ఇరవైఐదుసంవత్సరాల తెలుగుదేశం ఉత్థానపతనాలు

అప్పటికి ముప్పై సంవత్సరాలుగా తెలుగు సినిమా రంగంలో తిరుగులేని అభిమాన నాయకుడిగా, దైవపాత్రలు పోషించి దైవసమానుడిగా లక్షలాది అభిమానులను సంపాదించుకున్న నందమూరి తారకరామారావు 1982 మార్చ్ 29 న తెలుగుదేశం అనే ప్రాంతీయ రాజకీయపక్షాన్ని ప్రారంభిస్తున్నానని ప్రకటించినప్పుడు అది ఎక్కువకాలం మనబోయే ప్రతిపాదన కాదని చాలమంది విశ్లేషకులు భావించారు. ఒక సినిమాతార పట్ల ప్రజలలో ఉండే వేలంవెర్రి అభిమానం వేరని, అది రాజకీయ నాయకత్వానికి పనికి రాదని చాలమంది భావించారు. కాని ఆ రాజకీయపక్షం తొమ్మిదినెలల కాలంలోనే, 1983 జనవరి 8న ప్రభుత్వాన్ని స్థాపించగలిగింది. మరొక ఏడాదిన్నర తర్వాత భారీ వెన్నుపోటుకు గురయికూడ ఇతర ప్రతిపక్షాల మద్దతుతో, ప్రజాఉద్యమంతో తన అధికారాన్ని పునరుద్ధరించుకోగలిగింది. ఆ అధికారాన్ని మరొక ఐదు సంవత్సరాల తర్వాత కోల్పోయినప్పటికీ, ఆ మరుసటి ఎన్నికలలో తిరిగి అధికారాన్ని సంపాదించడం మాత్రమే గాక అంతర్గత ఘర్షణలను కూడ తట్టుకుని మరొక రెండు దఫాలు రాజ్యంచేసింది. రెండున్నర దశాబ్దాలు రాష్ట్రాన్ని అప్రతిహతంగా పాలించిన కాంగ్రెస్ పార్టీని శాసనసభలో పదోవంతుస్థానాల స్థితికి నెట్టివేసింది. రాష్ట్రంలోని ఆర్థిక, రాజకీయ, సామాజిక వ్యవస్థలలో పెనుమార్పులను తీసుకువచ్చింది. రాష్ట్రంలోనే గాక దేశరాజధానిలో కూడ చక్రంతిప్పే స్థాయికి ఎదిగి జాతీయ ఐక్యసంఘటనలలో, కూటములలో ప్రధాన పాత్ర వహించింది.

ఈ క్రమంలో పార్టీ ప్రారంభమయినపుడు ఎన్.టి రామారావుకు సహచరులుగా నిలబడినవారెందరో పార్టీకి దూరమయ్యారు. స్వయంగా స్థాపకుడు రామారావు మీదనే తిరుగుబాటు జరిగి పార్టీ పూర్తిగా మరొకరి చేజిక్కింది. స్థాపకుడి చిత్రపటం పార్టీకి అలంకారప్రాయంగానే మిగిలిపోయింది. ప్రారంభించినప్పుడు ప్రకటించుకున్న ఆదర్శాలకూ పావు శతాబ్దం తర్వాత అధినాయకులు మాట్లాడుతున్న మాటలకూ హస్తిమశకాంతరం ఉంది. తెలుగుజాతి అత్మగౌరవాన్ని పునరుద్ధరిస్తామని, ఢిల్లీ అధికారాన్ని కూడ సహించబోమని గర్జిస్తూ ప్రారంభమైన పార్టీ దేశదేశాల సంపన్నులకు, వాషింగ్టన్ అధికారానికి, ప్రపంచబ్యాంకు ఆదేశాలకు రాష్ట్ర ఆర్థిక, సామాజిక, రాజకీయ వ్యవస్థలను దాసోహం చేసివేసింది. కాంగ్రెస్ పాలనలో కన్న ఎక్కువగా రాష్ట్రాన్ని బానిసత్వంలోకి నెట్టివేసింది. చలనశీలమైన తెలుగుసమాజంలో కొత్త ఆలోచనలు, ప్రశ్నలు తలెత్తడానికి వీలులేనంత నిర్బంధాన్ని ప్రయోగించింది. ప్రపంచీకరణ విధానాలతో, అంతర్జాతీయ బేహారులకు అనుకూలమైన విధానాలతో వేలాదిమంది రైతులు, చేనేత కార్మికులు, విద్యార్థి యువజనులు హత్యలకూ, ఆత్మహత్యలకూ బలి అయిపోయేలా చేసింది.

