ఈ ఇంద్రధనుస్సు రంగేమిటి?

దేశమంతా ఉత్కంఠతో నిరీక్షించిన ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. రాజకీయ పండితుల, పరిణామాల జ్యోతిష్యుల అంచనాలను తలకిందులు చేస్తూ మాయావతి నాయకత్వంలోని బహుజన సమాజ్‌పార్టీ సొంతంగా ప్రభుత్వం స్థాపించగల జనాదేశాన్ని పొందింది. మాయవతి నాలుగోసారి ముఖ్యమంత్రిగా పదవిని అధిరోహించారు. గతంలో మూడుసార్లు మిశ్రమ, ఐక్యసంఘటన ప్రభుత్వాల్లో వరుసగా నాలుగు నెలలు, ఆరునెలలు, పదిహేను నెల లు ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహించిన మాయావతి ఈసారి సం పూర్ణ బహుమతి వల్ల పూర్తికాలం కొనసాగవచ్చు. తొలి దళితమహిళా ముఖ్యమంత్రిగా 1995లో పేరుతెచ్చుకున్నట్టే, ప్రస్తుతం కూడా ఆమె ఏకైక దళిత మహిళా ముఖ్యమంత్రిగా ఉన్నారు.

ఉత్తరప్రదేశ్‌ వంటి బ్రాహ్మణాధిక్య, అగ్రకులాధిక్య, పితృస్వామిక విలువల రాష్ట్రంలో దళితమహిళా ముఖ్యమంత్రిగా నాలుగోసారి గద్దెనెక్కడం, ఈసారి ఇతోధిక విజయాన్ని సాధించడం అభినందనీయమైన విషయాలే. కాని మాయావతి విషయంలోనూ, ప్రస్తుతం ఎన్నికలు జరిగిన ప ద్ధతిలోనూ, ఎన్నికలకోసం మాయావతి, బహుజనసమాజ్‌ పార్టీ పన్ని న వ్యూహాలలోనూ లోతుగా చర్చించవలసిన అంశాలు ఎన్నో ఉన్నా యి. ఆమె ఎన్నికల పొత్తులనుంచి, అభ్యర్థులకు స్థానాల పంపిణీ నుం చి, ఎన్నికలక్రమంలో ఆదర్శాలు, నినాదాలు పోలికే లేనంతగా మారిపోవడం నుంచి, ఆమె గత పాలనా కాలాలలో అవినీతి కుంభకోణాలనుంచి ఆలోచించవలసిన అంశాలెన్నో ఉన్నాయి. భారతదేశంలో పార్లమెంటరీ రాజకీయాలంటేనే అటువంటి తప్పుడు పనుల, సూత్రరహి త వ్యూహాల, అవకాశవాదాల, దగుల్బాజీతనాల రొచ్చుగుంట అనే మాటను బహుశా ఉత్తరప్రదేశ్‌ రాజకీయాలు మరొకసారి నిజం చేస్తున్నాయి.

ఒక దళిత నాయకురాలు, ఒక దళిత రాజకీయ పక్షం కూడా అందుకు మినహాయింపు కాకపోవడమే దురదృష్టకరం. పార్లమెంటరీ రాజకీయాల్లో వామపక్షాలనబడేవికూడా అటువంటి వ్యూహాలనే అనుసరిస్తున్నప్పుడు, అటువంటి పాలననే అందిస్తున్నప్పుడు, బిఎస్‌పి నుంచి ఉదాత్త రాజకీయాలను ఆశించడం బహుశా అత్యాశేనేమో! ఉత్తర భారతంలోని ఒక ముఖ్యమైన రాష్ట్రానికి ఒక దళిత మహిళ నాయకురాలు అయినందుకు తప్పనిసరిగా సంతోషించవలసిందేగాని ఆ ఆరోహణ ఎటువంటి విలువలసోపానాలమీద సాగిందన్నది ముఖ్యమైన ప్రశ్న. తొలిసారి ముఖ్యమంత్రి కావడానికి ఆమె భారతీయ జనతాపార్టీతో పొత్తుపెట్టుకున్నారు. మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు కూడా భాజపాలాగ మనువాద పార్టీలేనని, కనుక భాజపాతో పొత్తుపెట్టుకుంటే తప్పేమిటని అప్పుడు ఆమె, కాన్షీరాం వేసిన ప్రశ్నలో మొదటి సగం నిజమే. కాని అప్పటికి భాజపా అదే రాష్ట్రంలో బాబ్రీ మసీదును కూలగొట్టి ముస్లింల మనోభావాలను అతిభయంకరంగా గాయపరచింది.

