ఆరువందలపదా, అదేమిటి?

జీవో 610 వివాదం మళ్ళీ ఒకసారి రాజుకుంటున్నది. ఒకసారి విషాదం గా ముగిసిన చరిత్ర మరొకసారి హాస్యాస్పదంగా పునరావృత్తమవుతుందని అన్నట్టు ఈసారి విషాదమూ ప్రహసనమూ కలగలిసి సాగుతున్నాయి. ఈసారి ప్రధాన చర్చ ఆ జీవోను అమలు చేయడమా చేయకపోవడమా అనికాదు. ఆ జీవో అసలేమిటో తెలుసునా అని జరుగుతున్నది. నీకు తెలుసునా అంటే నీకు తెలుసునా అని సంవాదంలో మునిగి తేలుతున్న రాజకీయపక్షాలన్నీ రెండువైపులా అజ్ఞానమే డిటో అని చూపుకుంటున్నాయి. నలుపుతెలుపుల్లో అచ్చయిన అక్షరాలను, విషాదబీభత్సంగా గడిచిపోయిన చరిత్ర ను, నడుస్తున్న అన్యాయాలను తమ ఇష్టంవచ్చినట్టు వక్రీకరిస్తున్నాయి, వ్యా ఖ్యానిస్తున్నాయి. తమ జ్ఞానప్రదర్శనకో, అజ్ఞాన ప్రదర్శనకో బహిరంగ వేదిక లు కావాలని అర్రులు చాస్తున్నాయి. ఆరువందలపది జీవో అమలు చేస్తే పంపించవలసిన వాళ్ళసంఖ్య ఐదారువేలకు మించదని ఒకరు. ఆ జీవో అమలు చేయడానికి మాకే చిత్తశుద్ధి ఉందని మరొకరు. అసలు అది అమలుచేస్తే తెలంగాణకే ప్రమాదం అని మరొకరు. తెలంగాణలో ఐదోజోన్‌కూ ఆరోజోన్‌కూ మధ్య చిచ్చు అని ఒకరు.

హైదరాబాద్‌ ఎవడబ్బసొత్తు అని ఒకరు. అవును మా అబ్బసొత్తే అని మరొకరు. అవతలివాళ్ళవన్నీ లుంగీలు, మావన్నీ షేర్వానీలు అని ఒకరు. మీ లుంగీలు ఊడగొడతాం అని మరొకరు. మీకు జ్ఞానం నేర్పిందే మేము అని ఒకరు. ఎట్లా పోరో చూస్తాం అని ఒకరు. పంపించి చూడండి, పంపిన చేతులు నరికేస్తాం అని మరొకరు. ఇదేమైనా దేశాలమధ్య గొడవనా అని ఇంకొకరు. ఉద్యోగంలో చేరి ముసలివాళ్ళయిన తర్వాత పొమ్మంటారా అని ఒకరు. ఈ రణగొణధ్వనులలో అసలు సమస్య ఏమిటో ఎవరికయినా తెలుసునా, ఈ ప్రయాణం ఎక్కడ ప్రారంభించామో ఎవరికయినా గుర్తున్నదా అని అనుమానించవలసి వస్తున్నది. ఈ ప్రశ్నలకు, ఈ అజ్ఞాన ప్రదర్శనకు జవాబు చెప్పడం ఒక్కోసారి విసుగ్గానూ పునరుక్తిగానూ అనిపిస్తుందిగాని, మహాజ్ఞానులలాగా నటిస్తున్న అభేద్య అహంకారులకు, నాగరికులలాగా చిలుకపలుకు లు పలుకుతున్న మూర్ఖులకు, నిస్సిగ్గుగా అబద్ధాలాడుతూ తొడగొట్టి సవాలు విసురుతున్న పహిల్వాన్లకు ఎన్నిసార్లయినా చెప్పిందే చెప్పవలసి వస్తుంది. అసలు సమస్య గుర్తుచేయవలసి వస్తుంది. అసలు సమస్య తమనేలమీద తాము నిలబడడానికి భూమిపుత్రులకు హక్కు ఉన్నదా లేదా అనేది.

