సమాల్ సవాళ్లెవరికి?

భారతీయుల వాదవినోద కౌశలం గురించి పుస్తకమే రాసిన అమర్త్యసేన్ కూడ ఆశ్చర్యపోయే రీతిలో విలువైన సమయాన్నీ, శక్తినీ ఖర్చు చేస్తూ సేతుసముద్రం – రామసేతు వివాదం జరుగుతున్నది. ఇటువంటి పనికిరాని వివాదాలవల్ల వాస్తవంగా జరిగేదేమంటే అవి సమాజానికి నిజంగా అవసరమైన చర్చలకూ, సమాజం ముందున్న తీవ్రమైన సవాళ్లను ఎదుర్కోవడానికీ సమయమూ స్థలమూ మిగలకుండా చేస్తాయి. కలడోలేడో తెలియని, ఉన్నా అసలు దక్షిణభారతానికి వచ్చాడో లేదో తెలియని రామచంద్రప్రభువు కోసం వానరసేన నిర్మించిందంటున్న సేతువుమీద జరుగుతున్న చర్చలో కొంతభాగమైనా ఇప్పుడు మనమధ్యనే ఉండి అవసరమైన ప్రశ్నల కత్తులవంతెన నిర్మించిన రామచంద్రసమాల్ నివేదికల మీద జరిగితే బాగుండును.

సమాల్ నివేదికలు ఇవాళ్టి మన సమాజస్థితి మీద చర్చించడానికి అత్యవసరమైనవి. మన ప్రజాధనం ఎట్లా దుర్వినియోగమవుతున్నదో, మన వ్యవస్థ ఎంత అస్తవ్యస్తంగా సాగుతున్నదో వివరించి చెప్పేవి. ఆయన చెప్పిన విషయాలు చాలమంది చాలరోజులుగా చెపుతున్నవే కావచ్చును గాని వ్యవస్థను, పాలనను ఆయన లోపలి నుంచి చూసి అప్రూవర్ సాక్ష్యం లాంటిది ఇచ్చారు. అమెరికా పాలకుల దుర్మార్గాల గురించి యాభై సంవత్సరాలుగా అందరికీ తెలిసిన విషయాలనే సాధికారికంగా లోపలి నుంచి ప్రకటించిన జాన్ పెర్కిన్స్ (ఒక దళారీ పశ్చాత్తాపం) లాగ సమాల్ తన అనుభవాలలో కొన్నిటిని ప్రకటించారు.

ఆ చేదునిజాలు విని భుజాలు తడుముకున్న కొద్దిమంది గుమ్మడికాయల దొంగలను మినహాయిస్తే, తాము చేసేది లౌక్యం, ఇతరులు చేసేది మోసం అనీ, అన్ని గడపల్లోన తమ గడప మేలు అనీ అనుకునే పాలకపక్ష రాజకీయనేతలను మినహాయిస్తే, తామూ ఆ తానులో ముక్కలే అయికూడ ఈ శవదహనంలో పేలాలు ఏరుకుందామనుకున్న కొద్దిమంది ప్రతిపక్ష రాజకీయనాయకులను మినహాయిస్తే, పెద్దగా ప్రజాస్పందనలేదు. నిజంగా ఎవరి సంపద అపహరణకు గురయిందో, ఎవరి నెత్తురూ చెమటా అక్రమార్జనగా గద్దెలమీద ఉన్నవారి బొక్కసాలు నింపిందో, ఎవరిపేరుమీద జరుగుతున్న పాలన కనీస సూత్రాలను పాటించడంలేదో ఆ అమాయక ప్రజానీకం మాత్రం ఈ దొరల దొంగతనం గురించి మాట్లాడనేలేదు.

అదే ఆశ్చర్యం. నిజానికి సమాల్ సవాల్ అధికారులకో, రాజకీయ నాయకులకో కాదు. సమాల్ తన అనుభవాల ప్రకటన ద్వారా సమాజానికి సవాల్ విసిరారు, మనందరినీ ప్రశ్నించారు. ఏ ప్రజలు తమ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, తమ పాలన స్వచ్ఛంగా ఉండడానికి, తమ పేరుమీద స్వార్థపరశక్తులు బొజ్జలు నింపుకోకుండా ఉండడానికి నిరంతర జాగరూకత ప్రదర్శించవలసి ఉన్నదో ఆ ప్రజల కళ్లు తెరిపించడానికి, ఆ ప్రజలు ఈ దుస్థితిని సరిదిద్దేలా చేయడానికి సమాల్ సవాళ్లు ఉపయోగపడాలి. కాని ఆ సవాళ్లమీద సమాజం ఉలుకూ పలుకూ లేకుండా పడి ఉన్నట్టనిపిస్తున్నది. లేదా, మన మహా ఘనత వహించిన ప్రజాస్వామ్యంలో సమాజ ప్రతిస్పందనను ప్రతిఫలించడానికి అవసరమైన వాహికలు లేవనే అప్రియ సత్యమయినా దీనితో బయటపడుతూ ఉండాలి.
సమాల్ సవాళ్ల మీద ఇంతవరకూ మూడు రకాల స్పందనలు వచ్చాయి.

