అర్ధసత్యం అనే మాటకు సగం సత్యం అనే వాచ్యార్థం కాక, అసత్యం అనే రూఢ్యర్థం కూడ ఉంది. సంపూర్ణ సత్యంలోని ఒకముక్కను చూపడమంటే ఒకరకమైన అసత్యమే గనుక ఆ అర్థం వచ్చిఉంటుంది. సత్యం ఒకటే అయినా చూసేవారి చూపును బట్టి దానిలో ఏదో ఒక పార్శ్వాన్నే పైకెత్తిచూపినప్పుడు, ఆ ఒక్కపార్శ్వమే సంపూర్ణం కాదుగనుక, అసలది ఆ మొత్తం సత్యంలో ఒకానొక పిపీలికంమాత్రమే కావచ్చుగనుక అర్ధసత్యం అసత్యం కావడానికే అవకాశం ఎక్కువ. అందులోనూ ఆ అర్ధసత్యాన్ని చూపెట్టేవారికి ఉండే ప్రయోజనాల దృష్ట్యా అర్ధసత్యం అసత్యం కావడం సహజం. సగంనీళ్లతో ఉన్నపాత్ర అన్నా, సగం ఖాళీగా ఉన్న పాత్ర అన్నా చెప్పే విషయం ఒకటే అయినా, రెండూ ఎంత సత్యాలో అంత అసత్యాలే, రెండూ అర్ధసత్యాలే, చూసేవారి దృక్పథానికి సూచికలే.
కాని స్వల్పభేదంతో అర్థసత్యం అనే మాట ఉంది. చాలమంది అర్థ, అర్ధ మధ్య ఉచ్చారణా భేదాన్ని గాని, అక్షర భేదాన్ని గాని గుర్తించరుగాని ఆ అర్థ అనే మాటకు డబ్బుసంబంధమైన అనే అర్థం ఉంది. మానవజీవిత మనుగడకు అవసరమైన ఉత్పత్తి కార్యకలాపాలకు సంబంధించిన అనే అర్థం కూడ ఉంది. ఆ అర్థంలో చూసినప్పుడు అర్థసత్యం అనే మాటకు సగం సత్యం అని కాక, ఆర్థిక పరమైన సత్యం అనే అర్థం వస్తుంది. ఆర్థిక పరమైన అంటే డబ్బు లావాదేవీలు అనే మామూలు అర్థం మాత్రమే కాదు, మన నిత్యజీవితక్రమానికి సంబంధించిన అన్ని ప్రక్రియలూ ఆర్థికపరమైనవే. ఆ అర్థంలో చూసినప్పుడు అర్థసత్యాలు నిజంగా మన జీవితాన్ని శాసించేవి, మన నిత్యజీవితానుభవంలో మనకు తెలియకుండానే మనం వ్యవహరించేవి.
మనకు తెలియకుండానే మనం అనుక్షణం శ్వాసప్రక్రియలో పాల్గొంటున్నట్టు, మనకు తెలియకుండానే మనం ఆర్థిక కార్యకలాపాలలో కూడ అనుక్షణం పాల్గొంటూ ఉంటాం. “ఏం చేస్తున్నారు” అనే సాధారణ కుశల ప్రశ్నకు “ఏమీ చేయడంలేదు” అని జవాబు చెప్పే వారు కూడ వారికి తెలిసో తెలియకో ఏదో ఒక ఆర్థికకార్యకలాపంలో పాల్గొంటూనే ఉంటారు. జననం నుంచి మరణం దాకా జీవిత పర్యంతం అన్ని కార్యకలాపాలూ ఆర్థిక కార్యకలాపాలే. మానవీయమైన సహజాతాలూ, సంబంధాలూ, అనుభూతులూ కూడ ఏదో ఒక స్థాయిలో ఆర్థిక కార్యకలాపాల స్పర్శతోనే ఉంటాయి. ప్రతిమనిషీ తన జీవితక్రమంలో అడుగడుగునా ఏవో వస్తువులను, సరుకులను, సేవలను వినియోగించుకోవాలి, వాటితో వ్యవహరించాలి. ఆ సరుకుల, సేవల ఉత్పత్తి, పంపిణీ, వినిమయం, వినియోగం అనే నాలుగు మౌలిక ఆర్థికకార్యకలాపాలలో పాల్గొనకుండా ఏ ఒక్క జీవితమూ ఒక్క క్షణం కూడ నడవదు. కొందరికి ఏకకాలంలో ఆ అన్ని ప్రక్రియలతోనూ సంబంధం ఉండవచ్చు, మరికొందరు ఏదో ఒక ప్రక్రియలోనే పాలుపంచుకుంటూ ఉండవచ్చు. కాని అసలు ఆర్థిక కార్యకలాపంలో పాల్గొనని వ్యక్తి ఒక్కరుకూడ ఉండే అవకాశం లేదు. అందువల్ల జీవితసత్యం ఏమన్నా ఉన్నదంటే అది అర్థసత్యం మాత్రమే. అంటే అదే పరమార్థసత్యం అన్నమాట.
