వర్గీకరణలో ప్రాంతీయ ప్రత్యేకత

షెడ్యూల్డ్ కులాలకు రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్లను ఆ షెడ్యూల్డ్ కులాలలోనే కొన్ని వర్గాలు తమ జనాభా నిష్పత్తికన్న ఎక్కువగా వినియోగించుకుంటున్నందువల్ల, మరికొన్ని వర్గాలు తమ న్యాయమైన వాటాను పొందలేకపోతున్నాయనే వాదనతో, రిజర్వేషన్ల కల్పనలో షెడ్యూల్డ్ కులాల మధ్య కూడ వర్గీకరణను అమలు చేయాలని మొదలయిన మాదిగ దండోరా ఉద్యమం పదమూడు సంవత్సరాల కాలంలో అనేకమలుపులు తిరిగింది. మాదిగ దండోరా నాయకత్వం అప్పుడప్పుడు అవకాశవాద వైఖరి అవలంబించినా, పాలకవర్గ ముఠా తగాదాల్లో తెలిసో తెలియకనో భాగమయిపోయినా, ఆ ఉద్యమపు సారాంశం ఒక ప్రజాస్వామికమైన, న్యాయమైన డిమాండ్. చారిత్రకంగానూ, సామాజికంగానూ న్యాయమైన వాదననే చేస్తున్నప్పటికీ, తన వాదనను గణాంకాలతో రుజువుచేసి అందరినీ ఒప్పించగల అవకాశం ఉన్నప్పటికీ మాదిగదండోరా కొన్నిసార్లు అతిశయోక్తులకూ, అనవసరమైన శత్రుపూరిత వైఖరికీ దిగింది.

మాదిగ దండోరా తర్వాత, కేవలం ఆ ఉద్యమ ఆకాంక్షలను వ్యతిరేకించే ప్రాతిపదికపై మాల మహానాడు ప్రారంభమయింది. మాల మహానాడు తన వెనుక మాల, తదితర కులాలకు చెందిన ప్రజలను సంఘటితం చేయగలిగినప్పటికీ, దాని సారాంశం ఒక ప్రజాస్వామికమైన ఆకాంక్షను వ్యతిరేకించడం. ఈ క్రమంలో మాలమహానాడు అసలు రిజర్వేషన్ల స్ఫూర్తికే భంగకరంగా, అగ్రవర్ణాలు ముందుకుతెచ్చిన ప్రతిభ వాదనను కూడ ముందుకుతెచ్చింది. తమతోటి బాధిత వర్గానికి ప్రయోజనం అందించే ఒక విధానాన్ని అడ్డుకోవడానికి న్యాయస్థానానికి కూడ వెళ్లింది. పరిశోధన జరిపి వాస్తవాలు నిగ్గు తేల్చడానికి ఏర్పాటయిన కమిషన్ పని చేయడానికి వీలులేదని పట్టుపట్టింది.

ఇరుపక్షాలనుంచీ అనుచిత వాదనలు, పోటీ జిమ్మిక్కులు సాగినప్పటికీ, ఇప్పుడయినా ఆ గతాన్నంతా పక్కనపెట్టి, ఈ సమస్య పరిష్కారం సాధించేదిశగా ఆలోచించవలసి ఉంది.

వర్గీకరణ అనేది ఎప్పుడైనా ఒక ప్రజాస్వామిక, ప్రాతినిధ్య, సహజన్యాయ సూత్రమని మొట్టమొదట అందరూ గుర్తించాలి. వేలఏళ్లుగా అసమాన కుల దొంతరలతో నడుస్తున్న అంతరాల వ్యవస్థలో ఏ రెండు కులాల మధ్యనైనా సమానత్వం ఉన్నదనుకోవడం అంత సులభం కాదు. తరతరాలుగా అన్ని అవకాశాలూ పొందుతున్న సమూహానికీ, ఏ అవకాశమూ అందని సమూహానికీ మధ్య సమానత్వం ఉన్నట్టు ప్రవర్తించడం అసాధ్యం మాత్రమే కాదు, దుర్మార్గం కూడ. అందువల్లనే ఈ దేశంలో కొన్ని వర్గాలకు రక్షణ కల్పించే రిజర్వేషన్ విధానం మొదలయింది. ఆ విధానం వివక్షకు, నిరాదరణకు, అసమానతకు గురయిన వర్గాలన్నిటికీ న్యాయం కలిగించలేకపోతే దాన్ని ఇంకా బలోపేతం చేయడానికి ఏమి చేయాలో ఆలోచించవలసి ఉంటుంది గాని దాన్ని రద్దు చేయడమో, తూట్లుపొడవడమో మార్గం కాదు. వర్గీకరించి ఒక్కొక్కరిపట్ల భిన్నంగా వ్యవహరించడం అనేది అగ్రవర్ణాలు, వెనుకబడిన వర్గాలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, మహిళలు, మైనారిటీలు అనే విభజన విషయంలో ఎంత న్యాయమైనదో, ఆయా వర్గాలలోపల కూడ అంతే న్యాయమైనది. కాకపోతే ఇక్కడ వర్గీకరణకు గురవుతున్న వర్గాలు రెండూ కూడ బాధిత వర్గాలేనని గుర్తించడం అవసరం. ఆ జాగ్రత్త తీసుకోవడం అవసరం.

