పోలీసులదేనా రాజ్యం?

“ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, పోలీసు రాజ్యం, తుపాకి రాజ్యం” అనే నినాదం ఈ రాష్ట్రంలో మార్మోగడం 1970ల చివరలోనో 1980ల మొదట్లోనో ప్రారంభమయింది. రాడికల్ విద్యార్థి సంఘం (ఆర్ ఎస్ యు), ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి డి ఎస్ యు) వంటి విప్లవ విద్యార్థిసంఘాల ద్వారా, మొత్తంగా నక్సలైటు రాజకీయాల ద్వారా ఆ నినాదం చలామణీలోకి వచ్చింది. అప్పుడు ప్రధానంగా ఈ నినాదం ఇస్తుండిన సంఘాలలో కొన్ని ఇప్పుడు నిషేధంలో ఉన్నాయి, కొన్ని అదృశ్యమయ్యాయి, కొన్ని కొనసాగుతున్నాయి. కాని పావుశతాబ్దం గడిచేసరికి అన్నిరాజకీయపక్షాలూ ఈ నక్సలైటు నినాదాన్ని తమ నినాదంగా చేసుకున్నట్టు కనబడుతున్నది. రెండున్నర దశాబ్దాలకింద నక్సలైట్లు చేసిన విశ్లేషణ నిజమేనని ఇవాళ అందరూ అంగీకరిస్తున్నట్టున్నది.

అధికారపక్షం పోలీసులను ఎట్లా వాడుకోగలదో పదిహేనుసంవత్సరాల పాలనానుభవంతో తెలిసిన తెలుగుదేశం పార్టీ గత మూడు సంవత్సరాలలో అనేకచోట్ల ఇది పోలీసు రాజ్యమని అంటూనే ఉంది. ఒకసారి పాలకపక్షానికీ మరొకసారి ప్రతిపక్షానికీ మిత్రపక్షంగా శాశ్వత మిత్రపక్ష పాత్ర పోషిస్తున్న భారత కమ్యూనిస్టు పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) లు కూడ గత రెండు నెలలుగా భూపోరాటంలో భాగంగా చాల చోట్ల ఇది పోలీసు రాజ్యమని గుర్తిస్తున్నాయి, ప్రకటిస్తున్నాయి. భారతీయ జనతాపార్టీ సాగిస్తున్న ఆందోళనల్లో, ముఖ్యంగా పోలీసు జులుంను ఎదుర్కొన్నప్పుడు, ఆ నినాదం ప్రబలంగానే వినిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రసమితి నినాదాలలో కూడ ఆ నినాదం ప్రముఖంగానే ఉంది. హైదరాబాద్ పాతబస్తీలో మజ్లిస్ నాయకత్వాన జరుగుతున్న ఆందోళనల్లోనూ, అమాయక ముస్లిం యువకులమీద నీలాపనిందలతో అణచివేతచర్యలు సాగినప్పుడు జరుగుతున్న నిరసన ప్రదర్శనలలోనూ ఆ నినాదం వినబడుతూనే ఉంది. చివరికి అధికారకాంగ్రెస్ నాయకుడే అయిన పి జనార్ధన రెడ్డి కూడ నిన్నామొన్నా ఆ మాట అనవలసి వచ్చింది. వివిధ సామాజిక ఉద్యమాలు, విద్యార్థి ఉద్యమాలు లాఠీదెబ్బలుతింటూ ఇస్తున్న ఆ నినాదం గురించి చెప్పనే అక్కరలేదు. ఇంతమంది పరస్పర భిన్నమైన దృక్పథాలుగలవాళ్లు ఇన్నిరకాలుగా ఇది పోలీసు రాజ్యమని ఘోషిస్తున్నారంటే ఆ మాటలో నిజం ఉండే ఉంటుంది. దాదాపు అన్ని సందర్భాలలోనూ పోలీసు అధికారుల హుంకరింపులూ, లాఠీఛార్జిలూ, వాటర్ కానన్ ఛార్జిలూ, తుపాకి కాల్పుల మోతలూ నేపథ్య సంగీతాన్ని సమకూరుస్తూ ఆ నినాదం అక్షరాలా నిజమేనని బలపరుస్తున్నాయి.