మన దైనందిన కార్యకలాపాలలో మనందరమూ వందలాది సరుకులనూ సేవలనూ వినియోగిస్తుంటాం, మనలో కొందరు వాటిని ఉత్పత్తి చేస్తుంటారు, కొందరు వాటిని పంపిణీ చేస్తుంటారు, కొందరు వాటిని వినిమయం చేస్తుంటారు. ఈ పనులన్నీ మనం మనకోసం మాత్రమే చేసుకుంటున్నామని మనలో చాలమంది అనుకుంటారు. కాని మనందరం విడివిడిగా చేస్తున్నట్టు భావిస్తున్న ఈ పనులవల్లనే సమాజం మొత్తంగా నడుస్తూ ఉంది. ఉత్పత్తి, పంపిణీ, వినిమయం, వినియోగం – ఇదంతా ఒక మహాద్భుత యంత్రంలాగ, ఒకదానితో ఒకటి పరస్పర, అన్యోన్య సంబంధంలో నిరంతరం గిరగిరా తిరుగుతూ ఉంటుంది.
ఎవరు ఉత్పత్తిలో పాల్గొనాలి, ఏమి ఉత్పత్తి చేయాలి, ఉన్న వనరులను ఏయే సరుకుల ఉత్పత్తి కోసం వెచ్చించాలి, పంపిణీ ప్రక్రియను శాసించే నియమాలేమిటి, వినిమయం చేసే పద్ధతులేమిటి, వినియోగానికి అవకాశాలూ పరిమితులూ ఏమిటి అనే అంశాలను నియంత్రించడానికి వేల ఏళ్లుగా ప్రయోగాలమీద ప్రయోగాలు చేస్తూ మానవసమాజం కొన్ని వ్యవస్థలను నిర్మించుకుంది. ఆ వ్యవస్థలలో ఒకానొకటి మార్కెట్. ఆ వ్యవస్థలను క్రమబద్ధంగా, సమాజహితం లక్ష్యంగా నడిపే బాధ్యతను సమాజమే ప్రభుత్వాలకు అప్పగించింది.
అంటే స్థూలంగా మార్కెట్, ప్రభుత్వం అనే సంస్థలు మానవ ఆర్థిక జీవితాన్ని మెరుగుపరచడానికి, సులభతరం, సుఖతరం చేయడానికి పుట్టుకువచ్చాయి. కాని కాలక్రమంలో ఆర్థిక కార్యకలాపాలు సంక్లిష్టమైపోయి, ఆర్థికకార్యకలాపాలలో కొందరి స్వార్థప్రయోజనాలు పెరిగిపోయినతర్వాత, ఆర్థికవ్యవహారాలను కొందరినుంచి దాచిపెట్టవలసి వచ్చింది. అందరికీ అవసరమైన విషయాలను కొందరికి మాత్రమే అర్థమయ్యే భాషలో మాట్లాడవలసి వచ్చింది. అలా ఆర్థికసత్యాలు నిజంగానే అర్ధసత్యాల స్వభావాన్ని సంతరించుకున్నాయి. ఇప్పుడిక ఆర్థిక శాస్త్ర విషయాలు ఎవరో కొందరు నిపుణులకు, ప్రభుత్వాధికారులకు, పారిశ్రామిక వేత్తలకు, వ్యాపారవేత్తలకు మాత్రమే సంబంధించిన విషయాలుగా, మామూలు ప్రజలకు అర్థంకాని, పట్టని విషయాలుగా మారిపోయాయి.
