ముదిగొండ మారణకాండ ప్రశ్నలు

ఈ దేశంలో పేదప్రజల ప్రాణాలు కారుచౌక అయిపోయాయి. ఎక్కడ పోలీసు తుపాకి గర్జించినా పోయేవి అమాయక, నిస్సహాయ పేదప్రజల ప్రాణాలే. ఎక్కడ పాలక దుర్మార్గపు కాల్పులు జరిగినా వినబడే సమర్థన ఒకటే. ఎక్కడ రాజ్య దౌర్జన్యానికి అమాయకులు అసువులు బాసినా కనబడేవి నిజాయితీ లేని రాజకీయ నాయకుల పలకరింపులే, పరామర్శలే, గ్లిసరిన్ కన్నీళ్లే. గాయపడిన ముదిగొండ, నెత్తిన బండలుపడి ఆరుగురు ముద్దుబిడ్డలను పోగొట్టుకున్న ముదిగొండ ఇప్పుడు అసహాయంగా ఆ విషాదభరిత నాటకాన్ని చూస్తున్నది. ఈ దేశంలో పోలీసు దుర్మార్గాలకు, పాలకుల దమననీతికి ధ్వంసమైన లక్షల పల్లెల, పట్నాల జాబితాలో ఇవాళ కొత్తగా చేరిన ముదిగొండ అదే దృశ్యాన్ని మళ్లీ చూస్తున్నది. ముదిగొండలో ఒరిగిన వీరుల మూతబడని కళ్లు మన వివేకంపై, మన రాజకీయాలపై, మన ప్రయోజనాలపై అనేక ప్రశ్నలు సంధిస్తున్నాయి. ముదిగొండలో చిందిన నెత్తురు నేర్చుకోదలచుకున్న వాళ్లకు ఎన్నో పాఠాలు చెప్పడానికి సిద్ధంగా ఉంది.

అసలు ముదిగొండలో ఎందుకు నెత్తురు పారవలసి వచ్చింది? ఏ విధానాల, ఏ కుట్రల, ఏ దౌర్జన్యాల, ఏ ఊసరవెల్లి రాజకీయాల ఫలితమీ ముదిగొండ మారణకాండ?

ప్రపంచీకరణ విధానాల, ప్రత్యేక ఆర్థిక మండలాల దుర్మార్గాల వర్తమాన చరిత్రలో కాళ్లకింది నేల కదలిపోతుంటే, రియల్ ఎస్టేట్ బకాసురుల, ప్రవాసభారతీయుల డాలర్ల భూదాహానికి ఎకరాలు గజాలుగా మారి చుక్కలనంటుతుంటే, మన పట్నాలన్నిటిలో, పట్నాల శివారుగ్రామాలలో, ముఖ్యంగా రహదారుల పక్కగ్రామాలలో పేదప్రజలకు నిలువనీడలేకుండా పోతున్నది. వందల, వేల ఎకరాలు దేశదేశాల పెట్టుబడిదారులకూ, వారి దళారీలకూ కట్టబెడుతున్న పాలనలోనే నిరుపేద గుడిసెకు వందగజాల నీడ కరవవుతున్నది. అందువల్లనే నాయకత్వం వహిస్తున్నవారి చరిత్ర ఏమయినా, వారి అవసరాలు, ఉద్దేశ్యాలు ఏవయినా రాష్ట్రవ్యాప్తంగా వేలాది ప్రజలు ఈ భూపోరాటంలో వీరోచితంగా పాల్గొన్నారు. తమ న్యాయమైన హక్కుల సాధనకొరకు ఎంతకైనా తెగించి పోరాడారు. లాఠీలతో, వాటర్ కానన్లతో, ఆశ్వికదళాలతో తమమీద పాలకులు సాగించిన దాడిని ఉత్తేజకరంగా ప్రతిఘటించారు. ఈ నేలకు అలవాటయిన ఉజ్వలమైన పోరాట సంప్రదాయాన్ని కొనసాగించారు. చాల సందర్భాలలో నాయకులు పోదలచిన దూరాలకన్న ఎక్కువ దూరాలకు కూడ పయనించారు.