మొదటిరకం ఆ సవాళ్ల నిజానిజాలలోకి వెళ్లకుండా సమాల్ కు మతిస్థిమితంలేదనో, ఆయన వెనుక మరెవరో ఉన్నారనో, ఆయన పదవిలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదనో, అవి అధికారిక రహస్యాలు గనుక బయటపెట్టగూడదనో సాంకేతిక కారణాలతో వాటిని కొట్టివేసేవి. ఆ సాంకేతికకారణాలన్నీ నిజమైనప్పటికీ సమాల్ సవాళ్లకు జవాబు చెప్పవలసిన బాధ్యత ఉండనే ఉంటుంది.

రెండవరకం స్పందనలు సమాల్ కూడా అవినీతిపరుడేననీ, అక్కడ భూమి ఆక్రమించాడనీ, ఇక్కడ అధికార దుర్వినియోగం చేశాడనీ వచ్చినవి. అవతలివాడిమీద బురదజల్లి తమ బురదమీది నుంచి దృష్టి మళ్లించేవి. ఒకవేళ సమాల్ వంటి మీద అంతకు ముందే బురద ఉన్నా, ఇప్పుడు కొత్తగా చల్లినా, ఇవతలి పక్షం వంటిమీది బురద రద్దయిపోదు. ‘నేనొక్కడినే కాదు, మిగిలిన వాళ్లందరూ ఫెయిలయ్యారు’ అని తప్పించుకునే పిల్లకాయతనం తప్ప ఈ ప్రత్యారోపణలకు పెద్ద విలువ ఉండదు. జవాబులు చెప్పవలసిన బాధ్యత నుంచి ఈ స్పందనలు ఎవరినీ తప్పించజాలవు.

ఇక మూడో రకం స్పందనలు మరింత చిత్రమైనవి. ప్రతిపక్ష నాయకులందరూ అసలు ఈ రాష్ట్రంలో అవినీతి అనేది నిన్నగాకమొన్ననే మొదలయినట్టు, సమాల్ అనే మహానుభావుడు వెల్లడించేవరకూ అది ఎవరికీ తెలియనే తెలియనట్టు, ఆ పాపమంతా ప్రస్తుత ప్రభుత్వానిదే అయినట్టు మాట్లాడారు. ఇది చరిత్ర తెలియని అజ్ఞానమైనా కావాలి, లేదా వినేవారిని తప్పుదారి పట్టించదలచిన అవకాశవాదమైనా కావాలి.

మన అవినీతికథ మన పాలనలోకి స్వార్థం ప్రవేశించినంత పాతది. అంత వెనక్కి పోకపోయినా, చందారెడ్డి, ధనార్జనరెడ్డి అని ముఖ్యమంత్రుల పేర్లే మారిపోయిన ఘనచరిత్ర మన రాష్ట్రానిది. ఇక ప్రపంచబ్యాంకు నిధులతోనూ, బహుళజాతిసంస్థల డాలర్లతోనూ సంపర్కం కుదిరినాక వేలకోట్లరూపాయల అవినీతిని చూసిన చరిత్ర మనది. ఆ అవినీతిని కూడ అత్యున్నత అధికారపీఠాలలో కేంద్రీకరించి, పైకి మాత్రం అవినీతిమీద నిప్పులు చెరిగిన చరిత్ర మనది.

చోటా రాజకీయనాయకులనుంచి ముఖ్యమంత్రులదాకా ఏఒక్కరివిషయంలోనైనా రాజకీయాలలో ప్రవేశించకముందు ఆస్తి ఎంత, రాజకీయసోపానపదంలో పైకి పోయినకొద్దీ పెరిగిన ఆస్తి ఎంత అనేది ప్రజలందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. అఖిలభారత సర్వీసుల అధికారులు జీతభత్యాల రూపంలో పొందే వార్షికాదాయం ఎంతో, వారి ప్రశాసననగర్ భవంతులు ఆ ఆదాయానికి ఎన్ని వందలరెట్లు విలువైనవో ఎవరయినా చూసి తెలుసుకోవచ్చు. ఈ అవినీతి మన పాలనావ్యవస్థనో, ఆర్థిక వ్యవస్థనో మాత్రమే కాదు, మన సామాజిక, సాంస్కృతిక జీవనాన్నే అల్లకల్లోలం చేస్తున్నది. ఇది ఇలాగే కొనసాగితే సమాజ మనుగడ గాని, భద్రతగాని ప్రశ్నార్థకమైపోతాయి.

