విద్యే మహావ్యాపారం

“చదవనివాడజ్ఞుండగు, చదివిన సదసద్వివేక చతురత గలుగున్” అని ఆరుశతాబ్దాలకిందనే చదువుకూ వివేకానికీ మధ్య సంబంధాన్ని ప్రకటించిన జాతి మనది. ఇవాళ “చదువంటే వ్యాపారము, చదువుపేర కోట్లు కోట్లు దండుకోదగున్” అని ఆ వివేకాన్ని మార్చిన చతురత మన పాలకులది. ఇన్నాళ్లకివాళ ఏలినవారిదయవల్ల చదువుకు నిర్వచనం మారుతున్నట్టున్నది. ఈ అత్యాధునిక యుగంలో మనం ప్రజలను అజ్ఞులను చేసే, సదసద్వివేక చతురత కలగకుండాచేసే చదువుల వైపు మళ్లుతున్నట్టున్నది. ‘విద్యను పరిశ్రమగా గుర్తిస్తాం’ అని చంద్రబాబు నాయుడు విజన్ 2020 లో సరికొత్త నిర్వచనం చెప్పి, ఆ పని పూర్తి చేయకుండానే దిగిపోయారు గాని చెప్పకుండానే ఆ విజన్ ను అక్షరాలా కొనసాగిస్తున్న రాజశేఖరరెడ్డి ప్రభుత్వం మాత్రం గ్రామీణ ఆశ్రమ పబ్లిక్ స్కూళ్ల పేరిట విద్యావ్యాపారానికీ, పరిశ్రమకూ బార్లా తలుపులు తెరుస్తున్నది. ఇంకా సగం జనాభా చదువుకు దూరంగానే ఉన్న మన సమాజంలో చదువు పేరిట ఎన్ని అబద్ధాలు ఆడవచ్చునో, ఎట్లా ఆశ్రితులకు భూములూ, ప్రజాధనమూ దోచిపెట్టవచ్చునో ఈ కొత్త విద్యాయజ్ఞం పథకం చూపెడుతున్నది.

“రాష్ట్రంలోని గ్రామీణ, చిన్నపట్టణ ప్రాంతాలలోని విద్యాపరంగా ప్రతిభావంతులైన చిన్నారులకు ఉత్తమ ప్రమాణాల విద్యను అందించడం కోసం” ఈ పథకాన్ని తయారు చేశామని ప్రభుత్వం అంటున్నది. ఇటువంటి పథకాన్ని తయారుచేసే ముందు ప్రభుత్వం వేసుకోవలసిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ప్రభుత్వం దగ్గర వనరులు లేవా? ఉన్న వనరులు సరిపోవా? ప్రస్తుతం ఉన్న విద్యావ్యవస్థలో ఈ లక్ష్యాలను సాధించకుండా ప్రభుత్వాన్ని అడ్డుకుంటున్న కారణాలేమిటి? ప్రభుత్వ రంగ విద్యాసంస్థల ప్రమాణాలను దిగజారుస్తున్న అంశాలేమిటి? ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కల్పించినా, మన గ్రామీణ విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎన్ని అద్భుతాలు సాధిస్తున్నారు? ఆ అద్భుతాలను పెంపొందించడానికి ఏమి చెయ్యవచ్చు? ఇలాంటి ప్రశ్నలు వేసుకోకుండా, జవాబులు చెప్పే ప్రయత్నం చేయకుండా, పిడుక్కీ బియ్యానికీ ఒకే మంత్రమన్నట్టు ప్రైవేటు అని బోర్డు పెట్టుకుంటే చాలు, అన్ని నాణ్యతా ప్రమాణాలూ వచ్చి ఒళ్లో వాలుతాయన్నట్టు ప్రభుత్వం ఈ లక్ష్యం మాటున ప్రైవేటు విద్యావ్యాపారుల ప్రయోజనాలకోసం ఈ విద్యా యజ్ఞాన్ని తయారు చేసింది. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న 16,292 ఉన్నతపాఠశాలల్లో 6483, అంటే దాదాపు నలభై శాతం, ప్రైవేటు రంగంలోనే ఉన్నాయి. వాటిలో చాలా భాగం ఎట్లా అపార్ట్ మెంట్లలో, మూసేసిన పౌల్ట్రీ ఫారాలలో, కిక్కిరిసిన వాతావరణంలో, చదరపు గజం ఆటస్థలం కూడ లేకుండా, పిల్లల శారీరక, మానసిక వికాసానికి ఏ మాత్రం ఉపయోగపడకుండా ఉన్నాయో, ఎట్లా విద్యావ్యాపారుల దుకాణాలుగా కొనసాగుతున్నాయో అందరికీ తెలుసు. ఆ ప్రైవేటువిద్యావ్యాపార రంగాన్ని ఇంకా విస్తరించడంకోసం ‘పబ్లిక్ – ప్రైవేట్ భాగస్వామ్యం’ పేరుతో ఈ రూరల్ రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్స్ –గ్రామీణ ఆశ్రమ పబ్లిక్ పాఠశాలలు — ఏర్పడుతున్నాయి. ఈ పదబంధంలో పబ్లిక్ అనే మాటను అనువదించడం కష్టం, ఎందువల్లనంటే ఈ ఏర్పడబోయే పాఠశాలల స్వభావంలో వందల కోట్లరూపాయల ప్రజాధనం కైంకర్యం చేయడం మినహా పబ్లిక్ అని చెప్పదగినదేదీలేదు.