ఆ ప్రజా చైతన్యవికాసానికి బెదిరిపోయిన పోలీసు రాజ్యం, భయోత్పాతంతో దాన్ని ఆపదలచిన తుపాకి రాజ్యం ముదిగొండలో ఆరుగురు పేదల ప్రాణాలు తీసింది. నిజం చెప్పాలంటే ఆ ప్రజా చైతన్యస్ఫూర్తికీ దానికి నాయకత్వం వహిస్తున్నామని చెప్పుకుంటున్నవారికీ ఏమంత సంబంధంలేదు. ముదిగొండలో అమాయకప్రజలు అసహాయంగా తుపాకి గుళ్లకు రాలిపోతుంటే వారికి నాయకులమని చెప్పుకుంటున్నవారు బషీర్ బాగ్ హంతకులతో వియ్యానికి తహతహలాడుతున్నారు. ఆ నాయకుల ఎత్తుగడలు ఎటువంటివైనా, ఏ ప్రయోజనాలకోసమైనా వాటిని పక్కనపెట్టి, పాలకుల రక్తపిపాసను మరొకసారి భయోద్విగ్నంగా కొన్నెత్తుటిధారల్తో చూపినందుకు ముదిగొండను గుర్తుంచుకోవాలి. ముదిగొండ వేస్తున్న ప్రశ్నలనూ, గుర్తుచేస్తున్న చరిత్రనూ, చూపుతున్న సాదృశ్యాలనూ గమనించాలి.

మరొకస్థలంలో మరొకసమయంలో తమవంటి పేదప్రజల నెత్తురు పారించిన మొసళ్లే తమదగ్గర కారుస్తున్న కన్నీళ్లను ముదిగొండ చూస్తున్నది. నిజానికి ఈ దేశంలో ఏ ఒక్క రాజకీయ పక్షం పాలనలోనైనా పోలీసు కాల్పులు జరగని సందర్భం లేదు. ప్రతి పాలకపక్షమూ పోలీసులమీద ఆధారపడి మాత్రమే పాలన సాగించడానికి అలవాటు పడిన వ్యవస్థ మనది. తుపాకి గొట్టం ద్వారా రాజ్యాధికారం సిద్ధిస్తుందన్నందుకు నక్సలైట్లను తిట్టిపోసే రాజకీయపక్షాలలో ఏ ఒక్కటీ తుపాకిగొట్టం లేకుండా రాజ్యం నడపలేకపోవడం ఒక కవితాన్యాయం. ఈ దేశంలో కమ్యూనిస్టు, సోషలిస్టు, దళిత, బహుజన, ఐక్యసంఘటన రాజకీయాల ముసుగువేసుకున్నవారితో సహా అందరు పాలకులూ కూడ న్యాయమైన కోర్కెలపై ఉద్యమించిన ప్రజలమీద పోలీసుల చేత కాల్పులు జరిపించినవారే.

ఎంతగా ప్రజా ప్రభుత్వాలమని భుజకీర్తులు తగిలించుకున్నవాళ్లయినా ప్రజల మీద పోలీసులు కాల్పులు జరపగూడదని అనలేదు. తాము అధికారంలోకి వస్తే చట్టబద్ధపాలన నడుపుతామని అనలేదు. పోలీసులను ప్రజలను చంపే కిరాయి హంతకులుగా వాడుకోబోమని అనలేదు. పోలీసులకు అపరిమిత, శిక్షాతీత, విచారణాతీత హక్కులు ఇవ్వబోమని అనలేదు. పైగా కాల్పులు జరిపి ప్రజల ప్రాణాలు తీసిన పోలీసులను ఎల్లవేళలా సమర్థించారు, పారితోషికాలు ఇచ్చారు. బషీర్ బాగ్ కాల్పుల తర్వాత చంద్రబాబు నాయుడు మాటలకు, కళింగనగర్ కాల్పుల తర్వాత నవీన్ పట్నాయక్ మాటలకు, నందిగ్రామ్ కాల్పుల తర్వాత బుద్ధదేవ్ భట్టాచార్య మాటలకు, గంగవరం, ముదిగొండ కాల్పుల తర్వాత రాజశేఖరరెడ్డి మాటలకు అక్షరం కూడ తేడాలేదు. ఈ అన్ని ఘటనలలోనూ సంఘవ్యతిరేక శక్తుల అలజడివల్లనే తమ పోలీసులు కాల్పులు జరపవలసి వచ్చిందని ఈ ముఖ్యమంత్రులందరూ సుభాషితాలు వల్లించి తమ పోలీసు బలగాలను వెనకేసుకొచ్చారు.

