ఘాతుకం కానిదేది?

‘వాకపల్లిలో అత్యాచారాలు జరగలేదు, పోలీసులను అప్రతిష్టపాలు చేసే ప్రయత్నమది’ అని ఆ నేరం జరిగిన మరుక్షణమే నేరస్తులకు క్లీన్ చిట్ ఇచ్చినవాళ్లే, ‘వాకాడు నేరస్తులను వదిలిపెట్టం’ అని ఈ నేరస్తుల గురించి మాత్రం భీషణప్రతిజ్ఞలు చేయడం, రాజ్యం అన్ని వర్గాలమధ్య సమన్యాయం పాటించి, చట్టం ఎదుట అందరినీ సమానంగా చూస్తుందనే కనీస ప్రజాస్వామ్యసూత్రానికి అపహాస్యం. ‘మేము ఎవరిపక్షానా మాట్లాడడంలేదు, తటస్థంగా, నిష్పాక్షికంగా ఉంటాం’ అని అనేవాళ్ళు కనీసం రెండిటినీ సమానంగా నేరాలుగా, ఘాతుకాలుగా అంగీకరించవలసి ఉంటుంది. రెండు నేరాల మీద ఒకేరకంగా స్పందించి ఒకేరకమైన చర్యలు తీసుకోవలసి ఉంటుంది. కాని దురదృష్టవశాత్తూ ఏలినవారి స్పందనలలో ఈ వైరుధ్యం ప్రతిక్షణం కొట్టవచ్చినట్టు కనబడుతున్నది.

మన నిత్యజీవితంలో ఘాతుకాల మీద ఘాతుకాలు జరిగిపోతుంటే కొన్నిటిని మాత్రం ఘోరం, ఘాతుకం, దారుణం, దురాగతం అని గగ్గోలు పెడుతూ, మరికొన్ని ఘాతుకాల గురించి మౌనం వహించడమో, అవి జరగనట్టు నటించడమో అసలు సమస్య. ఒక ఘాతుకాన్ని మాత్రం దాని చరిత్ర నుంచి, దాని కారణాలనుంచి, అది ఒక పర్యవసానం మాత్రమే అయిన సుదీర్ఘ క్రమం నుంచి వేరుచేసి, ఆ ఘాతుకం అప్పుడే మందుపాతరయి పేలినట్టు మాట్లాడడం అసలు సమస్య. మందుపాతరకయినా, అటువంటి మరే ‘ఘాతుకానిక’యినా దశాబ్దాల చరిత్ర ఉంది. అనేక ఘటనల, పరిణామాల, కార్యకారణ సంబంధాల, పర్యవసానాల సంక్లిష్ట దృశ్యం అది.

ఒక మాజీ ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకుని ఆయనను చంపడం కోసమే మందుపాతర పేల్చడం ఘాతుకమే కావచ్చు. అసలు ఏ మనిషినయినా చంపాలనే ఉద్దేశ్యంతో ఒక చర్యకు పూనుకోవడం ఘాతుకమే. దాన్నేమీ సమర్థించనవసరంలేదు. ఖండించడం చాల సులభం. కాని అది ఏ నేపథ్యంలో జరిగిందో అర్థం చేసుకోకపోతే అటువంటి ఘటనలు మళ్లీమళ్లీ జరుగుతూనే ఉంటాయి, మనం ఖండిస్తూనే ఉంటాం, ఇంకా ఇంకా తీవ్రమైన పదజాలంతో ఖండించినా ఆ ఘటనలు ఆగవు. ఆ ఘటనలు జరగడానికి కారణమైన మౌలికాంశాలమీద చర్చ జరగకుండా, ఆ కారణాలను తొలగించే ప్రయత్నం జరగకుండా ఆ పరిణామాలు మారవు.

