శీలా వీర్రాజు ‘ఎర్రడబ్బారైలు’

సామాజిక జీవన వైవిధ్య దృశ్యాల సంపుటి

పైపైచూపులకు శీలా వీర్రాజు ‘ఎర్రడబ్బారైలు’ చాల చిన్న, మామూలు కవితల సంపుటం. ముప్పై కవితలు, ఎనభై పుటలు – అంతే. కాని లోతులకు వెళ్లిచూస్తే ఆ ముప్పై కవితలూ విభిన్నదృశ్యాలలో అపార సామాజిక జీవన వైవిధ్యాన్ని గ్రహించి కవితాత్మకంగా వ్యక్తీకరించినవి. ఒకానొక ప్రత్యేక సామాజిక సందర్భానికి సున్నిత భావుక స్పందనలుగా అక్షరీకరణ పొందినవి. ఆ కవితలలో రూపు కట్టించిన తెలుపు నలుపుల, రంగుల చిత్రాలు జీవితం గురించి మనకు ఇంతవరకూ తెలియని, తెలిసినా ఈ చూపుతో తెలియని వాస్తవికతను ప్రకటిస్తాయి. జీవితం ఎంత బీభత్సంగా, ఎంత సుందరంగా, ఎంత క్రూరంగా, ఎంత కరుణామయంగా, ఎంత అసహ్యకరంగా, ఎంత ఆహ్లాదకరంగా ఉన్నదో ఈ చిత్రాలు మనకు చూపుతాయి. కవి దార్శనికుడూ చిత్రకారుడూ కూడ కావడం ఆయన కవిత్వానికి గొప్ప దర్శనీయతను ఇచ్చిందనిపిస్తుంది.


ఈ కవితల గురించి చర్చించవలసిన అంశాలు చాల ఉన్నాయి గాని, వాటి సామాజిక నేపథ్యం, ఆ నేపథ్యం నుంచి మారుతున్న మధ్యతరగతి విలువలపై ఆత్మవిమర్శ, వయ్యక్తిక కవితలు అనిపించేవాటిలో కూడ వ్యక్తమైన సామాజిక అవగాహన, అభివ్యక్తిలో దృశ్యాలు కట్టే నేర్పు మాత్రం ఇక్కడ చర్చించదలచుకున్నాను.మొట్టమొదట ఈ కవిత్వపు కాలాన్ని గుర్తించడం చాల అవసరం. ఈ కవితలన్నీ 1981 నుంచి 1993 మధ్య రాసినవి, 1994లో పుస్తకరూపం ధరించాయి. మన మధ్యతరగతి జీవితంలోనూ, ఆలోచనలలోనూ పెనుమార్పులు ప్రారంభమైన సంవత్సరాలు అవి. రాజకీయార్థిక సందర్భం నుంచి చెప్పాలంటే భారత ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి మొదటి అప్పు తీసుకున్న సంవత్సరం 1981. అప్పుడు బహుళజాతిసంస్థలకు అనుకూలంగా ప్రారంభమైన రాజకీయార్థిక విధానాలు 1985లో రాజీవ్ గాంధీ ప్రకటించిన దిగుమతి సరళీకరణ విధానాలతో ఒక మెట్టు పైకెక్కి, 1991 జూన్ లో పి వి నరసింహారావు, మన్మోహన్ సింగ్ లు ప్రకటించిన నూతనఆర్థికవిధానాలతో మరింత ముందుకువెళ్లాయి. మన మధ్యతరగతి అనుభవపరిధిలోకి కొత్తకొత్త వినియోగదారీ సరుకులూ, సంస్కృతీ ప్రవహించడం మొదలయినదప్పుడే.
ఆ కాలంలోనే దేశంలో హిందూ మతోన్మాదం పెచ్చరిల్లి బాబ్రీ మసీదు విధ్వంసం జరిగింది. ఆ కాలంలోనే మండల్ కమిషన్ సిఫారసుల అమలు ప్రతిపాదనపై అగ్రవర్ణాల వికృత ఆందోళన చెలరేగి, సామాజికన్యాయభావనకు అడ్డంకులు ఒకవైపు నుంచి రాగా, మరొక వైపు నుంచి దళిత బహుజన కులాల సంఘీభావం పెరిగి సామాజికన్యాయభావన బలోపేతమయింది.

