ఎవరి మేలు కొరకీ ప్రాంతీయ మండలి ?

ఎట్టకేలకు తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలి ఉనికిలోకి వచ్చింది. నెలరోజుల అలక తర్వాత, కాగితంమీదనైనా కొన్ని ఎక్కువ అధికారాల, నిధులు అందిన తర్వాత ఉప్పునూతుల పురుషోత్తమ రెడ్డి మండలి అధ్యక్ష పదవిని చేపట్టారు. తెలంగాణ ప్రాంతీయ మండలితోపాటుగానే ఉనికిలోకి వచ్చిన రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతీయ మండలుల అధ్యక్షులు ఇంకా తమ బాధ్యతలు చేపట్టవలసే ఉన్నది. అయితే ఈ ప్రతిపాదిత అధ్యక్షులు తమ పదవీ బాధ్యతలు చేపడతారాలేదా అనే వివాదం రగిలుతున్నంతగా, అసలు ఆ మండలుల లక్ష్యాలు ఎమిటి, అవి ఏ ప్రయోజనాలను నెరవేరుస్తాయి, వాటివల్ల అసలు ఏమైనా ఉపయోగం ఉంటుందా, అవి కేవలం కంటితుడుపు చర్యలేనా, అవి నిజమైన అధికారాలను చేపట్టగలుగుతాయా అనే చర్చ జరగడం లేదు. ఆ పదవిని స్వీకరించబోమని ఇప్పటిదాకా భీష్మించుకుని కూచున్న నాయకులు కూడ అవి తమ స్థాయికి తగనివనో, వాటివల్ల కాబినెట్ మంత్రి హోదా రాదనో అంటున్నారే తప్ప, ఆ మండలుల బాగోగులను చర్చిస్తున్నట్టులేదు.

ఈ ప్రాంతీయ మండలులను ప్రకటించిన నేపథ్యాన్ని, ఆ ప్రకటనలోని అవకతవకలను, గతంలో ఇటువంటి ప్రయోగాలు జరిగిన చరిత్రను చూస్తే ఈ ప్రాంతీయమండలులు రాజకీయ కారణాలవల్లనే ఏర్పడ్డాయని, తగిన కూలంకషమైన పరిశీలన లేకుండానే ప్రకటన వెలువడిందని, అవి ఆయా ప్రాంతాల అభివృద్ధికి చేయగల దోహదం ఏమీలేదని అర్థమవుతుంది.

ప్రస్తుతం ప్రాంతీయ అభివృద్ధి మండలుల ప్రకటనకు తక్షణ కారణం తెలంగాణలో ప్రత్యేకరాష్ట్రం కొరకు జరుగుతున్న ఆందోళనేననేది బహిరంగ రహస్యమే. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఉద్దేశ్య పూర్వకంగానే అభివృద్ధి రాహిత్యానికి గురి అయిందనే అసంతృప్తితో, 1956 పెద్దమనుషుల ఒప్పందంలోని రక్షణలను అమలుచేయడంలేదనే ఆగ్రహంతో ప్రారంభమైన 1969 ప్రత్యేక రాష్ట్ర ఆందోళన, 1996 కల్లా వెనుకబాటుతనం, రక్షణలు అనే ప్రాతిపదికలను కూడ దాటి ప్రత్యేక అస్తిత్వ ప్రకటనగా, ఆత్మగౌరవ పోరాటం గా రూపు దాల్చింది. తెలంగాణ వెనుకబాటుతనానికి స్పష్టమైన ఆధారాలు ఎన్నో కనబడుతున్నప్పుడు ఆ వెనుకబాటుతనాన్ని సరిదిద్దేందుకు అభివృద్ధి ప్యాకేజీలు, అభివృద్ధి మండలి వగైరా చిట్కా వైద్యాలు ముందుకొచ్చాయి. తెలంగాణ తో సమానంగా కాకపోయినా ఐదు దశాబ్దాల పాలనా విధానాల ఫలితంగానే వెనుకబాటుతనానికి గురయిన ఇతర ప్రాంతాల ప్రజల న్యాయమైన ఆకాంక్షలను అవకాశవాదపూరితంగా వాడుకుంటూ అక్కడ కూడ ప్రాంతీయ ఉద్యమాలను రెచ్చగొట్టి తెలంగాణ ఉద్యమానికి ఎదురుగా నిలపాలని కొన్ని రాజకీయ పక్షాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఆ నేపథ్యంలో ఇటు తెలంగాణ ఆకాంక్షలను తీర్చినట్టు కనబడుతూ అటు ఆయాప్రాంతాల నాయకుల అవసరాలు తీర్చడానికి ప్రస్తుతం ప్రాంతీయ అభివృద్ధి మండలులు ఏర్పాటయ్యాయి. అంటే ఒక న్యాయమైన ఆందోళనపై చన్నీళ్లు చల్లడానికి వేసిన ఎత్తుగడగా తప్ప ఈ మండలుల ఏర్పాటుకు పెద్ద ప్రాధాన్యత లేదు, ఉండబోదు.