తొలిదశలో రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున పుడతాయని ప్రభుత్వం వాగ్దానం చేస్తున్న ఈ గ్రామీణ ఆశ్రమ పాఠశాలలు ఎవరి ప్రయోజనాలకొరకు వస్తున్నాయో, అసలు ఈ దుకాణాల లక్ష్యం విద్యాబోధన అవునో కాదో, ప్రభుత్వం తయారు చేసిన పవర్ పాయింట్ ప్రదర్శన నుంచే స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఈ పాఠశాలలు ఎప్పటికి పని ప్రారంభించి, ఎప్పటికి పిల్లలను చేర్చుకుని, ఎప్పటికి వాళ్లకు చదువు చెప్పడం మొదలు పెడతాయో తెలియదుగాని, ఈ పాఠశాలలనే దుకాణాలు పెట్టదలచుకున్న వాళ్లకు మొట్టమొదట ప్రభుత్వం 30 నుంచి 50 ఎకరాలవరకు భూమిని ధారాదత్తం చేస్తుంది. ‘ప్రయాణం అవద్ది, నైవేద్యం నివద్ది’ అని సామెత చెప్పినట్టు ఆ దుకాణాల బోర్డులు అసలు వెలుస్తాయో లేదో, వెలిస్తే ఎన్నాళ్లు నడుస్తాయో, వ్యాపారం లాభసాటిగా లేదని మధ్యలో బోర్డు తిప్పేస్తాయో గాని, ఏమి చేసినా మొట్టమొదట ఆ దుకాణదార్లకు భూమి దొరుకుతుంది. ఒకటి రెండు సంవత్సరాలకొరకు కాదు, మొదట 33 సంవత్సరాల లీజు అన్నదానిని ప్రస్తుతం 99 సంవత్సరాల దీర్ఘకాలిక లీజుకు పెంచారు. ఆ భూమిని ‘పాఠశాల’కు వాడినా వాడకపోయినా ఏదోవిధంగా క్రమబద్ధీకరణ కూడ జరుగుతుందని గత అనుభవాలు చూపుతున్నాయి.

ఈ పాఠశాలల ఏర్పాటుకు ఒక్కొక్కదానికి రు. 11 కోట్ల 68 లక్షలు ఖర్చు అవుతుందని ప్రభుత్వం లెక్కలు వేసింది. ఆ లెక్క సరయినదేనా, అందులోనూ ఆరోతరగతి నుంచి పన్నెండో తరగతి దాకా ఉండే పాఠశాలకు రు. 48 లక్షల ఆడిటోరియం ఎందుకు వంటి ప్రశ్నలు అడగకుండానే, ఈ 12 కోట్ల రూపాయల వ్యవహారాన్ని కొంచెం అనుమానంతో చూడవలసి ఉంది. అసలు ఈ మొత్తం పథకాన్నే కార్పొరేటు విద్యాపథకమనీ, ప్రభుత్వ – ప్రైవేటు భాగస్వామ్య పథకమనీ అంటున్నారు గనుక ఈ పాఠశాలలకు వ్యాపారసంస్థలుగా గుర్తింపు వస్తుందన్నమాట. అంటే ఈ విద్యాబేహారులు ఏదో ఒక జాతీయబ్యాంకును పట్టుకుని ఆ పన్నెండుకోట్ల రూపాయల అంచనావ్యయంలో పదకొండుకోట్ల రూపాయల టర్మ్ లోను కూడ సంపాదించవచ్చునన్నమాట. ఆ టర్మ్ లోనును ఆ తర్వాత ఏ రుణ మాఫీపథకంకిందనో, బోర్డు తిప్పేసిన నిరర్థక అప్పు కిందనో కూడ చూపించవచ్చునన్నమాట. వారెవ్వా, ఏమి మహా పథకం, ఒక కోటి రూపాయలలోపు మార్జిన్ మనీ గనుక మీ దగ్గర ఉంటే, మీరు విద్యాసంస్థ పేరుతో ఒక వ్యాపార సంస్థను రిజిస్టర్ చేయించగలిగితే, అటు ప్రభుత్వం దగ్గరి నుంచి అప్పనంగా యాభై ఎకరాల భూమీ సంపాదించవచ్చు, ఎట్లాగూ ఆ భూమి పెరుగుతున్న చిన్న పట్టణాల శివార్లలోనే ఇస్తామంటున్నారుగనుక దాన్ని రియల్ ఎస్టేట్ చేసి కోట్లకు పడగఎత్తవచ్చు. బోనస్ గా బ్యాంకు రుణం పేరుతో కాసిన్ని చిల్లరడబ్బులు కూడ సంపాదించవచ్చు.

