మనుస్మృతికి న్యాయవ్యవస్థ వత్తాసు : సమాధానాలు

మిత్రులారా,

ప్రత్యేకించి మిత్రులు సత్యసాయి గారు,  టి బాలసుబ్రహ్మణ్యం గారు, లలిత గారు, రాజేశ్ గారు,

ఆంధ్రజ్యొతిలో నా మంగళవారం శీర్షిక ‘వర్తమానం’ లో ఏప్రిల్ మొదటివారంలో రాసిన ‘మనుస్మృతికి న్యాయవ్యవస్థ వత్తాసు’ మీద మీరు చేసిన వ్యాఖ్యలకు కృతజ్ఞతలు. జవాబివ్వడానికి చాల ఆలస్యం చేసినందుకు క్షమించండి. పనుల ఒత్తిడి వల్ల కొంత, చర్చించవలసిన విషయాలు చాల లోతయినవి కావడం వల్ల కొంత ఆలస్యం జరిగింది.

ఇప్పటికైనా మీరు లేవనెత్తిన ప్రశ్నలన్నిటికీ ఒక్కొక్కదానికి జవాబు చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. మనం తీసుకునే కొన్ని సామాజిక వైఖరులు మన పుట్టుక వల్ల, పెంపకం వల్ల, అనుభవం వల్ల, అధ్యయనం వల్ల, విలువల వల్ల — ఒక్కమాటలో చెప్పాలంటే సోషలైజేషన్ వల్ల — ఏర్పడతాయి. అంత లోతయిన కారణాలవల్ల రూపొందే వైఖరులను ఏదో ఒక వ్యాసంతోనో, ఒక చర్చతోనో మార్చడం కుదరదు. రిజర్వేషన్లను సమర్థించే నా వైఖరి అయినా, వ్యతిరేకించేవారి వైఖరి అయినా అంతే. అందువల్ల మీరు లేవనెత్తిన ప్రశ్నలలో కొన్ని అసంబద్ధమయినవని నేను అనుకుంటున్నప్పటికీ, వాటిమీద చర్చచేయాలని నాకేమీ కోరిక లేదు.

కాని మీ దృష్టికి కొన్ని అంశాలు తేదలచుకున్నాను:

1. ఎవరూ తాము ఏ కులంలో పుట్టాలో నిర్ణయించుకుని పుట్టలేదు. అందువల్ల పుట్టిన కులం గురించి ఎవరినీ శిక్షించగూడదు. నేను కూడ దాన్ని అంగీకరిస్తాను. కాని ఈ రెండు వాక్యాల తర్వాత మూడో వాక్యంగా, అందువల్ల మాతాతల అగ్రవర్ణ అహంకారానికి మమ్మల్ని ఎందుకు శిక్షిస్తారు అనే ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్న అమాయకంగా కనపడుతుందిగాని, ఆ ప్రశ్న కొనసాగుతున్న అసమానతను బలోపేతం చేయడానికే పనికి వస్తుంది. మా తాతల పీడనకు మమ్మల్ని ఎందుకు బలిచేస్తారు అనే వాళ్లెవరయినా ఆ తాతలు “ఆర్జించిన” (“అసమ సమాజంలో ఆర్జనయే దౌర్జన్యం” అన్నాడు కాళోజీ. ప్రాపర్టీ ఈజ్ థెఫ్ట్ అన్నమాట మీరు వినే ఉంటారు!) ఆస్తిని అనుభవించడం మానేస్తున్నారా? తాతలు సంపాదించిన, లేదా నిజమైన శ్రామిక కులాల శ్రమను కొల్లగొట్టి కూడబెట్టిన మెటీరియల్ ఆస్తి, కులం పేరుతో వచ్చే సోషల్ కాపిటల్ కావాలి గాని వారుచేసిన అక్రమాలకు పరిహారం చెల్లించడం మాత్రం వద్దా? మరి ఆ పరిహారం ఎవరు చెల్లించాలి? నిజానికి రెండువేల సంవత్సరాలు అగ్రవర్ణాలు, బ్రాహ్మణులు తమకు తాము అమలు చేసుకున్న వందశాతం రిజర్వేషన్ ను ఇప్పుడు డిరిజర్వ్ చేసి, కొన్ని కులాలకైనా వారి జనాభా నిష్పత్తిని బట్టి అవకాశాలు ఇవ్వాలనే డిమాండ్ సాగుతున్నది. ఇన్నాళ్లూ రిజర్వ్ చేసుకుని ఉన్నవాళ్లు డిరిజర్వ్ కోరికను ఎంత వ్యతిరేకిస్తారో చూడాలంటే, యాభై ఏళ్ల రిజర్వేషన్ కే మాలమహానాడు ఎట్లా స్పందిస్తున్నదో చూస్తే, వందలఏళ్లు రిజర్వ్ చేసుకున్న అగ్రవర్ణాల ఆందోళన అర్థమవుతుంది.

