపాదించడంలో విలువయిన కాలాన్ని వృధాచేసింది. ఢిల్లీలో రెండు డజన్ల మంది రాజకీయ నాయకుల అభిప్రాయాన్ని సాధించే పనిలో తలమునకలవుతూ, తెలంగాణలోని మూడున్నరకోట్ల ప్రజల ఆకాంక్షల ప్రకటనకు ఏ కార్యక్రమాన్నీ సూచించలేని స్థితిలో పడిపోయింది.
కాంగ్రెస్ కుట్రపూరిత, తెలంగాణ వ్యతిరేక స్వభావాన్ని పసిగట్టలేకపోయినందువల్లనే ఒకవైపు కాంగ్రెస్ వేసే ఉపసంఘాలమీద మితిమీరిన నమ్మకం పెట్టుకోవడం, మరొకవైపు తెలంగాణ భవిష్యత్తును కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పాదాల దగ్గర పెట్టడం జరిగాయి. కాంగ్రెస్ చరిత్రలో తెలంగాణ విషయంలో 1953-56 మధ్య, 1969-73 మధ్య జరిగిన తతంగాల మీద అవగాహన ఉన్నవారెవరయినా ఈ ఉపసంఘాల, సంప్రదింపుల, సూత్రాల ఆకర్షణలను నమ్మజాలరు. ఇక మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ఆదేశాలను కూడ ధిక్కరించి స్టేట్ కాంగ్రెస్ ఏర్పరచి, సత్యాగ్రహాలు జరిపిన ఘనచరిత్ర ఉన్న తెలంగాణను సోనియా గాంధీ పాదాలదగ్గర పెట్టడం ఎంత సబబో తెరాస ఎప్పటికయినా చరిత్రకు జవాబు చెప్పవలసే ఉంటుంది.
తెరాస అగ్రనాయకత్వం లాబీయింగ్ పేరిట, ఏకాభిప్రాయసాధన పేరిట ఢిల్లీలో రెండుసంవత్సరాలకు పైగా కాలయాపన చేస్తుండగా, రాష్ట్ర మంత్రివర్గంలో చేరిన తెరాస నాయకత్వం, శాసనసభ్యులు ఆ రెండు సంవత్సరాలలో తెలంగాణ ప్రయోజనాలకొరకు చేయగలిగిన పోరాటమయినా చేశామని చూపలేకపోయారు. కనీసం ప్రధాన సమస్యలయిన పులిచింతల, జీవో 610 వంటివాటి విషయంలోనైనా మంత్రివర్గ సమావేశాలలోనైనా అసమ్మతి ప్రకటించిన దాఖలాలు లేవు. తెరాస అసమ్మతి తెలిపినంతమాత్రాన ప్రభుత్వ నిర్ణయాలు ఆగిపోకపోవచ్చు, మిశ్రమ మంత్రివర్గంలో కాంగ్రెస్ తన పశుబలంతో తన కోస్తాంధ్రపాలకవర్గాల అనుకూల విధానాలనే అమలు చేసిఉండవచ్చు. కాని తెలంగాణ ప్రజాప్రతినిధులు మిశ్రమ మంత్రివర్గంలో భాగస్వాములుగా ఆ తెలంగాణ వ్యతిరేక నిర్ణయాలమీద తమ ఆమోద ముద్ర వేసినట్టయింది.

అంతర్గతంగా వెన్నుపోట్లు, అసమ్మతులు అలా ఉండగానే, కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఆ రెండు సంవత్సరాలలో చేసిన పాపాలకు మంత్రివర్గం నుంచి వైదొలగడమే ఒక ప్రాయశ్చిత్తంగా ప్రజలు భావించారు. ఎన్ని అసంతృప్తులతోనైనా తెరాసను మళ్లీ ఆదరించారు. కరీంనగర్ లోకసభ ఉపఎన్నిక ఒకరకంగా తెరాసకు మళ్లీ ప్రాణం పోసింది. ఆ సందర్భంలోనైనా తన గమనాన్ని, పనితీరును ఒకసారి పునఃపరిశీలించుకుని తెలంగాణ ప్రయోజనాలకు మరింత దృఢంగా కట్టుబడడం ఎట్లాగో తెరాస ఆలోచించుకుని ఉండవలసింది. తానే పెట్టుకున్న లక్ష్యాలను సాధించడానికి చేపట్టవలసిన పోరాట రూపాలేమిటో, నిర్మాణ రూపాలేమిటో కనిపెట్టి ఆచరణలోకి తేవలసి ఉండింది. నిజానికి కరీంనగర్ ఎన్నికల ఫలితాల తర్వాత తెరాస ప్రకటించిన గొప్ప పోరాటరూపం మహారాస్తారోకో. ఆ పోరాటరూపం సాధించిన బ్రహ్మాండమైన విజయంతో తెరాస దృష్టి ప్రజలను మరింత ఎక్కువగా భాగస్వాములను చేసే ఆందోళనారూపాలవైపు మళ్లవలసిఉండింది.