ఏవో హామీలతో, వాగ్దానాలతో ఇంట్లో ప్రవేశించినవాళ్ళు ఆ హామీలన్నిటినీ బుట్టదాఖలు చేసి ఇంట్లో తిష్ఠవేసి, ఆ ఇంట్లోంచి ఎందుకు పోవాలి అని ఎదురు అడగడం అసలు సమస్య. ఆ హామీలు అనేకసార్లు ఉల్లంఘనలకు గురయినాక, ఒకానొక హామీకి రాజ్యాంగం కూడా పూచీపడిన తరువాత, రెండు దశాబ్దాలు గడిచినా, ఆ హామీ అమలుకాకపోవడం అసలు సమస్య. ఆ హామీనైనా అమలు చేయండి, లేదా నా ఇల్లు నాకే వదిలేసి పోండి అని ఎలుగెత్తడం అసలు సమస్య. జీవో 610 అనేదాన్ని కాసేపు పక్కనపెడదాం. స్థానికులకే తమ వనరులమీద అధికారం అనేవాదన అత్యంత ప్రజాస్వామికమైనది. ప్రపంచమంతా ఆమోదించిన సహజ న్యాయసూత్రమది. అసలు దేశ సరిహద్దులు, జాతిరాజ్యం అనేభావన ఏర్పడినదే ఆ ప్రాతిపదికమీద. అయితే దేశమంతా ఒకటేకాదు. జాతిరాజ్యం అనేదానిలోనూ అసమానతలున్నాయి. అందులోనూ భారతదేశం వంటి అనేకజాతుల, భాషల, మతాల, కులాల దేశంలో, వాటిమధ్య తీవ్రమైన అసమానతలు ఉన్న నేపథ్యంలో అందరికీ కలిపి ఒకే గుండుగుత్త సూత్రాలు, ప్రమాణాలు పనికొస్తాయా? అందుకే ఈ దేశంలో ఒక సమా ఖ్య రాజ్యాంగం వచ్చి కేంద్రజాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా రాసుకోవలసి వచ్చింది.

కాని ఆ రాష్ట్రాల రూపకల్పన కూడా వాస్తవిక ప్రమాణాలమీద జరగలేదు. అంతే కాక అప్పటికే అధికారంలో, అంగబలంలో, అర్థబలం లో పైచేయిగా ఉన్న ఉపజాతుల నాయకులు, తమ ప్రాంతంలోనే ఉన్న, తమ భాషే మాట్లాడుతున్న సమూహాలమీద ఆధిపత్యం చెలాయిస్తారేమోననే భయసందేహాలను కొన్ని ఉపజాతుల ప్రజలు యాభైయేళ్ళ కిందనే వ్యక్తం చేశారు. అందువల్ల, ఆ రాష్ట్రంలోనే వెనుకబడిన ప్రాంతాల, ప్రజల హక్కుల పరిరక్షణ ప్రాతిపదికమీద రాష్ట్రాల ఏర్పాటు జరిగింది. అటువంటి పరిరక్షణకు ఒప్పుకోము. మా దోపిడీ, పీడనలు యథాతథంగా కొనసాగవలసిందే అని అనడానికి ఎవరికయినా హక్కు ఉంది గాని, అలా బహిరంగంగా అప్పుడే అని ఉంటే ఆ రాష్ట్రమే ఏర్పడి ఉండేది కాదు. ఆ భూమిపుత్రుల హక్కుల పరిరక్షణ చర్యలలో ఒకానొకటి జీవో 610. అది కోస్తాంధ్ర, రాయలసీమ పాలకుల దయాధర్మంకాదు, తెలంగాణ ప్రజలు రూ పొందించినదీ కాదు, మరొకరిచేత బలవంతాన రూపొందింపజేసినదీ కాదు.

అది ఆంధ్రప్రదేశ్‌ పుట్టుకకు ప్రాతిపదిక అయిన స్థానికుల హక్కుల రక్షణ హామీకి కొనసాగింపు. అసలు సరిగా చెప్పాలంటే జీవో 610 అనేది ఒక మోసకారి ఎత్తుగడ. ఎందుకంటే ఆరుసూత్రాల పథకానికి కొనసాగింపుగా రాష్ట్రపతి ఉత్తర్వులు, రాజ్యాంగసవరణ ద్వారా 371డి అనే అధికరణం వచ్చాయి. ఏ దేశంలోనయినా రాజ్యాంగాన్ని, రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేయడానికి మళ్ళీ ఒక జీవో విడుదల చేయవలసివచ్చిన వృత్తాంతం విన్నారా? అది కేవ లం ఆంధ్రప్రదేశ్‌లోనే జరిగింది. రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేయవలసి ఉండగా వాటిని అమలుచేయకుండా ఆ తర్వాత ఎనిమిదేళ్ళు అధికారంలో కొనసాగినది- ఇవాళ టన్నులకొద్దీ చిత్తశుద్ధిని మాటల్లో ప్రకటిస్తున్న కాంగ్రెస్‌పార్టీ. ఆ తరువాత అధికారం లోకి వచ్చి, మూడేళ్ళు పాలించిన తర్వాత, ఎటువంటి జీవో అవసరం లేకుం డానే రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేయగలిగి ఉండి కూడా కేవలం తాత్సారపు ఎత్తుగడలలో భాగంగా జీవో 610ని విడుదల చేసినది, అమలు చేయకుండా మొదటి దఫా మూడు సంవత్సరాలు, రెండో దఫా తొమ్మిదిన్నర సంవత్సరాలు అధికారంలో ఉన్నది ఇవాళ జీవో 610 మీద గర్జిస్తున్న తెలుగుదేశం పార్టీ. ఇక తాను తెలంగాణ కొరకే పుట్టానని చెప్పుకున్న తెరాస రెండుసంవత్సరాల పాటు కాంగ్రెస్‌తో అధికారం పంచుకుని కూడా ఆ జీవో అమలు కొరకు చేసిన ప్రయత్నమెంతో అందరికీ తెలుసు.

