మళ్లీ ఎన్‌కౌంటరయిన సత్యం

‘విరబూసే ఆపిల్ చెట్లు కాదు
సత్యానికి తారుపూస్తున్న
హిట్లర్ ఉపన్యాసాలు
నాచేత పాటలురాయిస్తున్నాయి’ అన్నాడు ఏడుదశాబ్దాలకింద జర్మన్ కవి బెర్టోల్ట్ బ్రెహ్ట్. లక్షలాదిమందిని ఊచకోతకోసిన హిట్లర్ నాజీ పాలన చీకటిరోజుల్లో తన సృజనను వ్యక్తీకరిస్తూ ‘చీకటి రోజుల్లో పాటలుంటాయా’ అని అడిగి ‘ఉంటాయి’ అని తనకు తాను ఆశ్వాసం చెప్పుకుని ఆ పాటలు ‘చీకటి రోజులగురించే’నని వెలుగంత తేటతెల్లంగా చెప్పాడు బ్రెహ్ట్.

ఒక నాయకుడిని, అతని సహచరులిద్దరిని దొంగతనంగా ఎత్తుకుపోయిన బెంగళూరు వీథుల్లోనుంచి మళ్లీ ఇవాళ బ్రెహ్ట్ చీకటి గురించిన పాటలు పాడుతున్నాడు. తమ అధీనంలో ఉన్న నాయకుడిని జనసమ్మర్దపు నట్టనడిబొడ్డున కాల్చి చంపి ఎదురుకాల్పులు అంటున్న తారుపూసిన ఉపన్యాసాలు విని ఆశ్చర్యపోతున్నాడు బ్రెహ్ట్. అబద్ధాలమీద అబద్ధాలతో అసలు సంగతిని మాయంచేస్తున్న కుటిలనీతిని చూస్తూ తన సమాధిలో అటూఇటూ దొర్లుతున్నాడు హిట్లర్ దగ్గరి అబద్ధాల మంత్రి గోబెల్స్. ఒకవైపు కాశ్మీర్ లో, మరొక వైపు గుజరాత్ లో, ఇంకొకవైపు కేరళలో ఎన్ కౌంటర్ ఘటనల బూటకత్వం బయటపడి, ఖాకీబట్టలు తొడుక్కున్న శిక్షాతీత హంతక ప్రవృత్తి బోన్లెక్కుతుంటే, బెంగళూరు నుంచి ధర్మవరం దాకా జడలువిప్పిన ఈ అబద్ధం, అమానుషత్వం చూసి బ్రెహ్ట్, గోబెల్స్ లు మాత్రమే కాదు బహుశా హిట్లర్ కూడ ఆశ్చర్యపోతూ ఉంటాడు.

అదే విచిత్రం. ఇవాళ్టి మన ప్రజాస్వామ్య ఏలికలు నరహంతక హిట్లర్ లను మించిపోతున్నారు. హిట్లర్లనూ ముస్సోలినీలనూ తలదన్నేంత దౌర్జన్యం, క్రౌర్యం, అమానుషత్వం, అబద్ధం ఇవాళ అధికార పీఠాలమీద ఊరేగుతున్నాయి. అందుకే సత్యం అనేది ఒక అరుదయిన పదార్థం గా మారిపోతున్న ఈ చీకటిరోజుల్లో మళ్లీ మళ్లీ చీకటి రోజుల గురించి పాడకతప్పదు.