కాని మొదటినుంచీకూడ ప్రజలభాగస్వామ్యాన్ని, ఆందోళనలను, ఉద్యమరూపాలను దూరం పెడుతూ వచ్చిన తెరాస చాల ఆహ్వానించదగిన పోరాటరూపాలను ఎంచుకుని అమలుచేసినప్పుడుకూడ వాటిని ప్రదర్శనప్రాయం, నామమాత్రం చేసింది. నిజంగా ప్రజల చొరవను పెంచడం పట్ల, ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమాలు నడపడం పట్ల అగ్రనాయకత్వానికి ఆసక్తి లేదనే విమర్శలకు బలం చేకూరేటట్టుగానే నాయకత్వం ప్రవర్తించింది. ఒకవైపు ప్రజలను కదల్చి ఉద్యమాలు నడపకపోవడం, విస్తృత ప్రజా పోరాటరూపాలు చేపట్టకపోవడంతోపాటు కిందిస్థాయి నాయకత్వాన్ని అభివృద్ధి చేసేలా నిర్మాణాలను ఏర్పరచకపోవడం ఈ విమర్శలకు మరింత బలం చేకూర్చాయి. ఆరు సంవత్సరాలపాటు నడిచిన, విస్తృత ప్రజా మద్దతు ఉన్న రాజకీయ పక్షానికి ఇంతవరకూ రాష్ట్రస్థాయిలో ఒక నామమాత్రపు కార్యవర్గం మినహా మరే ప్రాంతీయ, జిల్లా, మండల, గ్రామ స్థాయి నిర్మాణాలు లేకపోవడం ఆశ్చర్యకరం. ఇది అధినాయకుడి నిరంకుశత్వానికి నిదర్శనమని విమర్శకులు అనేమాట ఎట్లా ఉన్నా, సంస్థాగత పటిష్టతకు చిహ్నమైతేకాదు.
ప్రజల భాగస్వామ్యం గురించి మాట్లాడేటప్పుడు తెరాస సాధించిన విజయాలలో అది విభిన్న ప్రజా సమూహాలలోకి చొచ్చుకుపోవడాన్ని అభినందిస్తూనే తెలంగాణ ప్రజలలో అతి ముఖ్యమైన ప్రజా సమూహాలలో కొన్నిటిలో అది ప్రవేశించలేకపోవడాన్ని, ప్రవేశించినచోట్ల కూడ నామమాత్రంగా మాత్రమే ఉండడాన్ని కూడ పరిగణనలోకి తీసుకోవాలి. ఉదాహరణకు, తెలంగాణ జనాభాలో గణనీయమైన భాగమైన ముస్లిం మైనారిటీలను ఆకర్షించడంలో తెరాస వెనుకబడిపోవడం మాత్రమే కాదు, హైదరాబాదు మతకల్లోలాలలో ముస్లింల ఊచకోతలకు కారకుడని పేరుపడిన ఒక మాజీ సంఘ పరివార్ నాయకుడిని తన అగ్రనాయకుడిగా చేసుకున్నది. ఆ అగ్ర నాయకుడు ఇవ్వాళ్టికీ వినాయక నిమజ్జనం గురించి మాట్లాడినప్పుడు తన ముస్లిం వ్యతిరేకతను ప్రకటిస్తూనే ఉన్నాడు. అటువంటి నాయకులతో తెలంగాణ అంతటా సాధారణంగానూ, హైదరాబాదులో ప్రత్యేకంగానూ తెలంగాణ ప్రత్యేకరాష్ట్రం పట్ల ముస్లింలలో ఆదరణ సంపాదించడం అసాధ్యం.