అందువల్ల ఈ సమస్యను వ్యక్తిగతంగా కాదు, సామాజిక చరిత్ర వైపు నుంచి చూసే ప్రయత్నం చేయండి.

ఒక తరంలోనో, యాభై ఏళ్లకో కూడ తీరిపోయే సమస్య కూడ కాదిది. ఆర్థికంగా స్థితిమంతులైన దళితులు, వెనుకబడిన కులాలవారు కూడ ఇవ్వాళ్టికీ పొందుతున్న అవమానాలు, వివక్ష చూస్తే ఒక్క రిజర్వేషన్ మాత్రమే కాదు, సామాజిక విలువలను, సంస్కృతినీ మార్చే ఎన్నో పనులు చేయవలసి ఉంది. రిజర్వేషన్ విధానం అటువంటి బృహత్తర సామాజిక భూకంపంలో ఒకానొక అంశం మాత్రమే. దానివల్లనే అన్నీ మారిపోతాయని ఎవరూ అనడంలేదు. చేయవలసిన సుదీర్ఘ ప్రయాణంలో అది ఒక చిన్న మొదటి అడుగు మాత్రమే. దానికే ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తే ఇక ప్రయాణం సాగేదెట్లా?

2. ఇక శ్రమను గౌరవించాలనీ, కులవృత్తిని అవమానించగూడదనీ చాల సుభాషితాలు వచ్చాయి. ఇవి వినడానికి బాగుంటాయి. కాని కొన్ని వృత్తులు — ఉదాహరణకు మరొక మనిషి మలాన్ని ఎత్తుకుపోయే వృత్తి — ఒక కులానికి ఎందుకు ఇవ్వబడింది? జీవితానికి ఎంతమాత్రం ఉపయోగపడని మంత్రాలు చదివే వృత్తికి తినికూచుని ఆస్తులు సంపాదించే అవకాశం ఎందుకు ఇవ్వబడింది? పోనీ ఆ వృత్తులు మార్పిడి పద్ధతి ప్రకారం అందరూ చేయాలని కాక, వంశపారంపర్యంగా చేయాలని, వర్ణ సంకరం జరగగూడదని ఎందుకు శాసనాలు విధించడం జరిగింది? సామాజిక ఉత్పత్తిలో భాగం గాని పనిని వృత్తిగా చూపి ఆ వృత్తిని అనుసరించి గోదానాలూ భూదానాలూ పడుతుంటే, ఆరుగాలం కష్టపడే వాళ్లు తమ కులవృత్తిని ఎందుకు గౌరవించరని ప్రశ్నించడం చాల సులభం. మనం ఎక్కడినుంచి చూస్తున్నామనేది ముఖ్యం.

3. ఉద్యోగాలు సమర్థులకు ఇవ్వాలి అనేపేరుమీద రిజర్వేషన్లను వ్యతిరేకించే మహామేధావులారా, పుట్టుకతోనే కొందరు సమర్థులు, కొందరు అసమర్థులు అయ్యే స్థితి ఎక్కడినుంచి వచ్చింది? ఎందువల్ల వచ్చింది? కింది కులాలవాళ్లు అనగానే అసమర్థులు అని నోరుపారేసుకోవడం ఏ ఆభిజాత్యాన్ని, అహంకారాన్ని చూపుతోంది?

ఆలోచించండి !

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Telugu, Vartamaanam. Bookmark the permalink.

