అనుమానం తయారీ

హిందూ పూజాస్థలం సాయిబాబా గుడిమీద దాడి జరిగినా, ముస్లిం ప్రార్థనాస్థలం మక్కామసీదుమీద దాడి జరిగినా, లౌకిక రాజ్యపు ప్రజాప్రతినిధుల సభాస్థలంమీద దాడి జరిగినా అనుమానం ఒకవైపే ఎక్కుపెట్టబడుతుంది. కనీసం ఒకరి మీద జరిగిన దాడికి వారి ప్రత్యర్థులమీదికి అనుమానం పోవాలనే సహజసూత్రం కూడా మారిపోతున్న సందర్భం ఇది. సహజసూత్రం మారిపోవడం కాదేమో, బలవంతాన మన అనుమానాన్ని ఉత్పత్తి చేయడం జరుగుతున్నదేమో. అనుమానబీజాలు నాటడం జరుగుతున్నదేమో. తీవ్రంగా, నిశితంగా పరిశోధించి అనుమానితుల పేర్లు ప్రకటించవలసిన సంస్థలు అటువంటి పరిశోధన ఏమీ లేకుం డానే, ఘటన జరిగిన నిమిషాలలోపలే తమ దగ్గర సిద్ధంగా ఉన్న అనుమానితుల, సంస్థల పేర్లను, నిర్ధారిత నేరస్తుల పేర్లలాగ బయటపెడతాయి. ఆ ప్రకటనలనే ప్రచార సాధనాలన్నీ యథాతథంగా స్వీకరిస్తాయి. వాటినే మనమంతా నమ్మక తప్పని స్థితి ఉంటుంది.

పార్లమెంటుపై దాడి సంఘటనలో పోలీసులు, ప్రభుత్వం, ప్రాసిక్యూష న్‌ ఎన్నెన్ని అబద్ధాలను ప్రచారంలోకి తెచ్చాయో, వాటినే మన పత్రికలూ, ప్రసార సాధనాలూ ఎట్లా పునరుక్తంచేశాయో, వాటికి ఎట్లా బలం కల్పిం చాయో పెంగ్విన్స్‌ ప్రచురించిన ’13 డిసెంబర్‌-ఎ రీడర్‌’ పుస్తకం తేటతెల్లం చేసింది. ఒక ఘటనను పరిశోధించి నిజాలు నిగ్గుతేల్చి, నిజమైన నేరస్తులను బోనెక్కించి, అభియోగాలు మోపి, రుజువు చేసి, శిక్షించడానికి ఆధారాలు ఇవ్వవలసిన రాజ్యాంగ సంస్థలే అబద్ధాలు ఆడడం మొదలు పెడితే, పరిశోధనలేకుండానే కొందరిని రాక్షసులుగా ప్రకటించి వారిమీద నిందలు మోపుతుంటే, ఇక నిజాలను ఎవరు కనిపెట్టగలరు? ఒకవేళ కనిపెట్టినా ఎవరు ప్రకటించగలరు? ఈ క్రమంలో అసలు దోషులు తప్పించుకుపోతుంటే, నిర్దోషులు అనుమానితులై, నిందితులై, విచారణలపాలై, అబద్ధపు సాక్ష్యాలకు బలి అయి, శిక్షితులు కూడా అవుతుంటే న్యాయపాలన అనేమాటకు ఏమన్నా అర్థం ఉన్నదా? ప్రచారసాధనాల ద్వారా పాలకవర్గాల ఆలోచనలకూ ఆచరణలకూ సమ్మతి తయారీ ఎట్లా అవుతుందో నోమ్‌చామ్‌స్కీ తన ‘మాన్యుఫాక్చరింగ్‌ కన్సెంట్‌‘ భావనద్వారా చెప్పాడు.