ఈ మండలుల ఏర్పాటు ఎంత నామమాత్రమైనదో, ఎంత తూతూ మంత్రమో తెలుసుకోవాలంటే అది ఏర్పాటయిన పద్ధతి, ప్రతిపాదిత అధ్యక్షులు అలక ప్రకటించగానే హడావిడిగా కాసిన్ని అధికారాలు అందజేసిన పద్ధతి చూపిస్తాయి. అసలు తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా నాలుగు ప్రాంతాలనూ సమానంగా చూసి సమాన ప్రతిపత్తితో అభివృద్ధి మండలులు వేయడం ఒక అన్యాయం. వీటిలో అతి ఎక్కువ అన్యాయానికి, వివక్షకు గురయినది తెలంగాణ. ఆ తర్వాత స్థానంలో ఉండేవి ఉత్తరాంధ్ర, రాయలసీమ. నిజానికి కోస్తా ఈ వరుసలోకి వచ్చే అవకాశంలేదు. కోస్తాలో కూడ బహుశా పల్నాడు ను, ప్రకాశం జిల్లాలో కొన్ని ప్రాంతాలను, పశ్చిమ కృష్ణా జిల్లాను వెనుకబాటుతనానికి గురయిన ప్రాంతాలుగా చెప్పవచ్చు. పల్నాడుకు తప్పనిసరిగా అభివృద్ధి మండలి వేయవచ్చు. ఏది ఏమైనా వెనుకబాటుతనంలో, నీళ్లు, నిధులు, నియామకాలు, విద్య, వైద్య, ఆరోగ్య సౌకర్యాల విషయంలో ఈ అన్ని ప్రాంతాలూ ఒకే స్థాయిలో లేవు. అందువల్ల అధికారాలలో, నిధులలో ఈ ప్రాంతాల అభివృద్ధి మండలుల మధ్య నిర్దిష్టమైన తేడాలు, వేరువేరు మార్గదర్శక సూత్రాలు ఉండకతప్పదు. ప్రస్తుత మండలుల ఏర్పాటు ఇంత లోతయిన ఆలోచనకాదుగదా అసలు ఆలోచనేలేకుండా జరిగినట్టు కనబడుతున్నది.

ఇక చరిత్రలోకి వెళ్లి పరిశీలిస్తే, అసలు ప్రాంతీయ అభివృద్ధి మండలులు ఇప్పుడు ఏర్పడిన పద్ధతిలో ఎండమావులకన్న ఎక్కువ నీటిని ఇవ్వబోవు. ఎందువల్లనంటే గతంలో రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన తెలంగాణ ప్రాంతీయ సంఘమే చిన్నమెత్తు పనికూడ చేయలేక, చేయనివ్వని స్థితిలో అంతమైపోయింది. ఇప్పుడు ఏ అధికారమూ లేని మండలి ఆ మాత్రం పని అయినా చేయగలుగుతుందని అనుకోవడం అత్యాశ.