13 Responses to మనుస్మృతికి న్యాయవ్యవస్థ వత్తాసు : సమాధానాలు

 1. మీ వాదానికి ఇంటర్నెట్‌లో పెట్టేటంత స్థాయి లేదు.దీన్ని ఇంగ్లీషులోకి అనువదిస్తే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది.మనుషులు పరిహారాలు చెల్లించాలా ? ఏ మానవ హక్కుల చార్టర్లు చెబుతున్నాయి ? మీకు రిజర్వేషన్లు అవసరమైతే సరే, తీసుకోండి. ఇందులో ఇప్పటి అగ్రవర్ణాల ప్రమేయం ఏముంది గనక ? తీసుకుంటూనే ఉన్నారు గత 56 ఏళ్ళనుంచి. అగ్రవర్ణాలవారు ఇప్పుడు కొత్తగా కోల్పోయేదేమీ లేదు. రిజర్వేషన్లు ఒక ప్రతిభా సమస్య అని మాత్రం అంగీకరించండి. మీరు అంగీకరించకపోయినా నష్టం లేదు. ప్రతివాడి అనుభవంలోకి వస్తున్నదానికి మీ ఆమోదం అనవసరం. అగ్రవర్ణాలవారు ఏ మాటలైతే ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని అనలేదో అవి అన్నట్లుగా ప్రచారం చేసి అసలు విషయం నుంచి దృష్టి మళ్ళించడానికి చూడకండి.

 2. Chaitanya says:

  ఏమన్నా ఉంటే విషయం మీద చరిచించాల్సింది పోయి ‘స్థాయి లేదు’ అని అక్కసుతో వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం దేనికి. హాస్యాస్పదమైనది ఏ భాషలోనైనా హాస్యాస్పదమే, ఇంగ్లిష్ లోకి అనువదించడమెందుకు? నాకు మీరు రాసింది తెలుగులో కూడా హాస్యాస్పదంగానే ఉంది.

 3. వేణుగోపాల్ గారికి
  ఆలశ్యంగా నానైనా స్పందించడం ముదావహం. నావ్యాఖ్యలో మీ టపాలో కాని, ఇంకే టపాలోకాని రిజర్వేషన్లు అవసరం లేదని నేనెక్కడా అనలేదు. అనను. కానీ దాన్ని రాజకీయంగా కాక నిజంగా వెనుకబడిన వాళ్ళకి ( కులానికి, వర్గానికి తేడా ఉందని మీకింకా అర్థమయినట్లు లేదు) ఉపయొగకరంగా ఉండేలా రూపొందించాలి. దానికి రూపకల్పన మీలాంటి విజ్ఞులు చేయాలి. మీరే రెచ్చగొట్టేలా అసత్యాలు, అర్ధ సత్యాలు వ్రాస్తే – మీరు సామాజిక బాధ్యత విస్మరించినట్లేకదా. జర్నలిస్టు పక్షపాతంతో రాస్తే కంచే చేనుమేసినట్లు కాదా? మీటపా, పైన ఇచ్చిన సమాధానం ఒకసారి చూడండి- నా భావం అర్ధమౌతుంది. మీ లెక్కన బ్రాహ్మణులూ, అగ్రవర్ణాలవాళ్ళూ సమాజానికి ఏమీ చేయకపోగా, మిగిలిన వారిని అణిచేసారు. సంపద పోగుచేసుకుని కులుకుతున్నారు. ఒక్క సారి ఏదైనా సర్వే చేసి చెప్పరాదా ఎంత మంది అగ్రవర్ణాలవారు డబ్బుల్లేక చదువుకోలేకపోతున్నారో, ఎంత మంది కులుకుతున్నారో? బీదరికం, కులం -రెండీంటికీ సంబంధంలేదు. మీనమ్మకాలని నిజాలని అందర్నీ నమ్మించి ఒకళ్ళమీదకింకొళ్ళని ఉసిగొల్పడం ఎవరికి లాభం. చరిత్రలో జరిగిన అన్యాయాలని వర్తమానంలో సరిదిద్దడానికి మనుషుల మధ్య అంతరాలూ, అపార్ధాలూ సృష్టించక్కర్లేదనుకొంటా.
  చివరగా, మీరు మంచికుందేలునే పట్టారు. కానీ దానికి నాలుగు కాళ్ళున్నాయని గమనించట్లేదు. మీరు చూడలేకపోతున్న నాలుగోకాలు చూడగల్గితే నా వ్యాఖ్యలో చూడండి.

 4. Dileep says:

  ఇంటర్నెట్ లో ఏదైనా పెట్టడానికి ఒక “స్థాయి” ఉండాలని నిర్ణయించారు బానే ఉంది. కొంచెం ఆ “స్థాయి” ఏమిటొ కూడా చెప్పి పుణ్యం (?) కట్టుకోండి. ఇంటర్నెట్ లో నానా రకాల సొల్లు కబుర్లు రాసుకోవడానికైతె అభ్యంతరం లేదు కానీ, ఒక అర్ధవంతమైన చర్చ లేవనెత్తితే దానికి “స్థాయి” లేదని వ్యాఖ్యానించడం దుర్మార్గం.

