సెన్సెక్స్ ఉత్థానం పతనం వైపేనా?

నిరాశనూ నిరుత్సాహాన్నీ పెంచడానికి కాదు గాని, ఏ బలమైన కారణమూ లేకుండా సెన్సెక్స్ రోజు రోజూ పైకి పైపైకి పరుగులు పెడుతుంటే భయం కలుగుతున్నది. సెన్సెక్స్ పైకి పోతున్న ఆ గ్రాఫు మనకు కనబడుతున్న పటాన్ని కూడ దాటి ఫ్రేము పగలగొట్టుకుని ఆకాశంలోకి దూసుకుపోతుంటే ఏదో తెలియని భయం వ్యాపిస్తోంది. ఇంకా మన సమాజంలో స్టాక్ మార్కెట్ అంటే ఏమిటో ఎక్కువమందికి తెలియదు గనుక, అయినా యావన్మందీ చదివే పత్రికల పతాకశీర్షికలలోను, చూసే బుల్లితెర మీదా ఈ సెన్సెక్స్ వార్తలు, స్టాక్ మార్కెట్ వార్తలు ఇబ్బడిముబ్బడిగా వస్తున్నాయి గనుక సాధారణ పాఠకులూ ప్రేక్షకులూ ఈ సెన్సెక్స్ పరుగును ఎట్లా అర్థం చేసుకుంటున్నారో, వాళ్లమీద ఆ వార్తల ప్రభావం ఎట్లా ఉంటుందో ఊహిస్తేనే భయం వేస్తున్నది.

ఆ కాళ్లు విరిగిపోయే పరుగును చూపించి మన ఆర్థిక వ్యవస్థ ఎంత వేగంగా ఎంత బ్రహ్మాండంగా పురోగమిస్తున్నదో చూడండి అని నమ్మబలుకుతున్న రాజకీయ నాయకులను, ఆర్థిక వేత్తలను, స్టాక్ మార్కెట్ విశ్లేషకులను చూస్తుంటే, వాళ్లు కలిగించే ఆకర్షణలవల్ల మరెంతమంది కొత్త మదుపుదార్లు ఈ పద్మవ్యూహంలో ప్రవేశించి ఒరిగిపోతారోనని ఆ భయం మరింత పెరుగుతున్నది.

స్టాక్ మార్కెట్ చరిత్రలో ఇటువంటి ‘పురోగమనం’ చాలసార్లు జరిగిందనీ, ఆ ‘పురోగమనం’ వెనుక ప్రతిసందర్భంలోనూ ఏవో కొన్ని స్వార్థపరశక్తులో, ప్రయోజనాలో, కుట్రలో, కుంభకోణాలో ఉన్నాయని, ప్రతిసారీ ఆ ‘పురోగమనం’ తర్వాత దారుణమైన పతనాలు, తిరోగమనాలు సంభవించాయని చారిత్రక పరిజ్ఞానం వల్ల ఆ భయం మరింత పెరుగుతున్నది. సరిగ్గా ఇట్లాంటి పరుగే గతంలో కుప్పకూలిపోవడానికి ముందు కూడ జరిగింది గనుక చిన్న మదుపుదార్ల నిధులు ఏ గంగలో కలిసిపోతాయోనని విచారం వేస్తున్నది.

