ఆదివాసుల దారి

రాష్ట్రంలో ప్రతిఒక్కరి మనసుమీద ప్రశ్నగా వేలాడుతూ నిరంతరం ఆలోచింపజేస్తున్న నక్సలైటు ఉద్యమానికి ఈవారంలో నలభైసంవత్సరాలు నిండుతాయి. తెలుగుసమాజం మీద అసాధారణమైన ప్రభావంవేసిన శ్రీకాకుళ గిరిజన ఉద్యమంలో ఒక ముఖ్యమైన మైలురాయి అక్టోబర్ 31, 1967. ఆరోజున అప్పటి అవిభక్త శ్రీకాకుళం జిల్లాలోని పార్వతీపురం తాలూకా (ప్రస్తుత విజయనగరం జిల్లా కురుపాం మండలం) లేవిడి గ్రామంలో గిరిజనుల మీద తొలిసారి భూస్వాముల తుపాకులు పేలాయి. ఆరిక కోరన్న, కొండగొర్రి మంగన్న అనే ఇద్దరు గిరిజనులు మరణించారు. నక్సలైటు ఉద్యమం హింసాపూరితమైనదని సాధారణంగా అపోహపడే, ఆరోపించే మధ్యతరగతి ఆలోచనాపరులు ఇవాళ్టి నక్సలైటు ఉద్యమానికి ఈ రాష్ట్రంలో బీజంవేసిన లేవిడి సంఘటనలో హింస ఎవరిదో గుర్తించవలసి ఉంది.

లేవిడి ఘటనకు కనీసం పది సంవత్సరాల పూర్వరంగం ఉంది. కూలీరేట్ల, పాలేర్ల జీతాల పెంపుదలకోసం, అధికవడ్డీలకు వ్యతిరేకంగా, గిరిజన ప్రాంతాలలో భూములు ఆక్రమించుకున్న మైదానప్రాంత భూస్వాములకు, షావుకార్లకు వ్యతిరేకంగా, అమాయక గిరిజనులపై అటవీ అధికారులు, పోలీసులు సాగిస్తున్న దాష్టీకానికి వ్యతిరేకంగా శ్రీకాకుళం జిల్లా గిరిజన రైతాంగం 1958 నుంచీ చిన్న చిన్న పోరాటాలు సాగిస్తోంది. నిజానికి వాళ్లు ఆరోజున చేసిన డిమాండ్లన్నీ సంక్షేమ రాజ్యపు ప్రభుత్వం వాగ్దానం చేసినవే. రాజ్యాంగబద్ధమైనవే. ప్రజాస్వామికమైనవే. ఆ డిమాండ్లమీద తమ పోరాటానికి గిరిజనులు 1961లో సంఘరూపం కూడ ఇచ్చుకున్నారు. అప్పటి నుంచీ ఏటేటా మహాసభలు జరుపుకుంటూ, బలం పెంచుకుంటూ వచ్చారు. అటువంటి వార్షిక సభే మొండెంఖల్లులో 1967 అక్టోబర్ 31 న జరగవలసింది.

తమ దోపిడీ దౌర్జన్యాలను ప్రశ్నిస్తూ, గిరిజనులలో చైతన్యం పెంచుతున్న గిరిజన సంఘం కార్యకలాపాలను అడ్డుకోవాలని భూస్వాములు, షావుకార్లు ప్రయత్నించారు. వారికి పోలీసులు, అధికారపార్టీ రాజకీయనాయకులు సహకరించారు. అందులో భాగంగానే మొండెంఖల్లు సభను భగ్నం చేయాలని, నాయకులను మట్టుపెట్టాలని భూస్వాములు ప్రయత్నించారు. అది సాధ్యం కాకపోయేసరికి సభకు వెళుతున్న గిరిజనులను లేవిడి గ్రామం దగ్గర అడ్డుకుని వారిమీద దాడి చేశారు. కొట్టారు. స్త్రీలను అవమానించారు. ఆ దాడిగురించి తెలిసిన గిరిజనులు మొండెంఖల్లు నుంచి లేవిడికి పరుగెత్తుకురాగా వారిమీద కాల్పులు జరిపి కోరన్న, మంగన్నలను చంపివేశారు.