  అవునులెండి, అన్ని ఫలాలు మొదట అగ్ర కులాలకే దక్కాయి. ఇప్పుడు ఇంటర్నెట్ కూడా అలానే ఉంది. దానిలో కనీసం ఒక భిన్నమైన అలోచన కూడా ఉండరాదు అని మీ బోటి వారు హుంకరించడం లో ఆశ్చర్యం ఏముంది.

  ఇక ఒక భాషలో చెప్పిన దాన్ని ఇంకో భాష లోకి అనువాదం చేస్తే అది హాస్యాస్పదంగా మారిపోతుందని మాకు ఇప్పటి దాకా తెలియదు. గొప్ప జ్ఞానోదయం చేసినందుకు థాంక్ యూ.

 5. lalithag says:

  Venugopal garu,

  When I wrote that comment, I was far more newer to blogworld than today. My comment was not on your post, but just a series of questions about caste system and about survival. A few of them were answered for me, as I replied in my other comment.

  I am sorry but I have to acknowledge that I did not read your post completely then or now.

  The questions were my loud thinking and not a comment on your post.

 6. రిజర్వేషన్లను సమర్ధించేందుకు వేరే సమర్ధనీయ కారణాలున్నాయి. కానీ “మీ పూర్వులు చేసిన అక్రమాలకు పరిహారంగా ఇప్పుడు రిజర్వేషన్లు పెట్టాల”నడం మాత్రం సబబు కాదు. ఇదే లెక్కన కాశీ మధురల్లో మసీదులను పడగొడితే తప్పేంటి? ఒకప్పటి గుడులనే కదా పడగొట్టి మసీదులుగా మార్చింది! ఆ తప్పుకు పరిహారంగా మసీదులను పడగొట్టాలా?

  ఎందుకీ ప్రతీకార ధోరణి? ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లను అమలు చెయ్యాలనడం న్యాయమైన కోరికగా మీకెందుకనిపించదు?

  మీరే అన్నారు..

  “ఆర్థికంగా స్థితిమంతులైన దళితులు, వెనుకబడిన కులాలవారు కూడ ఇవ్వాళ్టికీ పొందుతున్న అవమానాలు, వివక్ష చూస్తే ఒక్క రిజర్వేషన్ మాత్రమే కాదు, సామాజిక విలువలను, సంస్కృతినీ మార్చే ఎన్నో పనులు చేయవలసి ఉంది. రిజర్వేషన్ విధానం అటువంటి బృహత్తర సామాజిక భూకంపంలో ఒకానొక అంశం మాత్రమే. దానివల్లనే అన్నీ మారిపోతాయని ఎవరూ అనడంలేదు. చేయవలసిన సుదీర్ఘ ప్రయాణంలో అది ఒక చిన్న మొదటి అడుగు మాత్రమే. దానికే ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తే ఇక ప్రయాణం సాగేదెట్లా?”

  మరి.., ఇలాంటి ప్రతీకార ధోరణులు మార్పును తెస్తాయా? ఇలాంటి అభిప్రాయాల వలన సమాజంలోని వర్గాల మధ్య దూరం తగ్గే మాట దేవుడెరుగు, ఇంకా పెరుగుతాయి.

  ఏ సమస్యనైనా ఒకే సంకుచిత కోణం నుండి చూట్టం సామాన్యులు చేసే పని. మీవంటి మాన్యులు, అందునా పాత్రికేయులు- అభిప్రాయాల కళ్ళజోళ్ళు తీసి సమస్యలను చూడాల్సిన అవసరం ఉంది.

 7. నేను మీ అభిప్రాయాలను చాలా వరకు సమర్ధిస్థాను. అయితే రిజర్వేషన్లు అనేవి కేవలం కొంత కాలానికి మాత్రమే ఉండాలి. రాజకీయాలకు అతీతంగా ఉంటే బాగుండేది. అన్ని పరిస్థితులకు అతీతంగా చూస్తే, కులాల పేరు మీద ఎన్ని హృదయాలు అవమానంతో విరుగుతున్నాయో, రిజర్వేషన్ల వల్ల ర్యాంకులు వచ్చి కూడా సీట్లు దొరకక ఎంత మంది విద్యార్థులు బాధపడుతున్నారో – పరిష్కారం ఊహించలేకపోతున్నాను.