ఈ నేపథ్యంలో రామచంద్ర సమాల్ అనే ఒకానొక అధికారి, ఆయనకు నైతిక అర్హత ఉన్నాలేకపోయినా, ఆయన వెనుక ఎవరన్నా ఉన్నా లేకపోయినా, “ఇవన్నీ ఏమిటో, ఎందుకు జరుగుతున్నాయో ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రతి వివేకవంతుడైన పౌరుడికీ ఉంది. జవాబు పొందే హక్కు ఉంది” అనే అవగాహనతో తన నివేదిక తయారుచేయడం పౌరులందరూ ఆహ్వానించవలసిన సంగతి. ఆ నివేదికలో ఆయన ప్రభుత్వ పాలన అనేది ఎంత అస్తవ్యస్తంగా పనిచేస్తున్నదో, పాలనసజావుగా సాగడంకొరకు రాసిపెట్టుకున్న నిబంధనలను ఎట్లా తుంగలో తొక్కడం జరుగుతున్నదో వివరించారు. రాజకీయనాయకులలో, అఖిలభారత సర్వీసు అధికారులలో, ప్రభుత్వాధికారులలో మొత్తంగా దిగజారిపోతున్న విలువల గురించి మాట్లాడారు. అవసరమైన చోట ఉదాహరణలుగా కొందరి పేర్లు, కొన్ని ఉదంతాలు ప్రస్తావించారు. ఆ పేర్లలో, ఉదంతాలలో ఎక్కడన్నా ఒకటీఅరా పొరపాట్లు ఉన్నా, మొత్తంగా ఆయన నివేదిక మనను ఒక కర్తవ్యానికి పురికొల్పుతుంది. మన పాలనావ్యవస్థకు తక్షణమే లోతయిన మరమ్మతు చేయవలసి ఉన్నదని ఆ నివేదిక మనకు మరొకసారి చెపుతున్నది.

About ఎన్.వేణుగోపాల్ N Venugopal

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues.
This entry was posted in Telugu, Vartamaanam. Bookmark the permalink.

1 Response to సమాల్ సవాళ్లెవరికి?

  1. “ఇటువంటి పనికిరాని వివాదాలవల్ల వాస్తవంగా జరిగేదేమంటే అవి సమాజానికి నిజంగా అవసరమైన చర్చలకూ, సమాజం ముందున్న తీవ్రమైన సవాళ్లను ఎదుర్కోవడానికీ సమయమూ స్థలమూ మిగలకుండా చేస్తాయి.” – సరిగ్గా నేనూ ఇదే అనుకుంటున్నాను. స్వప్రయోజనం లేనిదే రాజకీయ పార్టీలూ వాటి నాయకులూ దేన్నీ పట్టించుకోవడం లేదు. ఇలాంటి వ్యర్థ (లేదా తక్కువ ప్రాముఖ్యం కల) విషయాల గురించి రాడకీయ పక్షాలు లేవదీసే అర్థం లేని చర్చలకు ప్రసారసాధనాలు కూడా అధిక ప్రాముఖ్యం ఇవ్వడంతో సాధారణ ప్రజానీకం దృష్టిని మరల్చే ప్రయత్నం జరుగుతోంది. Main stream media భ్రష్టు పట్టింది. ఇలాంటి బ్లాగులే ఏమైనా కాస్తంత పనికొచ్చే ఆలోచనలను చర్చించే వీలును కల్పించగలవేమో.

    ఎవరు అధికారంలోకి వచ్చినా వీలైనంత దండుకోవడమే రాజనీతి అయిపోయింది. మూడో ఫ్రంటు రావాలి అనే మాట కూడా అపహాస్యానికి గురౌతున్నది. ఎవడో ఒక మహానుభావుడు రావాలి. పాలనా వ్యవస్థలో పుట్టి వర్ధిల్లుతున్న ఈ వేరుపురుగును నాశనం చేసి జనజీవనాన్ని సమూలంగా మార్చివేయాలి అంటూ అందరూ ఆకాశంకేసి చూసే పరిస్థితి నేడు కొనసాగుతోంది.

    ఒక ఆక్రమణదారు (చెంఘిజ్‌ఖాన్ అనుకుంటాను) ఇలా అన్నాడట “భారతదేశం ఒక అందమైన స్త్రీ. ఎప్పుడెప్పుడు బలవంతుని కౌగిలిలో నలిగిపోదామా అని ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటుంది.” మూడో ప్ఱంటు రావాలి, కాంగ్రెసుకూ తెలుగుదేశం పార్టీకీ బుద్ధి చెప్పాలి, జయప్రకాశ్ నారాయణ్ రావాలి, చిరంజీవి రావాలి … ఇలా వచ్చే వీళ్లలో ఒక్కడైనా దేశాన్ని తల్లిలా చూసేవాడు కాకపోతాడా … అని ఎదురు చూస్తుండటం గమనిస్తే ఆ ఆక్రమణదారు మాటలు నిజమనిపించక మానవు.

    మనకున్న వ్యవస్థ ప్రజాస్వామ్యం. ఇందులో ప్రజల స్వామ్యమేమీలేదు – ఓట్లేసి ఎవడో ఒకడిని బలవంతునిగా చేయడం తప్పితే. ఇంక ఆ తరువాత ప్రజల పరిస్థితి ఏమౌతోందంటే – చినవీరభద్రుడు గారు ‘ప్రశ్నభూమి’ కథలో చెప్పినట్లు “మహాకాయుడైన ఆ రాజ్య పురుషుని ….

Leave a comment