ఇలా బాతును ముందేకోసి ఒక్క బంగారు గుడ్డు తీసుకోవలసిన ఖర్మ మాకేల అనుకునేవాళ్ల కోసం రోజూ బంగారు గుడ్డు పథకం కూడ ఉంది. 99 ఏళ్లపాటు, అంటే కనీసం నాలుగు తరాలపాటు, ఏటేటా బంగారు గుడ్లు పెట్టే బాతులను ఆ యాభైఎకరాల రిసార్టులో పెంచుకోవచ్చు. ప్రభుత్వం వేసిన లెక్క ప్రకారమే ఒక్కొక్క పాఠశాలకు సాలీనా రు. 2.78 కోట్లు ఖర్చు అవుతాయి. అందులో రు. 1.39 కోట్లను ప్రభుత్వమే ప్రజాధనం నుంచి సమకూర్చి పెడుతుంది. అలా ప్రభుత్వం ఇచ్చే విరాళంతోనే తమ బడిదుకాణం ఖర్చంతా వెళ్లదీయగల వ్యాపారుల ప్రతిభ వారి ఇష్టం. ఇంకా కొసరుగా, ఒక్కో పాఠశాలలో 25 శాతం సీట్లను యాజమాన్యం అనబడేది తన ఇష్టం వచ్చిన ధరలకు అమ్ముకోవచ్చు.

ఇంతకీ ఈ కొత్త ప్రయోగం ఈ యజమానుల ప్రయోజనాలను తీర్చడంతో పాటు, విద్యాప్రమాణాలను ఏమన్నా పెంచుతుందా, విద్యార్థుల సృజనాత్మక వికాసానికి పునాది వేస్తుందా, రాష్ట్రంలో విపరీతంగా ఉన్న డ్రాపవుట్ రేటును ఏమాత్రమైనా తగ్గిస్తుందా, ఉపాధ్యాయుల పనిపరిస్థితులను చక్కదిద్దుతుందా వంటి ప్రశ్నలు విద్యావ్యాపారులకు ఎట్లాగూ రావు, ప్రభుత్వానికీ రాలేదు. భూమి, డబ్బు, ప్రైవేటు యాజమాన్యం ఉంటే చదువుదేముంది అని ప్రభుత్వం అనుకుంటున్నట్టుంది.

మరో రూపంలో ప్రత్యేక ఆర్థిక మండలాలను తెస్తున్న ఈ విద్యా పథకం బోధనా మాధ్యమం విషయంలో జాతీయోద్యమం నాటినుంచీ వస్తున్న విలువలను కూడ పూడ్చిపెట్టబోతున్నది. ఇంగ్లిషు మాధ్యమంగా ఉండబోయే ఈ పథకం అన్ని జాతీయ విద్యా కమిషన్లు సూచించిన మాతృభాషలో విద్యాబోధన, త్రిభాషావిధానం అన్నవాటికి స్వస్తిపలికి బహుళజాతిసంస్థలకు ఊడిగం చేసే, వారి సరుకులు కొనే శిష్ట వర్గాన్ని తయారు చేయడానికి ఉద్దేశిస్తున్నది.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Telugu, Vartamaanam. Bookmark the permalink.

One Response to విద్యే మహావ్యాపారం

 1. ramnarsimha says:

  Sir,

  Your article is very fine..

  Indian education system is in danger situation..

  It needs reforms on war-foot..

  by
  P.R.Narsimhareddy..

  rputluri@yahoo.com

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s