ఒక కొసన కమ్యూనిస్టుపార్టీలతో మైత్రి నుంచి మరొక కొసన భారతీయ జనతాపార్టీతో పొత్తుదాకా సాగించి రాజకీయ అవకాశవాదానికి చిహ్నంగా నిలిచింది. సామాన్యులే దేవుళ్లు అనే నిర్వచనంతో ప్రారంభమైన పార్టీ అచిరకాలంలోనే ఉన్నవారి పార్టీగా పేరు తెచ్చుకుంది.

ఇప్పుడు ఇరవైఐదు వసంతాల పండుగ జరుపుకుంటున్న తెలుగుదేశం పార్టీ ఈ ఇరవై ఐదు సంవత్సరాలలో పదిహేను సంవత్సరాలు అధికారంలో కొనసాగింది, పది సంవత్సరాలు అధికారానికి బయట ప్రతిపక్షంగా ఉండి పోయింది. ఆ పార్టీ లోపలికి ప్రవేశించిన వాళ్లు ఎంతమందో బయటికి వెళ్లిపోయిన వాళ్లు కూడ అంతమందే ఉన్నారు. ఇతర రాజకీయ పక్షాలమీద, ప్రత్యేకించి దాని బద్ధ శత్రువు అయిన కాంగ్రెస్ మీద ఎన్ని ఆరోపణలు, కుంభకోణాలు, విమర్శలు స్వయంగా తానే చేసిందో వాటన్నిటికీ తాను దూరమని, అతీతమని తెలుగుదేశం చూపుకోలేకపోయింది. రాజకీయాల్లో చేరి లక్షలు, కోట్లు గడించే అరాచక రాజకీయ శక్తుల అవినీతికి అంతిమగీతం పాడడమే తన ఆదర్శమని చెప్పుకున్న తెలుగుదేశం నాయకులు ఏ ఒక్కరి చరిత్రచూసినా ఎటువంటి అక్రమార్జనఎంత పెద్ద ఎత్తున సాగిందో కనబడుతుంది. ఆ ప్రమాణాలతో చూసినప్పుడు కాంగ్రెస్ నాయకులకూ తెలుగుదేశం నాయకులకూ మధ్య స్పష్టమైన విభజన రేఖ ఏమీలేదు.

ఇటువంటి ఒడిదుడుకుల చరిత్ర ఉన్నప్పటికీ తెలుగుదేశం ఒక ప్రధానమైన, ప్రభావశీలమైన రాజకీయ పక్షంగా మనుగడ సాగిస్తూనే ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ తర్వాత అంతటి స్థాయిలో ఉనికి, ప్రాతినిధ్యం, వనరులు, అంగబలం, అర్థబలం ఉన్న రాజకీయ పక్షంగా తెలుగుదేశం మొదటి స్థానంలో కాకపోయినా రెండో స్థానంలో ఉంటూనే ఉంది.

ఇరవై ఐదు సంవత్సరాల కాలం ఒక రాజకీయ పక్షపు జీవితంలో తక్కువేమీ కాదు. ఈ సందర్భంగా దాని జీవితంలో గుర్తించదగిన అంశాలేమిటో, వాటిలో ప్రజానుకూలమైనవేమిటో, ప్రజా వ్యతిరేకమైనవేమిటో విశ్లేషించవలసి ఉంది. తెలుగుదేశం పార్టీ కూడ ఒక పాలకవర్గ పార్టీయేనని, దాని ప్రజానుకూల ప్రకటనలేవైనా ఉన్నప్పటికీ అవి ప్రజలను మభ్యపెట్టడానికి చేస్తున్నవేనని విమర్శ ఒక కొసనా, అది కాంగ్రెస్ నిరంకుశత్వం నుంచి తెలుగు ప్రజలను విముక్తి చేయడానికి ఆవిర్భవించిన ఒక ముక్తిదాత అని, దాని పాలకవర్గ, సంపన్నవర్గ అనుకూలతలు ఒక అనివార్యమైన ఒత్తిడి ఫలితమేనని సమర్థనలు మరొక కొసనా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలనూ ఆచరణనూ మదింపు వేసి ఒక నిర్ధారణకు రావలసి ఉంటుంది. అంత వివరమైన అంచనాకు ఇక్కడ స్థలం సరిపోదుగాని కొన్ని ముఖ్యమైన అంశాలనైనా చర్చించవలసి ఉంది.