పోలీసు రాజ్యమంటే ఉదారవాద ప్రజాస్వామిక విలువలు లేని, సంక్షేమభావనలు లేని రాజ్యమని రాజనీతిశాస్త్రం చెపుతుంది. పేరుకు ఒక రాజ్యాంగం ఉన్నా ఆ రాజ్యాంగానికి వీసమెత్తు విలువనివ్వని ఆధిపత్య శక్తులు రక్షణబలగాలద్వారా, బలప్రయోగంద్వారా తమ నిరంకుశ రాజ్యం కొనసాగించడానికి మరోపేరు పోలీసు రాజ్యం. అనేక ప్రభుత్వశాఖల్లో ఒకానొక శాఖ అయిన పోలీసు శాఖకు అపరిమిత అధికారాలు ఇచ్చి, వారిలో శిక్షాతీత నేరప్రవృత్తిని పెంచడానికి పాలకులు ఉద్దేశ్యపూర్వకంగా ఎంచుకున్న విధానాల ఫలితంగా పోలీసు రాజ్యం ఏర్పడుతుంది. ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ దేశవ్యాప్తంగా అటువంటి పోలీసు రాజ్యం నెలకొల్పిందని, ఎమర్జెన్సీ తర్వాత, న్యాయమైన ఆకాంక్షలపై తలెత్తిన ప్రజా ఉద్యమాలను అణచివేయడానికి అనేకరాష్ట్రాలలో పోలీసు రాజ్యాలు తలెత్తాయని పౌరహక్కుల ఉద్యమకారులు, సామాజిక శాస్త్రవేత్తలు ఎన్నో విశ్లేషణలు ప్రకటించారు.

ఇవాళ ఆంధ్రప్రదేశ్ అచ్చమైన పోలీసు రాజ్యంగా మారిపోతున్నది. ప్రజల సర్వసత్తాక అధికారాన్ని అంగీకరిస్తూ, ప్రజలలోని విభిన్న వర్గాల ప్రయోజనాలమధ్య సమన్వయాన్ని నిర్వహించే అధికార వ్యవస్థగా ఉండవలసిన కార్యనిర్వాహకవర్గం తనకు తానే సర్వంసహాధికారిగా ప్రవర్తించడం ఇవాళ మన రాష్ట్రంలో నికరంగా కనబడుతున్నది. ప్రజానీకంలో వైవిధ్యం, వైరుధ్యాలు ఉన్నందువల్ల వారిమధ్య ఘర్షణలో అవాంఛనీయమైన ధోరణులు, హింస తలెత్తకుండా శాంతిభద్రతలను పరిరక్షించే అతి పరిమితమైన బాధ్యతను నిర్వర్తించవలసిన పోలీసు వ్యవస్థ ఒక వర్గపు ప్రయోజనాలకు కొమ్ముకాయడం, తానూ ఆ వర్గంలో చేరిపోవడం, విచ్చలవిడిగా హింసను ప్రయోగిస్తూ, తానే శాంతిభద్రతల సమస్యగా మారడం – ఇవన్నీ పోలీసు రాజ్యంగా మారడానికి చిహ్నాలు.

తోటకూరనాడే దొంగతనం పట్టుకుని ఉంటే ఇవాళ గజదొంగగా మారిఉండేవాడినా అని తెలుగువారి ప్రాచీన వివేకపు నుడికారం ప్రశ్నిస్తుంది. కనుక ఇవాళ్టి పోలీసురాజ్యపు మూలం ఏనాటి తోటకూరదొంగతనంలో ఉన్నదో గుర్తించాలి. ప్రజల సమస్యల పరిష్కారానికి సృజనాత్మక పరిష్కారాలు కనిపెట్టడానికి, సమాజాన్ని మెరుగ్గా మార్చడానికీ కొందరిని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుని ప్రభుత్వ బాధ్యత అప్పగిస్తే వారు ఆ కర్తవ్యాలు నెరవేర్చడంలో విఫలమయ్యారు. తమ ఆస్తులు పెంచుకోవడంలో, ఆశ్రితులకు సంపాదనామార్గాలు చూపెట్టడంలో తలమునకలయిపోయారు. తీరని సమస్యలతో ప్రజలు ఆందోళనకు దిగితే ఆ ఆందోళనల నోరు మూయించడానికి సాయుధ బలగాల సాయం తీసుకున్నారు. ఆ సాయానికి ప్రతిఫలంగా ఆ సాయుధబలగాల నేరాలకు శిక్షలనుంచి మినహాయింపు ఇచ్చారు. అలా మొదలయిన శిక్షాతీత నేరప్రవృత్తి మొదట్లో ఏ ఒక్క వర్గం మీదనో ఎక్కుపెడితే మిగిలిన వర్గాలన్నీ తమదాకా రాలేదని సంతోషించాయి. ఇవాళ ఆ భస్మాసుర హస్తం ఒక్కొక్క తలనూ వెతుకుతూ వస్తున్నది.