చరిత్రపట్ల గౌరవం లేదని నిరూపించుకుంది. ఈ దేశపు బహుళత్వాన్ని గుర్తించనని, దీన్ని హిందూత్వ గుత్తాధిపత్యం కిందకి తెస్తానని చెప్పుకుంది. ఆ నేపథ్యంలో మూడు సంవత్సరాలు తిరగకుండానే కేవలం ముఖ్యమంత్రి పదవి కోసం తాను అంతకాలమూ విమర్శిస్తూ వచ్చిన మనువాద పార్టీతో పొత్తుపెట్టుకోవడానికి ఎంతమాత్రం సందేహించని చరిత్ర మాయావతిది. మనకు అధికారం ఇవ్వకపోతే మనువాదం, ఇస్తే మనువాదం కాదు అనే అవకాశవాదాన్ని కళ గా ఆమె అప్పటినుంచే అభివృద్ధి చేస్తూ వచ్చారు. అందువల్లనే ‘తిలక్‌’ తరాజు ఔర్‌ తల్వార్‌, ఇన్కో మారో జుతే చార్‌’ (తిలకం-బ్రాహ్మణులు, తరాజు-వైశ్యులు, తల్వార్‌- క్షత్రియులు-ఈ ముగ్గురినీ నాలుగు చెప్పుదెబ్బలుకొట్టండి) అని ఒక ప్రభావశీలమైన, అవసరమైన నినాదం ఇచ్చి దళిత బహుజనులలో స్వాభిమానాన్ని రేకెత్తించిన మాయావతి ఈ ఎన్నికల్లో గెలుపుకోసం ఆ తిలకం తానే దిద్దుకున్నారు.

తాను ఇంతకాలం తెగనాడిన బ్రాహ్మణులకు, అగ్రకులాలకు పెద్దపీట వేసి, జనాభాలో వారి నిష్పత్తితో సంబంధంలేకుండా బ్రాహ్మణులకు 120 స్థానాలు, క్షత్రియులకు 25 స్థానాలు కేటాయించా రు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలోనూ మూడువందలమంది బ్రా హ్మలు, వందమంది దళితులతో ‘భాయిచారా బనావో సమితి’లను స్థాపించి ఎన్నికల ప్రచారానికి వాడుకున్నారు. చివరికి పార్టీ చిహ్నం ఏనుగును వినాయకుడిగా మార్చివేశారు. ‘హాథీ నహీ గణేష్‌ హై, బ్ర హ్మ, విష్ణు, మహేశ్‌ హై’ అని మనువాద వ్యతిరేకపార్టీ చిహ్నాన్ని మనువాద చిహ్నంగా మార్చివేశారు. ఇటువంటి పిల్లిమొగ్గలకు రాజకీయ చతురత అనో, ఇంద్రధనుస్సు కలయిక అనో, సామాజిక పునర్నిర్మాణం అనో ఎన్ని పేర్లయినా ఇవ్వవచ్చుగాని, ఆ ఊసరవెల్లితత్వపు అసలు సారం రాజకీయ అవకాశవాదం. ఆ అవకాశవాదం ఎందువల్ల ఇవాళ గెలుపుగుర్రంగా మారిందంటే జూదగాళ్లందరూ ఇప్పటికే అన్ని గుర్రాలమీద కాపు కాసి ఓడిపోయి విరక్తిలో, పళ్లూడగొట్టుకునేందుకు ఏ రాయయినా ఒకటే అనే నిస్పృహలో ఉన్నారు గనుక.