మేడిద సత్యనారాయణ అనే భూస్వామి నాయకత్వంలో జరిగిన ఈ హత్యలపై ప్రభుత్వం, పోలీసులు ఎటువంటి చర్యా తీసుకోలేదు. నిందితులను వెంటనే అరెస్టు చేయడంగాని, హత్యకేసు నమోదుచేసి విచారించడం గాని జరగలేదు. ఎంతో ఒత్తిడిమీద కొన్ని నెలల తర్వాత కేసు నమోదయినప్పటికీ, దాన్ని తప్పులతడకగా తయారు చేయడంతో హంతకులు నిర్దోషులుగా విడుదలయ్యారు.

భూస్వాముల ఆగడాలను ఎదుర్కోవడానికి సాయుధ ప్రతిఘటన తప్ప మరొక మార్గం లేదని లేవిడి హత్యాకాండ తర్వాతనే శ్రీకాకుళ పోరాట నాయకత్వం నిర్ణయానికి వచ్చింది. అప్పటికే బెంగాల్ లోని నక్సల్బరీలో ప్రారంభమైన సాయుధ పోరాట మార్గంతో ఈ నిర్ణయం జతకూడింది. ఒక ఏడాది పాటు సన్నాహక ఏర్పాట్ల తర్వాత, చర్చల తర్వాత 1968 నవంబర్ 25 న ఒక భూస్వామి మీద దాడితో సాయుధపోరాట ప్రారంభాన్ని ప్రకటించడం జరిగింది.

వలసపాలన ముగిసిన తర్వాత పది సంవత్సరాలు తమ బతుకుల బాగు కోసం ఎదురుచూసి, ఎవరో వస్తారని, ఏదో చేస్తారని కన్న కలలు విఫలమైనతర్వాతనే ఆదివాసులు ఒక ప్రజాస్వామిక ఆందోళనా మార్గం చేపట్టారు. ఆ మార్గంలో పది సంవత్సరాలు ముందుకుసాగినా ప్రభుత్వం ప్రకటించిన వాగ్దానాలు కూడ నెరవేర్చలేదు. తమను రక్షించవలసిన ప్రభుత్వం భూస్వాములకు, షావుకార్లకు కొమ్ము కాస్తుంటే, వాళ్ల హింసకు, హత్యలకు మద్దతు తెలుపుతుంటే, ఇక గత్యంతరం లేదనుకున్న గిరిజనులు సాయుధపోరాట మార్గం చేపట్టారు. అలా నక్సల్బరీ, లేవిడి అనే గ్రామాల్లో ప్రారంభమైన ఆలోచన – ఆచరణ ఇవాళ ప్రభుత్వమే చెపుతున్నట్టు పదహారు రాష్ట్రాలకు వ్యాపించింది. ఈలోగా ప్రపంచీకరణ విధ్వంసం, అభివృద్ధి పథకాల నిర్వాసితుల సమస్యలు కూడ తోడయ్యాయి.

నలభై సంవత్సరాలు గడిచినా, పదివేలకుపైగా మెరికల్లాంటి యువతీయువకులు ఆ మార్గంలో ప్రాణాలు పోగొట్టుకున్నా ఆ మార్గానికి ప్రాసంగికత పోలేదంటే, బహుశా ప్రాసంగికత పెరుగుతున్నదంటే కారణం సమాజానికి అంతకంతకూ వ్యవస్థాంతర్గత పరిష్కారాలమీద విశ్వాసం తగ్గిపోతూ ఉండడమే. అధికారం, డబ్బు, హోదా, సామాజిక ఉన్నతస్థితి ఉన్నవారు ఏనేరంచేసినా శిక్ష మాత్రమే కాదు, విచారణ కూడ లేకపోవడం, పేదలు, దళితులు, ఆదివాసులు, అణగారిన వర్గాలు ఏ నేరం చేయకపోయినా బతుకు దుర్భరమైపోవడం అనే వాస్తవస్థితి శ్రీకాకుళ మార్గం పట్ల ఆకర్షణను పెంచుతూనే ఉంటుంది.