భారతదేశంలో పాలకవర్గాలు మరొక అడుగు ముందుకువేసి ‘అనుమానం తయారీ’- మాన్యుఫాక్చరింగ్‌ సస్పిష న్‌ చేస్తున్నట్టున్నాయి. సమ్మతి తయారీ ద్వారా భిన్నమైన ఆలోచనలకు, భిన్నాభిప్రాయాలకు గండి కొట్టినట్టే అనుమానం తయారీ ద్వారా అనుమానపు సహజ మార్గాన్ని అడ్డగించి, లేనిపోని అనుమానాలు సృష్టించడం, అనుమానాలలో ఒక మూసను తయారు చేయడం, ఒక ఘటనకు సంబం ధించి లోతుగా పరిశోధన జరపడంగాని, ప్రశ్నలు రేకెత్తడంగాని లేకుండా చేయడం ఈ అనుమాన తయారీ లక్ష్యం. ఇప్పటికిప్పుడు మక్కా మసీదులో బాంబుపేలుడు సంఘటననే చూస్తే అది అత్యంత దురదృష్టకరమైనది. నాలుగు శతాబ్దాల చరిత్ర ఉన్న ఒక కట్టడంలో, పవిత్రదినంగా భావించేరోజున, వేలాదిమంది భక్తులు ప్రార్థనలు చేస్తున్న సమయాన పెద్ద ఎత్తున ప్రాణహానికి దారితీసే పేలుడు జరపాలని కుట్రపన్నిన, దాన్ని ఆచరణలో పెట్టిన దుర్మార్గులెవరయినా తీవ్రంగా దం డించవలసిందే.

అయితే వారెవరు అనేది నిస్సందేహంగా రుజువు కావాలి. అందుకు అనుమానానికి తావులేని సాక్ష్యాధారాలుండాలి. ఆ రుజువు చేసే పనినీ, సాక్ష్యాధారాలు సంపాదించేపనినీ తూతూమంత్రంగా మార్చివేసి, తమ సొంత దురభిప్రాయాలనే, అపోహలనే వాస్తవాలుగా చలామణి చేయడమే అనుమానం తయారీలో ముఖ్యభాగం. ఇటువంటి ఘటనకు మతపరమైన కారణాలు ఉండవచ్చు. రాజకీయమైన కారణాలు ఉండవచ్చు. వ్యక్తిగతమైన ద్వేషం కారణం కావచ్చు. ఆర్థిక స్వలాభం కొరకు ఈ పని జరిగి ఉండవచ్చు. మరొక ఘటన నుంచి దృష్టి మళ్లించడానికి కూడా ఇది జరిగి ఉండవచ్చు.

మరేదయినా కారణం కావ చ్చు. మామూలుగా ఏ నేరం జరిగినప్పుడయినా, దానికిగల కారణాలన్నిటి జాబితా తయారుచేసి, వాటిలో ఒక్కొక్కదాన్నీ జాగ్రత్తగా పరిశోధిస్తూ, కానివాటిని కొట్టివేస్తూ అసలు కారణాన్ని నిర్ధారించడం నేరనిరూపణా శాస్త్రంలో కీలకమైన పద్ధతి. కాని మన అధికారులకు మాత్రం తమ బుర్రలో పుట్టిన కారణాన్ని వెంటనే ప్రకటించడం, దాన్ని బలపరిచే ఆధారాలకోసమే వెతకడం, ఇతర కారణాలు, ఆధారాలు ఎంతపెద్దవి కనిపించి నా వాటిని పక్కనపెట్టడం అలవాటయిపోయింది.

రాజకీయ నాయకులకు ప్రజల నుంచి రక్షణ కల్పిస్తూ, అందుకు ప్రతిఫలంగా తిరుగులేని అధికారా న్ని అనుభవించడం మొదలయిన పనులలో పడి అసలు పోలీసింగ్‌ అంటే, శాంతిభద్రతలను కాపాడటం అంటే, నేర పరిశోధన అంటే ఏమిటి, గూఢచార వర్గాలనుంచి అందిన సమాచారాన్ని సక్రమంగా వాడుకొని నేర నిరోధక చర్యలు ఎట్లా తీసుకోవాలి అనే విషయాలు మరిచిపోతున్న యంత్రాం గం మనది. అందువల్లనే మక్కామసీదు ఘటన వంటిదేదో జరుగుతుందని ముందే ఉప్పందినా దాన్ని ఆపడానికి ఏ చర్యా తీసుకోలేదు. ఒకవేళ చర్య తీసుకోవడం అన్నా, ఎవరినో ఒకరిని పట్టుకుని చంపేయడం తప్ప మరొక పద్ధతిలో దాన్ని నిరోధించవచ్చునని కూడా మన యంత్రాంగానికి తెలియ దు.