ఈ చీకటి రోజుల్లో విశేషం ఏమంటే ఇవాళ్టి హిట్లర్లు ఎప్పుడూ చిరునవ్వులు ఒలకబోస్తుంటారు. మెత్తనికత్తుల్లా మర్యాదనిండిన మాటలు మాట్లాడుతుంటారు. దేశం వెలిగిపోతోందని, కాంట్రాక్టర్ల కోసం తవ్విన కాలువల్లో ప్రవహించడానికి ఎట్లాగూ నీళ్లు లేవు గనుక పాలూ తేనే ప్రవహిస్తున్నదని, ధర్మం ఆరుపాదాలనో, ఎనిమిదిపాదాలనో నడుస్తున్నదని, రామరాజ్యానికి బెత్తెడుదూరంలోనే ఉన్నామని, అప్పుడప్పుడు రాక్షససంహారం తప్పడం లేదని నమ్మబలుకుతుంటారు. తమ ఆర్జన సజావుగా సాగుతుంటే, కింద ప్రజాపాలన ఎట్లా సాగినా తమకేమీ పట్టనట్టుంటారు. ప్రజలను పీడించేపనిని జాగీర్దార్లకూ, జమీందార్లకూ, సేనాధిపతులకూ వదిలి, నిత్య విలాసాల్లో మునిగితేలిన చక్రవర్తులలాగ ఇవాళ్టి ఏలికలు బధిరాంధపాలకులయిపోయారు.

అయినా ఏలిక అంటే గద్దె మీద కూచునే ఒకానొక మనిషి అనే అర్థం ఎప్పుడో మారిపోయింది. ఇది రాచరికం కాదుగదా, ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్నాంగదా, అందుకే ఏలికల సంఖ్య కూడ ప్రజాస్వామికంగా పెరిగిపోయింది. పాత రోజుల్లో రక్షకభటులు అని పేరు పెట్టుకున్నవాళ్లు, రక్షణ బాధ్యతను ప్రజల రక్షణగా కాక, ప్రభువుల రక్షణగా మార్చివేసి, ప్రభువుల భటులుగా, ప్రజలపట్ల తలారులుగా మారిపోయారు. వాళ్లే నిజమైన ఏలికలయిపోయారు. తమ ఏలికలను తామే ఎన్నుకుంటున్నామని, తమ పవిత్రమైన వోట్లకే ఈ ఏలికలు తయారవుతున్నారని ప్రజలు అమాయకంగా నమ్ముతుంటే ఆ ఏలికలను పీలికలుగా మార్చి, ఈ తలారులయిన దండనాయకులే ధరాధిపతులయిపోయారు.

ఇప్పుడు ఈ దండనాయకుల చేతిలో ఉన్నది ఎప్పుడో ఏలికలు స్వయంగా తయారు చేసిన ‘ప్రత్యర్థుల నిర్మూలనా పథకం’. ‘ఒక మనిషిని హత్యచేస్తే బహుమతులిస్తాం. సత్యం తెలుసుకుని, తాను తెలుసుకున్న సత్యాన్ని ప్రజలకు తెలియజెప్పాలని ఎవరయినా ప్రయత్నిస్తే వారిని నిర్మూలించవలసిందే. అలా నిర్మూలించినవారికి రాజలాంఛనాలిస్తాం, చీనిచీనాంబరాలిస్తాం, మణిమాణిక్యాది వజ్ర వైఢూర్యాది బహుమానాలు అందజేస్తాం, ఆ తలారుల ఇతరేతర తప్పులన్నిటినీ క్షమించేస్తాం’ అని ప్రభువులవారు ప్రకటించిన కానుకలపథకం దండనాయకుల దౌర్జన్యానికి ఇతోధికంగా అవకాశమిస్తోంది. దొరికినవారిని దొరికినట్టు చంపివేయడమే ఒక జాతీయక్రీడగా మారిపోయింది. పులులను వేటాడి పక్కన నిలబడి ఫొటిగరాఫులు తీయించుకున్న రెండువందల ఏళ్లకింది ఏడేడు సముద్రాల అవతలి దొరల నిజమైన వారసులుగా మనుషులను చంపి అబద్ధాలు నిండిన ప్రగల్భాలు పలకడమే తలారుల సామర్థ్యానికి సూచిక అయిపోయింది.