 8. వేణు గోపాల్ గారూ,
  మీరన్నట్లే
  “మనం తీసుకునే కొన్ని సామాజిక వైఖరులు మన పుట్టుక వల్ల, పెంపకం వల్ల, అనుభవం వల్ల, అధ్యయనం వల్ల, విలువల వల్ల — ఒక్కమాటలో చెప్పాలంటే సోషలైజేషన్ వల్ల — ఏర్పడతాయి.”
  గనుక వాళ్ళ వైఖరిని మనం మార్చలేం మన వైఖరిని వాళ్ళు మార్చలేరు. వేల ఏళ్ళుగా జరిగిన/జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దడాన్ని కూడా “ప్రతీకారం” లాంటివాటితో జత కలిపితే ఏంఇ చేద్దాం.

  ర్యాంకు వచ్చీ సీటు రాని వాడి గురించే బాధ గానీ ర్యాంకు తెచ్చుకొనే అవకాశమే లేని వాడి గురించి బాధ పడం. మన ఆలోచనా శక్తి ఎంతటిది అంటే అరాకొరా హాస్టళ్ళలో పెట్టి ఉచితంగా తిండీ, బట్టా ఇచ్చినంతనే సోషల్ స్టేసస్ వున్నవాళ్ళతో సమానంగా ర్యాంకులు రావాలని ఆశించడం.

  ఎంత అరిచినా కంఠ శోషే గానీ ఏమీ లాభం లేదు. ఇంతకు ముందు వీటి గురించిన కొన్ని పోస్టులు చూడండి.

  http://www.charasala.com/blog/?p=22
  http://www.charasala.com/blog/?p=95

  –ప్రసాద్
  http://blog.charasala.com

 9. subramanyam says:

  it is good article. those who oppose are basing on the pre-determined mind and not caring for the fellow human beings

 10. charwaka says:

  Bala gari comment choosaaka kadali taraga lu vunnanta varaku canute lu kooda vuntaarani ardhamayyindi

 11. ఈ సమస్యను వ్యక్తిగతంగా కాదు, సామాజిక చరిత్ర వైపు నుంచి చూసే ప్రయత్నం చేయండి-వేణు గోపాల్ గారి వాదన సమంజసంగానే వుంది. విషయాన్ని వదిలి స్థాయి ని గురించి చర్చించటం సారి కాదు!

 12. Jai says:

  యుగయుగాలుగా చెలామణి అయిన కుల వ్యవస్థలో వివక్ష లేదు, కేవలం distribution of work అని వాదించే చాందసవాదులకు నాదొక సలహా. కుల వ్యవస్థను ఇంకో 200 ఏళ్ళు కొనసాగిద్దాం. తేడా ఏమటంటే మనుస్మృతిలో తమ కులాలకు కేటాయించని పనులు/వ్యాపకాలు (e.g. software, real estate etc.) అగ్రవర్ణాలు చేయకూడదు.

  ఈరోజు పరపతి, గౌరవం ఉన్న అనేక పనులు ఆ రోజుల్లో శూద్రులుకు/దళితులకు కేటాయించారు. ఉదాహరణకు మంగలివాళ్ళు వైద్యం చేసేవారు. ఆయా పనులను ఆ కులాల వారికే 100% reservation చేయాలి. Only nayis should be doctors, padmashalis should have a monopoly on the textile trade, only “smiths” should be engineers.

  బ్రాహ్మలను అడుక్కోవడం, పూజలు/దహనసంస్కారం చేయడం & వేద/మతపరమయిన విద్య బోధించడానికి పరిమితం చేయాలి. They should not take up any non-religious activity directly or indirectly. For example, they can take up teaching but should not either learn or teach any secular subjects.

  ఈరోజుల్లో రాచరికాలు, యుద్ధాలు లేవు కాబట్టి క్షత్రియులకు పనేమీ మిగలదు. వాళ్ళు కావాలంటే తమ “గతవైభవం” గురించి బుర్రకథలు చెప్పుకోవచ్చు.

  వైశ్యులు వ్యాపారం చేసుకోవచ్చు కానీ retail & money lending మాత్రమె, పెద్ద పరిశ్రమల జోలికి వెళ్ళకూడదు

 13. Jai says:

  Very interesting post from the neo-caste supremacist at http://kalagooragampa.blogspot.com/2011/09/3.html

  Tadepalli was always known for his idiotic pronouncements but he now emerges as the champion of zamandari revisionism.

  He signs off showing disdain for democracy: “కాబట్టి ఎవడు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా చావగొట్టి, చెవులు మూసి మఱీ సమైక్యాంధ్రలో ఉంచాలి. ఒప్పుకోనివాళ్ళందఱినీ నిర్దాక్షిణ్యంగా మూసేయాలి”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s