ఈ మొత్తం చరిత్రను ఒక్కమాటలో చెప్పాలంటే, వ్యవస్థలోపల తమ సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయనే విశ్వాసాన్ని కోల్పోయినతర్వాతనే ఆదివాసులు వ్యవస్థకు బైటి పరిష్కారాలకోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ ప్రయత్నాల బాగోగుల గురించి ఎంతయినా వాదోపవాదాలు చేయవచ్చునుగాని ఆ ప్రయత్నాలు ఎక్కడ, ఎందుకు మొదలయ్యాయో గుర్తించడం అవసరం.

నిన్నటికి నిన్న జరిగిన వాకపల్లి దుర్మార్గాన్ని చూడండి. అత్యాచారం జరిగినవెంటనే వెయ్యికిలోమీటర్ల అవతలి నుంచి పోలీసు పెద్దదొర అసలు అది జరగనే లేదనే సత్యాన్ని ఊహించి కనిపెట్టాడు. హోంమంత్రిగారు ఆ ఊహాసత్యాన్నే ఔదలదాల్చారు. ఆ అత్యాచారంపై తెహెల్కా వారపత్రికకు నివేదిక రాయడానికి అక్టోబర్ 14న వాకపల్లి వెళ్లాను. అప్పటికి ఆ అత్యాచారం జరిగి సరిగ్గా ఏడువారాలు. అప్పటికి (ఇప్పటికి కూడ) నేరస్తులెవరో తెలియదు. ఆరోజున ఆ గ్రామానికి గ్రేహౌండ్స్ దళాన్ని పంపించిన అధికారులకు, ప్రభుత్వానికి ఆ దళంలో ఎవరెవరు ఉన్నారో తెలుసు. కాని చెప్పరు. బాధితులు వాకపల్లిలోనూ, పాడేరులోనూ, విశాఖపట్నంలోనూ, హైదరాబాదులోనూ కాలికిబలపం కట్టుకుని తమపై జరిగిన అత్యాచారం గురించి కనిపించిన ప్రతివారికీ చెప్పారు. అయినా ఏ చర్యాలేదు. చివరికి జిల్లాకలెక్టర్, పోలీసుసూపరింటెండెంటుకూడ ఏడువారాలవరకు ఆగ్రామం సందర్శించనుకూడ లేదు. సిఐడి దర్యాప్తుకు ఆదేశించినప్పటికీ ఆ అధికారులు కూడ అక్టోబర్ 14 నాటికి నేరం జరిగిన స్థలాన్ని సందర్శించనేలేదు. గ్రామానికి వచ్చి బాధితులను కలిసి గిరిజన సంక్షేమ అధికారి సమర్పించిన నివేదికను మసిపూసి మారేడుకాయ చేశారు. ఇలా వాకపల్లి ఆదివాసుల ముందున్న వ్యవస్థాంతర్గత మార్గాలన్నిటినీ మూసివేసినతర్వాత, వారికి మిగిలినదారి ఏమిటి?

ఆదివాసులమీద, ఇతర అణగారిన వర్గాలమీద మౌనంగా నిశ్శబ్దంగా శతాబ్దాలుగా సాగిపోతున్న హింసనూ దౌర్జన్యాన్నీ మనం గుర్తించలేకపోయినా, కనీసం కోరన్న-మంగన్నల హత్య, వాకపల్లి మహిళలపై అత్యాచారం వంటి బహిరంగ హింసనైనా గుర్తించగలగాలి. ఆ బహిరంగ హింస పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న, ఆ నేరస్తులను కాపాడుతున్న వ్యవస్థ ఉన్నప్పుడు ఏమి జరుగుతుందో లేవిడి నుంచి వాకపల్లి దాకా సాగివచ్చిన దారి ప్రకటిస్తున్న సత్యం విస్పష్టమైనదే.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Telugu, Vartamaanam. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s