భూపోరాటంలో పొల్లూ నెల్లూ

కొద్దివారాలుగా రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలలో ఇళ్లస్థలాలకోసం నిర్వాసిత పేదలు, గ్రామీణ ప్రాంతాలలో సాగుభూమికోసం భూమిలేని నిరుపేదలు బ్రహ్మాండమైన భూపోరాటం జరుపుతున్నారు. ప్రధానంగా పట్టణప్రాంతాలలో ఇళ్లస్థలాల కోసం ప్రారంభమైన భూపోరాటం క్రమంగా తక్కువగానే అయినప్పటికీ గ్రామీణ ప్రాంతాలకు కూడ విస్తరించింది. వందలాదిగా, వేలాదిగా ప్రజలు ఈపోరాటాలలో, భూ ఆక్రమణలలో పాల్గొంటున్నారు. ఈ పోరాటాన్ని ప్రధానంగా భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు), భారత కమ్యూనిస్టు పార్టీ నడుపుతున్నప్పటికీ, చాలచోట్ల ఇతర పార్టీలు, ప్రజాసంఘాలు కూడ నాయకత్వం వహిస్తుండగా, తమంతట తాముగా ప్రజలు కూడ పాల్గొంటున్నారు.

ఇటీవలికాలంలో పట్టణభూముల ధరలు విపరీతంగా పెరిగిపోవడం, పట్టణ భూపరిమితి చట్టం అనేదొకటి ఉన్నదని కూడ ప్రభుత్వం మరిచిపోవడం, పట్టణ ప్రాంతాలలో భూక్రయవిక్రయాలలో అక్రమాలు, సంపన్నులు-అధికారులు-పోలీసులు కలిసి ప్రభుత్వ, ఉమ్మడి భూములను ఆక్రమించడం, భూకబ్జాలు, మాఫియాల రంగ ప్రవేశం వంటి పరిణామాల ఫలితంగా ఒకవైపు, ప్రపంచీకరణ క్రమంలో గ్రామీణప్రాంతాలనుంచి పట్టణాలకు వలసల వెల్లువలు సాగుతుండడం మరొకవైపు మన పట్టణాలలో నిలువనీడలేని నిర్వాసిత పేదల సంఖ్యను విపరీతంగా పెంచాయి. ఆ పేదలు ఇవాళ ఎవరు చారెడు భూమి ఇప్పించగలరనుకుంటే వారివెనుక సమీకృతం కావడానికి సిద్ధంగా ఉన్నారు.

అంటే పట్టణాలలో జరుగుతున్న భూపోరాటం ఒకనిజమైనసమస్య మీద, న్యాయమైన ఆకాంక్షలమీద నిర్మాణమయింది. సమస్య ఎంత నిజమైనదైనా, దాని పరిష్కారంకోసం జరుగుతున్న పోరాటం ఎంత విస్తృతమైనదైనా అణచివేత తప్ప మరొక రకంగా వ్యవహరించడం తెలియని ప్రభుత్వాల పాలన సాగుతున్నందువల్ల ప్రస్తుతభూపోరాటంమీద కూడ ప్రభుత్వం, పోలీసుబలగాలు అప్రజాస్వామికమైన, అనుచితమైన అణచివేత వైఖరిని అవలంబిస్తున్నాయి. ప్రతిరోజూ ప్రతి చోటా లాఠీచార్జిలు, మహిళలు, పిల్లలు, వృద్ధులు అని కూడ చూడకుండా చితకబాదడం, వేసుకున్న గుడిసెలు, పాతిన జెండాలు దౌర్జన్యపూరితంగా పీకివేయడం, వందలాదిమందిని నిర్బంధంలోకి తీసుకోవడం, డజన్లమందిమీద కేసులు పెట్టడం మొదలయిన అక్రమ పద్ధతులద్వారా ఈ ఉద్యమాన్ని అణచివేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రాజకీయ పక్షాలు ఒకదానిమీద మరొకటి ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం, ప్రత్యర్థి రాజకీయాలకు దిగడం సరేసరి.