మందుపాతరలు పేల్చి నాయకులనో, వారి విధానాలను అమలుచేసే ప్రభుత్వాధికారులనో చంపడానికి ప్రయత్నించడం అనే పరిణామం ఈ రాష్ట్రంలోకి ఎప్పుడు, ఎందుకు ప్రవేశించిందో నిజాయితీగా గుర్తించగలిగిన ధైర్యం మనకుంటే నాలుగు దశాబ్దాల చరిత్ర ఎన్నో పాఠాలు చెపుతుంది. ప్రభుత్వం చట్టవ్యతిరేకంగా ప్రవర్తించడం ప్రారంభించిననాడే ప్రజాసమూహాల చట్టవ్యతిరేక ప్రవర్తనకు సాధికారత దొరికింది. రాజ్యాంగమే హామీ ఇచ్చిన సమానత్వం, సమన్యాయం, స్వేచ్ఛ నిజంగా అమలు కావాలని నిలదీసిన రాజకీయ పక్షాన్ని, ప్రభుత్వమే ప్రకటించిన భూసంస్కరణలు అమలు చేయాలని కోరిన రాజకీయ పక్షాన్న, ఈ పాలనా విధానం కింద అవి అమలు కావు అనే విశ్వాసంతో ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నించిన రాజకీయపక్షాన్ని ఎటువంటి విచారణ లేకుండా, రాజ్యాంగరక్షణలు నిరాకరించి కాల్చి చంపవచ్చుననే విధానం మొదలయిన ఇరవైఏళ్ల తర్వాత మందుపాతరలు మొదలయ్యాయి. భిన్నరాజకీయవిశ్వాసాలు ఉన్నవారిని చంపడం ఒక పాలనా విధానంగా కొనసాగించడం అసలు ఘాతుకం. ఆ ఘాతుకం మొదలయి చాల రోజులయింది. ఇప్పుడు జరిగిన ఘాతుకాన్ని సమర్థించనక్కరలేదుగాని అది ఏ ఘాతుకాలకు ఫలితమో మాత్రం అర్థంచేసుకోవాలి. ఒక ఘాతుకాన్ని విడదీసి చూసినప్పుడు అందులో బాధితవ్యక్తులకు ప్రత్యక్షప్రమేయం కూడ లేకపోవచ్చు. కాని అది ఒక పాలనావిధానం అయినప్పుడు ఆ పాలనకు అధినాయకత్వం వహించేవారే అందుకు బాధ్యులని అనిపించడం సహజం.

హైదరాబాద్ మతకల్లోలాల తర్వాత 1991 చివరిలో ముఖ్యమంత్రిగా అధికారానికి వచ్చిన జనార్దనరెడ్డి ప్రైవేటు ఇంజనీరింగు కాలేజీల అనుమతుల కుంభకోణంతో 1992 చివరిలో రాజీనామాచేశారు. ప్రస్తుత సందర్భంలో ఆయన పాలన గురించి గుర్తు చేసుకోవలసిన అంశాలు రెండున్నాయి. అప్పటికి నక్సలైట్ల వైపునుంచి పెద్ద హింసాచర్యలు లేకుండానే, వారి హింసాచర్యలను అడ్డుకోవడానికి సాధారణ చట్టాలు సరిపోతుండగానే, బహుశా అప్పుదు ముమ్మరంగా జరుగుతుండిన భూఆక్రమణలను అడ్డుకోవడానికి, రాజీవ్ గాంధీ మొదటి వర్ధంతి రోజున 1992 మే 21 న ప్రతీకాత్మకంగా ఆయన నక్సలైటు పార్టీ మీద నిషేధం ప్రకటించారు. ఆ ప్రకటన ఒక కాలంచెల్లిన, సుప్రీంకోర్టు కొట్టివేసిన చట్టం ఆధారంగా చేయడం, అదితెలిసి నాలికకరుచుకుని మరొక నెలతర్వాత కొత్త ఆర్డినెన్సు తీసుకురావడం మరొక పిట్టకథ. ఆ పార్టీ మీద నిషేధానికి అది సాయుధ పార్టీ అనే సాకు అయినా ఉంది. కాని దానితోపాటు ఒక విద్యార్థి సంఘాన్ని, ఒక యువజన సంఘాన్ని, ఒక రైతుకూలీ సంఘాన్ని, ఒక గని కార్మిక సంఘాన్ని కూడ నిషేధించి ప్రపంచచరిత్రలోనే ఎక్కడాలేని రికార్డు సృష్టించిన ఘనత ఆయన ప్రభుత్వానిది. ఆ నిషేధం ఎన్ కౌంటర్ హత్యల పాలనా విధానంతో కలగలిసి 1991లో 104 గా ఉన్న ఎన్ కౌంటర్ హత్యలు 1992లో 256 అయ్యాయి. ఆ ఎన్ కౌంటర్లు ఎంత విచ్చలవిడిగా జరిగాయో హైదరాబాద్ నడిబొడ్డున పత్రికావిలేకరి గులాం రసూల్ ను, ఆయనతోపాటు ఉన్న పాపానికి విజయప్రసాద్ ను చంపి ఎన్ కౌంటర్ గా ప్రకటించడమే, ఆ ఎన్ కౌంటర్ ను ప్రభుత్వం సమర్థించడమే నిదర్శనం.

