జీవోమీదజీవోమీదజీవో…

జీవో 610 మీద మరొక సారి వివాదం మొదలయింది. ఇరవైరెండు సంవత్సరాల కాలయాపన చేసిన ప్రభుత్వం నెలరోజులలోపల అమలు చేస్తానని పారదర్శకంగా అబద్ధమని తేలిపోయే ప్రగల్భాలు పలుకుతున్నది. ఆ అమలుకోసమేననే పేరుతో మరొక జీవో తెచ్చింది. కోస్తాంధ్రకు, రాయలసీమకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని తమకు తాము చెప్పుకునే నాయకులు ఆ జీవోను అమలు చేయనేగూడదని ప్రకటిస్తున్నారు. ఒక ఉద్యోగ సంఘ నాయకుడు మరొక అడుగు ముందుకువేసి తెలంగాణ దయ్యం పట్టిందని, దాన్ని వదిలించే భూత వైద్యం జరగాలని అన్నారు.

ప్రభుత్వమే రెండు దశాబ్దాలకింద జారీ చేసిన ఒక జీవోను అమలు చేయడానికి, ఒకటికి రెండు సార్లు ప్రభుత్వం నియమించిన కమిషన్లు తప్పనిసరిగా అమలుచేయాలని సిఫారసు చేసిన జీవోను అమలు చేయకుండా ఉండడానికి, అమలు చేయించకుండా ఉండడానికి, ప్రజలమధ్య అనవసరమైన విద్వేషాలు రెచ్చగొట్టి అసలు సమస్యను పక్కదారి పట్టించడానికి ప్రతిఒక్క పాత్రధారీ ప్రవర్తిస్తున్న తీరు చూస్తే విషాద రసవత్తరంగా ఉన్నది. కాకపోతే ఒక ఇరవై రెండు సంవత్సరాల, ఆ మాటకు వస్తే యాభై సంవత్సరాల అన్యాయాన్ని వక్రీకరించి ప్రదర్శిస్తున్న ఈ రసవత్తర నాటకం ఈ పాత్రధారుల అతి ప్రదర్శనల వల్ల అంతిమంగా రక్తపాతానికీ, హింసకూ, అనవసరమైన విద్వేషాలకూ దారితీస్తుందేమోనని భయం వేస్తున్నది.

ప్రతిరోజూ సామాజిక వ్యవహారాలపైననో, పాలనా అవసరాలకోసమో, వ్యక్తిగత సమస్యల పరిష్కారానికో నాలుగైదు జీవోలు విడుదలయి ఆ పని తీరగానే కాలగర్భంలో కలిసిపోయే వాతావరణంలో, ఇరవై రెండు సంవత్సరాల కిందటి ఈ జీవో 610 ఇవాళ్టికీ సజీవంగా ఉన్నదంటే, ఇంత గాఢమైన ఉద్వేగాలను సృష్టించగలుగుతున్నదంటే, ఆ జీవోకు మూలంలోనే ఎంత బలం ఉన్నదనుకోవాలి! లేదా ఒకానొక ప్రభుత్వాజ్ఞ ఇంతటి సుదీర్ఘ చరిత్రకు, వివాదానికి కారణమవుతున్నదంటే మన పాలనా రీతులు, రాజకీయార్థిక విధానాలు ఎంత లోప భూయిష్టంగా ఉండి ఉండాలి!
నిజంగానే జీవో 610 చరిత్ర చూస్తే, అది ఎన్నెన్ని మలుపులు తిరిగి ఇక్కడికి వచ్చిందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఈ జీవో కు మూలమైన చరిత్ర సుదీర్ఘమైనది, మూడు నాలుగు శతాబ్దాల కిందటిది. కాని, అంత దూరం పోనక్కరలేకుండానే కనీసం ఆంధ్రప్రదేశ్ పుట్టుకకు కారణమైన పెద్దమనుషుల ఒప్పందం నుంచి ఈ జీవో చరిత్రను చూడవచ్చు.

