వల్లంపాటిని ఎట్లా అర్థం చేసుకోవాలి? (part 2 of 2)

ఆ విధంగా చూసినప్పుడు తాను పుట్టిన కులానికి, వర్గానికి, మతానికి, లింగానికి, ప్రాంతానికి, భాషకు భిన్నమైన ఆలోచనలు, ఆచరణలు, విలువలు ఉన్న మనుషులు మనచుట్టూ ఎంతోమంది ఉన్నారు. వారి పుట్టుకతో ఉండగల అవలక్షణాలను వదుల్చుకొమ్మని వారిని నిరంతరం హెచ్చరిస్తూనే, ఎప్పుడైనా అటువంటి అవలక్షణాలు పొడసూపితే వాటిని ఖండిస్తూనే, వారి ఆచరణను బట్టి, విలువలను బట్టి వారిని అంచనా వేయవలసిఉంటుంది. వారి ఆచరణతో, విలువలతో సంబంధంలేకుండా, దుడ్డుకర్ర పట్టుకుని కూచుని “ఫలాని కులంలో పుట్టినవాళ్లందరూ చెడ్డవాళ్లు, ఫలాని కులంలో పుట్టినవాళ్లందరూ మంచివాళ్లు” అని సరళరేఖ లాగ నిర్ధారించేట్టయితే, అది మనువును పునరుద్ధరించడమే. తెలుగు మేధోప్రపంచంలో ఆ పని ఇటీవల చాల ఎక్కువగా, చాలసార్లు అవకాశవాదంతో, తాము నిందించదలచుకున్నవాళ్ల కులం వెతుకుతూ జరుగుతోంది.

“నాలాంటి బ్రాహ్మలకంటే శూద్ర బ్రాహ్మణులు ఎక్కువ ప్రమాదకరంగదా? నేనెప్పుడైనా బ్రాహ్మణత్వాన్ని సమర్థించి ఉంటే ఆయన ఆ మాట అనటంలో సామంజస్యం ఉండేది. బ్రాహ్మణత్వాన్ని వ్యతిరేకించింది నేనా, అతనా? ఇలా ఉన్నాయి మార్క్సిస్టులమని చెప్పుకునేవారి సంస్కారాలు. ఇలాంటివి చూసినప్పుడు మనుషులమీదనే నమ్మకం పోతుంది. మనం చాలా శ్రమ పడితేకానీ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేము” అని వల్లంపాటి చేసిన ఆక్రోశాన్ని ఈ నేపథ్యంలో అర్థం చేసుకోవాలి.

ఇందులో మార్క్సిస్టులమని చెప్పుకునేవారు ఎలా ప్రవర్తించగూడదో వ్యాఖ్య ఉంది. అటువంటి ప్రవర్తన వల్ల మనుషులమీదనే నమ్మకం పోతుందనే విచారం ఉంది. చాలా శ్రమ పడి అయినా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనే ఆకాంక్ష ఉంది.

మదనపల్లి లాంటి మారుమూల ఉండికూడ వల్లంపాటి బయటి సాహిత్యలోకంతో, బయటి చర్చలతో, ఆలోచనలతో నిత్య సజీవ సంబంధంలో ఉన్నారు. అదికేవలం స్నేహితులద్వారామాత్రమే కాదు, బయట ఏదయినా కొత్త పుస్తకం వచ్చిందంటే ఏదో ఒకరకంగా దాన్ని సంపాదించి చదివి ఆ కొత్త ఆలోచనలు చర్చించాలని, వాటిలో మంచి ఉంటే స్వీకరించాలని అనుకునేదాకా ఆయన కొత్తభావాలకోసం ఎదురుచూశారు. నిజానికి ఈ తపన కూడ తెలుగు మేధావులలో ఉండవలసినంతగా ఉండడంలేదు. కొంతకాలం బాగా చదువుకున్నవాళ్లు కూడ ఆతర్వాత కొత్తభావాలగురించి పట్టించుకోకుండా, తాము చిన్నప్పుడు చదువుకున్న అభిప్రాయాలనో, ఎప్పుడో ఏర్పడిన అభిమానాలనో, అపోహలనో పునరుద్ఘాటిస్తున్నారు. ఒక వయసు వచ్చిన తర్వాత, పేరు వచ్చిన తర్వాత చదువు మానేస్తున్నారు. వల్లంపాటి మాత్రం చిట్టచివరివరకూ చదువుతూ, చర్చిస్తూ ఉన్నారు. ఎక్కడ కొత్తభావం వెలువడినా దాని గురించి తెలుసుకోవాలనీ, దాని గురించి చర్చించాలనీ, దాన్ని ఆకళించుకోవాలనీ అనుకున్నారు.