అదే విధంగా, తెలంగాణ జనాభాలో అత్యధిక సంఖ్యలో ఉన్న ఆదివాసుల గురించి కూడ ప్రత్యేక రాష్ట్రం ఏమిచేయబోతున్నదో ఇప్పటికైతే స్పష్టంగా లేదు. అందువల్లనే ఆదివాసుల భాగస్వామ్యం ఉండవలసినంతగా ఉండడం లేదు. అట్లాగే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో మహిళల పాత్ర కూడ ఉండవలసినంతగా ఉండడం లేదు. ఆయా ప్రత్యేక సమూహాలు, ప్రజాసంఘాలు, బుద్ధిజీవుల సంఘాలు ఎటువంటి పాత్ర నిర్వహించినప్పటికీ, ఒక రాజకీయ పక్షంగా ఈ సమూహాలన్నిటినీ కలుపుకుపోవలసిన, అందరికీ కార్యక్రమం అందించవలసిన స్థితిలో తెరాస ఉండి ఉండవలసింది.
విభిన్న ప్రజా సమూహాలను ఉద్యమంలో భాగస్వాములను చేయలేకపోవడం, విభిన్న అభిప్రాయాలకు నిర్మాణంలో తావుఇచ్చి, సృజనాత్మక వికాసానికి అవకాశం ఇచ్చేలా ప్రవర్తించకపోవడం ఒక ఎత్తు అయితే, అగ్రనాయకులు అప్పుడప్పుడు ఉపయోగించిన భాష, తెలంగాణ ప్రయోజనాలతో ఎటువంటి సంబంధంలేని వ్యక్తిగత నిర్ణయాలు తెలంగాణ అభిమానులలో కూడ నిరాశకు దారితీశాయి. ఒక ప్రముఖమైన ఉదాహరణ చెప్పాలంటే ఏ రకంగా చూసినా తెలంగాణకు ప్రథమ శత్రువులలో ఒకరిగా నిలిచే కోస్తాంధ్ర పాలకవర్గ ప్రతినిధి ఒకరు ఒక ఆర్థిక నేరానికి పాల్పడి అది బయటపడినప్పుడు, ఏమీ సంబంధంలేకపోయినా ఆ ఆర్థిక నేరస్తుడిని సమర్థించడానికి తెరాస అగ్రనాయకులు ఉత్సాహపడ్డారు.

జీవో 610 అమలుకాకుండా తెలంగాణలో ఉద్యోగాలను ఆక్రమించుకున్న కోస్తాంధ్ర ప్రాంతపు ఉద్యోగులను కనిపెట్టి వారిని స్వస్థలాలకు పంపించివేయాలని ఏదో ఒకస్థాయిలో ప్రకటిస్తున్న తెరాస, తెలంగాణలో వేలాది ఎకరాల భూములు ఆక్రమించుకున్న వారి భూములు స్వాధీనంచేసుకుని వెనక్కి పంపించాలనే డిమాండుపై మాత్రం నీళ్లు నములుతున్నది. నిజానికి 1956 పెద్దమనుషుల ఒప్పందంలోనే తెలంగాణలో భూముల క్రయవిక్రయాలపై తెలంగాణ ప్రాంతీయ మండలి నింయంత్రణ ఉండాలనే షరతు ఉంది. ఆ ఒప్పందసూత్రాన్ని ఉపయోగించుకుని తెలంగాణలో అన్యాక్రాంతమైన భూములన్నిటినీ ఒకసారి సమీక్షించవచ్చు. అటువంటి సమీక్ష జరిపి, తెలంగాణేతరుల అధీనంలో ఉన్న లక్షలాది భూములను స్వాధీనంచేసుకుని తెలంగాణ ప్రజలకు పునఃపంపిణీ చేయకపోతే తెలంగాణ ప్రత్యేకరాష్ట్రం ఏర్పడికూడ ప్రయోజనమేమీ ఉండదు. కావాలంటే తెలంగాణేతర చిన్న రైతులకు, బతుకుతెరువుకోసం వచ్చిన వారికి మినహాయింపు ఇవ్వడం గురించి ఆలోచించవచ్చు. కాని తెరాస నాయకత్వం మాత్రం వేలఎకరాలు, అదీ హైదరాబాదులో ఆక్రమించికూచున్నవారికి అనుకూలంగా అనేకసార్లు ప్రకటనలు చేసింది. ఒకవైపు చిరుద్యోగులమీద కత్తి ఝళిపిస్తామని హెచ్చరించడం, భూస్వాములమీద, సంపన్నులమీద కనికరం చూపుతామని హామీ ఇవ్వడం ప్రత్యేకరాష్ట్ర ఆకాంక్షలకు పునాదిగా ఉన్న ప్రజా ప్రయోజనాలకు అనుగుణమైన వాదనలు కావు.

ఇలా ఈ ఆరు సంవత్సరాల తెరాస ప్రయాణంలో అనుకూల అంశాలూ ప్రతికూల అంశాలూ కలగలిసి ఉన్నాయి. అనుకూల అంశాలను పెంపొందించుకుంటూ, ప్రతికూల అంశాలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతూ ముందుకుసాగినప్పుడే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన అనే లక్ష్యానికి చేరువకావడం మాత్రమే కాదు, ఆ ప్రత్యేకరాష్ట్ర పాలన ప్రజానుకూల పాలన కావడానికి అవకాశం ఏర్పడుతుంది. తెలంగాణ తేవడం ఎట్లా అని ఆలోచించడం ఎంత ముఖ్యమో తెలంగాణ తేవడం ఎందుకు అని ఆలోచించడం కూడ అంతే ముఖ్యం. ఆ ముఖ్యమైన ఆలోచనలతో మునుసాగినప్పుడే తెరాస పడవ తీరంచేరుతుంది.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Telangana, Telugu. Bookmark the permalink.

One Response to తెరాసకు కొన్ని ప్రశంసలు, కొన్ని ప్రశ్నలు

  1. veeresh says:

    jai telangana jai jai telangana

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s