జనాభా నిష్పత్తి ప్రకారం సామాజికఫలాల విభజన జరగాలనేది స్థూలంగా అనుసరించవలసిన పద్ధతి. షెడ్యూల్డ్ కులాలకు మొత్తంగా అమలవుతున్న 15 శాతం రిజర్వేషన్లను, షెడ్యూల్డ్ కులాల జాబితాలో ఉన్న కులాలన్నిటికీ వాటివాటి జనాభా నిష్పత్తి ప్రకారం కెటాయించాలనేది రిజర్వేషన్ సూత్రానికి అనుగుణమైన వాదనే. అయితే ఎవరి కులం జనాభా ఎంత అనేది వివాదాస్పదమయింది. జస్టిస్ పి. రామచంద్ర రాజు ఏకసభ్య కమిషన్ (1997) జనగణన 1981 గణాంకాల ఆధారంగా మొత్తం షెడ్యూల్డ్ కులాల జనాభాలో వివిధ కులాల, కుల సమూహాల జనాభాను గణించి, నాలుగు గ్రూపులుగా వర్గీకరించి ఆయా గ్రూపుకు ఎంత వాటా ఇవ్వవచ్చునో సిఫారసు చేసింది. ఆ గణాంకాలు సరయినవి కావని మాలమహానాడు అన్నప్పటికీ ఆ వాదన వీగిపోయింది. చివరికి 2004 నవంబర్ లో సుప్రీంకోర్టు సాంకేతిక కారణాల రీత్యా ఈ వర్గీకరణ చెల్లదని కొట్టివేసిన తర్వాత ఈ విషయంలో చట్టం చేయాలని కేంద్రప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించింది.

ఆ తర్వాత ఈ విషయం గురించి ప్రధానమంత్రికి వివరించడానికి రాష్ట్రం నుంచి వెళ్లిన అఖిలపక్ష ప్రతినిధి బృందం తన విజ్ఞాపన పత్రంలో జనగణన 2001 గణాంకాలను ఉటంకించి, రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాల జనాభాలో మాదిగలు 47.15 శాతం అని, మాలలు 38.53 శాతం అని రాసింది. ఈ అంకెలను ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఆ పత్రమే మాదిగలలో అక్షరాస్యతా శాతం 10 నుంచి 19 శాతం కాగా, మాలలలో 22 నుంచి 30 శాతం అని, మాలలు అభివృద్ధి చెందిన వారుగా విద్యలోనూ, ఉద్యోగాలలోనూ ఉన్నత పదవులు ఆక్రమించారని రాసింది.

పదమూడు సంవత్సరాలుగా ఈ వివాదం నడుస్తున్నప్పటికీ, పది సంవత్సరాలకింది రామచంద్రరాజు కమిషన్ నుంచి రెండు సంవత్సరాల కింది అఖిలపక్ష పత్రం వరకూ అన్నిచోట్లా మాదిగ, తదితర కులాలకు అన్యాయం జరిగిందనీ, దాన్ని వర్గీకరణ ద్వారా సరిదిద్దవలసిన అవసరం ఉందనీ ప్రకటిస్తున్నప్పటికీ, పాలకవర్గాలు మాత్రం ఈ రెండు బాధిత వర్గాల మధ్య ఘర్షణను పెంచి పెద్దది చెయ్యడానికే ప్రయత్నించాయి తప్ప ఒక న్యాయమైన, సర్వజనామోదమైన, శాంతియుతమైన పరిష్కారం కనిపెట్టే ప్రయత్నం చేయడంలేదు.