ఇలా నిపుణుల చేతిలో బందీ అయిపోయిన అర్థశాస్త్రాన్ని ఆ చెరసాల నుంచి విడుదలచేయవలసి ఉంది. ఆర్థిక వ్యవహారాలంటే ప్రజలందరికీ సంబంధించినవిగనుక వాటిని ప్రజలందరికీ విప్పిచెప్పవలసి ఉంది. అర్థశాస్త్రం పేరుమీద సాగుతున్న అంకెలగారడీని బద్దలుకొట్టి ప్రజల నిత్యజీవిత వ్యవహారాలకు ఆ అంకెలు ఎంత ముఖ్యమైనవో వివరించవలసి ఉంది. పరమార్థసత్యపు రహస్యాన్ని బహిరంగం చేయవలసిఉంది.
ఆర్థిక కార్యకలాపాలు అనగానే చాలమంది అంకెలు, లెక్కలు, గణాంకాలు, మనకు తెలియని పారిభాషిక పదజాలం అనుకుంటుంటారు. ఏ శాస్త్రానికయినా ఉన్నట్టుగానే ఈ శాస్త్రంలోనూ అర్థం కాని, అస్పష్టమైన పారిభాషిక పదాలు ఉన్నమాట నిజమే గాని, చాలమంది ఆర్థికశాస్త్ర నిపుణులు అంకెలతో భయపెట్టేమాట నిజమేగాని, అర్థశాస్త్రపు అసలుసారం అది కాదు. అర్థశాస్త్రపు అట్టడుగున ఉన్నది మనిషి మనుగడ. ఆ మనిషి మనుగడ మనందరికీ అవసరమైనది, మనందరమూ పట్టించుకోవలసినది. మనంకూడ పాల్గొనవలసినది.
జాతీయోత్పత్తి, తలసరి ఆదాయం, పెరుగుదల రేటు, బడ్జెట్లు, సబ్సిడీలు, రుణాలు, ప్రోత్సాహకాలు, వడ్డీరేట్లు, పెట్టుబడులు, ఉత్పత్తివ్యయాలు, లాభనష్టాలు, విదేశీ పెట్టుబడులు, విదేశీ మారకద్రవ్యం, మారకపురేట్లు, మదుపుదారులు, స్టాక్ మార్కెట్లు, షేర్లు, విదేశీ సంస్థాగత మదుపుదార్లు, కేటాయింపులు, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ద్రవ్యసంస్థలు, ఎగుమతి దిగుమతి విధానాలు, పారిశ్రామిక విధానాలు, ఒక స్వతంత్రదేశపు రాజకీయార్థిక విధానాలపై అంతర్జాతీయ ద్రవ్యసంస్థల ప్రభావం మొదలయిన మాటలన్నీ మనకు సుదూరమయినవిగా కనిపించినప్పటికీ అవన్నీ మనం ఏమి తింటున్నాం, ఏమి తాగుతున్నాం, ఏమి ఆలోచిస్తున్నాం, ఏమి చదువుతున్నాం, మన ప్రభుత్వం మనకోసం ఏమిచేస్తోంది, ఏమి చేయడంలేదు, మనం వంటి మన ప్రశ్నలకు జవాబులు ఆ మాటల్లో, ఆ మాటల వెనుక దాగిన రహస్యాలలో ఇమిడి ఉన్నాయి. అందువల్ల వాటి గుట్టువిప్పి తెలుసుకోవడం మన అవసరం, మన బాధ్యత. ఎప్పటికప్పుడు ఆర్థికరంగ పరిణామాల నేపథ్యంలో ఆ అవసరాన్ని, ఆ బాధ్యతను గుర్తింపజేయడమే ఈ ‘పరమార్థసత్యం’ వారంవారం శీర్షిక లక్ష్యం.