కులాల ప్రాతిపదికపై చీలిపోయిన ఉత్తరప్రదేశ్‌ లో ఆమె గెలుపు సాధ్యమైంది. ఒకవైపు దళితపార్టీగా చెప్పుకుంటూనే బ్రాహ్మణులకు ఎక్కువస్థానాలు ఇవ్వడం, ఇరుపక్షాలనూ నమ్మించగల ఆమె శక్తికి నిదర్శనంగా నిలుస్తుంది. అగ్రవర్ణాల, సంపన్నవర్గాల రాజకీయం నడుపుతూనే దళితులను, నిరుపేదలను ఆకర్షించే, సమ్మోహనపరిచే, మోసగించే రాజకీ య నినాదాలు సృష్టించగలిగిన ఇందిరాగాంధీలాగ ప్రత్యర్థులను ఆకర్షిస్తూ లోలోపల తమ ప్రయోజనాలు నెరవేర్చగల రాజనీతిజ్ఞురాలు వచ్చిందని బహుశా గీతకు ఇవతలివారూ అవతలివారూ కూడా భ్రమపడే అవకాశం వచ్చింది. ఆ భ్రమలే ఓట్లుగా మారి బ్యాలెట్‌ పెట్టెలు నిండాయి. పుట్టుకతో అట్టడుగు దళితవర్గాల బిడ్డ అయినప్పటికీ, మా టలు ఏమి చెప్పినప్పటికీ మాయావతి పాలకవర్గాల తానులోని ము క్కేనని ఆమె రాజకీయ సమీకరణాలు మాత్రమేగాదు, పాలనా అనుభ వం కూడా తెలియజెపుతోంది.

తాజ్‌ కారిడార్‌ ప్రాజెక్టులో ఆమె అవినీతి, కుంభకోణం కథలు దేశవ్యాప్తంగా అగ్రవర్ణ రాజకీయ నాయకులలో ఏ ఒక్కరికీ తీసిపోయినవి కాదు. ఆమె ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తాజ్‌ మహల్‌ పర్యాటక సౌకర్యాల కోసం తయారయిన ఒక పథకానికి సంబంధించి రు. 175 కోట్లు గల్లంతయిపోయాయి. ఆ కేసు కేంద్ర నేరపరిశోధక శాఖ విచారణలో ఉంది. ఆ శాఖ ఆమె ఇళ్లమీద, ఆస్తులమీద జరిపిన సోదాలలో ఆమె ఆదాయం ఒకకోటి పది లక్షల రూపాయలని చెప్పకున్నప్పటికీ మొత్తం బయటపడిన ఆస్తులవిలువ పదిహేనుకోట్ల రూపాయలుంటుందని తేలింది.

అప్పుడే ఆమెను అరె స్టు చేయడానికి రంగం సిద్ధంకావడం, ఈ లోగా కేంద్రంలో అధికారం మారి, బహుజన సమాజ్‌ పార్టీ కేంద్రంలోని యుపిఏ కూటమిని సమర్థించడంతో తాజ్‌ కారిడార్‌ కేసు విచారణ వెనుకపట్టు పట్టింది. నిజంగా ఈ దేశ సంపదకు, సంస్కృతికి సృష్టికర్తలయిన ఒక అట్టడుగు సామాజికవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తాననే హామీతో, ఆ వర్గపు రాజకీయ వ్యక్తీకరణగా పుట్టుకొచ్చిన రాజకీయపక్షపు అధినాయకురా లు ఈ రకంగా అగ్రవర్ణ, సంపన్న మాయాజాలంలో ఒక అవిభాజ్య అంతర్భాగంగా మారిపోతుంటే ఇక ఈ దేశ ప్రజలు నిలబడేదెట్లా?

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Andhra Jyothy, Telugu, Vartamaanam. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s