ఆ కాలంలోనే రాష్ట్రంలో తొలిసారి కాంగ్రెసేతర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఆరు సంవత్సరాలలోనే తాను కాంగ్రెస్ సంస్కృతి తానులోని ముక్కనేనని చూపుకుంది. ఆ కాలంలోనే ముఖ్యమంత్రిని మార్చడానికి “మత కల్లోలాలు” అనబడేవి సృష్టించి వందలాదిమందిని చంపవచ్చునని, నగరాన్ని భీతావహంలో ముంచవచ్చునని పాలకవర్గాలు ప్రజలకు చూపించాయి. ఆ కాలంలోనే సోవియట్ యూనియన్, తూర్పు యూరప్ లలోని సోషలిస్టు ప్రభుత్వాలనబడేవి కూలిపోయి, తొలి గల్ఫ్ యుద్ధం కూడ జరిగి, అమెరికా యుద్ధోన్మాదం తిరుగులేని శక్తిగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. అదేకాలంలో రాష్ట్రంలో మాత్రం అన్ని వర్గాలలోనూ, అన్ని సమస్యలమీదా ప్రజాపోరాటాలు విస్తరించాయి.

భావుకుడైన కవి మనసుమీద ఈ ప్రభావాలన్నీ లోతయిన ముద్ర వేస్తాయి. అవి ఏదో ఒక రూపంలో వ్యక్తీకరణ పొందుతాయి. సామాజిక పరిణామాలకు, కళావ్యక్తీకరణలకు మధ్య ఉండే ఈ సంబంధం సంక్లిష్టమైనది. దాన్ని సరళరేఖలాగ గుర్తించగలమని అనుకోగూడదు. ఈ అనుభవాలు, అవి కలిగించే సంస్పందనలు, ఉద్వేగాలు, వాటి విశ్లేషణలు, కవి మనసులో ఎప్పటికప్పుడు సాగే విధ్వంసం – నిర్మాణం, విభిన్న ఆలోచనల రసాయనిక సమ్మేళనం – ఇవన్నీ కలగలిసి సాంద్రమైన కవితారూపం పొందుతాయి.

‘ఎర్రడబ్బారైలు’ చదివినప్పుడు దానిలో ప్రతిఒక్క కవితా ఆ సాంద్రరూపంలో ఉండడం కనిపిస్తుంది. ప్రతి కవిత వెనుకా ఈ సామాజిక పరిణామాలన్నీ కలగలిసిన సుదీర్ఘమైన, సంక్లిష్టమైన నేపథ్యం ఉందనిపిస్తుంది. ముప్పై కవితలలో ఒకేఒక్క కవితకు మాత్రం కవి ఆ కవిత వెలువడిన సందర్భ సూచన ఇచ్చారు. అక్కడకూడ ఇచ్చిన సందర్భం ప్రేరణ మాత్రమే కావచ్చు. ఆ కవిత వెనుకనైనా, ఇతర కవితల వెనుకనైనా చెప్పగలిగినవీ, చెప్పలేనివీ ఎన్నెన్నో ప్రేరణలు, పురాస్మృతులు, ఊహలు, విశ్లేషణలు ఉండవచ్చు.

పైన చెప్పిన సంఘటనలు, సందర్భాలు అన్నీకూడ మన సమాజంలో మధ్యతరగతి విలువలను, ఆదర్శాలను, వైఖరులను లోలోపలినుంచి తొలిచివేయడం, మార్చివేయడం మొదలుపెట్టాయి. మనసమాజంలో 1980లకు ముందు మధ్యతరగతి స్పందనలకు, ఆ తర్వాత మధ్యతరగతి స్పందనలకు స్పష్టమైన వ్యత్యాసం ఉంది. జాతీయోద్యమ కాలం నుంచి 1970 లవరకు దాదాపు ఒక శతాబ్దంపాటు మనసమాజంలో మధ్యతరగతి నిర్వహించిన అసాధారణమైన ప్రజానుకూల, ప్రగతిశీల పాత్ర క్రమక్రమంగా మారిపోవడం 1980లలోనే మొదలయింది. మన మధ్యతరగతికి ఎప్పుడూ కిందివర్గాల ప్రజల ఆశలను, ఆకాంక్షలను వ్యక్తంచేసే, ఆ పోరాటాలకు వ్యాఖ్యాతగా ఉండే స్థితి, పైవర్గాల, పాలకవర్గాల ధాష్టీకంమీద తిరగబడే స్వభావం ఉంటూవచ్చాయి. ఆ స్థితినుంచి, ఆ స్వభావం నుంచి కిందివర్గాల ప్రజల ఆకాంక్షలను పట్టించుకోని, ప్రజాపోరాటాలలో పాల్గొనడానికి ఇచ్చగించని ఒక నిర్లిప్తస్థితికి, ప్రతీప, వయ్యక్తిక స్వభావానికి మధ్యతరగతి చేరుకునే క్రమం 1980లలో ప్రారంభమయింది.

