వాకపల్లి టు లుంబిని

ఇటీవల రాష్ట్రంలో జరిగిన రెండు దారుణాలు వేరువేరుగా కనిపించినప్పటికీ ఒకే విషయాన్ని సూచిస్తున్నాయి. ఒక టి విశాఖపట్నంజిల్లా జి.మాడుగుల మండలం వాకపల్లి గ్రామంలో పదకొండుమంది ఆదివాసి మహిళలపై గ్రేహౌండ్స్‌ పోలీసులు చేసిన అత్యాచారాల ఘటన. మరొకటి హైదరాబా దులో లుంబినీ పార్క్‌లోను, గోకుల్‌ చాట్‌ భండార్‌లోను పేలుళ్ళు జరిపి అమానుషంగా నలభైరెండు మంది ప్రాణాలు తీసిన దుర్ఘటన. ఇవి రెండూ భిన్నస్థాయిలవి కావచ్చు. భిన్న నేపధ్యాల నుంచి జరిగి ఉండవచ్చు. భిన్నమైన స్పందనలను కలిగిస్తుండవచ్చు. కాని మౌలికంగా ఈ రెండు ఘటనలను కలిపి ఆలోచించవలసిన విషయాలున్నాయి. తాము దాడి చేయడానికి వెళ్లిన ప్రాంతాలలోని ప్రజలమీద, మహిళలమీద ప్రత్యేకించి ఆదివాసి మహిళలమీద పోలీసుల అతిప్రవర్తన, అత్యాచారాలు మన రాష్ట్ర చరిత్రలో కొత్త విష యం కాదు. ప్రపంచం దృష్టికి వచ్చిన ప్రతి ఒక్క సంఘటనకు దృష్టికిరాని సంఘటనలు కనీసం పది ఉంటాయి.

పోలీసులకు ఏ నేరం చేయడానికయినా అధికారం ఉన్నదని, వారు మిగతా పౌరులలాగ బోనెక్కి శిక్షలు పొందనక్కరలేదని, వారికి శిక్షా తీత, విచారణాతీత మినహాయింపు హోదాను కల్పించామని మన పాలకులు చెప్పకనే చెపుతున్నారు. ఆ నేపథ్యంలో వాక పల్లి ఘటన ఆశ్యర్యకరమైనదేమీ కాదు. వాకపల్లిలో కొత్తగా గుర్తించ వలసిందేమంటే ఏజెన్సీలోని ఆదివాసులు ఒకవైపు విప్లవోద్యమ నాయకత్వంలో ఉన్నారు. మరొకవైపు వారి ప్రాంతాల్లో ఉన్న బాక్సైట్‌ తదితర విలువైన ఖనిజాలను బహుళజాతిసంస్థలకు అప్పగించడానికి ఒప్పుకో బోమనిపోరాడుతున్నారు. వారిని విప్లవకారులనుంచి దూరం చేయడానికి, ఆ ప్రాంతపు ఖనిజాలను దేశదేశాల సంపన్నుల కు అప్పజెప్పడానికి వారిని భయపెట్టడమే, అక్కడినుంచి వెళ్ల గొట్టడమే ఏకైక మార్గం. భయపెట్టడమంటే పురుషులనైతే చంపివేయాలి, జైళ్లపాలు చేయాలి. స్త్రీలనైతే అత్యాచారాలు చేయాలి, అవమానాలపాలు చేయాలి.

తమమీద ఫలానా అత్యాచారం జరిగిందని, ఫలానావాళ్లు చేశారని స్వయంగా బాధితులు చెపితే వెయ్యికిలోమీటర్ల దూరంలో కూచున్న పోలీసు దొరలకు, వారిపైన ఉన్న రాజకీయ ఏలికలకు అది అబద్ధమని వెంటనే అనిపిస్తుంది. కూంబింగును ఆపడానికి వేసిన ఎత్తుగడ అనిపిస్తుంది. ఈ దూరదృష్టి, ఈ అద్భుత ఊ హాశక్తి హైద రాబాదు పేలుళ్ల దగ్గరికి వచ్చేసరికి మరొకరకంగా వ్యక్తమవుతుంది. ఆ దౌర్జన్యం ఎవరు చేశారో ఎవరికీ తెలియక పోయినా, ప్రాథమిక సాక్ష్యాధారాలు కూడా సేకరించకముం దే కొన్ని పేర్లు పోలీసు దొరల, ఏలికల నోటివెంట ఆలవోకగా వస్తాయి. ఒకచోట బాధితులు నిందితులగురించి చెపితే అబద్ధం అనడమేమిటి, ఎదురు నిందలు వేయడమేమిటి, మరొకచోట ఏ ఆధారమూ లేకుండానే కొందరు నిందితుల పేర్లు ప్రకటించడమేమిటి. రెండు సందర్భాలలో రెండు రకాల ప్రవర్తన ఎందుకుంది అని మనం అడగకూడదు. అసలు పోలీసుల పనితీరు సక్రమంగా లేదని స్వయంగా తొమ్మిదిసంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన వారూ, మూడు సంవత్సరాలపాటు రాష్ట్రపోలీసులకు అధినాయకత్వం వహిం చినవారూ ఇప్పుడు అంటున్నారు.