వల్లంపాటి వ్యక్తిత్వంలోని ఈ నాలుగు గుణాలే ఆయన సాహిత్యవిమర్శలోకి కూడ ప్రవహించడం వల్లనే ఆయన సాహిత్యవిమర్శకు విస్తృతీ లోతూ వచ్చాయనుకుంటాను. మానవసంబంధాలమీద ఆర్తి, విమర్శపట్ల సహృదయస్పందన, విలువలపతనంపట్ల ఆవేదన, కొత్తదనంకోసం అన్వేషణ – ఈ లక్షణాల ఆధారంగా ఆయన సాహిత్య విమర్శనంతా విశ్లేషించవచ్చు.

తెలుగు సాహిత్యవిమర్శకు సంబంధించి వల్లంపాటి కృషిని చూస్తే ఆయన మొత్తం దాదాపు యాభై వ్యాసాలు రాసి ఉంటారు. వాటిలో కొన్ని ‘అనుశీలనం’ (1984), ‘వల్లంపాటి సాహిత్యవ్యాసాలు’ (1997) సంపుటాలలో వచ్చాయి. పత్రికలలోనూ, వివిధ సంకలనాలలోనూ అచ్చయి పుస్తకరూపంలోకి రానివి ఇంకా చాలా ఉంటాయి. ఇక ‘నవలాశిల్పం’ (1989), ‘కథాశిల్పం’ (1995), ‘విమర్శాశిల్పం’ (2002), ‘రాయసీమలో ఆధునిక సాహిత్యం – సామాజిక సాంస్కృతిక విశ్లేషణ (2006)’ నాలుగు పుస్తకాలూ సరేసరి. వల్లంపాటి సాహిత్యవిమర్శా క్రమంలో విడివిడిగా కథా, నవలా రచయితల గురించి రాసిన వ్యాసాలూ ఉన్నాయి. కొన్ని కథలగురించో, నవలల గురించో రాసిన వ్యాసాలూ ఉన్నాయి. ప్రత్యేకించి ప్రక్రియలుగా కథ మీద, నవలమీద సమగ్ర విశ్లేషణతో రాసిన పుస్తకాలూ ఉన్నాయి.

వల్లంపాటి ప్రధానంగా వచనసాహిత్యపు విమర్శకుడిగా తనను తాను మలచుకోవడానికి మానవసంబంధాలపట్ల ఉన్న ఆర్తే ప్రధానంగా పనిచేసిందేమో ఆలోచించాలి. విమర్శకుడిగా రూపుదిద్దుకోకముందు కథలు, నవలలు రాసిఉన్నప్పటికీ ఆయన పొందిన శిక్షణ ప్రధానంగా కవిత్వంలోనే. కాని తెలుగులో సాహిత్యవిమర్శంటే కవిత్వ విమర్శే అని ప్రతీతి ఉన్నకాలంలో ఆయన సంకల్పపూరితంగా కాల్పనిక వచన సాహిత్య విమర్శలోకి ప్రవేశించారు. కాల్పనిక వచన సాహిత్యంలో ప్రధానమైనది మానవసంబంధాల స్పర్శ. సంఘజీవిగా మనిషి నిత్యజీవితంలో వేర్వేరు స్థలకాలాలలో, సందర్భాలలో ఎదుర్కొనే మానవసంబంధాలను చిత్రించడం ద్వారా, ఆ మానవసంబంధాల సంక్లిష్ట కోణాలగురించిన స్పృహను కలిగించడంద్వారా కాల్పనిక వచన సాహిత్యం చదువరి జీవన దృక్పథాన్ని ఉన్నతీకరిస్తుంది. జీవిత ఉన్నతీకరణకు ఒక ప్రత్యేక వచన సాహిత్య రచన ఏవిధంగా ఉపకరిస్తుందో, అసలు ఉపకరిస్తుందో లేదో విశ్లేషించడమే సాహిత్య విమర్శ పని అని వల్లంపాటి గుర్తించారనీ, అందువల్లనే అది తన ప్రధాన కార్యక్షేత్రంగా ఎంచుకున్నారనీ అనిపిస్తుంది.

