మన గీతాజోహ్రీ ఎక్కడ?

యునాని చికిత్స కోసం భార్య కౌసర్‌ బీని హైదరాబాద్‌నుంచి మహారాష్ట్రలోని సాంగ్లీకి తీసుకువెళుతున్న ఒక సాధారణ ముస్లిం యువకుడు సొహ్రాబుద్దీన్‌ షేక్‌ను 2005 నవంబర్‌ 22 రాత్రి మార్గమధ్యంలో ఆగంతకులు అడ్డుకున్నారు. వారివెంట ఉన్న సొహ్రాబుద్దీన్‌ స్నేహితుడు తులసీరాం ప్రజాపతిని కూడా పట్టుకుపోయారు. ఆ ఆగంతకులు తాము పోలీసులమని చెప్పినమాట మినహా వారు నిజంగా ఎవరో, ఆ ముగ్గురినీ ఎక్కడికి పట్టుకుపోయారో అప్పటికి ఎవరికీ తెలియదు. కాని మూడు రోజుల తర్వాత సొహ్రాబుద్దీన్‌ అహ్మదాబాద్‌ శివార్లలో ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన తీవ్రవాదిగా శవమై మిగిలాడు. పోలీసులు అల్లిన కథలో నాయకుడిగా, గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని హత్యచేయడానికి కుట్ర పన్నుతున్న లష్కర్‌ ఎ తొయెబా తీవ్రవాదిగామిగిలాడు.

కౌసర్‌బీ ఏయే హింసలకు, అత్యాచారాలకు బలి అయిందో, ఎట్లా హత్య చేయబడిందో తెలియదుగాని ఇప్పటికి మృతదేహం ఆనవాళ్లు కూడా దొరకని అసంఖ్యాక అదృశ్యవ్యక్తుల జాబితాలో చేరిపోయింది. ప్రజాపతిని ఆ తర్వాత చంపివేసి మ రొక కట్టుకథ అల్లారని ఒక్కొక్కటిగా బయటపడుతున్న వార్తలు తెలుపుతున్నాయి. సొహ్రాబుద్దీన్‌ సోదరుడు సుప్రీంకోర్టుకు పంపిన అభ్యర్థనల వల్ల, సుప్రీంకోర్టు ప్రదర్శించిన ఆశ్చర్యకరమైన ఔదార్యంవల్ల (ఇదే సుప్రీం కోర్టు ఆంధ్రప్రదేశ్‌ ఎన్‌కౌంటర్లగురించి అరడజను అభ్యర్థనలను పక్క న పడేసింది! ఎన్‌కౌంటర్‌ హత్యలుచేసిన అధికారులకు పదోన్నతి ఇవ్వ డం సమర్థనీయమేనన్నది!), గుజరాత్‌ పోలీసు శాఖలో మానవత్వం మిగిలిన గీతా జోహ్రి వంటి అధికారులు ఒకరిద్దరయినా ఉన్నందువల్ల గుజరాత్‌ పోలీసు ఉన్నతాధికారులు డిజి వంజారా, రాజకుమార్‌ పాం డియన్‌, రాజస్థాన్‌ పోలీసు అధికారి ఎంఎన్‌ దినేష్‌ కుమార్‌ సస్పెన్షన్‌కు గురయి, హత్యానేరం మీద విచారణకు బోనెక్కబోతున్నారు.

సొహ్రాబుద్దీన్‌ ఈ దేశంలో ఎన్‌కౌంటర్‌ పేరిట జరుగుతున్న సుదీర్ఘమైన హత్యల జాబితాలో మొదటివాడూ కాదు, బహుశా చివరివాడూ కాదు. కాని చిన్నచిన్న ఓదార్పులకు కూడా సంతోషించవలసిన దౌర్భాగ్యంలో ఉన్న ఈ సమాజానికి ఈ మాత్రం ఉపశమనమైనా గొప్పగానే కనబడుతున్నది. సొహ్రాబుద్దీన్‌ ఉదంతం బయటపడిన నాటినుంచీ, దేశంలోనూ, రాష్ట్రంలోనూ ప్రతిస్పందిస్తున్న పత్రికలనూ, మేధావుల నూ, వారి అభేద్యమైన మతిమరుపునూ చూస్తుంటే ఇంత విషాదం లోనూ హాస్యం చిప్పిల్లుతున్నది. ఈ దేశంలో సొహ్రాబుద్దీన్‌ కంటె ముందు బూటకపు ఎన్‌కౌంటర్లే జరగనట్టు, ఇదే మొదటి బూటకపు ఎన్‌కౌంటర్‌ అయినట్టు హాహాకారాలు వినబడుతున్నాయి.