రాష్ట్రంలో 1956 నుంచి 1973 వరకు తెలంగాణ ప్రాంతీయ సంఘం పనిచేసింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకోసం కుదిరిన ‘పెద్దమనుషుల ఒప్పందం’ తెలంగాణ ప్రాంతీయ మండలి ఏ విధంగా ఏర్పాటు కావాలో, దానికి ఏ అధికారాలు ఉంటాయో స్పష్టంగా ప్రకటించింది. ఆ ప్రాంతీయ మండలి చట్టబద్ధ అధికారాలు కలిగి ఉంటుందని కూడ ప్రకటించింది. పెద్దమనుషుల ఒప్పందంలో “మండలి”గా ప్రకటించినదల్లా లోకసభలో బిల్లు సమయానికి “సంఘం” గా మారిపోయింది. దానికోసం రాజ్యాంగ సవరణ జరిగి, 1958లో రాష్ట్రపతి ఉత్తర్వు వచ్చే సమయానికి అది తెలంగాణ ప్రాంతీయ సంఘం కూడ కాకుండా “ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ సంఘం ఉత్తర్వు” గా మారిపోయింది. ఈ రూపపరమైన మార్పులు చిన్నవేనని, అసలు సారాంశాన్ని చూడాలని అనుకున్నా, తెలంగాణ ప్రాంతీయ సంఘం ఏర్పడినప్పటినుంచీ కూడ తెలంగాణ కు నీళ్లు, నిధులు, నియామకాలలో జరుగుతున్న అన్యాయాల గురించి నివేదికలు సమర్పిస్తూనే వచ్చింది. తెలంగాణ అబివృద్ధికోసం చేపట్టవలసిన పథకాలగురించి సిఫారసు చేస్తూనే వచ్చింది. ఈ విలువైన అధ్యయనాలు, నివేదికలు, సిఫారసులు అన్నీ ప్రభుత్వాల చెత్తబుట్టలోకి పోయాయి. ప్రాంతీయ సంఘం సిఫారసులు అమలయ్యేలా చూడవలసిన బాధ్యత ఉండిన గవర్నర్లు నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయారు. రాజ్యాంగబద్ధమైన ప్రతిపత్తి, గవర్నర్ పర్యవేక్షణ, ప్రాంతీయసంఘం సభ్యుల నిబద్ధ కృషి ఉన్నప్పటికీ తెలంగాణ ప్రాంతీయ సంఘం పని అంతా బూడిదలోపోసినపన్నీరయిపోయింది.

ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, ముల్కీనిబంధనలపై న్యాయస్థానాల తీర్పులు, జై ఆంధ్ర ఉద్యమం వగైరా చరిత్ర ఇక్కడ చెప్పనక్కరలేదు. ఆతర్వాత వచ్చిన ఆరుసూత్రాల పథకం మొదటి ఐదు సూత్రాలలో తెలంగాణ ఆకాంక్షలకు మేలు చేసేవి అమలు కాలేదు గాని, “పై ఐదు సూత్రాలు అమలయితే తెలంగాణ ప్రాంతీయ సంఘం, ముల్కీ నిబంధనలు అవసరంలేదు” అనే ఆరో సూత్రం మాత్రం అమలయి తెలంగాణ ప్రాంతీయ సంఘం రద్దయిపోయింది. ఆ తర్వాత 1978లో మూడు ప్రాంతాలకు (తెలంగాణ, రాయలసీమ, కోస్తా) ఏర్పాటయిన అభివృద్ధి మండలులను 1983లో తెలుగుదేశం ప్రభుత్వం రద్దు చేసింది. ఆ ఐదు సంవత్సరాలలో ఆ మండలులు చేసిన పని కూడ ఏమీలేదు.

ఈ చరిత్ర అంతా చూస్తే కొత్త ప్రాంతీయ అభివృద్ధి మండలులు అధ్యక్షులు అలిగినా అలగకపోయినా, కాగితాలమీద ఎక్కువ అధికారాలు ఉన్నా లేకపోయినా ఒరగబెట్టేది ఏమీ ఉండదని తేటతెల్లమవుతుంది.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Telangana, Telugu, Vartamaanam. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s