మొట్టమొదట తెలుగుదేశం ఉనికిలోకి వచ్చి, తొమ్మిది నెలల కాలంలోనే అధికారానికి రావడానికి దారితీసిన పరిస్థితులేమిటో అర్థం చేసుకుంటే, ప్రజలు దానిమీద ఎందుకు ఆశలు పెట్టుకున్నారో తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ముందునుంచే అటు మద్రాసు రాష్ట్రంలోని తెలుగు జిల్లాలలోనూ, ఇటు హైదరాబాదు రాజ్యంలోని తెలుగుజిల్లాలలోనూ ప్రజలలో కాంగ్రెస్ వ్యతిరేకత విస్తృతంగానే ఉండింది. రెండు చోట్లా కమ్యూనిస్టుల నాయకత్వంలో వీరోచితపోరాటాలు జరిగాయి. అన్ని వర్గాల ప్రజలూ ఆ పోరాటాలలో పాల్గొన్నారు. ప్రజలలో కాంగ్రెస్ వ్యతిరేక, కాంగ్రెసేతర రాజకీయ పక్షాల పట్ల ఆదరణ ఎంత బలంగా ఉండిందో గుర్తించడానికి 1952 ఎన్నికల ఫలితాలను చూడవచ్చు. కోస్తాంధ్ర ప్రాంతంలో 1952 ఎన్నికలలో కాంగ్రెస్ 40 స్థానాలు సాధించి రెండవ స్థానంలో ఉండగా కమ్యూనిస్టుపార్టీ 41 స్థానాలతో మొదటిస్థానంలో నిలిచింది. 1955 మధ్యంతర ఎన్నికలనాటికి కాంగ్రెస్ 119 స్థానాలకు ఎగబాకగా, కమ్యూనిస్టు పార్టీ 15 స్థానాలకు దిగజారింది. కాని వచ్చిన వోట్ల శాతం చూసినప్పుడు ఈ తేడా అంతగా కనబడదు. కాంగ్రెస్‌కు 1952లో 29.97 శాతం, 1955 లో 38.71 శాతం రాగా, కమ్యూనిస్టుపార్టీకి 1952లో 20.09 శాతం, 1955లో 30.82 శాతం వోట్లు వచ్చాయి. తెలంగాణలో 1952 ఎన్నికలలో కాంగ్రెస్‌కు 44 స్థానాలు, నిషేధం వల్ల ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ పేరుతో పోటీ చేసిన కమ్యూనిస్టులకు 37 స్థానాలు వచ్చాయి. 1957 ఎన్నికల్లో కాంగ్రెస్ బలం 68 కి పెరగగా, కమ్యూనిస్టులబలం 22 కు తగ్గింది.

ఆ తర్వాత కూడ అన్ని సార్వత్రిక ఎన్నికలలోనూ, కేవలం 1972లో మినహా, మొత్తం పోలయిన వోట్లలో కాంగ్రెస్ సగం కూడ సాధించుకోలేకపోయింది. కాంగ్రెస్ సంపాదించిన వోట్లు 1962 ఎన్నికలలో 47.3 శాతం, 1967 లో 45.3 శాతం, 1972లో 52 శాతం, 1978లో 39.24 శాతం, 1989లో 48 శాతం, 2004 లో మిత్ర పక్షాలతో కలిపి 48.64 శాతం, సొంతంగా 38.58 శాతం మాత్రమే. ఈ అంకెలనుంచి గుర్తించవలసిన విషయమేమంటే, 1972లో మినహా మిగిలిన అన్ని ఎన్నికలలోనూ ప్రజల్లో కాంగ్రెసేతర పక్షాలకే ఎక్కువ ఆదరణ దొరికింది. 1983 కు ముందు ఈ కాంగ్రెసేతర వోట్లను కైవసం చేసుకునే శక్తి ఉమ్మడి కమ్యూనిస్టుపార్టీకి గాని, విడిపోయిన తర్వాత రెండు కమ్యూనిస్టుపార్టీలకు గాని, భారతీయ జనతాపార్టీకి అప్పటి రూపమైన జనసంఘ్‌కు గాని లేకపోయింది. అందువల్ల ఎన్నికల రాజకీయాలలో 1956 నుంచి 1983 వరకూ కూడ వోట్లలో సాధారణ ఆధిక్యత లేకపోయినప్పటికీ కాంగ్రెస్ అధికారం చేపడుతూ వచ్చింది. అంటే ఒక రకంగా పార్లమెంటరీ రాజకీయ చట్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం లేదనిపించేంత ఖాళీ స్థితి ఒకటి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినతర్వాత 27 సంవత్సరాలపాటు కొనసాగింది.
ఎన్.టి రామారావు చేసిన ప్రయత్నమల్లా ఆ ఖాళీని పూరిస్తానని వాగ్దానం చేసి, ఆ కాంగ్రెసేతర వోటుబ్యాంకును రాబట్టుకోగలగడమే. కాంగ్రెస్ వోటుబ్యాంకులో కూడ కొంత భాగాన్ని ఆకర్షించగలగడమే. మిగిలిన కాంగ్రెసేతర రాజకీయ పక్షాలేవీ ఎప్పుడూ సంయుక్తంగాకూడ 200 స్థానాలకన్న ఎక్కువకు పోటీ కూడ చేయని స్థితి ఉండగా తెలుగుదేశంపార్టీ తన తొలి ఎన్నికల్లోనే 288 స్థానాలకు పోటీ చేసింది. అందువల్ల కాంగ్రెస్‌కు నిజమైన ప్రత్యామ్నాయం కాగలిగిన సత్తా తనకు ఉన్నదని ఒక విశ్వాసాన్ని అది కలిగించగలిగింది.