పెద్దమనుషుల ఒప్పందం లో విలీనం వల్ల జరిగే ఉద్యోగుల తొలగింపులు ప్రాంతీయ జనాభా నిష్పత్తి ప్రకారం జరగాలని నాలుగో అంశం, జరగనున్న నియామకాలు ప్రాంతీయ జనాభా నిష్పత్తి ప్రకారం జరగాలని ఐదో అంశం నిర్దేశించాయి. ఏడో అంశం ఇంకా స్పష్టంగా తెలంగాణ ప్రాంతీయుల ఉద్యోగ నియామకాలలో నిర్ణీత నిష్పత్తిని పాటించేందుకుగాను 12 సంవత్సరాల నివాసం వంటి సూత్రాలను రూపొందించాలని నిర్దేశించింది. అంటే ప్రాంతీయులకే ఉద్యోగాలు అనే పునాది మీదనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. ఈ అంశాన్ని బలోపేతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ (రిక్వైర్ మెంట్ ఆజ్ టు రెసిడెన్స్) రూల్స్ 1959 వెలువరించారు. కాని ఆ నిబంధనలను తుంగలో తొక్కడంతో తెలంగాణలో అసంతృప్తి ప్రజ్వలనం మొదలయింది.

ఆనేపథ్యంలో సమావేశమైన అఖిల పక్షం చేసిన సిఫారసులమేరకు 1969 జనవరి 21 న రాష్ట్రప్రభుత్వం జీవో 36 ప్రకటించింది. “1956 నవంబర్ 1 న గాని, ఆ తర్వాతగాని ఈ కింద వివరించిన, తెలంగాణ వాసులకు కెటాయించబడిన ఉద్యోగాలలో నియమితులయినవారందరినీ ఎపిపిఇ (ఆర్ ఆర్) రూల్స్ 1959 ప్రకారం 1969 ఫిబ్రవరి 28 లోపల వెనక్కిపంపించివేయడం జరుగుతుంది” అని ఆ జీవో పేర్కొంది. కాని ఆ జీవో అమలు కాలేదు.