“సామాజిక సంబంధాలను ఎంతమాత్రమూ స్పృశించకుండా వ్యక్తిలోని వైచిత్రిని గురించి రాసిన కథల మీద నాకు గౌరవం లేదు. అలాంటి కథల్లో చక్కని శిల్పం ఉండవచ్చు. మేధాశక్తికూడా ఉండవచ్చు. మరెన్నో ఉండవచ్చు. కానీ ఆ కథను చదివి జీవితాన్ని గురించి నేను తెలుసుకోవలసింది శూన్యం కాబట్టి అలాంటి కథల్ని నేను గౌరవించలేను” (వల్లంపాటి సాహిత్యవ్యాసాలు, పే. 46) అని కథ గురించీ, “సాధారణంగా జీవితం చాలా అస్పష్టంగానో, గజిబిజిగానో కనిపిస్తుంది. ఒక్కోసారి అర్థరహితంగా కూడా అనిపిస్తుంది. జీవితంలో కార్యకారణ సంబంధం లేనట్టు, యాదృచ్ఛికతే జీవితాన్ని నడిపిస్తున్నట్టు భ్రాంతి కూడా కలుగుతుంది. ఇలా అస్పష్టంగా, గజిబిజిగా, అర్థరహితంగా, యాదృచ్ఛికతా ప్రధానంగా కనిపించే జీవితానికి అర్థం లేకపోలేదు. జీవితాన్ని నడిపిస్తూ, జీవితానికి అర్థం ఇచ్చే సూత్రాలను గుర్తుపట్టి, జీవితాన్ని వర్ణించటమే నవలా రచయిత ప్రధాన కర్తవ్యం” (నవలాశిల్పం, పే. 15) అని నవల గురించీ ఆయన ప్రకటించిన అభిప్రాయాలు, ఆ రెండు వచనప్రక్రియల ప్రధాన కర్తవ్యం మానవసంబంధాల చిత్రణే అనే ఆయన దృఢమైన విశ్వాసానికి అద్దం పడతాయి.

విమర్శ ఎంతక్రూరంగా ఉన్నా సంయమనంతో గ్రహించాలని తన సంస్కారం వల్ల గ్రహించినట్టుగానే, విమర్శ అనవసరంగా క్రూరంగా ఉండగూడదని కూడ వల్లంపాటి గుర్తించినట్టున్నారు. తీవ్రమైన విమర్శ చేస్తున్నప్పుడు కూడ దురుసుగా ఉండకపోవడం, అతిక్లిష్టమైన విషయం చెపుతున్నప్పుడుకూడ చాల సరళంగా చెప్పడం ఆయన విమర్శలో ప్రధానమైన అంశాలు. ఆయన పుస్తకాలలో ఎక్కువభాగం విమర్శాసిద్ధాంతానికే సంబంధించినవయినప్పటికీ, ప్రత్యేకించి రచయితలమీద, పుస్తకాలమీద ఆయన రాసిన అన్వయ విమర్శ కొన్ని వ్యాసాలలో కనబడుతుంది. ఆ అన్వయ విమర్శకు కూడ పునాది ఆయనకు సాహిత్య విమర్శ గురించి ఉన్న విశ్వాసమే.

“విమర్శ సంపూర్ణమైన కళాకాదు, శాస్త్రమూకాదు. కళగా ప్రారంభమై శాస్త్ర లక్షణాలను సంతరించుకుంటూ ఉన్న సాహిత్య ప్రక్రియ. ఇందులో విమర్శకుని వ్యక్తిగతమైన, వ్యక్తినిష్ఠమైన అభిప్రాయాలకు చోటులేకపోలేదు. కానీ వ్యక్తిగతమైన ఈర్ష్యాద్వేషాలకు చోటు ఉండకూడదు. అలాగే ప్రాంతం, కులం, శాఖ, మతం మొదలైన అంశాలు సాహిత్య విమర్శలోనూ, సాహిత్యానికి విలువ కట్టటంలోనూ ప్రవేశించకూడదు. ఒక ప్రాపంచికదృక్పథాన్ని కలిగిన విమర్శకుడు నిర్వహించే సామాజిక బాధ్యత సాహిత్య విమర్శ” (నవలాశిల్పం, పే. 21) అనేదే ఆ విశ్వాసం.