అసలింతకీ స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి? ఇప్పుడు సాధారణంగా వినబడుతున్నట్టు అది ఆర్థిక వ్యవస్థకు పర్యాయపదమా, దానిలో పురోగమనానికీ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికీ ఏమన్నా సాపత్యం ఉంటుందా?
ఆర్థిక వ్యవస్థను సాధారణంగా ప్రాథమిక రంగం (వ్యవసాయం, అడవులు, మత్స్యసంపద, గనులు వంటి భూమి ఆధారిత ఆర్థిక కార్యకలాపాలు), ద్వితీయ రంగం (పరిశ్రమలు, పారిశ్రామిక సరుకుల ఉత్పత్తి, విద్యుత్తు, నీరు, నిర్మాణం తదితర కార్యకలాపాలు), తృతీయ రంగం (వ్యాపారం, హోటళ్లు, రవాణా, సమాచార సంబంధాలు, ద్రవ్య వ్యవహారాలు, రియల్ ఎస్టేట్, వ్యక్తిగత సేవలు, ప్రజాపాలన వంటివి కలిసిన సేవారంగం) గా విభజిస్తారు. వీటిలో తృతీయ రంగంలో చేరిన అనేక అంశాలలోని ద్రవ్యవ్యవహారాలలో ఒక భాగం స్టాక్ మార్కెట్. అందువల్ల దాన్ని మొత్తం ఆర్థిక వ్యవస్థతో సమానంగా చూసి మాట్లాడడం అతిశయోక్తి మాత్రమే కాదు, అర్థరహితం కూడ. నిజానికి అది చిన్న భాగం కావడం మాత్రమే కాదు, మొత్తం ఆర్థిక వ్యవస్థ చలనానికి ఒక సూచికగా కూడ పనికివచ్చే ప్రమాణం కాదు.
సరే, దాని స్థానం ఏదయినా, అది చేసే పని ఏమిటి? మామూలుగా మనం మార్కెట్ లోకి వెళ్లి సరుకులు కొనుక్కున్నట్టు, ఈ స్టాక్ మార్కెట్ అనే దానిలో స్టాకులు కొనుక్కోవచ్చు, అమ్మవచ్చు. స్టాకులు లేదా షేర్లు అంటే వ్యాపార, పారిశ్రామిక సంస్థల యాజమాన్యంలో భాగస్వామ్య వాటాలు అన్నమాట. అంటే స్టాక్ మార్కెట్లో లావాదేవీలు జరిపేవాళ్లు ఆ స్టాక్ మార్కెట్లో నమోదు అయి ఉన్న వ్యాపార పారిశ్రామిక సంస్థల యాజమాన్యంలో ఏ చిన్నవాటానో కొనుక్కునే అవకాశం ఉంటుంది. ఇక్కడ తప్పనిసరిగా ఆయా స్టాక్ మార్కెట్లలో ఆ సంస్థలు నమోదు కావలసి ఉంటుందనే పరిమితి ఉంది. అలాగే ఆ సంస్థ తన మొత్తం మూలధనంలో ఎంతభాగాన్ని వాటాల కింద అమ్మజూపుతున్నదనేది కూడ ఆ సంస్థ మొదట ప్రారంభించిన పెట్టుబడిదారులు చేతిలోనే ఉంటుంది. అంటే వాళ్లు తమ నిర్ణయాధికారానికి భంగం కలగకుండా జాగ్రత్త పడి, మిగిలిన భాగాన్నే అమ్మకానికి పెడతారు. అందువల్ల ఈ వాటాల కొనుగోలు, అమ్మకాలు లావాదేవీల వల్ల సంస్థ మౌలిక స్వభావంలో ఎటువంటి మార్పు రాదు.

అసలు ఈ అమ్మకాలు, కొనుగోళ్లు లావాదేవీలు ఎందుకు జరుగుతాయి? సాధారణంగా పెట్టుబడిదారీ ఆర్థిక కార్యకలాపాలన్నీ లాభాపేక్షతోనే జరుగుతాయి గనుక, ఇవాళ ఒక ధరకు వాటా కొనేవాళ్లు రేపు ఆ వాటా ఎక్కువ ధర పలుకుతుందని, తమ డబ్బు పిల్లల్ని పెడుతుందని నమ్మకంతోనే కొంటారు. ఎక్కువ ధర పలికిన రోజున అమ్ముతారు. అంటే ఈ లావాదేవీలన్నీ ఊహాపోహలమీద ఆధారపడి మాత్రమే జరుగుతాయన్నమాట. అంటే ఈ లావాదేవీలన్నీ సారాంశంలో మనకు బాగా తెలిసిన జూదానికి, చట్టావ్యాపారానికి, లాటరీకి దగ్గరిగా ఉంటాయన్నమాట.