మరి మందుపాతరే మార్గమా అని ఎవరయినా అడగవచ్చు. కాదు అని కచ్చితంగా చెప్పవచ్చు. కాని చట్టబద్ధపాలన లేనప్పుడు, చట్టం ఎదుట అందరూ సమానం కానప్పుడు, ప్రతినేరానికీ, ముఖ్యంగా పెద్దలు, సంపన్నులు, ప్రభుత్వాధికారులు, పోలీసులు చేసిన నేరాలకు చట్టం సరైన శిక్ష విధిస్తుందనే నమ్మకం లేనప్పుడు చట్ట వ్యతిరేక చర్యలే రాజమార్గమని ప్రజలు అనుకునే స్థితి వస్తుంది. ఒక కలిగిన వారి ఇంట్లో రెండు హత్యలు జరుగుతాయి, కేసు కూడ ఉండదు. హంతకుడు, పోనీ నిందితుడు, ఆస్పత్రిలో కొన్నాళ్లు చికిత్సారాజభోగాలనుభవించి విచారణ కూడ లేకుండా మిగిలిపోతాడు. ఒక అంతర్జాతీయ ప్రఖ్యాతి గల రచయితమీద హత్యాయత్నంచేసినవాళ్లు అధికారపక్ష మిత్రులు గనుక అసలు ఆ ఆరోపణే ఎదుర్కోరు. ఐదువేలమందిని ఎన్ కౌంటర్ ల పేరుమీద చంపితే ఒక్క హత్యకేసు కూడ నమోదు కాదు. వేలమందిని చంపిన యూనియన్ కార్బడ్ ఆండర్సన్ కు ప్రభుత్వం రాజభోగాలు కల్పిస్తుంది. మారణకాండకు ప్రోత్సాహమందించిన వ్యక్తి సర్వోత్తమ ముఖ్యమంత్రిగా మన్ననలందుకుంటాడు. తమ రాజకీయార్థిక విధానాల ద్వారా లక్షలాదిమంది ఉపాధిపోగొట్టినవాళ్లు, వేలమంది ఆత్మహత్యలకు కారణమైనవాళ్లు గౌరవనీయమైన రాజకీయవేత్తలుగా ఉంటారు. కాని ఏ నేరం చేయని వాళ్లకు, చిన్న నేరాలు చేసినవాళ్లకు మాత్రం హత్యకేసులూ, హత్యాయత్నంకేసులూ, రోజులతరబడి నరకకూపాలలో చిత్రహింసలూ, లాకప్ మరణశిక్షలూ దక్కుతాయి.

ఇంత బహిరంగంగా, ఇంత నిస్సిగ్గుగా, కనీస చట్టబద్ధపాలన ఆభాస కూడ లేకుండా పాలన నడుస్తున్నప్పుడు ప్రజలో, ప్రజాసమూహాలో, ప్రత్యామ్నాయ రాజకీయాలు పాటించేవారో చట్టాన్ని తమచేతుల్లోకి తీసుకోవడం సహజం. చట్టాన్ని పాటించేబాధ్యత ఉన్నవారు, చట్టాన్ని కాపాడతామని ప్రమాణంచేసి అధికారంలో ఉన్నవారు చట్టాన్ని అడుగడుగునా ఉల్లంఘిస్తున్నప్పుడు ప్రజలు “నేరాలు” చేయకతప్పని స్థితి వస్తుంది. పదహారో లూయీ తల పారిస్ వీథుల్లో దొర్లడం ఘాతుకమే కావచ్చును గాని, ఫ్రెంచి విప్లవచరిత్రకారులెవ్వరూ ఆ ఘాతుకాన్ని హఠాత్తుగా జరిగిన ఘటనగా చూడలేదు. అనేకఘాతుకాల పర్యవసానంగా చూశారు. ఆంధ్రదేశంలో చరిత్ర వెనక్కి నడుస్తూ ఇరవైఒకటో శతాబ్దం నుంచి పద్దెనిమిదో శతాబ్దానికి చేరుకుంటున్నట్టున్నది.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Telugu, Vartamaanam. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s