ఆ సామాజిక బాధ్యత గురించిన ఎరుకవల్లనే ఆయన తాను విమర్శిస్తున్న రచనలగురించి, రచయితలగురించికూడ, తీవ్రంగా అభిప్రాయభేదం ఉన్న విషయంలో కూడ వీలైనంత మృదువుగా వివరిస్తారు. నచ్చనిదాన్ని చీల్చిచెండాడిన రాచమల్లు రామచంద్రారెడ్డి ప్రభావంలో ఉండికూడ, అభిప్రాయభేదాన్ని ఖండఖండాలుగా నరికి పోగులుపెట్టిన త్రిపురనేని మధుసూదనరావుకు సమకాలికుడయి ఉండికూడ వల్లంపాటి ఈ మృదుత్వాన్ని సంతరించుకున్నారు, పెంపొందించుకున్నారు. అయితే మృదువుగా ఉండడం అభిప్రాయాలలో సామరస్యానికి దారితీయనక్కరలేదని, భావజాలానికి సంబంధించినంతవరకు నిష్కర్ష తప్పదని కూడ ఆయన రచనలు చూపుతాయి.

సాహిత్య విమర్శకుడిగా తనను తాను గుర్తించుకున్నప్పుడే నిరంతర అధ్యయనం తన విధి అని వల్లంపాటి గుర్తించారనుకోవాలి. “విమర్శకుడు ఉత్తమ పాఠకుడుగా మాత్రమే కాకుండా ఉత్తమ విద్వాంసుడుగా కూడా ఉండకతప్పదు. రచయితకూ చదువు – నిరంతరమైన చదువు – అవసరమే. కానీ విమర్శకునికి అవసరమైనంత చదువు రచయితకు అవసరం లేదు. విమర్శకుడు తన మాతృభాషా సాహిత్యాలను లోతుగా అధ్యయనం చేయాలి. తాను ఏ సాహిత్య ప్రక్రియలో కృషి చేస్తున్నాడో దానికి సంబంధించిన సిద్ధాంతాన్ని బాగా తెలుసుకోవాలి…….విమర్శకుడికి తాను ఏ సాహిత్యాన్ని గురించి విమర్శ రాయాలనుకుంటున్నాడో ఆ సాహిత్యాన్ని ప్రభావితం చేసిన, చేయగల అవకాశం ఉన్న సామాజికశాస్త్ర, మనస్తత్వశాస్త్ర సిద్ధాంతాల పరిజ్ఞానం ఉండాలి. భారతీయ వేదాంతం, మార్క్సిజం, అస్తిత్వవాదం, ఫ్రాయిడ్, ఆడ్లర్, యూంగ్ ల మనస్తత్వశాస్త్ర సిద్ధాంతాలూ, స్త్రీవాదం, దళితవాదం తెలుగు సాహిత్యాన్ని బలంగానే ప్రభావితం చేశాయి. ఈ సిద్ధాంతాల ప్రభావం రచయితల మీద ప్రథమావేశాల రూపంలోనో, బలహీనతల కారణంగానో, ఫాషన్ గానో, సుదీర్ఘమైన అధ్యయనం, ఆలోచనల ఫలితంగానో ఉండవచ్చు. రచయితల మీద ఈ సిద్ధాంతాల సామంజస్యాన్ని విశ్లేషించటం విమర్శకుని బాధ్యత కాబట్టి ఈ సిద్ధాంతాలను గురించి విమర్శకునికి సాధారణ రచయిత కంటే చాలా ఎక్కువ పరిజ్ఞానం ఉండాలి. ఏనాడూ సిద్ధాంతగ్రంథాలను అధ్యయనం చేయనివారు విమర్శకులుగా పనికిరారు” (విమర్శాశిల్పం, పే. 11-12) అని చెపుతున్నప్పుడు వల్లంపాటి తన అధ్యయనం గురించికూడ చెపుతున్నారన్నమాట. ఆయనకు అటువంటి సువిశాలమైన అధ్యయనం ఉండడం మాత్రమే కాదు, చరిత్ర, తత్వశాస్త్రం వంటి శాస్త్ర గ్రంథాలను ఇంగ్లిషు నుంచి తెలుగులోకి అనువాదం చేసిన అనుభవం కూడ ఉంది.

వల్లంపాటి సాహిత్య విమర్శలో గుర్తించదగిన లోపాలు కూడ ఉన్నాయి. పాండిత్యం పట్ల, అధ్యయనం పట్ల, విశ్లేషణా పటిమపట్ల ఆయనకు మితిమీరిన అభిమానం ఉండేది. బహుశా ఆ అభిమానం వల్లనే ఆయన ప్రాచీన భారతీయ, ఆలంకారిక సాహిత్య విమర్శ లోని భావజాలాన్ని ఖండిస్తున్నప్పుడు కూడ ఆ ఆలంకారికుల పాండిత్యంపట్ల మైమరిచిపోయేవారు. సహృదయభావన, రససిద్ధాంతం, ప్రాచీన ఆలంకారిక సాహిత్యవిమర్శలోని విశ్లేషణా విధానం వంటి వాటికి ఆయన ఇవ్వవలసినదానికన్న ఎక్కువ ప్రాధాన్యం, గౌరవం ఇస్తున్నారా అని కొన్నిచోట్ల అనిపిస్తుంది.