కాదంటే న్యాయంగా చూస్తే సమాజానికి అవసరమైన సరుకులు ఉత్పత్తి చేసే సంస్థల వాటాలు చాల ఆకర్షణీయంగా ఉండాలి, ఉత్పత్తిమీద, ఉత్పాదకాల ధరలమీద, మార్కెట్ మీద ప్రభావం చూపే రాజకీయార్థిక నిర్ణయాలు షేర్ల ధరల హెచ్చుతగ్గులకు దారి తీయాలి. మదుపుదార్లకు తెలిసిన వస్తువులను ఉత్పత్తిచేసే, వ్యాపారం చేసే సంస్థల వాటాలలో హెచ్చు లావాదేవీలు జరగాలి. కాని అదేమీలేకుండా స్టాక్ మార్కెట్ ఉత్థానపతనాలు నిర్హేతుకంగా జరుగుతున్నాయి. సరిగ్గా జూదంలాగే. ఒక వాటాను కొనేటప్పుడు ఆ సంస్థ అవసరమయిన సరుకులు ఉత్పత్తి చేస్తున్నదా, ఆ ఉత్పత్తి పెరుగుతుందా అనే ప్రశ్నలతో సంబంధంలేకుండా, ఆ సంస్థ లాభాలు సంపాదించగలదా లేదా అనే ప్రమాణం మీదనే కొనడం జరుగుతున్నదన్నమాట.

అసలు స్టాక్ మార్కెట్ నిర్మాణంలోనే ఉన్న ఈ అసంగతానికి తోడు ఇవాళ పెద్ద ఎత్తున ప్రచారంలో ఉన్న సెన్సెక్స్ అనేది మొత్తం స్టాక్ మార్కెట్ కు ప్రాతినిధ్యం వహించే ప్రమాణం కూడ కాదు. దేశ ఆర్థిక రాజధాని ముంబాయిలో పనిచేసే దేశంలోకెల్లా పురాతనమైన బాంబే స్టాక్ ఎక్స్ చేంజిలో నమోదు అయిన వేలాది వ్యాపార సంస్థల షేర్ల లో నుంచి మంచి లావాదేవీలు జరిగే ముప్పై షేర్లను ఎంపికచేసి తయారు చేసింది సెన్సెక్స్. ఈ ముప్పైలో ప్రభుత్వరంగ సంస్థలూ ఉన్నాయి, ప్రైవేటురంగ సంస్థలూ ఉన్నాయి. సిమెంటు కంపెనీలనుంచి ఐటి సంస్థలవరకు, నిర్మాణ కంపెనీలనుంచి బ్యాంకులవరకు ఉన్నాయి. ఈ ముప్పై సంస్థల షేర్ల సూచి ఇప్పుడు ఇరవైవేల దగ్గర అటూ ఇటూ ఆడుతున్నది.

ఈ సెన్సెక్స్ పురోగమనాన్ని చూపడంద్వారా, అన్ని షేర్ల ధరలు పైకి పోతాయేమోననే ఆశను కల్పించడం ద్వారా చిన్నమదుపుదార్లను స్టాక్ మార్కెట్ కొనుగోళ్లవైపు ఆకర్షించడమే అసలు లక్ష్యం. తద్వారా ఎక్కువమంది స్టాక్ మార్కెట్లో మదుపు పెట్టి ఎక్కువ షేర్లు కొనుక్కుంటారు. ఆయా షేర్ల అమ్మకందార్లకు, సంస్థలకు, ద్రవ్య ఆర్థిక వ్యవస్థకు, స్టాక్ బ్రోకర్లకు అదనంగా కోట్లాది రూపాయల ధనం అందుతుంది. ఇలా ఎక్కువమంది ఎగబడినందువల్ల ధరలు పెరిగిన షేర్లను సంస్థాగత మదుపుదార్లు పెద్ద ఎత్తున అమ్మడం మొదలుపెట్టగానే వాటి ధరలు పడిపోతాయి. హెచ్చు ధరకు కొనుక్కున్న చిన్న మదుపుదార్లు రోజురోజూ పడిపోతున్న ధరలు చూసి ఏదో ఒక రోజున ఎక్కువ లాభం లేకుండానో, నష్టానికో అమ్మవలసిన పరిస్థితి వస్తుంది. అలా నష్టపోయేది చిన్న మదుపుదార్లు, లాభపడేది విదేశీ, స్వదేశీ సంస్థాగత మదుపుదార్లు, స్టాక్ మార్కెట్ బ్రోకర్లు. ఈ వ్యవహారం జూదగృహాలకు వెళ్లివచ్చేవారందరికీ అనుభవైకవేద్యమే.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in ParamarthaSatyam, Telugu. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s