గుజరాత్‌ పోలీసు అధికారుల దుర్మార్గాలగురించి ఇవాళ హఠాత్తుగా గళమెత్తుతున్నవాళ్లు అంతకు మించిన దుర్మార్గాలు మనపక్కనే జరగడం లేదన్నట్టు, తమకు కనబడటంలేదన్నట్టు నటిస్తున్నారు. నిజానికి ఈ దేశం లో ఎన్‌కౌంటర్‌ పేరుతో ప్రత్యర్థులను హతమార్చే పాలకవిధానం కొత్తది కాదు. బ్రిటిష్‌ వలస పాలన నుంచి ఎరువుతెచ్చుకున్న ఆ మాట సాయంతో, తమకు గిట్టని వారందరినీ తుదముట్టించే పనిని పోలీసులకు అప్పగించి పబ్బం గడుపుకుంటున్నారు పాలకులు. జమ్ము-కాశ్మీర్‌లో భారతపాలనను వ్యతిరేకిస్తున్న ముస్లింలు వేలా దిమంది బూటకపు ఎన్‌కౌంటర్లలో చనిపోయారు. ఉత్తరప్రదేశ్‌లో వం దలాదిమందిని బందిపోట్లుగా చిత్రించి ఎన్‌కౌంటర్ల పేరుమీద చంప డం జరిగింది.

మహారాష్ట్రలో పోలీసులకు మామూళ్లు సరిగా ఇవ్వని మాఫియా నాయకులను, ఒక మాఫియా దగ్గర డబ్బులు తీసుకుని మరొక మాఫియాను అంతమొందించడం ఎన్‌కౌంటర్ల పేరుమీద జరిగింది. పంజాబ్‌లో చంపదలచుకున్నవారందరికీ ఖలిస్తానీల పేరుపెట్టి ఎన్‌కౌంటర్లలోనే అంతమొందిస్తున్నారు. గుజరాత్‌లోనూ ఇటువంటి ఎన్‌కౌంటర్‌ హత్యలకు లెక్కలేదు. అన్ని రాష్ట్రాలలోనూ పోలీసు అధికారులలో ‘ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టు’లనబడేవాళ్లున్నారంటే, ప్రస్తుత గుజరాత్‌ కేసులో సుప్రీంకోర్టులో వాదిస్తూ అటార్నీ జనరల్‌ మిలన్‌ బెనర్జీ పోలీసులను ‘కిరాయి హంతకులు’గా అభివర్ణించాడంటే ఈ దేశ దుస్థి తి ఏమిటో అర్థమవుతుంది. ఇక మన రాష్ట్రం సంగతి చెప్పనే అక్కరలేదు. విప్లవకారులను నిరాయుధంగా ఉన్నప్పుడు పట్టుకుని ఉద్దేశ్యపూర్వకంగా కాల్చి చంపి ఎన్‌కౌంటర్‌ కట్టుకథ అల్లడం అనుదిన బహిరంగ రహస్యమే.