ఆ విధంగా పాతబస్తీలో ఎందరో అమాయక యువకులను తీవ్రవాదులుగా ముద్రవేసి చంపినందువల్లనే వారి బంధుమిత్రులలో వ్యక్తిగత కసి పెరిగి ప్రస్తుత హింసగా పరిణమించడానికి అవకాశం కలుగుతున్నది. గుజరాత్‌ మారణకాండ ఇదేవిధంగా వేలాదిమంది కోపావేశాలనూ, కసినీ, ద్వేషాన్నీ సామాజిక జ్ఞాపకాల బ్యాంకులో నిల్వచేసింది. ఆ నెత్తుటి వడ్డీని ఈ సమాజం పొందుతూనే ఉంది. అటువంటి అనవసర అణచివేతవల్ల తలెత్తుతున్న కసి ఒకవైపున ఉండ గా ఆ కసిని వాడుకోవడానికి దేశ విదేశ సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. అస లు అటువంటి సంస్థలు లేకపోయినా తమ కసిని తీర్చుకోవడానికి వ్యక్తిగత మార్గాలు వెతుక్కునే యువకులు ఉండే అవకాశమూ ఉంది. పాతబస్తీలో అటువంటి అగ్నిపర్వతమొకటి కుతకుతలాడుతుండగానే, రాజకీయ సమీకరణాలు మారుతూ, గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలకు రంగాన్ని సిద్ధం చేస్తున్నాయి.

ఆ ఎన్నికలలో ఎక్కువ స్థానాలు సంపాదించడానికి ప్రజలను మతం పేరుమీద చీల్చడం, వారిని తమ వెనుక సంఘటితం చేసుకోవడం అవసరమని కనీసం నాలుగు రాజకీయపక్షాలు పథకాలు రచిస్తున్నాయి. అట్లాగే ముస్లిం వ్యతిరేకతను బహిరంగంగా వ్యక్తపరిచిన ఒక ఉన్నతాధికా రి మీద సరిగ్గా ఈ ఘటనకు కొన్ని రోజుల ముందే విచారణ ప్రారంభం కావడం కూడా ఈ సందర్భంలో విస్మరించవలసిన విషయం కాదు. ఒకవైపు ప్రార్థనాస్థలంలో, ప్రార్థనాసమయంలో హింసాకాండతోనే గా యపడి ఉన్న ముస్లిం సమాజ మానసిక స్థితిని పోలీసుకాల్పులు మరింత గాయపరిచాయి. ఆందోళిత సమూహాలను శాంతింపచేయడానికి మనకు కాల్పులు తప్ప మరే నాగరికపద్ధతి తెలియదని మరొకసారి చూపినట్టయింది.

కాల్పులగురించి ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పి, పోలీసులు తప్పు చేశారనికూడా అంటే ఆయన ఆమాట అనలేదని హోంమంత్రి సవరించా రు. అంటే చేసిన తప్పు ఒప్పుకోవడానికి కూడా సిద్ధంగాలేని ఒకవ్యవస్థ, ప్రజా ప్రతినిధులుగా అధికారంలోకివచ్చిన ముఖ్యమంత్రినీ, హోంమంత్రినీ కూ డా తోసిరాజనగల ఒకవ్యవస్థ ఇవాళ రాజ్యం చేస్తున్నదన్నమాట. ఆ వ్యవస్థ ప్రకటించే అనుమానాలే నిజాలుగా చలామణీ అవుతుంటే అసలు నిజాలు ఎప్పుడు బయటపడతాయి?

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Andhra Jyothy, Telugu, Vartamaanam. Bookmark the permalink.