అంటే జీవో 610 అనే ఈ ఇరవైరెండు సంవత్సరాల మోసంలో తెలుగుదేశం పద్నాలుగు సంవత్సరాలు, కాంగ్రెస్‌ ఎనిమిది సంవత్సరాలు, తెరాస రెండు సంవత్సరాలు తమ తమ పాత్రలు పోషించాయి. మొన్నటికి మొన్న ప్రభుత్వోద్యోగుల ధర్నాలలో అన్ని రాజకీయపక్షాలూ ఎన్ని నాల్కల వైఖరులు ప్రదర్శించాయో అందరికీ తెలుసు. కొత్త తాత్సారపు ఎత్తుగడలలో భాగంగా దీన్ని ఉద్యోగులమధ్య, ప్రజల మధ్య చిచ్చుగా మార్చడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. జీవో 610 అమలు అనేదాన్ని ప్రజల మధ్య సమస్యగా మార్చడం ఒక కుటి ల ప్రయత్నం. చారిత్రికంగా వెనుకబడిన ప్రాంతపు ప్రజలకు ఆ ప్రాంత ఉద్యోగాలలో, అదికూడా కిందిస్థాయి నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగాలలో కల్పించిన రిజర్వేషన్‌ను వ్యతిరేకించే అప్రజాస్వామిక వైఖరిని ఎవరూ తీసుకోనక్కరలేదు. ఆ అప్రజాస్వామిక వైఖరిని పెంచిపోషించి పబ్బం గడుపుకుందామని ఉద్యోగ సంఘాల నాయకులు అనుకోగూడదు. ఇంతకూ ఇది స్థానికుల ఉద్యోగాలను కొల్లగొట్టిన వారి సమస్య, దోపిడీ చేయడానికి వచ్చిన వారి సమస్య మాత్రమేగాని, బతుకుతెరువుకై వచ్చిన వారి సమస్య కాదు. ఇప్పుడు జీవో 610 అమలుకు వ్యతిరేకంగా ఎవరయినా మాట్లాడుతున్నారంటే వారు తెలిసో తెలియకనో తమను తాము ఇతరుల ఉద్యోగాలు కొల్లగొట్టేవారిగా, దోపిడీ చేసేవారి గా గుర్తించుకుంటున్నారన్నమాట.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Telangana, Telugu, Vartamaanam. Bookmark the permalink.

One Response to ఆరువందలపదా, అదేమిటి?

  1. satyasai says:

    నాకు 610 జీవో రాష్ట్ర రాజధానిపై ఒక ప్రాంతంవాళ్ళకి మాత్రమే ఎక్కువ అధికారం కల్పించే ఏర్పాటని అనిపిస్తుంది. హైదరాబాదుని(రాజధానికాబట్టి) తెలంగాణా జోన్ గా పరిగణించడం సహజన్యాయం కాదని పిస్తుంది. ఈజీవో ఒకప్రాంతానికి న్యాయం చేయడానికంటే, ఒక రాష్ట్ర ప్రజలని విడదీయడానికి ఉపయోగపడుతోందని అనిపిస్తుంది.
    నేను రాష్ట్రప్రభుత్వోద్యోగం చేయట్లేదు- మీచివరి వాక్యం తప్పయినట్లే కదా.
    మీ చివరి వాక్యం చదివాక ఒక చిన్నకథ గుర్తొచ్చింది. ఒకాయన ఇంటికి కొంతమంది భోజనానికి వచ్చారట. ఆయనకి వాళ్ళు గారెలు ఎక్కువ తినేస్తారనే బెంగ. పెళ్ళం గారెలు పట్టుకొచ్చి ఈయనదగ్గరకి వచ్చి గారెలేసుకోండని అడగ్గానే, ‘రెండుకన్నా ఎక్కువ గారెలు తినడానికి నేనేమైనా గాడిదనా ‘ అన్నాడట. ప్రజాస్వామ్యం అంటే ఎవరూ ఎదురు చెప్పకూడదనా!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s