విప్లవకారులకు సహకరిస్తున్నారనే అనుమానంతో సాధారణ ప్రజలను చంపిన ఉదాహరణలకు కొదవలేదు. జర్నలిస్టు గులాం రసూల్‌ను చంపదలచినప్పుడు అల్లినది కట్టుకథే. ఆయనతోపాటు ఉన్న పాపానికి, సాక్ష్యం లేకుండా చేయడానికి చంపబడిన విజయ ప్రసాద్‌, విప్లవ నాయకుడు భానుప్రసాద్‌తోపాటు ఉండటం వల్ల చంపబడిన ట్రాన్స్‌పోర్టు ఆపరేటర్‌ నాగార్జునరెడ్డి, రాత్రిపూట కరెంటు కోసం పొలానికిపోతూ అనుమానంతో చంపబడిన రైతు, శ్రీరామ నవమి సాంస్క­ృతిక ప్రదర్శన ఇచ్చివస్తూ చంపబడిన కళాకారుడు, ఐఎస్‌ఐ పేరుపెట్టి చంపబడుతు న్న అమాయక ముస్లిం యువకులు, భద్రాచలంలోని హోటల్‌ గదిలో ఉండి తలుపుతెరవగానే కాల్చి చంపబడిన ఇన్‌స్పెక్టర్‌.. మన రాష్ట్రంలో సొహ్రాబుద్దీన్‌లకు, కౌసర్‌బీలకు, తులసీరామ్‌ ప్రజాపతులు ఎన్ని వేలమందో… సొహ్రాబుద్దీన్‌ ఉదంతంతో ధైర్యం వచ్చిన ఎంతోమంది తల్లిదండ్రు లూ, కుటుంబసభ్యులూ తమ ఆత్మీయులకు కూడా ఇటువంటి అన్యాయాలు జరిగాయని, వాటిని కూడా తవ్వితీయాలని, సొహ్రాబుద్దీన్‌ వి షయంలో మరణానంతరం జరుగుతున్న న్యాయం తమవారికి కూడా దక్కాలని కోరుతున్నట్టు దేశమంతటినుంచీ, రాష్ట్రంలోనూ వార్తలు వస్తున్నాయి.

అటువంటి దుర్మార్గాలన్నీ బయటపడితే, బహుశా స్వ తంత్రభారత చరిత్రలో అతిపెద్ద హత్యాకాండ గురించిన వాస్తవాలు వెల్లడవుతాయి. పోలీసు అధికారులు చట్టాన్ని అమలు చేసే ఒకానొక రాజ్యాంగ విభాగంగా కాక, ఇష్టారాజ్యంగా అధికారాన్ని చలాయించగల నిరంకుశ సామంతప్రభువుల్లా ఎటువంటి అమానుష కృత్యాలకు పాల్పడ్డారో, తమ అక్రమార్జన సాగించుకునే కార్యక్రమంలో తలమునకలవుతూ రాజకీయ నాయకత్వం పోలీసులను ఏ విధంగా దేశంమీది కి వదిలిందో, ఈ క్రమంలో న్యాయానికీ, సమాజానికీ, పరిపాలనకూ ఏమి జరిగిందో బయటపడుతుంది. తెలుగు నేలమీద వంజారాలూ, పాండియన్లూ, దినేష్‌కుమార్లూ లెక్కలేనంతమంది ఉన్నారు.

వారిచేతిలో 1968 నుంచి ఇప్పటివరకూ నక్సలైట్లూ, నక్సలైటు సానుభూతిపరులూ మూడువేలకు పైగా, ఏ రాజకీయాలూ లేకపోయినా స్థానిక రాజకీయ నాయకులకో, పోలీసు అధికారులకో కంట్లో నలుసులుగా మారినవాళ్లు కనీసం వెయ్యిమంది బూటకపు ఎన్‌కౌంటర్లలో చనిపోయి ఉంటారు. కాని తెలుగుజాతి దురదృష్టమేమిటంటే నిజాన్ని నిర్భయంగా చెప్పగల, అన్యాయం చేసినది తమ శాఖవాడే అయినా ధైర్యంగా న్యాయపక్షాన నిలబడగల గీతా జోహ్రీలు ఒక్కరుకూడా లేకపోవడమే. నిజంగానే ఇంత బలమై న ఉద్యమాలు ఉన్న ఈ నేలలో ఒక్క అధికారి కూడా న్యాయంవైపు, అమాయకుల హత్యలను ఖండించేవైపు లేకపోవడం ఎంత విచారకరం!

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Andhra Jyothy, Telugu, Vartamaanam. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s