ఒక కొత్తపోరాట క్రమంలో పాలకవర్గ దుర్మార్గాన్ని విప్పిచెప్పే పాఠాన్ని తమ నెత్తుటితో రచించిన ముదిగొండ అమరజీవులకు సగౌరవంగా నివాళి అర్పిస్తూనే మరొక విషయం కూడ గుర్తించవలసి ఉంది. ముదిగొండ దుర్మార్గాన్ని మసిపూసి మారేడుకాయ చేయదలచిన ప్రభుత్వం దానివెనుక నక్సలైట్లు ఉన్నారని దుష్ప్రచారం మొదలుపెట్టింది. ఉన్నారాలేదా అనే వాస్తవం ఎట్లా ఉన్నా, నక్సలైట్లు ఉన్నారంటే చంపడానికి ఆమోదం దొరుకుతుందని ప్రభుత్వం అనుకుంటున్నదన్నమాట. ఆ మాటచెపితే ఈ రాజకీయపక్షాలన్నీ మౌన ఆమోదం తెలుపుతాయనే పాలకుల నమ్మకానికి ఆ ప్రకటన అద్దం పడుతున్నది.

ఆ ప్రకటనకు మరొక ముఖంగా ముదిగొండలో జరిగిన దౌర్జన్యమే మొట్టమొదటి పోలీసురాజ్య వ్యక్తీకరణ అన్నట్టుగా కొన్ని రాజకీయ పక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. రాజశేఖరరెడ్డి ప్రభుత్వ పోలీసుల రక్తపిపాసలో ఇది మొదటి ఘటనా కాదు, చివరి ఘటనా కాబోదు. నలభై సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో పాలకులెవరయినా ఈ రక్తపిపాస సాగుతూనే ఉంది. ఈ మూడు సంవత్సరాలలోనే చూస్తే మూడువందలయాభై మంది విప్లవకారులను, కనీసం యాభై మంది మామూలు ప్రజలను రాజశేఖరరెడ్డి పోలీసులు చంపారని గుర్తుచేయవలసి ఉంది. ఆ క్రమంలో ఆ ప్రభుత్వానికి ఇవాళ్టి ప్రతిపక్షాలు కొంతకాలం మిత్రపక్షాలుగా ఉన్నాయని కూడ గుర్తుచేయవలసిఉంది. ముదిగొండ హతులతో పోలిస్తే యాభై అరవై రెట్ల మందిని ఈ ప్రభుత్వ బలగాలు దుర్మార్గంగా పొట్టనపెట్టుకున్నాయి. ఆ హత్యాకాండ నిరాటంకంగా జరుగుతున్న ఇన్నిరోజులూ ఈ ప్రతిపక్షాలకు గాని, ప్రజాస్వామికవాదులకు గాని ఆ హత్యలూ కనబడలేదు, హంతకుల దుర్మార్గమూ కనబడలేదు. చట్టబద్ధపాలనను రద్దుచేసి, రాజ్యాంగం హామీ ఇచ్చిన జీవించే స్వేచ్ఛను కాలరాచిన దౌష్ట్యం కనబడలేదు. ఆ అసంఖ్యాక హత్యలపట్ల మౌనం వహించిన ఈ మహాఘనతవహించిన పెద్దమనుషులకు ముదిగొండ హతులగురించి కన్నీళ్లు కార్చే హక్కు ఉన్నదా అని అడగవలసిఉంది. ఈ రెండు నాల్కల ధోరణి ముదిగొండ హతులకు నిజమైన నివాళి అవుతుందా అని అడగవలసిఉంది.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Andhra Jyothy, Telugu, Vartamaanam. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s