సరిగ్గా అదే సమయంలో ఎన్.టి రామారావు ప్రకటించిన ఆత్మగౌరవ నినాదం ప్రజలను, వోటర్లను ఆకర్షించింది. ఢిల్లీ పాలకులు దేశాన్ని సమాఖ్యగా భావించడంలేదని, అన్ని జాతుల ఆకాంక్షలను అణగదొక్కుతున్నారని దేశవ్యాప్తంగానే ఉద్యమాలు పెల్లుబుకుతున్న తరుణంలో, పంజాబ్‌లో ఆనందపూర్ సాహిబ్ తీర్మానం ప్రాతిపదికగా ఒక ప్రాంతీయ ఉద్యమం రూపు దిద్దుకుంటున్న తరుణంలో ఈ తెలుగుజాతి ఆత్మగౌరవ నినాదానికి గౌరవాదరాలు దక్కాయి. ఎమర్జెన్సీ అనంతర కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు ఇంకా వీస్తున్న స్థితిలో తెలుగుదేశం ఒక ఆశను కల్పించింది. ఎన్.టి రామారావు వ్యక్తిగత సమ్మోహక శక్తికూడ ఈ కారణాలకు తోడయింది.

కాని అధికారానికి వచ్చిన వెంటనే తెలుగుదేశం ప్రభుత్వం ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలలో అనుసరించిన విధానాలు నిజంగా ప్రజా సంక్షేమం దిశలో సాగలేదు. తెలుగుదేశం పార్టీ వాస్తవమైన ప్రజా ఆకాంక్షలను నినాదాలుగా వాడుకున్నప్పటికీ, వ్యవసాయరంగంలోనూ పారిశ్రామిక రంగంలోనూ కొత్తగా ఎదిగివస్తున్న ఒక నయాసంపన్నవర్గానికి ప్రతినిధిగానే, వారి ప్రయోజనాలు పరిరక్షించడానికే అధికారంలోకి వచ్చిందని అతిత్వరలోనే అనుమానాలు మొదలయ్యాయి. తెలుగుదేశం అధికారానికి వచ్చిన కొద్ది రోజులలోనే అది అప్పటికే సంపన్నమైన ఒక సామాజిక వర్గానికి సేవచేయనున్నదనే సందేహాలు బహిరంగంగానే వ్యక్తమయ్యాయి.

తెలుగుదేశం పార్టీ ఏ వర్గానికి ప్రయోజనం చేకూరుస్తున్నదనే ఆరోపణలు, అనుమానాలు వచ్చాయో ఆ వర్గంలోని పేదవారికి ఆ పార్టీ చేసిందేమీలేదు. కృష్ణా, గుంటూరు జిల్లాలలో రక్షిత నీటిపారుదల, ఎరువులు, హరిత విప్లవం, క్రిమిసంహారకాలు, మార్కెటింగ్ సౌకర్యాలు వంటి పరిణమాల ఫలితంగా తలెత్తుతూవచ్చి, ఫైనాన్స్, సినిమా, రియల్ ఎస్టేట్, ట్రాన్స్ పోర్ట్, విద్యావ్యాపారం వంటి రంగాలలో పెట్టుబడులు పెడుతుండిన ఒక వర్గం రాష్ట్ర అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు ఎన్.టి రామారావును ప్రతినిధిగా ముందుకు తెచ్చింది. ఈ వర్గాన్ని తరచుగా ఒక అగ్ర వర్ణంతో సమానం చేయడం కూడ జరుగుతుంది. కాని ఆ అగ్రవర్ణ అభిజాత్యాన్ని పెంచడం మినహా తెలుగుదేశం ప్రభుత్వం మొదటి దశలో వారికి చేసిన ఘనమైన మేలేమీ లేదు. ఐతే భౌతిక ప్రయోజనాలకన్న ఈ భావజాల ప్రయోజనాలే పైచేయి సాధించాయి.