కాని, ఒకటిరెండు దశాబ్దాల ముందు, 1960లలో, 1970లలో చైతన్యవంతులైన తరం మధ్యతరగతి సామాజిక ఆదర్శాలను గుర్తించినది, గౌరవించినది. ప్రజా పోరాటాలలో పాల్గొన్నది. 1960లలోనైతే ప్రాణత్యాగానికి కూడ సిద్ధపడినది. ఆ తరంలో సామాజిక చైతన్యంలోకి, ఆ చైతన్య వ్యక్తీకరణలోకి కళ్లు తెరిచిన శీలా వీర్రాజు సహజంగానే మారుతున్న విలువలను విమర్శనాత్మకంగా చూశారు. అందుకే ‘ఎర్రడబ్బారైలు’లోని ముప్పై కవితలలో ఎక్కువ భాగం – ఎనిమిదికి పైగా – మారుతున్న మధ్యతరగతి విలువల మీద విమర్శగా, ఆత్మవిమర్శా కవిత్వంగా వెలువడ్డాయనిపిస్తుంది.

మధ్యతరగతి క్రమక్రమంగా సమాజం కోసం ఆలోచించడం మానేసి, ఇంటికోసం మాత్రమే ఆలోచించడం మొదలయిన సందర్భం అది. ‘సొంతలాభం కొంతమానుకు పొరుగువాడికి తోడుపడవోయ్’ అనే ఆదర్శం అటకెక్కి, పొరుగువాడిగురించి ఎంతమాత్రం ఆలోచించకుండా సొంతలాభం గురించి మాత్రమే వెంపరలాడడం, అవసరమయితే పొరుగువాడిని వంచించడం మొదలయిన సమయం అది. పైగా తాము, తమ కుటుంబం పడిన కష్టాలను ఏకరువు పెడుతూ ఇప్పుడు ఆ కష్టాలను తొలగించేపని చేయడం, కుటుంబ బాగు కోసం ప్రయత్నించడం సామాజికసేవలో భాగమన్నంతగా సొంత సిద్ధాంతాలు తయారుచేయడం కూడ మొదలయిన వేళ అది. అప్పుడు వీర్రాజు

నీ యింటికోసం నువ్వేం చేసినా
అది త్యాగం కాదు, స్వార్థమే
అవసరానికి మించి ఏం సమకూర్చినా
అక్షరాలా అది భోగమే
అని నిర్మొహమాటంగా చెప్పగలిగారు.
ఈ వ్యవస్థ మీదికోపం
నీ కుటుంబ శ్రేయస్సుకే పరిమితం చేయకు
నువ్వు చేసే త్యాగం
నీ యింటి ఆవరణ దగ్గరే ఆగిపోనివ్వకు
అని మధ్యతరగతికి పాతవిలువల, ఆదర్శాల దారిని గుర్తుచేసే ప్రయత్నం కూడ చేశారు.

నిజానికి ఆ పరివర్తన తొలిరోజులలో మధ్యతరగతికి తనను తాను గుర్తుచేసి, కర్తవ్యబోధ చేయవలసిన అవసరం చాల ఉండింది. రానున్న ప్రమాదాన్ని ముందే గుర్తించి, ఇతరులకు గుర్తుచేసే వైతాళికపాత్ర అది. ఆ గుర్తుచేసే పనికి ఎన్నెన్నో కోణాలు, ముఖాలు ఉండడం సహజమే. యంత్రాలమధ్య పడి తనను తాను మరిచిపోవడం కూడ మధ్యతరగతికి ఎదురయిన ఒక అనుభవం. అటువంటప్పుడు మనిషికి ప్రకృతిని, మానవ ప్రకృతిని గుర్తుచేసి ఆ బరామీటర్ మీద మనిషి ఎంత సహజంగా ఉన్నాడో కొలుచుకోవాలని ‘బరామీటర్’ కవితలో వీర్రాజు చెప్పారు. సంఘజీవితం వదులుకొని, సంఘజీవితం మెరుగుపడడానికి అవసరమైన పనులను వదులుకొని వ్యక్తిగత జీవితంలోకి జారిపోతున్న మధ్యతరగతికి సంఘజీవిత ఔన్నత్యాన్ని గుర్తుచేయడం కూడ అప్పుడు అవసరమయిన పని. అందుకే కాకిని సంఘజీవితానికి, హంసను ఏకాకితనానికి ప్రతీకలుగా చూపుతూ ప్రతీకాత్మకంగా రాసిన ‘కాకిబతుకు’ కవితలో వీర్రాజు అనాకర్షణీయంగా కనబడే కాకి బతుకులోని ఆదర్శవంతమైన ప్రవర్తనను, ఆకర్షణీయంగా కనబడే హంస బతుకులోని సమూహవ్యతిరేకతను విప్పిచెప్పారు. కాకిలాగే బతుకుతాను, సమష్టిజీవితాన్నే కోరతాను అని ప్రకటించారు.