నిజానికి, చిత్తశుద్ధి, సమన్యాయభావన, దూరదృష్టి ఉంటే ఈ సమస్యను పరిష్కరించడం కష్టసాధ్యం కావచ్చు గాని అసాధ్యం కాదు. మొట్టమొదట గుర్తించవలసినది, రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోనూ షెడ్యూల్డ్ కులాల జనాభా నిష్పత్తి సమానం కాదు. జనగణన 2001 గణాంకాల ప్రకారం రాష్ట్రం మొత్తం జనాభాలో షెడ్యూల్డ్ కులాల జనాభా 16.19 శాతం కాగా, ఆ జనాభాలో జిల్లాల మధ్య విపరీతమైన అంతరం ఉంది. నెల్లూరు జిల్లాలో అతి ఎక్కువగా 22 శాతం షెడ్యూల్డ్ కులాల జనాభా ఉండగా విశాఖపట్నం జిల్లాలో అతి తక్కువగా 7.60 శాతం ఉంది.

మరొక వైపు మాల – మాదిగ జనాభాలో జిల్లాల మధ్య తేడా ఉంది. పద్నాలుగు జిల్లాలలో మాదిగల సంఖ్య మాలల కన్న ఎక్కువ ఉండగా, తొమ్మిది జిల్లాల్లో మాలల సంఖ్య ఎక్కువగా ఉందని రామచంద్రరాజు కమిషన్ పేర్కొంది. మొత్తంగా కృష్ణా మినహా మధ్య కోస్తాజిల్లాల్లో మాలల జనాభా ఎక్కువని, మిగిలిన జిల్లాల్లో మాదిగల జనాభా ఎక్కువ అని ఒక స్థూల అభిప్రాయం ఉంది. ఇంత వ్యత్యాసం ఉన్న సందర్భంలో అన్ని జిల్లాలలోనూ సమానంగా రిజర్వేషన్ సూత్రాన్నిగాని, వర్గీకరించిన రిజర్వేషన్ కోటాను గాని అమలు చేయడం ఉచితం కాదు. కాని చట్టప్రకారం జిల్లాల మధ్య విచక్షణ చూపడానికి వీలులేదు. అయితే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినంతవరకు 1975 రాష్ట్రపతి ఉత్తర్వులు, రాష్ట్రాన్ని ఆరు జోన్లుగా విభజించి ఆయా జోన్లకు మాత్రమే వర్తించే స్థానిక రిజర్వేషన్ అమలు చేయడానికి వీలు కల్పిస్తున్నాయి. ఇప్పుడు షెడ్యూల్డ్ కులాల జనాభాను, దానిలో మాల-మాదిగ జనాభా నిష్పత్తిని, ప్రాంతీయ వ్యత్యాసాలను పరిగణనలోకి తీసుకుని, జాగ్రత్తగా ఒక పరిష్కారం కనిపెట్టడం అసాధ్యం కాదు. ఈ లోగా ఇరువర్గాలమధ్య అనవసరమైన వైషమ్యాలు తలెత్తకుండా చూడడం తక్షణ అవసరం.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Telugu, Vartamaanam. Bookmark the permalink.

2 Responses to వర్గీకరణలో ప్రాంతీయ ప్రత్యేకత

 1. Sridhar says:

  ఈమధ్య ఏ విషయం మీద కానివ్వండి-ఎవరికి తోచిన న్యాయం వారు మాట్లాడుతున్నారు. కనుక ఏది న్యాయమో నిర్ణయించే అర్హత ఎవరికీ లేకుండా పోయింది.మనక్కూడా న్యాయం ఏమిటో తెలుసుకునే అవకాశం పోయింది.

  1. ఒక న్యాయం (బీసీల వర్గీకరణలానే)ప్రకారం ఎస్సీల వర్గీకరణ జరగాలి.
  2. మరో న్యాయం ప్రకారం జరక్కూడదు. (వేరే రాష్ట్రాల్లో జరగలేదు కనుక)
  3. ఇంకో న్యాయం ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వుల ననుసరించి
  రిజర్వేషన్ జరగాలి.

  4.వేరొక న్యాయం ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వులు కాదు-మనిషి ఎక్కడ పుట్టాడనేదాన్ని బట్టి ఉద్యోగం ఇవ్వాలి.

  ఏది సత్యం ? ఏది అసత్యం ? ఓ మహాత్మా ! ఓ మహర్షీ !

 2. మా కులం వాళ్ళం ఎక్కువ మందిమి వున్నాం. కనుక రిజర్వేషన్లలో మాకు ఎక్కువ వాటా ఇవ్వాలని కోరటం అన్యాయం. ఆ కులాల వాళ్ళ ఓట్లన్నీ ఒక పార్టీకే పడుతున్నాయి. వాళ్ళ ఓటు బ్యాంకును చీల్చాలని ఎన్టీ రామారావుగారు ప్రయోగించిన ఎత్తుగడ ఫలించింది. నేడు సగం ఓట్లు ప్రత్యర్ధులకు గ్యారంటీ. అయినా రాజకీయాల్లో నీతి, న్యాయాలకు చోటుంటుందా ?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s