ఇదంతా గతించిపోయిన రాజవంశాల కథనో, బ్రిటిష్ పాలనాకాలపు వలసరాజ్యపు దుర్మార్గమో కాదు. షష్టిపూర్తి జరుపుకోబోతున్న స్వతంత్ర, ప్రజాస్వామిక, లౌకిక, సర్వసత్తాక గణతంత్ర రాజ్యంలో యధావిధిగా కొనసాగుతున్న ఒక దుర్మార్గ, అమానవీయ, గాఢాంధకార గాథ. మనం చూడనందువల్లనో, చూడదలచుకోనందువల్లనో, చూడనట్టు నటించినందువల్లనో ఈ గాఢాంధకారం లేకుండా పోదు. ఆ అంధకారం రోజురోజుకూ విస్తరిస్తోంది. నాలుగుదశాబ్దాలవెనుక ఒకటిరెండు రాష్ట్రాలలో మొదలయిన ఈ శిక్షాతీత హంతకప్రవృత్తి మన నాగరిక, ప్రజాస్వామిక జీవనాన్నే అపహాస్యం చేస్తోంది. ప్రపంచంలోకెల్లా ఘనమైన రాజ్యాంగం అని మనం గొప్పలు చెప్పుకుంటున్న మన సంవిధానాన్నే కాలరాస్తోంది. ఇవాళ దేశమంతా వ్యాపించిన ఈ దాదూ ఫిర్యాదూ లేని హంతక వ్యవస్థ రేపు ప్రతిఒక్కరి జీవన భద్రతనూ సందేహాస్పదం చేస్తుంది.

అందుకే ఇది ఎన్నిసార్లు చెప్పినా మళ్లీ మళ్లీ చెప్పవలసిన విషయం. ఇది ఇవాళ హత్యలకు గురవుతున్న ఒకానొక రాజకీయపక్షపు సమస్య ఎంతమాత్రమూ కాదు. ఇది ఈ దేశ పాలనావిధానపు సమస్య. ఇది ఈ దేశ రాజ్యాంగపు సమస్య. ఇవాళ పత్రికా కథనాలు చెపుతున్నట్టు సందె రాజమౌళి అనే ఒకానొక మనిషిని బెంగళూరులో నిర్బంధంలోకి తీసుకుని, రెండు రోజులపాటు చిత్రహింసలు పెట్టి, ప్రజలలో భయభీతావహం సృష్టించేందుకు జనసమ్మర్దం మధ్య కాల్చి చంపడం అనే ఘటనలో, అతని సహచరిమీద అబద్ధాలు ప్రచారం చేయడంలో చనిపోతున్నది ఒక మనిషి మాత్రమే కాదు. దుష్ప్రచారానికి బలి అవుతున్నది ఒక మనిషి మాత్రమే కాదు. పౌరులందరికీ సామాజిక, రాజకీయ, ఆర్థిక న్యాయాన్ని కల్పిస్తామనీ, చట్టం ఎదుట అందరికీ సమానత్వం కల్పిస్తామనీ భారత సమాజం తనకు తాను చేసుకున్న వాగ్దానం ఈ ఘటనలో భగ్నమైపోతున్నది. అధికారం ఉన్నవారు పౌరులపట్ల నిరంకుశత్వం అమలుచేయకుండా అందరినీ నిష్పాక్షికంగా చూసే చట్టబద్ధ పాలన అందిస్తామని మనకు మనం ఇచ్చుకున్న హామీ లుప్తమైపోతున్నది. ఏ ఒక్క వ్యక్తి ప్రాణాన్నీ చట్టం నిర్దేశించిన పద్ధతిలో తప్ప మరొక రకంగా తీయడానికి వీలులేదని రాజ్యాంగ అధికరణం 21 చేసిన బాస అడియాస అయిపోతున్నది. ఎంతటి నేరస్తులనయినా విచారణ లేకుండా శిక్షించడానికి వీలులేదని చెప్పుకున్న ఆదర్శం రద్దయిపోతున్నది. అందుకే ఇది హతుల సమస్యకాదు. ఒక ప్రత్యేక రాజకీయ విశ్వాసాలున్నవారి సమస్య కాదు. మనందరి సమస్య. ఈ దేశపు సమస్య. పాలనా విధానపు సమస్య. రాజ్యాంగబద్ధ నడవడికకు సంబంధించిన సమస్య. ఇది హతులకో, హంతకులకో సంబంధించిన విషయం కాదు, మన విలువలకు సవాల్.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Telugu, Vartamaanam. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s