ఈ ఉద్యమం తనముందర పెట్టుకున్న లక్ష్యాల వైపు నుంచి చూసినా, విస్తృతమైన ప్రజల భాగస్వామ్యం వైపు నుంచి చూసినా, పోలీసుల, అధికారవర్గాల నిర్బంధవైఖరివైపునుంచి చూసినా ఈ ఉద్యమం ఇటీవలి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక ముఖ్యమైన, ప్రభావశీలమైన ప్రజా సంచలనం.

కాని ఈ భూపోరాట ఉద్యమంలో కూడ కొన్ని ఆలోచించవలసిన సమస్యలు ఉన్నాయి. భూపోరాట ఉద్యమంలో ప్రజల కదలికను చూసి నాయకులు భుజాలు చరుచుకోవచ్చు. ప్రజలు, నిరాశ్రితులు, అభాగ్యులు, బాధితులు, పోరాటకారులు అనేమాటలు చెరిగిపోయి వోటర్లు అనే ఒక్కమాట మాత్రమే కనబడే అవకాశం ఉన్నచోట ఈ పోరాటపు ప్రాధాన్యత వక్రీకరణ కూడ పొందవచ్చు. కాని తెలుగు ప్రజల చరిత్రలో ప్రజలు భూమి కొరకు కదలడం ఇదే మొదటిసారి కాదు. భూమికోసం ఈ నేలమీద సాగిన పోరాటాల చరిత్ర మహోజ్వలమైనది. భూమి కోసం ప్రాణాలు బలిపెట్టిన ఘన చరిత్ర తెలుగుప్రజలది. ఆ చరిత్ర నేపథ్యంలో ఇవాళ్టి పోరాటపు మంచిచెడులను చూడవలసి ఉంటుంది.

ఈ పోరాటంలో పాల్గొంటున్న ప్రజల నిజమైన ఆకాంక్షల పట్ల సంపూర్ణ గౌరవం ప్రకటిస్తూనే, వారు ఈ ఉద్యమంలోకి రావలసిన అనివార్య, సహజ పరిస్థితిని అంగీకరిస్తూనే, వారికి నాయకత్వం వహిస్తున్న స్థానిక నాయకుల చిత్తశుద్ధిని గౌరవిస్తూనే, ప్రభుత్వ నిర్బంధవైఖరిని ఖండిస్తూనే ఈ పోరాటంలోని ప్రతికూల అంశాలను గమనం లోకి తీసుకోవలసి ఉంది.

ఈ భూపోరాటానికి ప్రధాననాయకత్వం వహిస్తున్న సిపిఎంకు ఇవాళ, మరీ ముఖ్యంగా నందిగ్రామ్ కాల్పుల తర్వాత, భూపోరాటం చేసే నైతిక అర్హత ఉన్నదా అనేది ముఖ్యమైన ప్రశ్న. ఎన్ని సమర్థనలు చెప్పుకున్నా, ఒకచోట తమ భూమి తమకే ఉండాలని పోరాడుతున్న ప్రజలపై కాల్పులు జరిపించిన, జరిపిన వారు మరొక చోట ప్రజలకు భూమి ఇప్పించేపోరాటానికి నాయకత్వం వహిస్తారంటే అది హాస్యాస్పదంగానో, వారి రెండు నాల్కల వైఖరికి నిదర్శనంగానో ఉంటుంది. నందిగ్రామ్ కాల్పులలో పోయిన ప్రతిష్ఠను వెతుక్కోవడానికి సిపిఎం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చేస్తున్న ప్రయత్నాలలో భాగంగానే ఈ భూపోరాటం చేపట్టి ఉండవచ్చు.

ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లో గత పదిసంవత్సరాలలో సిపిఎం సంపాదించిన క్రియాశీల పక్షం అనేపేరు, చాల రోజులతర్వాత ప్రభుత్వ అణచివేతను ఎదుర్కొంటూ మందుకుసాగిన తీరు నందిగ్రామ్ తర్వాత, తెలుగుదేశంతో కలయిక కు మళ్లీ మొదలయిన తహతహ తర్వాత దెబ్బతినడం మొదలయింది. ఆ పోయిన పేరును తిరిగి సంపాదించాలంటే మళ్లీ ఏదో ఒక క్రియాశీలమైన ఉద్యమం చేపట్టాలి. త్వరితంగా విస్తరించగల, విస్తృతంగా ప్రజల్ని ఆకర్షించగల ప్రజాసమస్యను గుర్తించాలి, నిప్పురవ్వవేసినా దావానలంగా మారగల అంశాన్ని కనిపెట్టాలి. ఆ సమస్యకు ప్రజా మద్దతు మాత్రమే కాక, ప్రచార సాధనాల దర్శనీయత, ఆకర్షణ కూడ ఉండాలి. ఆ పోరాటం ప్రజల సమస్యను పరిష్కరించడం మాట ఎట్లా ఉన్నా తమ ప్రాబల్యాన్ని పెంచగలిగి ఉండాలి, అంటే ఇవాళ పోరాటంలో పాల్గొంటున్న ప్రజలు రానున్న ఎన్నికలలో తమ వోటర్లుగా మారాలి.

బహుశా ఈ కారణాలవల్లనే ఈ భూపోరాటంలో గ్రామీణ సాగుభూములకన్న పట్టణ ఇళ్లస్థలాలు ఎక్కువ ప్రాధాన్యత పొందుతున్నాయి. గ్రామీణ భూములకన్న పట్టణ భూముల దర్శనీయత ఎక్కువ. సాగుభూములయితే వందలమందిని కదిలిస్తే వేలాదిఎకరాలు ఆక్రమించవలసివస్తుంది, ఇళ్లస్థలాలయితే వేలమందిని కదిలించినా కొన్ని డజన్ల ఎకరాల ఆక్రమణతో సరిపోతుంది. పట్టణాలలో జరిగే చిన్న వ్యవహారమైనా పత్రికలలో, చానెళ్లలో పెద్ద ఎత్తున వస్తుంది. “రేపు ఫలానా చోట భూపోరాటం చేస్తున్నాం. లాఠీచార్జి జరుగుతుంది. కనుక దయచేసి కవరేజికి రాగలరు” అని మీడియాకు ముందురోజే ఆహ్వానం పంపవచ్చు. వేలాది ఎకరాలు ప్రత్యేక ఆర్థిక మండలాలపేరుమీద అన్యాక్రాంతమైపోతుంటే వాటిమీద పోరాడకుండా, ఇళ్లస్థలాలపోరాటాన్నే ప్రధానంగా చిత్రించవచ్చు. మిగులుభూములనో, గరిష్టపరిమితిని మించిన భూములనో కాకుండా ప్రభుత్వభూముల ఆక్రమణ పేరుతో ఉమ్మడి ఆస్తులనూ, సామూహిక ప్రయోజనకర భూములనూ, చివరికి పురావస్తుభూములనూ ఆక్రమించవచ్చు. ఒక రాజకీయపార్టీ ఎన్నికలదృష్టితో పోరాటాలు చేస్తే తప్పేమిటి అని ఎదురు ప్రశ్నించవచ్చు. తమపార్టీ నాయకులే ఆక్రమించిన, కబ్జాపెట్టిన భూములభాగోతాన్ని దాటవేయవచ్చు.

ఏది ఏమైనా ఈ పోరాట ఫలితంగా ప్రజలకు ఏమైనా మేలుజరిగితే మంధిదే. కాని రాజకీయపక్షాలు ఒక నిజమైన ప్రజాసమస్యను ఎట్లా పలుచన చేయగలవో, ఒక న్యాయమైన పోరాటాన్ని తక్షణ రాజకీయ ప్రయోజనాలకొరకు ఎట్లా మసిపూసి మారేడుకాయ చేయగలవో, ఈ క్రమంలో ప్రజలు, ప్రజా ఆకాంక్షలు, ప్రజాప్రయోజనాలు ఎట్లా కనుమరుగవుతాయో ఈ భూపోరాటం చూపుతోంది.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Telugu, Vartamaanam. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s