ఈ పరిణామం సహజంగానే రాష్ట్రంలో కులతత్వం పెరగడానికి దారితీసింది. రాష్ట్రరాజకీయాలలో మొదటినుంచీ కులప్రభావం ఉంటూనే ఉంది గాని తెలుగు సమాజ జీవనంలో కులాల మధ్య విద్వేషం, హంతక ఘర్షణలు పెరగడంలో తెలుగుదేశానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాత్ర ఉంది. తెలుగుదేశం పాలనాకాలం మొదటిదశలోనే పదిరికుప్పం, కారంచేడు, నీరుకొండ ఘటనలలో వ్యక్తమయినది అదే. ఈ మూడు ఘటనలలోనూ పదిరికుప్పంలో తెలుగుదేశం నాయకులమీద, కారంచేడులో ఎన్.టి రామారావు వియ్యంకుడి మీద, నీరుకొండలో తెలుగుదేశం కాబినెట్ మంత్రిమీద ఆరోపణలు వచ్చాయి. అప్పటికి మూడు దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో అవినీతి, అరాచకత్వం, బంధుప్రీతి, ఆశ్రితపక్షపాతం వంటి ప్రజావ్యతిరేక పద్ధతులతో విసిగిపోయిన ప్రజలు మార్పును ఆశించి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెస్తే, రెండు మూడు సంవత్సరాలు నిండకుండానే అవే పాలనాపద్ధతులు తెలుగుదేశం అధికారంలో కూడ కనబడ్డాయి.

ఈ లోగా పతనమవుతున్న తెలుగుదేశం ప్రతిష్టకు గవర్నర్ రాంలాల్ చేసిన పని తిరిగి ప్రాణం పోసినట్టయింది. నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటుకు, రాంలాల్ అక్రమానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో పెద్దఎత్తున ప్రజాస్వామిక పరిరక్షణ ఉద్యమం సాగింది. నందిహిల్స్ శిబిరంలో శాసనసభ్యులను నిర్బంధించి మద్దతు సంపాదించడం ద్వారా అయినప్పటికీ ఎన్.టి రామారావు విజయం సాధించారు. శాసనసభను రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లి, ఆ ఎన్నికలలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో పాటు, భారతీయ జనతాపార్టీతో కూడ ఎన్నికల పొత్తులు, సర్దుబాట్లు పెట్టుకున్నారు. ఒకరకంగా కాంగ్రెసేతర పక్షాలన్నీ ఏకమై కాంగ్రెస్ ను చిత్తుగా ఓడించిన సందర్భం అది.

తిరిగి అధికారానికి వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు మరింతగా పెచ్చరిల్లాయి. దాని ఫలితంగా 1989 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలయింది. తొమ్మిదినెలల్లో అధికారానికి వచ్చి రికార్డు సృష్టించినట్టుగానే ఆరు సంవత్సరాల పాలనతోనే ప్రజా ఆగ్రహాన్ని కూడ చవిచూడవలసి వచ్చింది. అయితే ఆ ఎన్నికలలో ప్రజలతీర్పు కాంగ్రెస్ మీది ప్రేమతో కాదని, అది పాజిటివ్ వోట్ కాదని, తెలుగుదేశం మీద అసంతృప్తితో పడిన నెగెటివ్ వోట్ మాత్రమేనని సాగిన విశ్లేషణలు వాస్తవమని ఆ తర్వాతి 1994 ఎన్నికలు నిరూపించాయి. నిజానికి అధికారంలో ఉన్నవారిపట్ల నెగెటివ్ వోట్ అనే సంప్రదాయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో 1983 లోనే ప్రారంభమైంది. అదే 1994 ఎన్నికలలో తెలుగుదేశానికి అనుకూలంగా మారింది.

ఒకవైపు కాంగ్రెస్ పట్ల వ్యతిరేకతతో పాటు ప్రతిపక్షంగా తెలుగుదేశం మాట్లాడి మాటలు, చేసిన వాగ్దానాలు కూడ తెలుగుదేశం పట్ల ప్రజల్లో కొంత ఆదరణను కలిగించాయి. ముఖ్యంగా రెండురూపాయలకు కిలో బియ్యం పథకం, సంపూర్ణ మద్యనిషేధం వంటి ప్రజా సంక్షేమ వాగ్దానాలు తెలుగుదేశం పట్ల ప్రజల్లో భ్రమలను పెంచాయి. అధికారంలోకి రాగానే ఎన్.టి రామారావు నాయకత్వంలోని తెలుగుదేశం ఆ వాగ్దానాలను ఏదో ఒకమేరకు అమలులో పెట్టడానికి కూడ ప్రయత్నించింది. కాని అప్పటికే దేశంలో కొనసాగుతున్న నూతన ఆర్థిక విధానాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ను ఒక ప్రయోగశాలగా ఎంచుకున్న ప్రపంచబ్యాంకు విధానాలు ఈ ప్రజాసంక్షేమ విధానాలను వ్యతిరేకించాయి. ప్రజాసంక్షేమ విధానాలను అమలుచేయకుండా తెలుగుదేశం ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం ప్రారంభించాయి. తెలుగుదేశం పార్టీ ముందర తెలుగుజాతి ఆత్మాభిమానాన్ని నిలబెట్టుకుని తెలుగు సమాజహితం కొరకు అతిస్వల్ప స్థాయిలోనైనా ఉపయోగపడగల సంక్షేమపథకాలను కొనసాగించడమా, ప్రపంచబ్యాంకుకు దాసోహం అని, బహుళజాతి సంస్థలకు తెలుగు ప్రజల భవిష్యత్తును తాకట్టుపెట్టి, ప్రతిఫలంగా ముడుపులు సంపాదించడమా అనే సవాలు నిలిచింది.