ఆ భస్మాసుర హస్తానికి పాలకులు మాత్రమే కాదు, రాష్ట్రపు ఉన్నత న్యాయస్థానం కూడ సాధికారత ఇస్తున్నది. ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనంలో ఇద్దరు న్యాయమూర్తులు చట్టం ఎదుట అందరూ సమానులే అనే సహజ న్యాయసూత్రం, ఉదాత్త రాజ్యాంగ విలువ పోలీసులకు మాత్రం వర్తించవని అన్నారు. ఇతరులెవరయినా మనిషిని చంపితే హత్య అయ్యేది, పోలీసులు చంపితే మాత్రం హత్య కాదని ప్రకటించారు. అంటే రాజ్యాంగ అధికరణం 21 హామీ ఇచ్చిన జీవనస్వేచ్ఛనుకూడ రద్దుచేసే అపరిమిత నిరంకుశ అధికారం పోలీసులకు ఉంటుందని, వారు చేసే హత్యలు ఇతరులు చేసే హత్యలలాగ భారతశిక్షాస్మృతి సెక్షన్ 302 కిందికి రావని న్యాయమూర్తులు అన్నారు.

అసలు సమస్య ఈ రకంగా విస్తరిస్తున్న పోలీసు రాజ్యానిది. ఇవాళ్టికయినా దాన్ని గుర్తిస్తున్న రాజకీయ పక్షాలు ఇక దాన్ని సాగనివ్వగూడదని, చట్టబద్ధపాలన, రాజ్యాంగవిలువల పునాదిగా ప్రభుత్వం నడవాలని ప్రకటించవలసి ఉన్నది. గతచరిత్రనుంచి ఎవరయినా పాఠాలు నేర్చుకోదలచినట్టయితే, ప్రపంచచరిత్రలో పోలీసు రాజ్యాలుగా మారిపోయి, ఒకానొక అధికార నిర్మాణానికి అపరిమిత అధికారాలు కట్టబెట్టి, ప్రజలమీద నిరంకుశత్వాన్ని రుద్దిన పాలనలు అనేకం ఉన్నాయి. ఆ నిరంకుశత్వానికి అంతిమప్రతిఫలం ఏమిటో కూడ అవి అనుభవించాయి. ఇంగ్లండ్ లో 1649లో తెగిపడిన మొదటి చార్లెస్ తల గాని, ఫ్రాన్స్ లో 1793లో వీథుల్లో దొర్లిన పదహారో లూయీ తల గాని పోలీసు రాజ్యాన్ని నెలకొల్పి ప్రజలమీద అణచివేతసాగించినందుకే తమకు ఆ స్థితి వచ్చిందని ప్రకటిస్తున్నాయి. అధికారాంతమునందు జూడవలె ఆ అయ్య సౌభాగ్యముల్ అన్నట్టు ఇది కేవలం అధికారంలో ఉన్నవారు ఆ అధికారంలో ఉన్నప్పుడు ఏ సౌభాగ్యాలు, ఏ నిరంకుశాధికారాలు అనుభవిస్తారు అన్న వ్యవహారం మాత్రమే కాదు. ఆ క్రమంలో మొత్తం సమాజంలోనే ఎటువంటి విలువలు నెలకొంటున్నాయి, ఎటువంటి విలువలకు ప్రాధాన్యత వస్తున్నది, సమాజం ఎటు దిగజారుతున్నది అని ఆలోచించవలసిఉంది.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Telugu, Vartamaanam. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s