ఆయన అధ్యయనం చాల విస్తృతంగానూ లోతుగానూ సాగిన మాట నిజమేగాని తెలుగునాట మేధావులలో చాలమందిలో ఉన్నట్టుగానే ఆయనలోనూ కొన్నిసందర్భాలలో సైద్ధాంతిక పటుత్వం లేకపోవడం, దృక్పథస్పష్టతలో లోపాలు కనబడుతుండేవి. వల్లంపాటి మేధావిగా రూపొందిన నేపథ్యంలో ఒక ప్రజా ఉద్యమ స్ఫూర్తిలేకపోవడం, ఎక్కడా ఏ రూపంలోనూ వర్గపోరాట వ్యక్తీకరణలలోనూ భాగం కాకపోవడం, చాలవరకు వర్గసామరస్య రాజకీయధోరణితోనే సన్నిహితంగా ఉండడం వంటి కారణాలవల్ల ఈ సైద్ధాంతిక పటుత్వలోపం ఏర్పడిందేమో అన్వేషించాలి. సరిగ్గా అమెరికన్, యూరపియన్ మార్క్సిస్టు సాహిత్య విమర్శకులు కొందరిలో కూడ ఆశ్చర్యకరమైన, అద్భుతమైన విశ్లేషణా శక్తితోపాటే కొన్ని చిన్నచిన్న సైద్ధాంతికవిషయాలపట్ల కూడ గందరగోళం ఉండడం చూసినప్పుడు వల్లంపాటితో పోలికలు కనబడతాయి. కేవలం వ్యక్తిగత మంచితనం వల్ల, న్యాయభావన వల్ల, సిద్ధాంత అధ్యయనం వల్ల మాత్రమే మార్క్సిస్టులయినవారిలో ఈ లోపాలు సాధారణమే. అందువల్లనేనేమో “మార్క్సిస్టు సాహిత్య విమర్శ” అని తాననుకున్నదాన్ని విమర్శిస్తున్నప్పుడు కూడ ఆయన పైపై విమర్శలే చేశారు. అసలు అది మార్క్సిస్టు సాహిత్య విమర్శ అవునా అని మౌలికమైన ప్రశ్న వేసుకోలేకపోయారు. అధ్యయన అవసరాన్ని చాల ఎక్కువగా గుర్తించికూడ, చరిత్ర, తత్వశాస్త్రాల్ని అధ్యయనం చేసికూడ, ఆయన రాజకీయార్థిక శాస్త్రపు మౌలిక భావనలను కూడ అవగాహనలోకి తెచ్చుకోలేదనిపిస్తుంది. నిజానికి రాజకీయార్థిక శాస్త్రాన్ని, చరిత్రను, తత్వశాస్త్రాన్ని లోతుగా అవగాహన చేసుకోకుండా సాహిత్యవిమర్శలో సైద్ధాంతిక పటుత్వం సంపాదించడం సాధ్యం కాదు. ‘రాయలసీమలో ఆధునిక సాహిత్యం – సామాజ్క సాంస్కృతిక విశ్లేషణ’ ను నిశితంగా పరిశీలిస్తే ఈ అభిప్రాయం బలపడుతుంది.

ఈ లోపాలు ఉన్నప్పటికీ, ప్రజాసాహిత్యం గురించి, సాహిత్య ప్రయోజనంగురించి నిరంతరం ఆలోచించి, చివరివరకూ ప్రజాసాహిత్య శిబిరంలో కొనసాగి, అపారమైన కృషి చేసిన వల్లంపాటి నుంచి నేర్చుకోవలసినవి ఎన్నో ఉన్నాయి. ఆయన వదిలిపెట్టిన సాహిత్యవిమర్శ కృషిని పరిపుష్టం చేయవలసిందీ ఎంతో ఉంది.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Reviews, Telugu. Bookmark the permalink.

2 Responses to వల్లంపాటిని ఎట్లా అర్థం చేసుకోవాలి? (part 2 of 2)

  1. koresh says:

    communist la lo kula gajji sarwa saadaranam.

  2. Pingback: కథా శిల్పం – వల్లంపాటి వెంకటసుబ్బయ్య | పుస్తకం

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s