ఆ తర్వాత తెలంగాణ ఉద్యోగులలో, విద్యార్థులలో చెలరేగిన ఆందోళన ప్రత్యేకరాష్ట్ర ఆకాంక్షగా పరిణమించడం అందరికీ తెలిసిన సంగతే. ఆ ఆందోళనాక్రమంలో హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులు, జైఆంధ్ర ఉద్యమం, మళ్లీ జైతెలంగాణ ఉద్యమం సాగిన తర్వాత ఇందిరాగాంధీ 1973లో ప్రతిపాదించిన ఆరుసూత్రాలపథకం తెరమీదికి వచ్చింది. ఆపథకంలో ఆరోసూత్రం ముల్కీనిబంధనలను రద్దు చేసింది. మూడోసూత్రం ఉద్యోగ నియామకాలలో స్థానికులకే ప్రాధాన్యత అని ప్రకటించినందువల్ల దానికి చట్టబద్ధత కల్పించడం కోసం రాజ్యాంగసవరణ చేసి 1975 అక్టోబర్ 18న రాష్ట్రపతి ఉత్తర్వులు అమలులోకి వచ్చాయి. రాష్ట్రపతి సంతకంతో వెలువడిన ఉత్తర్వుల అమలుకే దిక్కులేకపోగా, వాటి అమలు కొరకు ఒక జీవో వెలువరించమని ముఖ్యమంత్రిని తెలంగాణ ఎన్జీవోల సంఘం ప్రాధేయపడిన కారణంగా జీవో 610 వెలువడింది. అదికూడ రాయలసీమ ప్రాంతీయులకే స్థానిక ఉద్యోగాలు అంటూ రక్షణ కల్పిస్తూ జీవో 564 వెలువడినతర్వాతనే. తెలుగుదేశం పాలనలో 1985 డిసెంబర్ 30 న వెలువడిన ఈ జీవో 1986 మార్చ్ 31 లోపు అమలు కావాలి. మూడు నెలలలోపు అమలు చేయడం అలా ఉంచి, అసలు అటువంటి జీవో ఒకటి ఉందనికూడ ప్రభుత్వం మరిచిపోయింది. ఆ బాధ్యతా రాహిత్యం పైన అసంతృప్తి విస్తరిస్తున్నదశలో 2001 మేలో తెలుగుదేశం ప్రభుత్వం ఏకసభ్య విచారణ కమిషన్ ను నియమించింది. కమిషన్ ప్రాథమికనివేదికమీద సిఫారసులుచేయడానికి ఒక శాసనసభా సంఘం నియమించారు. కమిషన్ తన తుదినివేదికను 2004 సెప్టెంబర్ లో సమర్పించేనాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ – తెరాస ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ ప్రభుత్వం కూడా ఆ నివేదికను పరిశీలించడానికి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఆ మంత్రివర్గ ఉపసంఘం నివేదికను చదివి, క్రోడీకరించి తమకు నివేదించడానికి మరొక అధికారుల కమిటీని నియమించింది. ఆ కమిటీ తయారుచేసిన పరిశీలన పత్రం పకారం జీవో 72 అనే ఒక ఉత్తర్వును విడుదల చేశారు. ఆ ఉత్తర్వులు రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తికి, జీవో 610 స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉన్నాయని గగ్గోలు రేగడంతో జీవో 116 ద్వారా దాన్ని వెనక్కి తీసుకున్నారు. ఆ తర్వాత గిర్ గ్లాని సిఫారసులమేరకు జీవో 610 అమలుపై సూచనలు ఇవ్వడం కొరకు ఒక శాసనసభా సంఘాన్ని నియమించారు. కొందరు సభ్యుల రాజీనామాలతో ఆ శాసనసభా సంఘం ఉనికి ప్రశ్నార్థకం కావడంతో జీవో 399 తీసుకువచ్చారు. జీవో 610 స్థానికులకు రిజర్వేషన్ల గురించి మాట్లాడగా, జీవో 399 అందుకు పూర్తిగా వ్యతిరేకంగా స్థానికేతరుల సంఖ్యకు గరిష్ట పరిమితి గురించి మాట్లాడుతున్నది.
పెద్దమనుషుల ఒప్పందం (1956) మీద, స్థానికుల ఉద్యోగ నిబంధనల (1959) మీద, జీవో 36 (1969) మీద, ఆరుసూత్రాల పథకం (1973) మీద, రాష్ట్రపతి ఉత్తర్వుల (1975) మీద, జీవో 610 (1985) మీద, గిర్ గ్లాని కమిషన్ (2001) మీద, శాసనసభా సంఘం (2002) మీద, మంత్రివర్గ ఉపసంఘం (2004) మీద, జీవో 72 (2006) మీద, జీవో 116 (2006) మీద, శాసనసభా ఉపసంఘం (2006) మీద, జీవో 399 (2007) మీద….స్థానికులకే ఉద్యోగాలు (అవి కూడ ఉన్నతోద్యోగాలు కావు, రాష్ట్రపతి ఉత్తర్వుల రిజర్వేషన్లు చిరుద్యోగాలకు మాత్రమే) అనే ప్రజాస్వామిక, సహజన్యాయసూత్రం అమలు కావడానికి ఎన్నితరాలు వేచిచూడాలి? వేచిచూస్తున్న అభాగ్యులకు పుండుమీద కారం చల్లినట్టు కారుకూతలు వినబడుతుంటే ఏం చేయాలి? తెలుగు టీవీ సీరియళ్ల మలుపులనూ అసహజత్వాన్నీ కుటిలత్వాన్నీ కూడ తలదన్నే ఇన్ని మలుపుల నాటకం తెలుగు నేలలో కాకుండా మరెక్కడయినా అయితే ఇంత సజావుగా సాగి ఉండేదేనా?

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Telugu, Vartamaanam. Bookmark the permalink.

One Response to జీవోమీదజీవోమీదజీవో…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s