ఈ ఆత్మవిమర్శా కవిత్వంలో బలమయినది ‘నిజాయితీ లేనివాళ్లం’ కవిత.

మాటిమాటికీ మనకు మనమే గుర్తొస్తుంటాం
ప్రజలూ గుర్తురారు, సమూహాలూ గుర్తురావు
మనం వొట్టి స్వార్థపరులం
మనకు కావలసింది ప్రజలు కాదు, మనమే
మన కీర్తి ప్రతిష్టలు, మన సుఖ సంతోషాలు, మన హోదాలు
ఆ తర్వాతే మనకు ప్రజలు !

అని మధ్యతరగతి బుద్ధిజీవులలో, కిందివర్గాల గురించి తపనపడుతున్నట్టు, దోపిడీ పీడనలగురించి వ్యధ చెందుతున్నట్టు కనబడుతున్నవాళ్లలో కూడ ఎటువంటి క్షీణ విలువలు ప్రవేశిస్తున్నాయో ఎత్తిచూపి నిశితంగా విమర్శించారు.

మధ్యతరగతి తన కర్తవ్యాలనుంచి పక్కకు తప్పుకోవడానికి ప్రజల సమస్యల పరిష్కారానికి పోరాటాలు అవసరం లేదని, దానధర్మాలద్వారా అభాగ్యులను ఆదుకోవచ్చునని వాదిస్తుంది. ఆ క్రమంలో పుణ్యాత్ములనే పేరుతెచ్చుకుని ఆత్మసంతృప్తిలో బతకవచ్చుననుకుంటుంది. ఈ స్థితి గురించి ‘మనస్ చిత్రం’ కవితలో, రోడ్డుపక్క బిచ్చం ఎత్తుకునే ఏ చింకి బతుకునో చూసి, ఒక పది పైసల బిళ్లను ఖంగుమనేలా సత్తు చిప్పలోకి విసిరేసి
అప్పుడక్కడి అందరి కళ్లూ

నామీదే !
నేను పుణ్య పురుషుణ్ణయి కదిలిపోతాను
జాలి మారాజై, చల్లని తండ్రై, దరమ పెబువై
వొంటినిండాపడ్డ అక్షింతల్ని తుడుచుకుంటూ
అందరిమధ్యనుంచీ తృప్తిగా నడిచిపోతాను
అని స్వోత్కర్షలో మునిగిపోయే మధ్యతరగతి కుహనా ఆదర్శవాదపు నిజస్వరూపాన్ని కళ్లకు కట్టారు.

ఈ రకంగా మధ్యతరగతిలో మానవస్పందనలు కరవవుతున్న సమయంలో రక్తమాంసాల బొమ్మగామారి దేనికీ స్పందించని బానిసమనసు గురించి ‘బొమ్మ’ కవిత చెపుతుంది.

మనం బాల్యాన్ని ఆదర్శంగా తీసుకున్నదెప్పుడు?
తీసుకుంటే మనం యిలా ఎప్పటికీ వుండం
ఇంత అబద్ధంగా ఇంత కృత్రిమంగా ఇంత రాక్షసంగా
జీవించం గాక జీవించం
అనీ (‘ఎవరి బాల్యమే వాళ్ళకి ఆదర్శం’),
ఇప్పుడు కుండీల్లో ప్లాస్టిక్ మొక్కలు
మనకోసమే మార్కెట్లోకి వచ్చేసాయి
రండి ! మన కాంక్రీటు చెట్లని అలంకరించుకుని
రసహృదయాల్ని ఆవిష్కరించుకుందాం
రకరకాల సెంట్లు స్ప్రే చేసుకుని
రోజుకొక విధంగా ఘుమఘుమలాడిపోదాం