4 Responses to అనుమానం తయారీ

 1. Jaya Prakash says:

  FYI : ముస్లిములనే టెర్రరిస్టులుగా ఎందుకు చూస్తారు? (నిజనిర్ధారణ కమిటీ)
  హైదరాబాద్‌, మే21(ఆంధ్రజ్యోతి ఆన్‌లైన్‌): మందిరంలో విధ్వంసం జరిగానా… మసీదులో జరిగానా ముస్లింలనే ఎందుకు దోషులుగా చూస్తారు? ఏ ముస్లిమూ మసీదులో బాంబు పెట్టుకోబోడు. ముస్లింలు అంటే టెర్రరిస్టులుగా ఎందుకు ముద్రవేస్తున్నారు? మక్కా మసీదులో భారీ విధ్వంసానికి పాల్పడింది హిందూ మతోన్మాదుల పని ఎందుకు కాకూడదు అని నిజనిర్ధారణ కమిటీ నాయకులు ప్రశ్నించారు. మక్కా మసీదు పేలుడు కేసు విచారణను పోలీసులు ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించారని వారు ఆరోపించారు. సోమవారంనాడిక్కడి ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో విరసం నాయకుడు వరవరరావు, ప్రముఖ న్యాయవాది బొజ్జా తారకం, సివిల్‌ లిబర్టీస్‌ నాయకుడు లతీఫ్‌ఖాన్‌, ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న షాహెద్‌ బిలాల్‌ తండ్రి అబ్దుల్‌వహీద్‌ మాట్లాడారు.
  ఈ విధ్వంసలో ఆర్‌డీఎక్స్‌, టిఎన్‌టీ అనే పేలుడు పదార్ధాలు వాడినట్లు బయటపడకుండానే విదేశీ కుట్రగా పోలీసులు ప్రకటించారని ఆరోపించారు. విదేశాలలో కుట్రజరిగితే ఇక్కడి ముస్లింములను ఎందుకు కాల్చిచంపారని వారు ప్రశ్నించారు. మసీదు పేలుడు ఘటనను సాకుగా చూపి, పాతబస్తీలోని కొందరు యువకులను పోలీసులు కాల్చిచంపారని ఆరోపించారు. పోలీసు కాల్పులపై సీబీఐ విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని వారు డిమాండ్‌ చేశారు. ఈ కేసుతో ఎలాంటి సంబంధంలేకపోయినప్పటికీ తన కొడుకును బలిపశువును చేశారని షాహెద్‌ బిలాల్‌ తండ్రి వషీద్‌ ఆరోపించారు.

  చెన్నారెడ్డిని గద్దెదించేందుకు వైఎస్‌ అల్లర్లు సృష్టించలేదా…?

  మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన్ని గద్దెదించేందుకు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాతబస్తీలో అల్లర్లు సష్టించారని నిజనిర్ధారణ కమిటీ నాయకులు ఆరోపించారు. మసీదు పేలుడు ఘటనను కూడారాజకీయ లబ్దికోసం ఉపయోగించుకుని ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విధ్వంసం జరుగుతుందనే ముందే తెలుసని ముఖ్యమంత్రి ప్రకటించారని, ముందే తెలిసినప్పుడు ఎందుకు నిరోధించలేకపోయారని వారు ప్రశ్నించారు. మసీదు పేలుడు ఘటనను అడ్డంగా పెట్టుకుని అమాయకులపై కాల్పులు జరిపినందుకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

 2. Jaya Prakash says:

  The most pathetic thing i observed as the events unfolded was that… ‘5 people died in the blast & 7 more killed to maintain so called peace’ by the police (my numbers may be wrong here, but still…)

  When there is a blast, people franatically run around to save their lives, in fear that another blast may follow…you don’t control such crowd by shooting at them.

  The Govt’ simply needed an excuse to push aside all the pressures they have [Telangana statehood, Water, Babli, Polavaram, Sez scams, Greater HYD scams the list goes on]… they just needed an excuse ! and who are the scapegoats the common marginalised people !

 3. జేప్స్ గారూ,

  welcome to the post 9/11 world – where logic has no place!
  9/11 దాడుల్లో మరణించిన అమెరికన్లెంతమంది?
  తత్కారణంగా భూషయ్య మొదలెట్టిన “తీవ్రవాదంపై యుద్ధం”లో మరణించిన అమెరికన్లెంతమంది – చచ్చిన మిగతా దేశస్థుల సంగతి కాసేపు మర్చిపోయినా … అన్నిట్లో అమెరికాని అనుసరించడమేగా మన లక్ష్యం!

 4. Jaya Prakash says:

  అవును కొత్త పాళీ గారు,

  మన పోలీసు వ్యవస్థ మన (రాష్ట్ర ప్రజల) మీద యుద్ధానికి రావడమొక్కటే మిగిలి ఉంది ప్రస్తుత పరిస్థితుల్ల. నెహ్రూ పటేల్‌ల్లు కలిసి అలనాడు already దీనికి నాంది పలికినరు… ఇప్పటి ప్రభుత్వం దాదాపు అటువంటి ఆలోచన తోటె ఉన్నదా అని అనిపిస్తుంది.

  PS : “తీవ్రవాదంపై యుద్ధం”లో మరణించిన అమెరికన్లు దాదాపు మూడున్నరవేలు, మరీ ఇరాకీయులు దాదాపు రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల మంది… ఈ విషయం ఒక్క క్షణం కూడ మర్చిపోయేది కాదని నా అభిప్రాయం.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s