బహుశా తన వయసువల్ల, అప్పటికే ఉన్నప్రజాజీవితంవల్ల, సామాజిక పునాదివల్ల, వ్యక్తిగతంగా ఉండిన మొండితనం వల్ల రామారావు ఈ సవాలుకు మొదటి జవాబు చెప్పదలచినట్టున్నారు. ఆ జవాబు ప్రపంచబ్యాంకుకు, ప్రపంచీకరణ శక్తులకు నచ్చలేదు. అందువల్లనే రామారావుకు ప్రత్యామ్నాయంగా ప్రజాజీవితం, సామాజిక పునాది పెద్దగా లేని, చెప్పినట్టుగా వినే ఒక యువ రాజకీయ నేతకోసం ప్రపంచీకరణ శక్తులు వెతికాయి. అప్పటికే పది పన్నెండు సంవత్సరాలుగా తమకు అందుబాటులో ఉన్న చంద్రబాబు నాయుడు తగిన వ్యక్తిగా ఎంచుకున్నాయి. రామారావు మొండితనాన్ని మూర్ఖత్వంగా చూపి వ్యతిరేకత కూడగట్టడం ద్వారా, లక్ష్మీపార్వతి పాత్రను సాకుగా చూపి తెలుగుదేశం శాసనసభ్యులలో పితృస్వామ్య భావాలను రెచ్చగొట్టడం ద్వారా, విచ్చలవిడి డబ్బుల పంపిణీ ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్నే మార్చివేయడం జరిగింది.

ఈ నాయకత్వం మార్పుతో తెలుగుదేశం పార్టీ జెండా మారకుండానే దిక్కు మారిపోయింది. నినాదాలు మారకుండానే విధానాలు మారిపోయాయి. కనబడకుండానే పార్టీని శాసించే ప్రయోజనాలు, శక్తులు మారిపోయాయి. పునాదిగా నిలిచిన సామాజికవర్గాలలో గతంలో ప్రాబల్యంలో ఉండిన ఒకటి రెండు అగ్రవర్ణాలు, కొన్ని వెనుకబడిన కులాలు యదాతథంగా ఉంటూనే, వారిలోకూడ నయాసంపన్నులదే పైచేయి అయింది. ఆర్థికంగా చూసినప్పుడు తెలుగునేలలో వేళ్లు ఉన్న నయాసంపన్నులతో పాటు విదేశాలలో స్థిరపడిన నయాసంపన్నులు, దేశదేశాల బడాసంపన్నులు జమిలిగా పార్టీని నిర్దేశించే స్థితి వచ్చింది. మొత్తంగా పార్టీ అధికారంలో ఉన్న తొమ్మిదిన్నర సంవత్సరాలలో అక్రమంగా వందలకోట్లు కూడబెట్టుకున్న రాజకీయ నాయకుల, కాంట్రాక్టర్ల, వ్యాపారుల, పైరవీకారుల, మధ్యవర్తుల వర్గం ప్రాచుర్యంలోకి వచ్చింది. డబ్బు, సాంకేతిక విధానాల సహాయంతోనే రాజకీయాలు నడపవచ్చుననే, ప్రజలు అవసరంలేదనే ఒక దురభిప్రాయం పార్టీ అగ్రనాయకత్వంలో ప్రబలింది. ఒకవైపు తెలంగాణ ఆకాంక్షలు, మరొకవైపు నూతన ఆర్థిక విధానాల వల్ల ఎదుర్కొటున్న ఇబ్బందులగురించి ఆక్రోశాలు మిన్నంటుతుంటే పార్టీకి అవన్నీ వినబడనేలేదు. రాజకీయంగా చూసినప్పుడు కొత్తరక్తం పార్టీలోకి రావడం ఆగిపోయింది. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యానికి, కొత్త ఆలోచనలకు, అధినేతకు భిన్నమైన ఆలోచనలకు స్థానం లేకుండా పోయింది. ఈ విధంగా ప్రజలకు దూరమైన ఆలోచనలలో, ఆచరణలో ఉన్నందుకు, కొనసాగినందుకు తెలుగుదేశం 2004 ఎన్నికలలో భారీ మూల్యమే చెల్లించవలసి వచ్చింది.