అనీ (‘ప్రకృతిలో వికృతి’) మధ్యతరగతి లోని దిగజారుడుతనాన్నీ, అప్పుడప్పుడే వ్యాపిస్తున్న తప్పుడు విలువలనూ విమర్శించారు. అసలు కవిత్వమంతా కవి సొంత ఊహలనుంచి పెల్లుబికివచ్చే వ్యక్తీకరణే అయినప్పటికీ, తెలుగు కవిత్వంలో సాంప్రదాయికంగా సామాజిక కవిత్వానికీ ఆత్మాశ్రయ కవిత్వానికీ మధ్య ఒక విభజన రేఖ ఉంటూ వస్తోంది. కాని వీర్రాజు కవిత్వంలో ఆత్మాశ్రయ కవితలుగా కనబడే ‘జలహృదయం’, ‘ఒక స్త్రీమూర్తి’, ‘బొమ్మల కిటికీ’, ‘రాగాలచెట్టు’ కూడ సారాంశంలో సామాజికావగాహనను ఇవ్వడానికే, పాఠకుల అవగాహనను ఉన్నతీకరించడానికే ప్రయత్నిస్తాయి.

‘జలహృదయం’ గోదావరి తీరాన తన బాల్యం, కౌమారం, తొలి యవ్వనం గడిచిన పల్లెసీమలో పురాస్మృతిని తవ్వుకుంటున్న కవితగానే మొదలవుతుంది. నాటి ఈతలనూ, క్రీడలనూ తలచుకుంటూ గోదావరిలో ఆ ఈతనూ, ప్రస్తుతం ట్రాఫిక్ నిండిన రోడ్లమీద ఈతలాంటి నడకనూ పోల్చి ఇప్పుడెక్కడ సాధ్యమౌతుంది, ఇప్పుడెక్కడ వీలవుతుంది అని నిర్వేదం ప్రకటిస్తుంది. అమ్మ ఇచ్చిన ప్రేమనూ, రక్షణనూ తలచుకోవడం దగ్గర ప్రారంభమై, ఆ బాల్యాన్ని పారేసుకున్నాను అనీ, జారిపోయిన బాల్యం మళ్ళీ రాదుకదా అనీ గుర్తింపుతో ముందుకుసాగి, మళ్లీ చీరచెంగులో తన కన్నీళ్ళను పట్టి బంధించిన జీవితాన్ని పంచుకున్న అర్థాంగిని గుర్తించి, “ఈమెకూడా అమ్మలానే ఓ స్త్రీమూర్తికదూ” అనే విశ్లేషణతో ముగుస్తుంది ‘ఒక స్త్రీమూర్తి’ కవిత. ఒక నిర్దిష్ట వాస్తవికత దగ్గర ప్రారంభమై సాధారణీకరణ చేయడం అనే కవితానిర్మాణానికి ఇది ఒక నిదర్శనం. ‘బొమ్మలకిటికీ’, ‘రాగాలచెట్టు’ కవితలు సొంత అనుభవాల దగ్గర ప్రారంభమై క్రమక్రమంగా విస్తృతమై సాధారణీకరణ పొంది, నిసర్గ సౌందర్యానికీ వికృత పట్టణీకరణకూ మధ్య, అమాయకపు గతానికీ వ్యాపారీకృత వర్తమానానికీ మధ్య, ప్రకృతికీ విధ్వంసానికీ మధ్య వైరుధ్యాన్ని మన దృష్టికి తేవడంలో విజయం సాధిస్తాయి.

‘ఎర్రడబ్బారైలు’లో చెప్పుకోవలసిన మరొక విశిష్టత దాని కవితలలోని దృశ్యాత్మకత. స్వయంగా చిత్రకారుడుకావడం వల్ల వీర్రాజు ఊహాశాలితలో భావచిత్రాలు నిజమైన రంగులూ రేఖలూ దిద్దుకుంటాయి. ముప్పై కవితల్లో కనీసం ఆరు కవితలు నిజంగానే చిత్రాల గురించి మాట్లాడతాయి. దాదాపు అన్ని కవితలూ చదవగానే పఠితల కళ్లముందర ఒక దృశ్యాన్ని లేదా ఒక దృశ్యమాలికను రూపు కడతాయి.