ఈ విషయంలో వారికి తెలి సినంత మరెవరికీ తెలిిసి ఉండదుగనుక వారి మాటలు సంపూ ర్ణంగా నమ్మవచ్చు. అవును. ఈ రాష్ట్రంలో పోలీసులు శాంతి భద్రతల నిర్వాహకులనీ, చట్టానికి అనుగుణంగా పనిచేయ వలసిన వారనీ మరిచిపోయి చాలాకాలమయింది. కలిగినవారి ఇళ్లలో బహిరంగంగా జరిగిన హత్యలమీద, టెలివిజన్‌ కెమె రాలముందర జరిగిన ఆకృత్యాలమీద, తామే చేసిన హత్యల మీద, అత్యాచారాలమీద, అవసరం లేకపోయినా జరిపిన లాఠీ చార్జీలమీద, గుర్రాలను పెట్టి తొక్కించడంమీద, కాల్పులమీద అవి తప్పు అని చెప్పిన పాపాన పోయినవారులేరు. అమాయ కులను రోజులతరబడి నిర్భందిస్తే, చిత్రహింసలు పెడితే, చంపిపారవేస్తే అడిగినవారులేరు. ఏలినవారికి పనులు చేసి పెట్టడమే తప్ప పోలీసింగ్‌ అంటే ఏమిటో, ప్రజలకు రక్షణ కల్పించడం అంటే ఏమిటో పోలీసులకు తెలియకుండాపోయి చాలా కాలమయింది. అందువల్ల ఇప్పుడు కొత్తగా ఇంటిలిజె న్స్‌ వైఫల్యమా? అని ప్రశ్నించడం అనవసరం.

అసలు ఇంటిలి జెన్స్‌ అంటే ప్రత్యత్థులమీద కూపీలు లాగడం, తమ పరిధి లోకి రాని ఇతర రాష్ట్రాలలో కూడ రహస్యకార్యాలయాలు నడుపుతూ దొరికిన నక్సలైట్లను దొరికినట్టు చంపడం తప్ప ప్రజల రక్షణకు అవసరమయిన పని ఏదీ కాదని ఇప్పటికే తేట తెల్లమయిందిగదా. రాష్ట్ర పాలనాధికారపీఠం సెక్రటేరియట్‌ ముందర ఇంత ఘోరం జరగడమా అని మరికొందరు వాపోతున్నారు. సరిగ్గా అక్కడే ప్రతిరోజూ సాయంకాలం నుంచి అర్థరాత్రిదాకా మాన వమాంస వ్యాపారం నిరాఘాటంగా సాగుతుంటే, విటులు, సేఠాణీలు, బ్రోకర్లు, మాఫియా రాజ్యం సాగుతుంటే సెక్రటే రియట్‌ ముందర ఇంత ఘోరమా అని మనం ఎప్పుడూ ప్రశ్నించలేదు మరి. ఇక మరికొందరిది ఈ దహనకాండలో పేలాలు వేయించుకుతినే అవకాశం దొరుకుతుందా అనే ఆదు ర్దా. పోటా లేకనే ఇటువంటి ఘోరాలు జరుగుతున్నాయట. పోటా తెచ్చింది తీవ్రవాద నేరాలు అరికట్టడానికనే సాకుతో. కాని పోటా కింద నిర్భందించిన వేలమందిలో తొంభైశాతం మంది ఎట్లా అమాయకులో ఇప్పటికే అనేక పరిశోధనల్లో రుజువై వుంది.

అయినా, ఫలానా శిక్ష ఉంది గనుక ఈ నేరం చేయను అని ఎవరయినా ఆగిపోయేట్టయితే ఇందిరాగాంధీ హత్యానంతరం ఉత్తరభారతంలో, 2002లో గుజరాత్‌లో వేలాదిమందిని ఊచకోతకోసిన వారికి ఆ హత్యానేరాలకు మర ణశిక్ష ఉన్నదని తెలియకనా? బాబ్రీమసీదును కూలగొట్టిన కరసేవకులకు అది నేరమనీ, దానికి శిక్ష ఉంటుందని తెలియ కనా? సమాజానికి శిక్షాస్మ­ృతులు తయారు చేయడం అలవా టయి మూడు నాలుగు వేల ఏళ్లయింది. శిక్షలు హెచ్చరికగా పనిచేసి నేరాలు ఆపేట్టయితే సమాజంలో నేరాలనేవే ఉండేవి కావు. శిక్షలు పెంచాలి అని వాదించేవాళ్లు నేరాలను పెంచి పోషిస్తున్న రాజకీయార్థిక సామాజిక పరిస్థితులను చూడక నైనా పోయుండాలి. చూసినా చూడనట్టు నటిస్తుండాలి. రూల్‌ ఆఫ్‌ లా సక్రమంగా యావన్మందికీ అమలయితే ఎవ రూ చట్టవ్యతిరేక కార్యక్రమాలవైపు పోరు. నాకు జరిగిన అన్యా యానికి చట్టం జవాబు చెప్పలేదు గనుక నేనే జవాబుచెబు తానని కొందరు అనుకోవడానికి బాధ్యత వహించవలసినది చట్టాన్ని సమానంగా అమలు చేయనివారు మాత్రమే. నాలు గైదు దశాబ్దాల వ్యాధి ఇది. ఇవాళ్టికివాళ గంభీర ప్రవచనాలు ఆత్మసంతృప్తినిస్తాయిగాని ఆ వ్యాధిని పోగొట్టవు.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Andhra Jyothy, Telugu. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s