ఎన్.టి రామారావు హయాం నుంచి చంద్రబాబు హయాం మారిన సందర్భంలో తెలుగుదేశం పార్టీకి ఉండిన ప్రాధాన్యతలు, ప్రజాసమీకరణలు, ఇతర పార్టీలతో సంబంధాలు, అట్టడుగు ప్రజా ఆకాంక్షలకు అగ్రనాయకత్వపు ఆలోచనలకు మధ్య సంబంధాలు ఏ విధంగా మారాయో వివరంగా పరిశీలిస్తే మన రాజకీయపక్షాల మారుతున్న ధోరణులకు సజీవ నిదర్శనం కనబడుతుంది. తెలుగుదేశం పార్టీకి 1995కు ముందు ఏదో గాఢమైన తాత్విక దృక్పథం ఉందని, ఆతర్వాత అది మారిపోయిందని కాదు. కాని ఒక రాజకీయపక్షంగా ఏయే ప్రయోజనాలను సమన్వయం చేసుకుంటూ, ప్రజలకు ఏ వాగ్దానాలు ఇస్తూ అందులోకొన్నయినా నెరవేరుస్తూ సాగవలసి ఉంటుందో ఆ క్రమాన్ని పార్టీ 1995 తర్వాత మరిచిపోయింది. రాష్ట్రంలో అత్యధిక సంఖ్యాక ప్రజలు ఆధారపడే వ్యవసాయరంగాన్ని, నీటిపారుదలరంగాన్ని, మొత్తంగా గ్రామీణ వ్యవస్థను నిర్లక్ష్యం చేయడం ఒక ఎత్తయితే, పిడికెడు మందికి సంపద చేకూర్చిపెట్టే, అవకాశాలు కలిగించే సేవారంగాన్ని, బహుళజాతి సంస్థల లాభాలు పెంచే ఐటి, బిటి వంటి రంగాలను ఇతోధికంగా ప్రోత్సహించడం మరొక ఎత్తు. వ్యవసాయాన్ని చిన్నచూపు చూసినప్పటికీ గ్రామీణ జీవనం నుంచి నిరుద్యోగంలోకి నెట్టబడుతున్న లక్షలాదిమందికి ఉపాధి కల్పించేందుకు పరిశ్రమలను ప్రోత్సహించడమైనా జరగవలసింది. కాని 1995 నుంచి 2004 వరకు ఎక్కువ ఉపాధి కల్పించే కొత్త పారిశ్రామికీకరణ జరగలేదు సరిగదా అప్పటికి బాగా పనిచేస్తున్న ఎన్నో పరిశ్రమలు ప్రభుత్వ విధానాలవల్లనే మూతబడిపోయాయి.
అటు రైతాంగాన్ని ఇటు కార్మికవర్గాన్ని ఈ విధంగా తెలుగుదేశం ప్రభుత్వ విధానాలే అతలాకుతలం చేస్తుండగా, విద్యార్థులు, యువజనులు, మహిళలు, వెనుకబడిన కులాలు, మైనారిటీలు, ఆదివాసులు వంటి ప్రతి ఒక్క ప్రజాసమూహం కూడ తెలుగుదేశం విధానాలవల్ల ఇబ్బందులపాలు కావడం మొదలయింది. విద్య ప్రైవేటీకరణ అధికారిక విధానమయింది. విద్యారంగానికి కేటాయింపులు తగ్గిపోయాయి. యువజనులలో నిరుద్యోగం విస్తృతంగా ప్రబలిపోయింది. ప్రతిఏటా ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజిలలో నమోదు చేసుకున్న నిరుద్యోగుల సంఖ్య మూడు లక్షలు ఉండగా ఉద్యోగకల్పన పదివేలకు మించలేదు. ప్రభుత్వ విధానాలవల్ల పెరిగిన వినియోగదారీ సంస్కృతి మహిళలమీద హింసకు, వరకట్నాల చావులకు దారితీసింది. ఒకప్పుడు కాంగ్రెస్ చూపిన నిరాదరణకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీయే తమకు లాభం చేకూరుస్తుందని భావించిన వెనుకబడిన కులాల ఆశలు వమ్మయిపోయాయి. ఆదివాసుల భూపరాయీకరణకు వ్యతిరేకంగా ఉండిన చట్టాలను మార్చి ఆదివాసుల పొట్ట కొట్టడానికి తెలుగుదేశం ప్రయత్నించింది. భారతీయ జనతాపార్టీతో కుమ్మక్కు కావడంద్వారా ముస్లింమైనారిటీల పట్ల తనకు లౌకిక దృక్పథం లేదని చాటుకుంది.
ఈ లోపాల గురించి విమర్శలు వస్తున్నప్పటికీ, కిందిస్థాయి నాయకులు ఈ సమస్యలను గుర్తించి పార్టీని సరిదిద్దాలని ఆశించినప్పటికీ క్రమక్రమంగా పార్టీ ‘ఒకేఒక్కడి’ పార్టీగామారి అంతర్గత ప్రజాస్వామ్యం కరువైపోయింది.