ఒకప్పుడు అందమైన దృశ్యాన్ని చూపుతూ పెయింటింగై వేలాడుతూ ఉండే కిటికీకి అడ్డుగా ఇప్పుడు అగ్గిపెట్టెగూళ్ళ అంతస్తు భవనాలు, ఎత్తయిన ఇటికల గోడ లేచి పాకుడుపట్టిన గోడమీద అబ్ స్ట్రాక్ట్ పెయింటింగ్ కనబడుతున్నదనే ‘బొమ్మల కిటికీ’ గాని, గోదావరిలో నిండు సరకుల గూడు పడవను ఎగువకు లాక్కుపోయే దృశ్యాన్ని, అటువంటి అనేక దృశ్యాలను చూపిన ‘నీటివాలుకు ఎదురుప్రయాణం’ గాని, అనేకానేక దృశ్యాల్ని ఏరుకుంటూ సాగే ‘నడక’ గాని, టేంక్ బండ్ ఫుట్ పాత్ మీది ‘వెంటాడే దృశ్యం’ గాని, సాయంకాలానికి ఓ కవితనో, ఓ బొమ్మనో కాగితం మీదకు చల్లగా దించే దృశ్యాన్ని వివరించే ‘ఒక సెలవురోజు’గాని…ఇలా చెపుతూ పోతే దాదాపు ప్రతికవితా నిజంగా పఠిత మనోచిత్రం మీద రూపుకట్టే దృశ్యాల్ని సృష్టిస్తుంది.

అమెరికన్ సామ్రాజ్యవాద దురాక్రమణ స్వభావాన్ని ఎదిరిస్తూ రాసిన ‘రాక్షసులు కూడా కారు’, ‘కసీ + ద్వేషం’, భూతనఖా గురించి ‘కాగితం’, మతకల్లోలాల గురించి ‘పేరు ఏదయితేనేం’, జీవితంలో అనివార్యమైన ఎరుపు పట్ల సంపన్నవర్గాల భయాన్ని చిత్రించిన ‘భయం’, రాళ్లు కొట్టిబతికే వడ్డెరల జీవితాన్ని చిత్రించిన ‘మాకున్నభయం ఒకటే’ మొదలయిన కవితలన్నిటి గురించి ఎంతో విశ్లేషించవచ్చు.
పుస్తక శీర్షికగా మారిన ‘ఎర్రడబ్బారైలు’ ప్రధానంగా నిరీక్షణ మీద రాసినట్టనిపించినా పొరలుపొరలుగా జీవితకోణాలన్నిటినీ స్పృశించిన లోతయిన కవిత. ఉద్యమంలోకి వెళ్లిన కొడుకు ఎప్పుడయినా తనకు ఒక ఉత్తరం రాస్తాడని, ఆ ఉత్తరాన్ని ఒక ఎర్రడబ్బా ఉండే రైలు మోసుకువస్తుందని ఒక ముసలి తల్లి ఎదురుచూపు ఈ కవితకు ప్రధాన ఇతివృత్తం. కాని ఇంటిముందు తుమ్మచెట్లు, పోలీసుల్లా నిల్చిన తాటిచెట్లు, బితుకుబితుకుగా వొదిగిన వరిపొలాలు, పగిలిన టమోటాపండు ఆకాశం, గాజుకళ్ళ మసకచూపులు లాంటి భావచిత్రాల ద్వారా వాతావరణాన్ని కల్పిస్తూ మొదలవుతుందీ కవిత. కొడుకు ఉత్తరం అతనికి ఏ ప్రమాదమూ జరగలేదని, ఏ సర్కారు తుపాకీగుండు వల్లనో, ఏ లాకప్ చీకటి కొట్టులోనో, ఏ బూటు కాలికిందో కొడుకు హతమయిపోలేదని ఆ తల్లికి ఆశను నిలుపుతుంది. నిరాశలో, దుఃఖంలో, భయానక వాతావరణంలో ప్రారంభమైన కవిత రేపటిపై ఆశలో, నిరీక్షణలో ముగుస్తుంది.

చిత్రకారుడిగా, కథకుడిగా, నవలాకారుడిగా, కవిగా, స్నేహాస్పదుడైన మంచిమనిషిగా బహుముఖ ప్రజ్ఞనూ, సహృదయతనూ లోకానికి పంచిపెడుతున్న వీర్రాజు ‘ఎర్రడబ్బారైలు’ చదవడం ఒక విశిష్టమైన అనుభవం.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Book Reviews. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s