తెలుగుదేశం చరిత్రను నిశితంగా పరిశీలిస్తే మొదటి సగం ఒక రకంగానూ రెండో సగం మరొక రకంగానూ కనిపిస్తుంది.. మొదటి సగంలో ఏదో ఒక మేరకు ప్రజాకర్షక నినాదాలు ఇవ్వడం మాత్రమే కాక వాటి అమలు కొరకు కూడ ప్రయత్నించి కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం, పాత సామాజిక ఆర్థిక రాజకీయ వ్యవస్థలను బద్దలు కొట్టడానికి ప్రయత్నించడం (సామాజిక రంగంలో వెనుకబడిన కులాలకు అధిక ప్రాధాన్యం, ఆర్థిక రంగంలో నయా సంపన్నవర్గాల ప్రాబల్యం, రాజకీయ రంగంలో యువకులకు, విద్యాధికులకు, మొదటితరం రాజకీయనాయకులకు అవకాశం), భాష, సంస్కృతి, విలువల విషయంలో ఆదర్శాలు ప్రకటించడం వంటివి కనబడతాయి. కాని రెండో సగంలో ప్రజాకర్షక నినాదాలు కేవలం కాగితాలకు, ఉపన్యాసాలకు పరిమితమైపోయి, ప్రపంచబ్యాంకు, బహుళజాతి సంస్థలు, దేశదేశాల సంపన్నులు, పైరవీకారులకొరకే ప్రభుత్వం ఉన్నదనే స్థితిని తెలుగుదేశం తీసుకొనివచ్చింది. మొదటిదశలోని కాంగ్రెస్ వ్యతిరేకత నీరుకారిపోయి, కాంగ్రెస్ ప్రారంభించిన నూతన ఆర్థక విధానాలను కాంగ్రెస్ కన్న ఎక్కువ విధేయంగా అమలుచేయడానికి తెలుగుదేశం కంకణం కట్టుకుంది. తొలిదశలో వతన్‌దారీ వ్యవస్థ రద్దు వంటి అవసరమైన విధ్వంసాలు చేసిన తెలుగుదేశం రెండో దశలో ప్రత్యామ్నాయ నిర్మాణాలు చేసే బదులు ప్రపంచబ్యాంకు నిర్దేశించినమేరకు గ్రామీణ నయాసంపన్నుల నిర్మాణాలు ప్రారంభించింది. ఆ నిర్మాణాలు ప్రజాస్వామికంగా తయారుకాలేదు సరిగదా, బహుళజాతిసంస్థల సరుకుల కొనుగోలుదార్లుగా, అమ్మకందార్లుగా మారిపోయాయి. మొదటిరోజుల్లో కొత్త తరాన్ని, విద్యాధికులను, ఆదర్శవంతులను ఆకర్షించిన తెలుగుదేశం రెండో దశలో పైరవీకార్లకు, బహుళజాతిసంస్థలతో బేరాలుకుదిర్చిపెట్టగలవాళ్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు పెద్దపీటవేసి నిజంగా ప్రజాపునాది ఉన్న అట్టడుగుస్థాయి నాయకులను విస్మరించడం ప్రారంభించింది.

ఆ విధంగా పావుశతాబ్దం కింద ఎన్నికల రాజకీయాల పరిమితులలోపలే అయినా, కాంగ్రెస్ వ్యతిరేక శక్తుల వేదికగా, నిజమైన సమాఖ్య ఆలోచనలను పెంపొందించే రాజకీయపక్షంగా, ప్రజానుకూల, ప్రజా సంక్షేమ విధానాలను అమలుచేసే సత్తా ఉన్న పార్టీగా ఆవిర్భవించిన తెలుగుదేశం, ఇరవై ఐదు సంవత్సరాలలోపల తన చరిత్రకు తానే తూట్లు పొడుచుకుని అనేక అవినీతికర రాజకీయపక్షాలలో ఒకానొకటిగా మిగిలిపోయింది. ఈ స్థితిలో దాని పునరుత్థాన కాంగ్రెస్‌కు మరో ప్రత్యామ్నాయం లేనందువల్ల జరగవలసిందే తప్ప దానిలోని జీవశక్తివల్ల కాదు.

(వీక్షణం, మే 2007)

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Telugu, Veekshanam. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s